చాతకపక్షులు (భాగం-12)
(తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని చిత్రించిన నవల)
– నిడదవోలు మాలతి
సోమవారం గుంటూరులో బస్సు దిగేవేళకి టైము దాటిపోయిందని కాలేజీకి వెళ్లలేదు. మర్నాడు ఆవరణలో అడుగెడుతూనే సత్యం ఎదురయింది.
“నిన్న కాలేజీకి రాలేదేం?”
“ఏం లేదు. వూరికే.”
“ఒంట్లో బాగులేదా?”
“అదేంలేదు. ఇంటికెళ్లేను.”
“శనివారం వెళ్తే ఆదివారం వచ్చేయొచ్చు కదా.”
“రాలేదు.”
“పెళ్లిచూపులా?”
గీత ఉలిక్కిపడింది. “ఎందుకలా అనుకున్నావూ?”
“అంతకంటే నీకూ నాకూ ఏం వుంటాయిలే రాచకార్యాలు. నీ మొహం చూస్తే అనిపించింది. ఇదే మొదలు కూడానేమో,” అంది సత్యం నిరామయంగా.
పెళ్లంటే సత్యానికి ఎందుకంత కాతరభావమో గీతకి అర్థం కాలేదు.
“ఏం చేస్తున్నాడు పెళ్లికొడుకు?”
గీత చెప్పింది.
సత్యం కొంచెంసేపు ఊరుకుని, నెమ్మదిగా అంది, “మాఇంట్లో ఈ పెళ్లిచూపులమేళం ఎన్నేళ్లుగా జరుగుతోందో నాకే జ్ఞాపకంలేదు. ముందు మాపెద్దక్క – ప్రతివాడూ రావడం, కాఫీలూ, టిఫిన్లూ, తాంబూలాలూ సేవించి, ఉత్తరం రాస్తాం అంటూ వెళ్లిపోవడం. ఆతరవాత ఉత్తరం, ′మావాడు ఇప్పుడే పెళ్లి చేసుకోనంటున్నాడు′ అంటూ. అక్కడికి మన మొహాలు చూడగానే పెళ్లిమీద విరక్తి పుట్టినట్టు. లేకపోతే అమ్మాయికి పొట్టిజడ అనో చీపికళ్లు అనో వంకలు పెట్టడం. .. “
గీత మాట్లాడలేదు.
సత్యమే మళ్లీ అంది, “మా అక్క చచ్చిపోయింది ఈ పెళ్లికొడుకులపోరు పడలేక. హుం. .. మళ్లీ ఇప్పుడు మాచిన్నక్కతో మొదలు రెడ్డొచ్చే మొదలాడు.”
గీతకి కడుపులో దేవినట్టు వుంది ఆమాటలు వింటుంటే. సత్యం ఇలా మాటాడకుండా వుంటే బాగుండును అనిపిస్తోంది.
“క్లాసుకి టైమ్ అయింది, పద,” అంది గబగబా అడుగులేస్తూ.
పదిరోజులపాటు ఫోను మోగినప్పుడల్లా ఉలికిపడుతూనే వుంది గీత. పొస్టుమేను గేటుదగ్గర ఆగినా, ఆగకుండా దాటిపోయినా కలవరంగానే వుంది. మామయ్యో, అత్తయ్యో ఇంటికి ఫోను చేసి కనుక్కుంటే బాగుండును కానీ తనకు తానయి అడగలేదు కదా. తనకి మరీ చిరాగ్గా వున్నది ఆ ఇంట్లోనూ ఈ ఇంట్లోనూ కూడా అందరూ తన ప్రమేయం ఏమీ లేనట్టు ప్రవర్తించడం. ఆమాట గట్టిగా అడిగే గుండెబలం ఇంకా రాలేదు. ఆతరవాత మరో నాలుగురోజులకి గీతపేరున ఉత్తరం వచ్చింది సరోజదగ్గర్నుంచి.
ప్రియమయిన గీతకి,
ఇక్కడ మేం అందరం బాగానే వున్నాం. కాలేజీ లెక్చరర్లేం చెబుతున్నారో విద్యార్థులకి పట్టదు. ఆసంగతి లెక్చరర్లకి అక్కర్లేదు కూడా. ఏదో గడిచిపోతున్నాయి రోజులు. నువ్విక్కడ వుంటే బాగుండును అనిపిస్తోంది నాకు. ఆమధ్య నువ్వు వచ్చి వెళ్లేవని మీ అన్నయ్య బజారులో కనిపించి చెప్పేడు. మాయింటికి రాలేదేం?
ఇంతకీ అసలు సంగతి. అనుకోకుండా అర్జెంటుగా నాపెళ్లి కుదిరిపోయింది. ఈనెల పదిహేనో తారీకున ముహూర్తం. పెళ్లికొడుకు మాకు దూరపుచుట్టంలే. చిన్నప్పుడు కలిసి ఆడుకునేవాళ్లం కూడా అంటోంది మా అమ్మ. ఫారిన్ నించి వచ్చేడు పెళ్లి చేసుకోడానికి. అంచేత అట్టే టైం లేదు. నువ్వు తప్పకుండా రావాలి.
ప్రేమతో.
నీ సరోజ.
గీత ఆ వుత్తరం పదిసార్లు చదువుకుంది. సరోజ ఎదురుగా వుండి మాటాడుతున్నట్టే వుంది. చదువుతుంటే ఆనందమూ, విచారమూ, ఇంకా ఏదో చెప్పలేని వెలితీ ముప్పేటగా పెనవేసుకు ఉక్కిరిబిక్కిరి చేసేయి గీతని. అత్తయ్యతో పెళ్లి సంగతి చెప్పి వెళ్తానంది. ఈసారి కూడా జగదీశుని వెళ్లమన్నారు కానీ వాడు ఒప్పుకోలేదు. తప్పనిసరిగా శివరావు గీతని ఒక్కదాన్నీ బస్సెక్కించి, బాబాయి బస్టాండుకి వస్తాడనీ, భయంలేదనీ బస్సు కదిలేవరకూ ధైర్యం చెబుతూనే వున్నాడు. గీత సరే, సరే అంటూనే వుంది.
స్వల్పవ్యవధి అయినా పెళ్లి వేడుకలు బాగా జరిపించేరు సరోజ తల్లిదండ్రులు. సరోజని అంటిపెట్టుకు తిరుగుతున్న గీతని చూసి చాలామందే ముచ్చట పడ్డారు. “నీవంతూ వస్తుంది” అంటూ మేలమాడేరు. “నిన్ను కల్యాణతిలకంతో చూడకుండానే పోతాను కాబోలు” అంటూ బామ్మ కళ్లొత్తుకుంది. పెళ్లి అయిన మర్నాడు పెళ్లికొడుకు చనువుగా, “నీక్కూడా చూడమన్నావేమిటి మాఊళ్లోనే ఓ అబ్బాయిని” అన్నాడు.
పెళ్లి అయిన మర్నాడు సరోజ భర్తతో మద్రాసు వెళ్లింది అతనితో ఓపూట గడిపి ప్లేను ఎక్కించడానికి. సరోజ వెళ్లిపోయినతరవాత గీతకి అక్కడ వుండబుద్ధి పుట్టలేదు. “శనివారమే కదా, ఈ ఒక్కపూటా వుండి రేపు వెళ్లు” అని కామాక్షి ఎంత చెప్పినా వినకుండా, “చదువుకోవాల్సింది చాలా వుంది” అంటూ బస్సెక్కేసింది.
ఓరోజు ముందుగానే వచ్చేసిన గీతని చూసి కనకమ్మ సంతోషించింది. గీత సీరియస్‌గా చదువులో పడిపోయింది. శ్యాంతో ముభావంగా వుంటోంది. కనకమ్మ ముందు కంగారు పడినా, సరిగ్గానే అర్థం చేసుకుంది ఆ అమ్మాయిని. గీత ఎదుగుతోంది మానసికంగా. ఆవిడ ఇప్పుడు సంసారంగురించీ, బాధ్యతలగురించీ కూడా ముచ్చటిస్తోంది గీతతో.
గీతకి ఇప్పుడు కనకమ్మ పిల్లలందరూ చిట్టీ, బుజ్జీలాగే అనిపిస్తున్నారు.
***
గీత ఇంటరు పూర్తయేవేళకి నలుగురు పెళ్లికొడుకులు చూసి వెళ్లడం అయింది. పెళ్లికొడుకులవిషయంలో సత్యంతత్త్వం తనకి కూడా ఒంటబడుతోంది. ఇంట్లో పెద్దలమీదా, ఊళ్లో పెళ్లికొడుకులమీదా ఎక్కళ్లేని కసీ, అసహ్యం కలుగుతున్నాయి మనసులో.
మళ్లీ బి.యే. చదవడానికి గుంటూరు వచ్చింది. శలవుల్లో చాలా విశేషాలే జరిగేయి. మేరీ వాళ్లచర్చిలోనే కలిసిన మరో క్రిస్టియనుఅబ్బాయిని పెళ్లి చేసుకుని కలకత్తా వెళ్లిపోయింది. సత్యం చదువుకి చుక్క పెట్టేసింది. శివంగారు సత్యాన్ని శ్యామ్ కిచ్చి పెళ్లి చెయ్యమని వాళ్లమ్మకి కబురు చేశారు. ఇంకా నిశ్చయం కాలేదు కానీ అయేట్టే వుంది.
గీతకి అంతా అయోమయంగా వుంది. కనకమ్మతో చెప్పి, సత్యాన్ని చూడడానికి వాళ్లింటికెళ్లింది. సందుమొగలో శ్యామ్ కనిపించాడు కాని పలకరించలేదు. చిన్నగా నవ్వి పక్కకి తప్పుకున్నాడు.
గీత వెళ్లేసరికి సత్యం వసారాలో కూర్చుని దిండుగలేబుమీద పువ్వులు కుడుతోంది. గీత వెనకనించి వచ్చి ఉఫ్‌మని వూదింది మెడమీద.
సత్యం వులిక్కిపడి, సూది వేలికి గుచ్చుకుని, కెవ్వుమని కేకేసి, “అబ్భ, ఎన్నాళ్లకి కనిపించేవే?” అంది స్నేహితురాలి చెయ్యి ఆప్యాయంగా అందుకుని.
గీత కూడా పున్నమిచంద్రునిలా వెలిగిపోతూన్న మోముతో సత్యంపక్కనే చతికిలబడింది. ఇద్దరిమనసులూ మహదానందంతో ఊగిపోయేయి. సృష్టిలో తీయనిది స్నేహమేనోయి అని ఇందుకే అన్నారేమో అనిపించింది ఆపూట వారికి.
“విశేషాలు చెప్పు,” అంది సత్యం.
“నువ్వే చెప్పాలి” అంది గీత చిలిపిగా,
“నాసంగతులు నీకు తెలుసు. ఆ సంగతి నాకు తెలుసు. అంచేత ఏం చెప్పినా నువ్వే చెప్పాలి.
ఏం చేశావు శలవుల్లో?”
గీత జవాబు చెప్పలేదు.
ఇద్దరూ తలలొంచుకు కూర్చున్నారు, ఏదో ఏకాంతం అనుభవిస్తూ. రెండో మనిషి పక్కన వున్నట్టూ వుంది. లేనట్టూ వుంది. ఇదీ అని చెప్పడానికి కారణం లేకపోయినా ఇద్దరిమనసులూ బరువెక్కేయి.
మెల్లిగా గీతే నోరు విప్పింది, “మీ అమ్మగారు సంకోచిస్తున్నారుట శ్యాంతో నీపెళ్లివిషయం. ఎంచేత?”
సత్యం అవునన్నట్టు తలాడించింది.
“ఎందుచేత?” గీత మళ్లీ అడిగింది. నిజం తెలిసినా సత్యం మాటల్లో తెలుసుకోవాలని వుంది.
“కలవారితో చేతులు కలపడం కదా.”
“మరి నీకిష్టమేనా?”
సత్యం నవ్వి ఓ మొట్టికాయ వేసింది గీతతలమీద, “బాగుంది నీవరస. మాఅమ్మ ఒప్పుకోకపోతే ఎందుకు ఒప్పుకోలేదు అంటావు. నేను ఒప్పుకుంటే ఎందుకు ఒప్పుకున్నాను అంటావు.”
గీత కూడా నవ్వి, “ఏంచెయ్యను మరి? నాకంతా అయోమయంగా వుంది. ఏమనుకోవాలో తెలీడం లేదు.”
సత్యం చాలాసేపు మాటాడలేదు. తరవాత నెమ్మదిగా, అతినెమ్మదిగా, అంది, “నీకు తెలివితేటలున్నాయి కానీ లోకజ్ఞానం లేదు, గీతా. నాలుగేళ్ల పాపాయిలా ఆకలేస్తే అన్నం తింటావు. నిద్దరొస్తే పడుకుంటావు. అంతే కానీ, కంచంలోకి అన్నం ఎలా వచ్చిందీ, పడుకుంటే పనులెలా అవుతాయి అన్న ప్రశ్నలు తోచవు నీకు.”
గీత వింటూ కూచుంది. నిజమే. చాలా విషయాలు తనకి పట్టవు. యాంత్రికంగా జరిగినవి చూస్తూ, జరగనివి అవే జరిగిపోతాయనుకుంటూ, తానొక ప్రేక్షకురాలయిట్టు, జరుగుతున్న సంఘటనలలో తాను పోషించవలసిన పాత్ర ఏమీ లేనట్టు ఊరుకుంటుంది.
సత్యం ఆడపిల్లల్లో మూడో అమ్మాయి. ఆతరవాత ఇద్దరు మొగపిల్లలు. ఆఖరివాడికి రెండో ఏడు నడుస్తుండగా తండ్రి పోయేడు. అప్పటికి సత్యానికి పదకొండో ఏడు. తల్లి పాపమ్మ అభిమానవంతురాలు. ఆయింటా ఈయింటా చిల్లరపనులు చేసీ, నోటిమంచితనంతోనూ సంసారం గడుపుకొస్తోంది. పాపమ్మగారి తల్లి కూడా వాళ్లతోపాటే ఆ యింటే వుంది. ఆవిడ మధ్యాన్నాల చుట్టుపట్ల చదువురాని ఆడవాళ్లని పోగేసుకుని భారతమో భాగవతమో చదివి అర్థాలు చెప్తూ వుంటుంది. క్రమంగా ఆవిడకో భక్తసంఘం ఏర్పడింది. వాళ్లు తరుచూ కూరా, కాయా, చీరే, రవికెలగుడ్డా, పదీ పరకా డబ్బూ ఇస్తూ వుంటారు.
ఊళ్లోవాళ్లు పాపమ్మ అన్నగారిని ఆడిపోసుకుంటున్నారు తోబుట్టువుని ఆదుకోలేదని. ఆమాటలు పడలేక ఆయన పాపమ్మని వచ్చి తమఇంట్లో వుండమని పిలిచాడు. “ఆయింటా ఈయింటా చేసే పనులు మనింట్లోనే చేసుకోవచ్చు కదా” అంటూ.
పాపమ్మ ఇష్టపడలేదు. “పొరుగిల్లయితే, వాళ్లు మాట తూలితే, పోస్ పొమ్మని చేతిలో గిన్నె అక్కడే పారేసి వచ్చేస్తాను. నీయింట్లో అయితే నువ్వూ నేనూ కక్కలేకా మింగలేకా కుళ్లుకు చావాలి, ఎందుకొచ్చిన గొడవ. ఎక్కడున్నవాళ్లం అక్కడే పడివుంటే మంచిది. అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలు” అంది.
సత్యం ఈకథంతా చెప్పి, అంది, “మాఅమ్మ నాకేదో అపరశ్రీరాముణ్ణి తీసుకురాగలదన్న భ్రమల్లేవు నాకు. శివం మామయ్యగారూ, అత్తయ్యగారూ కూడా ఉత్తములు. శ్యామ్ కబుర్లపోగే కానీ గుండెబలం లేనివాడు. పైగా నువ్వంటే అతనికి గౌరవం. నీకు నేనంటే ఆపేక్ష. చాలా ఈ కారణాలు.”
గీతకి గుండెలమీంచి పెద్ద బరువు దింపినట్టయింది. “ఒప్పేసుగుంటున్నాను. నిజమే. నాకు ప్రపంచజ్ఞానం బొత్తిగా లేదు” అంది.
మరో నెలరోజులకి శ్యాంతో సత్యం పెళ్లి అయిపోయింది. ఇద్దరూ ఊళ్లోనే వేరు కాపురం పెట్టేరు. శివరావు శ్యాంని తన వ్యాపారంలో పెట్టి ట్రైనింగు ఇవ్వడం మొదలెట్టారు.
గీత బియే పూర్తి చేసి, ట్రైనింగయి. విజయవాడలో వాళ్లనాన్నగారు పనిచేసే స్కూల్లోనే టీచరుగా చేరింది. ఈపిల్లకి ఇంక పెళ్లి చెయ్యలేను కాబోలు అని పరమేశంగారూ, కామాక్షీ దిగులు పడుతున్నారు.
ఆ రోజుల్లోనే ఓరోజు శివరావు పరమేశానికి కబురు చేశారు గీతని తీసుకురమ్మని. గీత మొదట ఇష్టపడలేదు కానీ శివంమామయ్యా, కనకమ్మత్తలయందు గల అభిమానంవల్ల సరేనంది. పరమేశం, కామాక్షీ, గీతా సందేహిస్తూనే గుంటూరు వెళ్లేరు.
గీతని చూడగానే కనకమ్మ కన్నకూతురిని చూసినట్టు ఆనందించింది. ఆమెముఖంలో వెలుగు చూసి గీతమనసు పొంగిపోయింది. శివరావు కూడా ఆప్యాయంగా పలకరించారు. “బాగున్నావా అమ్మా. ఉద్యోగం ఎలా వుంది? మరేం చికాకులు లేవు కదా” అంటూ.
గీత జవాబులు చెప్తూ “మామయ్యకీ అత్తయ్యకీ నేనంటే ఎంత ఆపేక్ష” అనుకుంది ఆర్ద్రంగా.
శివరావు పెళ్లికొడుకు భోగట్టా చెప్పేడు – హరి అమెరికానుంచి పనిగట్టుకు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యంతోనే వచ్చేడుట. ఇద్దరికీ నచ్చితే వెంటనే పెళ్లి చేసుకుంటాడుట.
ఆసాయంత్రమే పెళ్లిచూపులు. కనకమ్మా, శివరావూ పెద్ద హడావుడి ఏమీ చెయ్యలేదు. హరి తల్లితో వచ్చేడు గీతని చూడడానికి. గీత సాదా వాయిలు చీరె కట్టుకుని, తల్లో నాలుగు మల్లెపూలు పెట్టుకుంది. కాఫీలయేక, శివం పరమేశంతో “నువ్వొక్కసారి యిటురా” అంటూ వీధిలోకి తీసుకెళ్లేడు. కనకమ్మ “రండి వదినగారూ, ఇల్లు చూద్దురు గానీ” అంటూ పిలిచింది. కామాక్షి వారిని అనుసరించింది.
హాల్లో హరీ, గీతా మిగిలేరు. గీతకి ఏం మాటాడాలో తోచలేదు.
హరే మొదలుపెట్టేడు. “అనుకోకుండా అకస్మాత్తుగా జరిగిపోతోంది అంతా. మీకేమయినా సందేహాలుంటే చెప్పండి,” అన్నాడు.
“సందేహాలు? దేన్నిగురించి?” అంది గీత నెమ్మదిగా.
హరి నవ్వేడు. “నాకూ తెలీదండీ. అక్కడ బయల్దేరినప్పుడు, పెళ్లిచేసుకు వచ్చేస్తాను అనుకుంటూ బయల్దేరేను. తీరా ఇక్కడికొచ్చాక, ప్రతివారూ ఇక్కడో అమ్మాయి వుంది, అక్కడో అమ్మాయి వుంది అంటూ వూదర పెట్టేస్తుంటే నాకు గాభరాగా వుంది. మీకెలా వుందో చెప్పండి” అన్నాడు.
అతను అలా దాపరికం లేకుండా మాటాడడంతో గీతమనసు తేలిక పడింది. “అదేనండీ. నేనూ అంతే. ′రా, రా′ అంటూ లాక్కొచ్చేరు, వచ్చేశాను. నాక్కూడా ఏం తోచడం లేదు.” అంది.
“సరేలెండి. నేనే మొదలెడతాను. మీరు బియేతో చదువు ఆపేశారు. ఇంటరెస్టు లేకనా?”
గీత ఇరకాటంలో పడింది. పైచదువులు చదివించే స్తోమతు తండ్రికి లేదని చెప్తే అతనెలా అర్థం చేసుకుంటాడో అని.
హరి వెంటనే, ”సారీ, వూరికే మీ ఇంటరెస్టులేమిటి అన్న ఉద్దేశంతో అడిగేనంతే. ఏపని గానీ చెయ్యడానికయినా చెయ్యకపోవడానికయినా చాలా కారణాలు వుంటాయి. ఇంతకీ మీకు అమెరికా రావడం సమ్మతమేనా?”
గీత కొంచెం ఆలోచించి, “మీరు అక్కడే వుండిపోతారా? మరింక మనదేశం వచ్చే ఉద్దేశం లేదా?” అని అడిగింది.
“చెప్పలేను. ఉద్యోగాన్ని ఆశ్రయించుకునే కదా మనబతుకులు. జీతాలు ఎక్కడికి లాక్కెళ్తే అక్కడే జీవితాలూనూ. కనీసం ఇప్పటికి అక్కడే. మరి మీరు విజయవాడలో ఉద్యోగం వదిలేసి రావాల్సివుంటుంది.”
“అందరూ వుద్యోగాలకోసం నానా అవస్థలూ పడుతుంటే నేను చేతిలో వున్న వుద్యోగం వదిలేసుకోడం ఎట్లా?” అంది.
“అదీ నిజమేలెండి. చేతిలో వున్న ఉద్యోగం వదిలేసుకోడం కష్టమే. పోనీ, ఓ యేడాది leave without pay తీసుకోండి. తరవాతిసంగతి తరవాత చూడొచ్చు” అన్నాడు హరి మధ్యేమార్గం ఆలోచిస్తూ.
మరో గంటసేపు ఇద్దరూ అవీ ఇవీ మాటాడుకున్నారు. తరవాత హరి “మా అమ్మ మాటల్లో పడితే నన్ను మర్చిపోతుంది. మీరు వెళ్లి పిలుచుకు రాగలరా?” అన్నాడు.
గీత చిన్నగా నవ్వి లోపలికెళ్లింది ముగ్గురు ఆడవాళ్లని పిలుచుకురావడానికి.
హరి వెళ్లిపోయింతరవాత గీత సీరియస్ గా ఆలోచించసాగింది. అతను తనని “మీరు” అంటూ మన్నించడం, మర్యాదగా ప్రతి విషయంలోనూ “మీరేం అనుకుంటున్నారు” అంటూ తన అభిప్రాయాలు అడగడం గీతకి చాలా సంతృప్తికరంగా వుంది. ఎదటివారి కష్టసుఖాలు గుర్తించే సహృదయుడుగా కనిపించేడు ఆలోచించినకొద్దీ.
కామాక్షి “ఏమంటావు? నీకు నచ్చేడా?” అని అడిగితే, “మంచివారిలాగే వున్నారు” అంది.
“అబ్బాయికి శలవులేదు. మళ్లీ ఎప్పుడు రాగలడో చెప్పలేం. అట్టే వ్యవధిలేదు. పెళ్లి రెండురోజూల్లో అయిపోవాలి” అంది హరితల్లి.
“పెళ్లంటే మాటలా? రెండురోజుల్లో ఎలా చేస్తాం?” అంటూ బెదిరిపోయారు పరమేశం, కామాక్షీను.
శివరావు “ఫరవాలేదులే నేను చూస్తాను” అని పూనుకుని తనకున్న పరపతి వినియోగించి, కావలసిన ఏర్పాట్లు చేయించి, అట్టే ఆర్భాటంగా కాకపోయినా పదిమందీ శభాష్ అనేలా జరిపించేరు.
పరమేశం, కామాక్షీ, శివరావు, కనకమ్మల దగ్గరికి వచ్చి కళ్లనీళ్లు పెట్టుకున్నారు.
“మేం కన్నాం కానీ దాని చదువూ, పెళ్లీ కూడా మీరే జరిపించేరు, పేరుకే మేం కానీ అది మీకూతురే,” అన్నారు పరమేశంగారు పూడుకుపోయిన గొంతుతో.
“ఛ, అదేం మాట. కన్నవారు కన్నవారే. ఎవరు ఎంత చేసినా తల్లిదండ్రులకి సాటి కారు. మేం ఎప్పటికీ శివంమామయ్యా, కనకమ్మత్తలమే.” అన్నారు శివరావు గారు.
***
గతకాలపు జ్ఞాపకాలలో ఓలలాడుతున్న గీత ఫోను ట్రింగురింగులతో తృళ్లిపడి ప్రస్తుతంలో కొచ్చి, ఫోను అందుకుంది.
ఎవరో టెలిమార్కెటర్. ఆ మనిషికి నో చెప్పేసి ఫోను పెట్టేసింది. ఇటు తిరిగిందో లేదో మళ్లీ మరో కాలూ. మరో అమ్మకాల్రాయుడు కాబోలు అనుకుంటూ అందుకుంది.
అట్నుంచి హరి “ఏం చేస్తున్నావు?” అన్నాడు.
పూర్వగాధాలహరీ, మార్కెటింగుపోరూ తరవాత ఆ వెంట వినిపించిన హరిగొంతు కమ్మని సంగీతంలా హాయిగా వుంది. తేలిగ్గా ఊపిరి పీల్చుకుని, “ఏంలేదు. వస్తున్నారా? కాఫీ పెట్టనా?” అని అడిగింది ఆత్రంగా.
“లేదు. ఆ మాట చెప్పడానికే పిలిచాను. ఇక్కడ నాపని ఇంకా కాలేదు. ఆలస్యం అవుతుంది నేనొచ్చేసరికి. నువ్వు నాకోసం ఆగకు. భోంచేసేయి.” అన్నాడు.
“సరే, అలాగేలెండి” అని ఫోను పెట్టేసింది నీరసంగా.
మళ్లీ ఒంటరితనం. మళ్లీ ఆనాటి తలపులు. … రెండు కాయితాలు తీసుకుని, సత్యానికి ఉత్తరం రాయడానికి కూర్చుంది. హరిగురించి, అతని స్నేహితులగురించి, తాను చేస్తున్న వంటలూ, ఊరూ, ఊళ్లో విశేషాలూ – అన్నీ పూస గుచ్చినట్టు రాసింది నాలుగు పేజీలు. సత్యం, శ్యాం వేరే కాపురం పెట్టేరని తెలుసు కానీ ఎడ్రెసు ఎప్పుడూ అడగలేదు. కొంచెం ఆలోచించి. శివంమామయ్యగారి ఎడ్రెసు కవరుమీద రాసి పోస్టులో పడేసింది వాళ్లే ఇస్తార్లే అనుకుని.
సత్యం తనవుత్తరం చూసి ఉప్పొంగిపోయి తనలాగే పెద్ద వుత్తరం రాస్తుందని ఎదురు చూసింది కొన్నాళ్లపాటు. ఆ ఎదురుచూపు కార్యక్రమం ముగిసేక, ఇహ జవాబు రాదని నిశ్చయం అయేక, అమెరికాలో కొత్తగడ్డమీద జీవనసరళి గురించిన ఆలోచనలు మొదలయేయి. ఇక్కడ ప్రతిదీ తలకిందులుగానే కనిపిస్తోంది. ఇంటిదగ్గర వున్నప్పుడు బయటికి వెళ్తే “చీకటి పడకుండా ఇంటికి వచ్చేయి” అనేది అమ్మ. ఇక్కడ అందరికీ అసలు జీవితం చీకటిపడిన తరవాతే మొదలు. మనకి పొద్దున్న లేవగానే కార్యక్రమం పళ్లు తోముకోడం, స్నానం చెయ్యడంలాటివి. ఇక్కడ అవన్నీ రాత్రివేళ. తనకి అన్నం చేత్తో తింటే కానీ తిన్నట్టుండదు. ఆమధ్య భోజనానికి వచ్చిన హరిస్నేహితులు చేత్తో తినడానికి పడ్డ అవస్థ తలుచుకుంటే ఇంకా నవ్వొస్తూనే వుంది. వేళ్లు వంగినట్టు ఫోర్కు వంగదు. చారూఅన్నం చేత్తో తింటంలో సౌలభ్యం ఫోర్కుతో చచ్చినా రాదు.
“దేవుడా ఇంత చేశావా!” అని ఉన్న ఊళ్లోనే పడివుండనందుకు ఒకటి రెండుసార్లు నొచ్చుకుంది కూడా. హరి అది గమనించాడు. అతను ఆ అమ్మాయిపక్కన కూచుని నెమ్మదిగా సంగతులు బోధపరుస్తూ, తనకి కావలిసినట్టు జరపడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు కొన్నాళ్లపాటు. కానీ, ఇద్దరికీ ఇదీ అని చెప్పలేని చికాకు మనసులో రొద పెడుతోంది. గీతకి అన్నిటికంటె ఎక్కువ బాధ కలిగిస్తున్నది తలుపులేసుకు ఇనప్పెట్టెలాటి ఆరెండు గదుల్లో ముడుచుకు కూర్చోవలసిరావడం. తనకి ఊపిరాడ్డంలేదు. పోనీ, కొంచెంసేపు ఎటేనా వెళ్లొద్దాం అంటే, హరి ఒకటే కంగారు ఒద్దు, ఒద్దు అంటూ. అతని కంగారు చూస్తే గీతకి “ఈయనకి ఇంత బెరుకేమిటి” అని కూడా అనిపిస్తోంది.
ఆఖరికి ఓరోజు ఉండబట్టలేక, హరి వెళ్లినతరవాత చూద్దాం అనుకుని బయల్దేరింది సందేహిస్తూనే. అంతకుముందు కొన్న పాంటూ, చొక్కా, టెన్నిస్ జోళ్ళూ తొడుక్కుని, గుమ్మంలోంచి వీధిలోకి ఓసారి తొంగిచూసి, లక్ష్మణరేఖ దాటి రెండు మెట్లు దిగింది. మళ్లీ రోడ్డు రెండువేపులా పరికించి చూసి, అక్కడ తనని ఎత్తుకుపోయే రావణబ్రహ్మలు ఎవరూ లేరని నిశ్చయించుకుని, “ఫరవాలేదు, బయల్దేరొచ్చు, తలుపు తాళం వేసి” అని తనకి తనే చెప్పుకున్నప్పుడు తెలిసింది, రోడ్డుమీద పరిస్థితులు అంచనా వేసే సంరంభంలో తాళాలు తీసుకోలేదు. ఇక్కడ తలుపులు వాటంతట అవే పడిపోతాయి అని తెలిసేక, రెండోసారి ′దేవుడా ఇంత చేశావా′ అనుకోవాల్సివచ్చింది. ‘సరే, ఇంక లోపలికెళ్లే ప్రశ్న లేదు కనక కనీసం రెండు వీధులయినా తిరిగివద్దాం’ అనుకుంటూ బయల్దేరింది.
రోడ్డుమీద అట్టే జనం లేరు. కార్లు కూడా మరీ ఎక్కువగా లేవు. నడుస్తుంటే చిన్నచలి. సైకిళ్లమీద పోయేవాళ్లు ఎలా తట్టుకుంటున్నారో అనుకుంది. అలా ఎంతసేపు తిరిగిందో తనకే తెలీలేదు. నాలుగు వీధులు తిరిగేక ఓ చెరువు కనిపించింది. చెరువులో బాతులు బారులు తీరి విలాసంగా తేలియాడుతున్నాయి. రెండు బాతులు మునివరుల్లా మునకలు వేస్తుంటే గమ్మత్తుగా వుంది చూడ్డానికి. కేవలం తనకోసమే ఏర్పాటు చేసిన వినోదప్రదర్శనలా వుంది. దూరంగా కొందరు పడవల్లో షికార్లు కొడుతున్నారు గాలివాలుకి తెరచాపలు ఎత్తి.
ఓ గంటసేపు అలా కాలక్షేపం అయింతరవాత గీతమనసు తేరుకుంది. కళ్లు తడి అయేయి ఆనందంతో. మళ్లీ సత్యం జ్ఞాపకం వచ్చింది. ఒకర్నొకరు వదిలి వుండలేం అనుకున్నారు అప్పట్లో. అనుకున్నంతసేపు పట్టలేదు విడిపోవడం. తనకి ఉత్తరం రాయలేనంత రాచకార్యాలేవిటో ఆవిడగారికి? ప్చ్. ఇప్పుడేం చేస్తూ వుంటుందో. మళ్లీ చప్పున గుర్తొచ్చింది. ఇది వాళ్లకి రాత్రి కదా. నిద్దరపోతూ వుంటుంది. …
ఆకలేస్తోంది. ఇంక ఇంటికి పోదాం అనుకుని వెనక్కి తిరిగింది. తీరా చూస్తే అన్ని వీధులూ ఒక్కలాగే వున్నాయి. తను బయల్దేరినప్పుడు వీధిచివర రెనబామ్స్ షాపు చూసినట్టు గుర్తు. అది ఆనవాలు పెట్టుకుని తమవీధికోసం చూస్తూ ఓ అరగంటసేపు తిరిగింది. తిరిగి తిరిగి కాళ్లు పీకుతున్నాయి కానీ తమవీధి కనిపించలేదు. ఎవర్నేనా అడుగుదాం అంటే అందరూ కారుల్లోనూ, సైకిళ్లమీదా దూసుకుపోయేవారే కానీ కాలినడకవారు ఎవరూ కనిపించడం లేదు. ఆఖరికి ఎవరో ఒకాయన మెయిల్ బాక్సులో ఉత్తరాలు తీసుకుని, కారు ఎక్కి బయటికి వెళ్లబోతూ దొరికేడు. గీత గబగబా ఆయనదగ్గరికి వెళ్లి అడిగింది “రెనబామ్స్ ఎక్కడ?” అని.
“ఈప్రాంతంలో నాలుగు రెనబాములు వున్నాయి.” అన్నాడాయన. గీత అదిరిపడింది. అది చూసి ఆయనే మళ్లీ వీధి పేరు అడిగేడు.
వీధిపేరు గుర్తు తెచ్చుకోడానికి కొంచెం అవస్థ పడాల్సొచ్చింది. ఆలోచించి, “రాండల్” అంది.
“రాండల్ కోర్ట్, రాండల్ అవెన్యూ, రాండల్ డ్రైవ్ – ఏది?” అన్నాడాయన.
గీత తెల్లమొహం వేసి ఏమో అంది.
గీత మొహం చూసి “ఇక్కడ కొత్తా?” అన్నాడు.
“యస్యస్” అంది గీత దిగులుపడిపోతూ. ఆయన మరో నాలుగు ప్రశ్నలు వేశాడు తాను చేయగల సాయం ఏమిటో తెలుసుకునే ప్రయత్నంలో. గీతకి సగం అర్థం అయేయి. సగం అర్థం కాలేదు. తోచిన సమాధానాలు చెప్పింది. గీతని వుండమని చెప్పి, ఆయన లోపలికి వెళ్లి టెలిఫోను బుక్కు తీసుకొచ్చి పేరు అడిగేడు.
తను ఇంకా కొత్త. హరిపేరు చెబితే నయం అనుకుని అతని పూర్తి పేరు చెప్పింది, “ధరణికోట ఆనందవిజయహరనాథరావు.”
“లాస్ట్ నేం ప్లీజ్” అన్నాడాయన మళ్లీ.
“లాస్టున వున్న నేము ఆనందవిజయహరనాథరావు”
“ఆయన్ని అందరూ ఏమని పిలుస్తారు?”
“హారి.” అంది హా ఒత్తి పలుకుతూ.
ఆపెద్దాయన ఆపేరుతో నానా కుస్తీలు పట్టి ఆఖరికి “రావు, ఎవి.హెచ్,” కింద గుర్తించి, ఎడ్రెసు చూసి, “మీరు చాలా దూరం వచ్చేశారు. రండి. నేను అటే వెళ్లాలి. మిమ్మల్ని నాకారులో దింపుతాను” అన్నాడు.
గీతకి హరిమాటలు గుర్తుకొచ్చేయి. ముక్కూ మొహంతెలీని ఈ పెద్దమనిషి కారు ఎక్కితే హరి గోలెట్టేస్తాడేమో. కానీ హరి ఏమంటాడో అన్నభయం కంటే ఇల్లు చేరాలన్న ఆతురత ఎక్కువయి, ఏమయితే అదే అవుతుందనుకుంటూ కారెక్కింది.
ఆ పెద్దాయన ఏం మాటాడకుండా, గీతని గుమ్మంముందు దింపేసి వెళ్లిపోయేడు.
ఈసురోమంటూ మెట్లెక్కి తలుపుదగ్గర నిలబడింది. లోపలికి వెళ్లడానికి తాళాల్లేవు మరి. సమయానికి ఇంటి మేనేజరు అటొస్తూ కనిపించేడు. గీత అతనిదగ్గరికి వెళ్లి, “నేను హరి భార్యని. అజ్ఞానంచేత తాళాలు తీసుకోకుండా బయటికి వచ్చేను. తలుపు గడియపడిపోయింది. దయచేసి, తియ్యండి” అని ప్రార్థించింది.
“అద్దెకి తీసుకున్నవారికి తప్ప నేను తలుపులు తీయరాదు,” అన్నాడతను నొచ్చుకుంటూ.
“హరి నిజంగా నాభర్తే. నేను అగ్నిసాక్షిగా ఆయనని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నేను కూడా ఆయింట్లోనే వుంటున్నాను” అంది మంగళసూత్రాలమీద చెయ్యేసి, ప్రమాణపూర్తిగా.
“అమ్మా, మీవివాహం నాకు చాలా సంతోషదాయకం. మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. కానీ కాంట్రాక్టుమీద సంతకం చేసినవారు మాత్రమే తలుపు తీయుట వంటి సర్వీసు పొందుటకు అర్హులు.” అన్నాడు మళ్లీ.
ఇంకా “ఇతరులకి తలుపు తీస్తే నాకు తిప్పలు, నా జాబుకి ముప్పులు” అని కూడా చెప్పేడు జాలిగా మొహం పెట్టి.
గీతకి కూడా జాలేసింది. పాపం, అతని కూట్లో ఎందుకు దుమ్ము కొట్టడం అనిపించింది.
అలా ఇద్దరూ ఒకరికోసం ఒకరు బాధపడిపోతూ, ఒకరిమీద ఒకరు జాలి పడిపోతూ రెండు నిముషాలపాటు మౌనం పాటించేరు. వారి మౌన ప్రార్థన ఊరికే పోలేదు.
హరి ప్రత్యక్షమయేడు. ఇంట్లో గీత ఎలా వుందో పిలిచిచూద్దాం అని పిలిచిచూసి, రెండోసారీ, మూడో సారీ కూడా ఫోను తియ్యకపోయేసరికి కంగారు పడి ఇంటికొచ్చాట్ట.
గుమ్మందగ్గర గీత నిలబడి వుంది బిక్క చచ్చిపోయి. హమ్మయ్య అనుకుని తలుపు తీశాడు.
* * * * *
(ఇంకా ఉంది)
చిత్రకారుడు: ఆర్లె రాంబాబు
నిడదవోలు మాలతి ఏడు దశాబ్దాలుగా కథలు రాస్తున్నారు. 2001లో తూలిక.నెట్ ప్రారంభించి, మంచి కథలు ఇంగ్లీషులోకి అనువాదాలు చేసేరు.. ప్రధానంగా తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను విదేశీయులకి కథలద్వారా తెలియజేయాలన్న ఆశయంతో మొదలుపెట్టిన సైట్ అది. 2009లో తెలుగు తూలిక బ్లాగు ప్రారంభించి తమ కథలు, వ్యాసాలు, సమీక్షలు, కవితలు ప్రచురిస్తున్నారు. ఆమెసాహిత్యం ఆమెబ్లాగు www.tethulika.wordpress.comలో చూడవచ్చు. కథాసంకలనాలు, వ్యాససంకలనాలు అన్నీ తెలుగు తూలిక బ్లాగులో e-Book formatలో ఉచితంగా లభ్యం. స్వాతంత్ర్యానంతరం, తెలుగు రచయిత్రులు అసామాన్యమైన ప్రాముఖ్యం సంపాదించుకున్నారు. ఆ ప్రాముఖ్యతకి వెనుక గల సాహిత్య, సామాజిక, ఆర్థిక, కౌటుంబిక పరిస్థితులను విశ్లేషిస్తూ రాసిన పుస్తకం Women writers, 1950-1975. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ.
ఎంతో సహజంగా, అందంగా చెపుతున్నారు. అభినందనలు.
అనూరాధ నాదెళ్ల
ధన్యవాదాలండి.
గీత భలే సాహస యాత్ర చేసేసింది కదూ. సహజంగా ఉంది.
నాదెళ్ల అనూరాధ
సమస్తం అయోమయం అయిన లోకంలో పడినప్పుడు, ఏమి చేస్తున్నానన్న ఆలోచన కూడా కలగదని చెప్పడానికి ప్రయత్నించేనండి.