పదాల ఉరవడి, జనపదాల ఉరవడి

పుస్తకాలమ్’ – 5

(ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )

  -ఎన్.వేణుగోపాల్

          మొదటే ఒక హెచ్చరిక. ఇవాళ నేను పరిచయం చేస్తున్న పుస్తకం మీకు ఎక్కడా దొరకదు. ప్రచురణకర్తలు దాన్ని అమ్మకానికి ఉద్దేశించలేదు. తూర్పు లండన్ లోని హాక్నీ ప్రాంతంలో ఉన్న ఏడు లైబ్రరీల్లో చదువరులకు ఉచితంగా పంపిణీ చెయ్యడం కోసం మాత్రమే 3000 కాపీలు ప్రచురించారు. అది ఒక వారం కిందనే నాచేతికి అందిన అద్భుతమైన కవితా సంకలనం Swirl of Words Swirl of Worlds (స్విర్ల్ ఆఫ్ వర్డ్స్ స్విర్ల్ ఆఫ్ వరల్డ్స్ – పదాల ఉరవడి, ప్రపంచాల ఉరవడి). ఆ అంతర్జాతీయ కవితా సంపుటం సంపాదకులు నాతో ఒక ఏడాదిగా సంభాషణలో ఉన్నందువల్ల, అందులోని 94 భాషల 116 కవితల్లో వరవరరావు గారి ‘రిఫ్లెక్షన్’ కూడ ఉండడం వల్ల అది నా హృదయానికి దగ్గరిదయింది. అది ఒక అత్యద్భుతమైన కవితా సంకలనం గనుక మీతో పంచుకుంటున్నాను.

          పుస్తకంలోపల ఉన్న కవితల దగ్గరికి పోబోయే ముందు అసలు ఆ పుస్తకం రూపు దిద్దుకున్న కథ తెలుసుకోవలసినది. లండన్ మహానగరం తూర్పు భాగంలో హాక్నీ అనే పాలనా ప్రాంతం (మన జిల్లా లాంటిది, బరో అంటారు) ఉంది. 21 వార్డులతో, రెండు లక్షల ఎనబై వేల జనాభాతో ఉన్న ఈ ప్రాంతం విస్తారమైన సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక వైవిధ్యానికి నిలయం. అక్కడ నివసించే ప్రజల్లో మూడో వంతు బ్రిటన్ కు బైట పుట్టినవాళ్లే. నూటికి డెబ్బై ఐదు మంది తమ భాష ఇంగ్లిష్ అని నమోదు చేసుకున్నారు గాని, కనీసం 94 భాషలు మాట్లాడేవారు అక్కడ ఉంటున్నారు. ఎక్కువమంది మాట్లాడే భాషలుగా ఇంగ్లిష్, టర్కిష్, పోలిష్, స్పానిష్, ఫ్రెంచ్, యిద్దిష్, బెంగాలీ, పోర్చుగీస్, ఇటాలియన్, గుజరాతీ నమోదయ్యాయి గాని అక్కడ నివసిస్తున్న వారిలో కనీసం ఒక్క కుటుంబమైనా, ఒక్క వ్యక్తి అయినా మాట్లాడే భాషలన్నీ లెక్కిస్తే 94 అవుతాయి. అంటే ఆ ఇరవై చ.కి.మీ. కన్న తక్కువ విస్తీర్ణంలో యావత్ప్రపంచమూ ఉందన్నమాట.

          ఆ ప్రాంతంలో పీర్ (PEER) అనే స్వతంత్ర కళా సంస్థ ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నది. “స్థానిక సముదాయంతోనూ, విశాల సమాజంతోనూ సంబంధం పెట్టుకుని, వారితో సంభాషిస్తూ, అత్యున్నత ప్రమాణాల అర్థవంతమైన సాంస్కృతిక అనుభవాన్ని స్థానిక ప్రజల నిత్య జీవితంలో అతి సాధారణాంశంగా మార్చడం” ఆ సంస్థ ప్రధాన లక్ష్యం. ఆ ప్రాంతంలో ఉన్న ఏడు లైబ్రరీల ద్వారా, కళా ప్రదర్శనల ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సంస్థ నెలకొని ఇరవై సంవత్సరాలు అయిన సందర్భంగా ఏడాది పొడవునా తలపెట్టిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా సెప్టెంబర్ 2020 నాటికి ఒక కవితా సంపుటం ప్రచురించాలని ఆలోచించారు. నాలుగు దశాబ్దాలకు పైగా ఆ ప్రాంతంలోనే నివసిస్తున్న సుప్రసిద్ధ కవి, అనువాదకుడు, భాషా కార్యకర్త స్టీఫెన్ వాట్స్ ను సంప్రదించారు.

          1952లో పుట్టిన స్టీఫెన్ వాట్స్ సొంత కవిత్వం ఏడు సంపుటాలు ప్రచురించారు. అనేక కవితా సంపుటాలకు, సంకలనాలకు సంపాదకులుగా ఉన్నారు. కుర్దిష్, జార్జియన్, బ్రిటిష్ బంగ్లాదేశీ, యిద్దిష్, స్లొవేనియన్, పంజాబీ, అరబిక్, పర్షియన్ తదితర భాషల కవిత్వం ఇంగ్లిష్ అనువాదాలు ఎన్నో సంపుటాలు ప్రచురించారు. గత నలబై ఏళ్లుగా ‘బిబ్లియోగ్రఫీ ఆఫ్ మాడ్రన్ పొయెట్రీ ఇన్ ఇంగ్లిష్ ట్రాన్స్ లేషన్’ (ఇంగ్లిష్ లోకి అనువాదం అయిన ఆధునిక కవితా సూచి) అనే భారీ పథకాన్ని నడుపుతున్నారు.

          ఆయనకు ఉన్న విస్తారమైన అనుభవం భూమికగా, హాక్నీ బరో నివాసులు మాట్లాడే భాషల్లో ఒక్కొక్క భాష నుంచి ఇంగ్లిష్ లోకి అనువాదమైన ఒక్కొక్క కవిత ఎంపిక చేసి ద్విభాషా సంకలనం తేవాలనే ఆలోచన వచ్చింది. “దాని ఆచరణసాధ్యత రీత్యా కొన్ని రకాలుగా అది ఒక పిచ్చి ఆలోచన. కాని ఎన్నో పిచ్చి ఆలోచనలలాగే అది కూడ అత్యత్తమమైనదీ, ప్రయత్నిస్తే ఫలవంతమైనదీ” అనుకున్న స్టీఫెన్ వాట్స్ అందుకు ఒప్పుకున్నారు. పుస్తకంలో ఆయన తన పేరు సంపాదకుడిగా కాక, “సేకర్త” గా వేసుకున్నారంటే అది వినయమే గాని, ఆయన అద్భుతమైన, అపారమైన కృషి ప్రతి పేజీలో, ప్రతి కవితలో కనబడుతుంది.

          దాదాపు వంద భాషల కవితల సంకలనపు బృహత్ప్రయత్నం గనుక కవిత సాధారణంగా ఒక పేజీ మించగూడదని నియమం పెట్టుకున్నారు. నాలుగైదు సందర్భాల్లో మాత్రమే మినహాయింపు ఇచ్చారు. అయినా ఆ ఎంపిక కష్టమే. ప్రతి ఒక్క భాషలోనూ వందలాది సంవత్సరాల కవిత్వ చరిత్ర ఉండి ఉంటుంది. వందలాది కవుల, వేలాది మంచి కవితలు ఉండి ఉంటాయి. ఇదివరకే ఇంగ్లిష్ లోకి అనువాదమై ఉన్నవి అనే నియమం పెట్టుకున్నా ప్రతి భాషలోనూ కొన్ని డజన్లయినా అనువాదం కూడ అయ్యే ఉంటాయి. ఆ మహా సముద్రంలోంచి ఈ మరచెంబు ఎలా సాధించగలిగారో ఎక్కడా చెప్పలేదు గాని, స్టీఫెన్ వాట్స్ రాసిన పరిచయంలో నుంచి కొన్ని మాటలు ప్రతి కవిత్వాభిమానీ తలచుకోవలసినవి.

          “కవిత్వ రచన అనే కార్యాచరణ, దానితో పాటే మరొక రచనా రూపమే అయిన అనువాదం అనే కార్యాచరణ, ఆ మాటకొస్తే అసలు భాషా కార్యాచరణే నాకెప్పుడూ తిరుగుబాటును నిక్షిప్తం చేసుకున్న కార్యాచరణలుగా కనిపిస్తాయి. అంటే స్వేచ్ఛను ఉత్సవం చేసుకునే, సమర్థించే కార్యాచరణలుగా కనిపిస్తాయి. ఆంక్షలూ పరిమితులూ వ్యాప్తిస్తున్న వేళ భాషా వైవిధ్యాన్ని ఉత్సవంగా జరిపేందుకు మేం ఈ సంకలనాన్ని చేపట్టాం. మేమీ పనిని ప్రేమతో, నిబద్ధతతో చేపట్టాం… కవిత్వమంటే ఊపిరి. జీవనం ఊపిరి మీద ఆధారపడుతుంది. ఆ రకంగా జీవితమూ కవిత్వమూ ఒకదానిలో ఒకటి కలిసిపోతాయి, ఒకదాని మీద మరొకటి ఆధారపడతాయి. కవిత్వం అనే కార్యాచరణ లేకపోతే మన జీవితాలు నిలువనీరైపోతాయనీ, అది మరణమేననీ మనం నిస్సందేహంగా చెప్పవచ్చు.”

          “లండన్ నగరంలో సామాజికంగా, సంఖ్యాపరంగా ఎన్నో భాషలు మాట్లాడే ప్రజలున్నారనే అవగాహనతో మా పని ప్రారంభించాం. నిజానికి ఇది అన్ని నగరాల్లోనూ, దాదాపు ప్రతిచోటా ఉండేదే. హాక్నీ కౌన్సిల్ జరిపిన 2011 జననగణనలో మా ప్రాంతంలో 86 భాషలు మాట్లాడేవాళ్లున్నారని నమోదైంది. దానితో మా ప్రయత్నం మొదలుపెట్టాం” అని ఆయన అన్నారు. “కవిత్వం ప్రపంచానికి హృదయ స్థానంలో ఉన్నదని, మన వ్యక్తిగత, సాముదాయక ప్రపంచాలన్నిటి రవరవలాడే గుండెలలో ఉన్నదని, చెప్పడం పూర్తి నిజం కాదు. అందుకు భిన్నంగా, కవిత్వమే ప్రపంచపు హృదయం…. కవిత్వమే ప్రపంచం. ఈ అవగాహన అంచులకైనా రాలేనివారు ఇవాళ మన రాజకీయవేత్తలలో అత్యధికులుగా ఉన్నారు. కవిత్వం ప్రజల కోసం, దైనందిన జీవితాలు గడిపే అతి సాధారణ ప్రజల కోసం. అది మనం మట్లాడే భాష నుంచీ, భాషల నుంచీ పెల్లుబికి వస్తుంది” అన్నారాయన.

          “మన ప్రపంచంలో కవికి ఉన్న మౌలిక స్థానంతో సమానమైనది అనువాదక స్థానం. స్టీఫెన్ రెండు పాత్రలూ నిర్వహించారు. ఒక కవితను ఒక భాష నుంచి మరొక భాషలోకి, ఒక స్థల కాలాల్లోంచి మరొక స్థల కాలాల్లోకి బదిలీ చేసినప్పుడు ఏం జరుగుతుందో పరిశీలించమని ఆయన తన సమస్త కృషితో మనకు చెపుతున్నారు…. కవిత్వాన్ని అనువదించడం బహుశా ఒక మొక్కను దాని స్వస్థలం నుంచి తీసి మరొక స్థలంలో నాటడం లాంటిది. కవి ఉద్దేశించిన అర్థాన్ని చెప్పడానికి సమానమైన, లేదా తగిన మాటనో, పదగుచ్ఛాన్నో ఎంచుకోవడం మాత్రమే కాదు, ఆ కవిత జీవించడానికీ, వికసించడానికీ తగిన ఒక కొత్త భాషా వాతావరణాన్ని అనువాదకులు కల్పించవలసి ఉంటుంది” అని పీర్ డైరెక్టర్ ఇన్ గ్రిడ్ స్వెన్సన్ అన్నారు.

          ఈ 94 భాషల 116 కవితల్లో మూడు నాలుగు మౌఖిక, జానపద గీతాలు కూడ ఉన్నాయి గాని ప్రధానంగా ఇది ఇరవయో, ఇరవై ఒకటో శతాబ్ది వచన కవిత్వమే. ఫ్రెంచి కవి గిల్లాం అపొలినేర్ లాంటి అంతకు ముందరి కవులు ఎక్కడో ఒకచోట మినహాయింపు మాత్రమే.

          భారతీయ భాషల నుంచి గుజరాతీ (గోపికా జడేజా), హిందీ (మంగ్లేశ్ దబ్రాల్), కశ్మీరీ (ఆర్షద్ ముష్తాఖ్), మలయాళం (కె సచ్చిదానందన్), మరాఠీ (బహినాబాయి చౌధరి), పంజాబీ (అమర్ జిత్ చందన్), తమిళం (కుట్టి రేవతి), తెలుగు (వరవరరావు), ఉర్దూ (ఫైజ్ అహ్మద్ ఫైజ్) కవితలున్నాయి. ఇతర భాషల నుంచి కవిత్వాభిమానులందరికీ తెలిసిన యానిస్ రిట్సాస్ (గ్రీక్), అత్తిలా జోసెఫ్ (హంగేరియన్), మియాజావా కెంజి (జపనీస్), వ్లాదిమిర్ మయకోవస్కీ (రష్యన్), ఫెడరికో గర్షియా లోర్కా (స్పానిష్), చేరన్ (శ్రీలంక తమిళం), నాజిం హిక్మత్ (టర్కిష్) వంటి కవులూ ఉన్నారు. మిగిలిన ఎనబై కవితలు, కవులు ఇప్పటికి తెలియనివారే అయినా ఒక్కొక్కటీ ఒక ఆణిముత్యం.

          ఇటువంటి వివిధభాషల కవితల సంకలనాలతో సాధారణంగా కొన్ని సమస్యలుంటాయి. కవితల ప్రమాణాల మధ్య అసమతుల్యత ఉండవచ్చు, ఆ భాషకు ప్రాతినిధ్య కవి అక్కడ ఉన్న వారేనా అనిపించవచ్చు, ఆ కవి కవితల్లో కూడ ప్రాతినిధ్య కవిత అదేనా అనిపించవచ్చు, సంపాదకుల స్వీయమానసిక అభిరుచో, సులభంగా అందుబాటులో ఉండడమో తప్ప, ఆ కవిత అంత శక్తిమంతమైనది కాదనిపించవచ్చు. ఆ అనువాదంలో మూల కవిత శక్తి బహిర్గతం కాలేదనిపించవచ్చు. కాని సాధారణంగా ఉండే ఆ సమస్యలను ఈ సంకలనం చాలవరకు అధిగమించింది. పాబ్లో నెరూడా లేకపోవడం నాకు కూడ రుచించలేదు గాని అప్పటికే స్పెయిన్ స్పానిష్ కు ఒకటీ, లాటిన్ అమెరికన్ స్పానిష్ కు ఒకటీ ప్రాతినిధ్య కవితలున్నాయి గనుక నెరూడాను పక్కనపెట్టవలసి వచ్చినట్టుంది.

          నావరకు నాకు ఈ 116 కవితల్లో కనీసం పది కవితలు అత్యద్భుతంగా, దాదాపు ముపై ఐదు కవితలు అద్భుతంగా ఉన్నాయి. మరొక ముప్పై కవితలు మంచి కవితలు అనిపించింది. మొత్తంమీద ఉండకపోయినా ఫర్వాలేదనిపించే కవితలు పది కన్న ఎక్కువ లేవు. అంటే మొత్తం మీద ప్రచురణకర్తల, సంపాదకుల (సేకర్తల) కృషి ఫలించినట్టే.

          ఈ పుస్తకం వల్ల నాకు అనుకోకుండా ఒక అద్భుత సోవియట్ కళానిధి దొరికింది. ఇందులో వ్లాదిమిర్ మయకోవస్కీ 1921లో రాసిన చిత్ర కవిత ‘కలరాతో చావకుండా ఉండడానికి ఏం చేయాలి?’ అనేది చేర్చారు. అది 14 బొమ్మల, 14 పంక్తుల కవిత (?). అది కవిత అవునా, అది ఎందుకు చేర్చారు అని చాల ఆలోచించాను. దాని వెనుక ఏమన్నా అర్థం ఉందా, ఏమైనా వివరణ దొరుకుతుందా అని రాదుగ ప్రచురణలు 1985లో వేసిన మయకోవస్కీ రచనల మూడు సంపుటాలు వెతికాను. ఆ సంపుటాల్లో ఈ రచనే లేదు! చివరికి, ఇంటర్నెట్ మీద ఆ రహస్యం బైటపడింది. బోల్షివిక్ విప్లవ విజయానంతరం కవిత్వం, చిత్రలేఖనం, వచనం వంటి అనేక రూపాలలో ప్రజలకు అత్యవసరమైన సమాచారాన్ని ప్రభుత్వం పోస్టర్ల రూపంలో ప్రచారం చేసింది. వాటి మీద ఉన్న బొమ్మల వల్ల గాని, వాటి మీది కవిత్వ, వచన సందేశాల వల్ల గాని, ప్రజలలో విస్తృతంగా వ్యాపించిన ఆ సమాచారం వల్ల గాని ఆ పోస్టర్లు ఒక్కొక్కటీ సామాజిక ప్రయోజనం సాధించిన ఒక కళాఖండం. ఎందరో కవులూ కళాకారులూ సాహిత్యకారులూ పాల్గొన్న ఆ కళాఖండాల సృష్టిలో మయకోవస్కీ పాత్ర అత్యంత ప్రధానమైనది. ‘అదంతా ఉట్టి ప్రచారం’ అని చాల మందికి అనిపించవచ్చు గాని, ‘ప్రజల నిత్యజీవిత అంశాలను కళాత్మక అనుభవం చేయడమే’ తమ లక్ష్యం అని చెప్పుకున్న ఈ సంకలనకర్తలు తప్పనిసరిగా ఆ ప్రచార పోస్టర్ లో కవిత్వాన్ని చూసి ఉంటారు.

          ఈ వెతుకులాట వల్ల నాకు 2019లో న్యూయార్క్ లో అచ్చయిన ‘ఎర్లీ సోవియెట్ పోస్టర్స్ ఆఫ్ ది రెవల్యూషనరీ ఎరా, 1917-1927’ అనే అద్భుతమైన 190 పేజీల బొమ్మల, వివరణల పుస్తకం సాఫ్ట్ కాపీ దొరికింది.

          మళ్లీ ‘స్విర్ల్ ఆఫ్ వర్డ్స్’ లోకి వెళ్లి, కనీసం పది ఇరవై కవితలన్నా తెలుగు చేసి మీతో పంచుకోవాలని ఉంది గాని, ప్రస్తుతానికి ఒకటి మచ్చుకు చూపుతాను: అది యుఫ్రేజ్ కెజిలహాబి (1944-2020) రాసిన స్వాహిలి కవిత ‘ఉపెపో వా వాకాటి’ (ది విండ్ ఆఫ్ టైమ్) కు తెలుగు:

కాలపు గాలి

ఒకానొక రోజు నేనొక గుట్టబోడు మీద నిలబడి

కింద పరచుకున్న సరస్సును చూస్తున్నాను

తుపాను వర్షపు రోజది, అలలను చూస్తున్నాను

లేచి నిలుస్తూ, విరిగి పడిపోతూ. అల్లకల్లోలమవుతూ

సుడిగుండాలు రేపుతూ, కవ్వంతో చిలికినట్టు నురుగులు వెదజల్లుతూ

గడ్డి లేని బీడు భూమి మీద పిచ్చెక్కిన ఆంబోతుల లాగ.

అబ్బ ఎట్లా గింగరాలు తిరుగుతున్నాయవి!

ఎట్లా విరిగి పడిపోతున్నాయవి, తిరిగి ఎట్లా లేచి నిలుస్తున్నాయవి!

నేనెప్పుడూ చూడనటువంటి దృశ్యం అది

పడమటి నుంచీ తూర్పు నుంచీ పరుగెత్తుకొచ్చే గాలులతో

పడిపోతున్న, ఎగసిపడుతున్న అలలను చూశాను.

సరిగ్గా మన ప్రపంచం లాగే

సరిగ్గా మన జీవితాలలాగే

కాలపు గాలుల మీద 

పడిపోతూ, తిరిగి లేస్తూ.

నీటమునుగుతూ మిత్రుడి కాలు పట్టుకున్నమనిషి లాగ

అధికారాన్ని ఒడిసి పట్టుకునే వాళ్లు!

చిన్నారులు తమ బొమ్మను గట్టిగా పట్టుకున్నట్టు,

పిచ్చెక్కిన సైనికుడు

మన నోరు మూయించడానికి తన తుపాకిని పట్టుకున్నట్టు

డబ్బును గట్టిగా అదిమి పట్టుకునేవాళ్లు

వాళ్లు కూడ లేస్తారు, పడిపోతారు

కుప్పకూలిపోతారు

కాలపు గాలులు తోసినకొద్దీ.

ఇంగ్లిష్: కత్రీనా రన్నె (పొయెట్రీ ట్రాన్స్ లేషన్ వర్క్ షాప్)

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.