మా అమ్మ విజేత-6
– దామరాజు నాగలక్ష్మి
“వీరలక్ష్మి గారూ ఇంట్లోనే ఉన్నారా? సుబ్బారావు బయటికి వెళ్ళాడా… అనుకోకుండా ఇటు వచ్చాను. నా కూతురు సరోజని చూసినట్టుంటుంది. మీ మనవరాలు అమ్మాజీని మా రాజుకి ఇచ్చి చేద్దామనుకున్నాం కదా.. పనిలో పని మంచి రోజు చూసుకుంటే పెళ్ళి పనులు మొదలు పెట్టుకుందాం… నేను ఇవాళ వచ్చినది మంచి రోజు కాదనుకోండి. నాకు అలాంటి నమ్మకాలు లేవు. ముందర పని అవడం కావాలి. సరే పెళ్ళికి అయితే మంచిరోజు చూడాలిగా మరి. కొంచెం మంచినీళ్ళివ్వండి” అంటూ మాట్లాడ్డం ఆపి ఎదురుగా ఉన్న కుర్చీలో కూలబడింది అన్నపూర్ణమ్మ.
తుఫాను వెలిసి నట్టయింది అనుకుంటూ ఓ చిన్న జమీందారిణిలా హుందాగా కూచున్న అన్నపూర్ణమ్మగారికి మంచినీళ్ళందించింది వీరలక్ష్మి.
“ఎండనపడి వచ్చారు. మజ్జిగ తాగుతారా… కాఫీ ఇవ్వమంటారా… ?”
“ఏమిటో… ఎంత ఎండయినా… కాఫీగత ప్రాణులం కదా… కాఫీయే ఇవ్వండి” అంది అన్నపూర్ణమ్మ.
వీరలక్ష్మి కోడలు సరోజతో… “అమ్మ వచ్చారమ్మా… ఏం చేస్తున్నావ్. బయట కూచున్నారు చూడు” అంటూ కాఫీ కలపడానికి వెళ్ళిపోయింది.
సరోజ పిల్లని చంకనేసుకుని “ఏంటమ్మా ఉత్తరపత్తరం లేకుండా ఇలా వచ్చేశావు. ఈయన ఎక్కడో బయటికి వెళ్ళారు. భోజనానికి రానని చెప్పారు” అంటూ ఇంకా ఏవేవో కబుర్లు చెప్పేస్తోంది.
కాఫీ తెచ్చిన వీరలక్ష్మిగారు సరోజ మాటలు విని “అమ్మ కూడా ఇప్పుడే వచ్చారుగా… వుంటారులే. సాయంత్రంలోపున సుబ్బారావు వచ్చేస్తాడుగా…” అంది.
పని పూర్తి చేసుకుని వెడదామనుకున్న అన్నపూర్ణమ్మగారు ఏమీ మాట్లాడలేదు.
వీరలక్ష్మి గారు కట్టెలపొయ్యి అప్పటికే అంటించి వుండడంతో వంట పూర్తి చేసి, అన్నపూర్ణమ్మగారికి, సరోజకి అన్నం పెట్టేసింది. ఇద్దరూ బయట కూచుని కబుర్లు చెప్పు కుంటున్నారు.
ఇంతలో వీరలక్ష్మిగారు అమ్మాజీని పిలిచి అన్నం పెట్టి “అమ్మాజీ… అమ్మమ్మ పిలుస్తోంది. ఒకసారి కనిపించేసిరా…” అంది.
అమ్మాజీ గదిలో కూచున్న అన్నపూర్ణమ్మగారిని ఒకసారి తొంగి చూసేసి వెళ్ళి పోయింది. చిన్నపిల్ల అని నవ్వుకున్నారు.
సాయంత్రానికి సుబ్బారావు బయటి నుంచి వచ్చాడు. వస్తూనే… “అత్తయ్యగారూ ఎప్పుడు వచ్చారు? నాకు తెలిస్తే బస్సు దగ్గిరికి వచ్చేవాడిని!” అన్నాడు.
“నువ్వటువెళ్ళగానే వచ్చాకానీ సుబ్బారావ్. కూచో కాసేపు. అమ్మాజీ పెళ్ళి విషయం ఖాయం చేసుకుందాం” అంది.
సుబ్బారావ్ ఆవిడకి దగ్గరలో ఓ కుర్చీ వేసుకుని కూచున్నాడు. “అమ్మా… నువ్వు కూడా ఇటురా… కాసేపు. ఏదైనా పని వుంటే సరోజ చూసుకుంటుంది” అన్నాడు. వీరలక్ష్మి వచ్చి కిందే చతికిలపడి కూచుంది.
“అన్నపూర్ణమ్మగారూ… ఈ పెళ్ళికి మనం పెద్ద మాట్లాడుకునేది ఏముంటుంది. కాసేపు వుండండి వీరభద్రం కూడా వస్తానన్నాడు. అందరం ఓ మాటకి వచ్చేద్దాం. కాకపోతే పిల్లకీ పిల్లాడికి 11 సంవత్సరాలు తేడా మరీ చిన్న పిల్లయిపోతుందేమో అనుకున్నాం కానీ… ఏం చేస్తాం అందరం కావలసిన వాళ్ళమే…” అని మాట్లాడుతూండగానే వీరభద్రం వచ్చాడు.
“చెప్పండమ్మా … వీరలక్ష్మి నాకు అంతా చెప్పింది. అమ్మాజీని ఓ ఇంటి దాన్ని చేస్తే మాకందరికీ దిగులుండదు. ఇంక మనం ఇందులో మాట్లాడుకునేది ఏమీలేదు. నేను బ్రాహ్మడికి చెప్పి ముహూర్తం పెట్టిస్తాను. ఏమంటారు?” అన్నాడు.
“సరే నాకో ఉత్తరం ముక్క రాసి పడెయ్యండి. పెళ్ళిపనులు చేసుకుందాం. సరే… నాకు ఏలూరు వెళ్ళే బస్సు వెళ్ళిపోతుంది. నేను చీకటి పడకుండా వెళ్ళిపోవాలి” అంటూ బయటికి నడిచింది అన్నపూర్ణమ్మ.
వీరలక్ష్మి వీరభద్రంతో “ముహూర్తం తొందరగా పెట్టించండి. ఓపనయి పోతుంది. చిన్న పిల్ల పెళ్ళయినా చాలా పనులుంటాయి కదా..!” అంది.
వీరభద్రం “సుందరి అమ్మాజీకి చేయించిన నగలు, వెండిగ్లాసులు, వెండి పళ్ళెం కూడా నేను పెళ్ళిలో చదివిస్తాను. చిన్న పిల్ల కదా… మీరే జాగర్త పెట్టాలి” అన్నాడు.
“సరే మేము జాగ్రత్తగానే చూసుకుంటాం. మీరయితే ముహూర్తం పెట్టించండి” అంది వీరలక్ష్మి.
వీరభద్రం ఇంటికి బయల్దేరాడు.
***
మాఘమాసం కావడంతో ముహూర్తాలు బాగానే వున్నాయి. ఒక పదిహేను రోజులు టైము వుండేలా చూసుకుని ముహూర్తం పెట్టించాడు.
వీరభద్రం తమ్ముడు పట్టెయ్యని ఏలూరు పంపించి అన్నపూర్ణమ్మగారికి కబురు చేశాడు.
అమ్మాజీకి ఇంటికి వచ్చే రాజు మామయ్యతో పెళ్ళి అంటే సంతోషంగానే అనిపించింది. అదేదో ఆటలాగా అనుకుంది. ఊరందరికీ తనకి పెళ్ళి అని చెప్పి వచ్చింది. అందరూ పిచ్చిపిల్ల ఓ ఇంటిదవుతోంది. పోనీలే తెలిసిన సంబంధమే అనుకున్నారు.
సుబ్బారావు పొలం నుంచీ తాటాకులు తెప్పించి, నాలుగు రోడ్లకి పెద్ద పందిరి వేయించాడు. అందరూ హడావుడిగా వీరలక్ష్మికి సాయం చెయ్యడానికి వచ్చారు.
అసలే బక్కగా వుండే అమ్మాజీకి అన్నపూర్ణమ్మగారు రాజమండ్రి నుంచి గులాబీ రంగు పట్టు చీర తెప్పించింది. “అమ్మాజీ చీర బావుందా… ” అన్నారు. అమ్మాజీ ఆ చీరని ఓసారి ముద్దుపెట్టుకుని పరుగెత్తింది.
వీరభద్రంగారు మేనగోడలికి ఆకుపచ్చరంగు పట్టుచీర కొన్నారు. ఆచీరలో అమ్మాజీ మునిగిపోతుందని తెలుసు కానీ ఆచారాన్ని కాదనలేరు.
పెళ్ళి నాలుగు రోజులు ఉందనగా అమ్మాజీని ఇంట్లోనే వుండమన్నారు.
ముందురోజు పెళ్ళి కూతుర్ని చేశారు. అమ్మాజీకి చీర ఎలా కట్టాలో ఎవరికీ అర్థం కాలేదు. ఎందుకంటే అంత చిన్నపిల్లకి పెద్ద చీర కడితే పడిపోతుందేమో అని భయం. మొత్తానికి ఎలాగో కష్టపడి చీర కట్టి పెళ్ళికూతుర్ని చేశారు. ఊరంతా వీళ్ళ చుట్టాలే కాబట్టి అందరూ అక్కడే వున్నారు.
రెండు రోజుల ముందరే వచ్చిన అన్నపూర్ణమ్మగారి కుటుంబానికి స్కూలు విడిదిగా ఇచ్చారు. ఆ స్కూలులో వాళ్ళకి కావలసిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేశారు.
అమ్మాజీకి ఇదంతా వింతగా వుంది. బయటికి వెళ్ళి ఆడుకుందామంటే చీరతో నడవడం రావట్లేదు. ఆ చీర ఇప్పేసి లంగా, జాకెట్టు వేసుకుంటానంటే ఎవరూ ఒప్పుకోవట్లేదు. ఇంట్లో అందరూ హడావుడిగా తిరుగుతున్నారు. ఇంక అమ్మాజీ బాధ చూడలేక. పిల్లలందరినీ వీళ్ళింటికే రమ్మన్నారు వీరలక్ష్మిగారు.
చేతినిండా గాజులు, చిట్టి చేతులకి గోరింటాకు, మెళ్ళో కాసులపేరు, కాళ్ళకి పట్టీలతో ముద్దుగా బొమ్మలా వుంది అమ్మాజీ. చీరని చేత్తో పట్టుకుని నడవలేక నడవలేక నడుస్తుంటే… సాయంచేస్తున్న పెద్దమ్మ పిల్లలు, స్నేహితులు అందరూ అమ్మాజీతో సరదాగా కబుర్లు చెపుతున్నారు. వాళ్ళు “మనం తాటాకు బొమ్మలకి బట్టలు కట్టి, వాటికి పెళ్ళి చేసేవాళ్ళం కదా… అలాగే వుంటుంది. నువ్వేం భయపడకు మేమందరం ఇక్కడే వుంటాం ” అన్నారు.
పెద్దవాళ్ళందరూ వంటలు, భోజనాలు, పిండివంటలు హడావుడిలో వున్నారు.
* * * * *
(ఇంకా ఉంది)
నా పేరు దామరాజు నాగలక్ష్మి
నేను పుట్టినది వరంగల్ జిల్లా హనుమకొండ. పెరిగినది చదువుకున్నది పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం. ప్రస్తుతం హైదరాబాదు వాస్తవ్యులం.
దినపత్రికలకి వ్యాసాలు రాయడం, కవితలు రాయడం, కథలు రాయడం నా అభిరుచులు. మొక్కలు పెంచడం, ప్రకృతి ఆరాధన ప్రత్యేక అభిరుచులు. స్త్రీల సమస్యలలో పాలు పంచుకుని వారికి తగిన సలహాలు ఇచ్చి సహకరించడం నాకు నచ్చిన విషయం.