మెరుపులు- కొరతలు

బి.అజయ్ ప్రసాద్ కథ “ఎండగుర్తు”

                                                                – డా.కే.వి.రమణరావు

సమాజంలోని ఒక సాదాసీదా వ్యక్తికి ముప్పఏయేళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చి దాన్ని నెమరువేసుకోవడమే ఈ కథ. ఇంకా చెప్పాలంటే అది కథ చెప్తున్న శ్యామ్ జీవితంలో ఇది ప్రాముఖ్యతలేని ఒక ఙ్ఞాపకం. ముఖ్యపాత్ర పొందిన ఒక తడిలేని అనుభూతిని నేరుగా పాఠకులకు అందేంచే ప్రయత్నం. ఇలా అమూర్తంగా, అనాసక్తిగా రాసినట్టు కనబడుతున్న కథలను ఆధునిక కథాసాహిత్యంలో వస్తున్న ఒక ధోరణిగా చూడాలి. అప్పుడే ఆకథను మనం సరిగ్గా అర్థంచేసుకోగలం.

     ఇందులో సంప్రదాయ పద్ధతిలోలాగ ‘కథాంశం’ అని చెప్పడానికి పెద్దగా ఏముండదు. 

     కథచెప్తున్న ముఖ్యపాత్ర శ్యామ్ దాదాపు ముప్పైయేళ్ల క్రితం యువకుడుగా ఉన్నప్పుడు ఒక సీనియర్ లాయర్ దగ్గర స్టెనో. అతనుకాక మరో గుమాస్తా, ఏడుగురు జూనియర్ లాయర్లు ఉండేవారు. సీనియర్ లాయరు అందరికి ఏడువందలే జీతం ఇచ్చేవాడు. ఇంటర్ తప్పి టైపూ షార్టుహాండూ నేర్చుకుని ఇంటినుంచి పారిపోయి బస్తీకి వచ్చి ఒక్కడే ఉంటున్న శ్యామ్ కి అది బొత్తిగా సరిపోయేదికాదు. మధ్యాహ్నాలు భోజనం టీ బిస్కట్లతోనే కానిచ్చేవాడు. శనాదివారాలు పొద్దున్నుంచి సాయంత్రంవరకూ అందరికీ పనివుండేది.

     ‘ఆ సమయంలోనే జూనియరు, సీనియరూ కాని ఒక జూనియర్ లాయరు ఆ సీనియర్ లాయరు దగ్గర చేరాడు. అతనిక్కూడా సీనియర్ లాయరు ఏడువందలే ఇచ్చేవాడు. అతను ‘మాట్లాడడంకంటె తలూపటం ఎక్కువగా ఉండేది. ఆయన కోటుకి ఒకటిరెండుచోట్ల చిరుగులుండేవి. చూట్టానికి పొట్టిగా వెడల్పుగా ఉండేవాడేగాని లావుగా ఉండేవాడు. గుండుచేయించుకున్నాక నెలరోజుల్లో ఎంతజుట్టు పెరుగుతుందో ఆయన జుట్టు ఎప్పుడూ అంతే.’ 

     ‘ఎవరో కొత్తసారు జాయినట్లున్నాడు’ అని శ్యామ్ అంటే ‘కోర్టులో కొంతమంది ప్రాక్టీసులేని ప్లీడర్లు ఇలా జూనియర్లుగా చేరతారు’ అనేశాడు గుమాస్తా ఆయనముందే. ఆయన అదేమీ పట్టించుకోకుండా నిశ్చింతగా ఏదో ఫైలు చూసుకుంటూ’ ఉండిపోయాడు.

     అలాంటి ఆ కొత్తగా అక్కడ చేరిన లాయరు ఒకరోజు మధ్యాహ్నం శ్యామ్ ని భోజనానికి పిలిచాడు. తనదగ్గర సరిపోయేన్ని డబ్బులు లేవని శ్యామ్ తటపటాయిస్తూండగా ఆయనే చొరవగా దారితీసాడు. 

     దారిలో ఆయన్ని గురించి శ్యామ్ అడిగినప్పుడు ఆయన సిగ్గుపడి తనకింకా పెళ్లికాలేదని చెప్పాడు. “నేను పెళ్లిచేసుకోలేదండి. తల్లిదండ్రులను చూసుకుంటూ జీవితం గడిపేసాను. మానాన్నగారికి పక్షవాతం ఉండేది. నేనే చేయాల్సొచ్చేది. ఈమధ్యే మా అమ్మగారుకూడా పోయారు” అనిచెప్పాడు.

     ఇద్దరూ కలసి ఆ ఖరీదైన కాలనిలో రోడుకిరువైపులా పొడవాటి పాతకాలం నల్లటి చెట్ల నీడలకింద నడుస్తూ రెండువీధులు దాటి మెయిన్ రోడ్డు బజారుకు వచ్చి హోటల్లో కూర్చున్నారు. అతనే రెండు ఫుల్ మీల్సుకి ఆర్డరిచ్చాడు. భోజనం తిన్నాక ఒక సిగరెట్టుకూడా శ్యామ్ కి ఇచ్చాడు. అదీ ఆరోజు మధ్యాహ్నం జరిగింది. అంతే. 

     తరువాత ఆ కొత్తలాయరు సీనియరు లాయరుదగ్గర ఉద్యోగం మానేసాడు. ఎప్పుడైనా అతను కోర్టులో చెట్లకిందో, క్యాంటీన్లోనో కనబడ్డాడని మిగతా జునియరు లాయర్లు చెప్పేవారు. అంతే. 

     ఇది జరిగిన ముప్పైయేళ్లతరువాత (ఈ కథాకాలంలో) శ్యామ్ కి అప్పుటి సీనియరు లాయరు ఆఫీసు, ఆరోజు మధ్యాహ్నం వాళ్లిద్దరు వెళ్లి భోజనం చెయ్యడం ఎందుకో గుర్తొచ్చి అదంతా వివరంగా తలచుకున్నాడు. ఇదీ కథ.

     కథంతా ఆరోజుల్ని, సీనియర్ లాయరు అఫీసుని, తొలిరోజుల్లోని శ్యామ్ పరిస్థితిని, కొత్తలాయరుని, అతన్తో హోటలుకెళ్లిన సంఘటనను గురించి వర్ణించడమే ఉంటుంది. ఆ వర్ణనకూడా కథ మూడ్ కి తగినట్టుగా ఒక ఉదాసీన వివరణలా ఉంటుంది. ఒక నిరాసక్త ఙ్ఞాపకం అప్రయత్నంగా వెలువడినట్టు. 

     కథా ప్రారంభమే కథాంశాన్ని, కథారూపాన్ని, వాతావరణాన్ని ఇలా నిర్దేశిస్తుంది; ‘నగరానికి వచ్చిన ఇన్నేళ్ల తరువాత ఇన్నిన్ని రోడ్లు తిరిగి ఇన్ని ఉద్యోగాలు చేసి ఇంతమందితో కలిసి తిరిగి చివరికి అందరినీ మరచిపోయి ముసల్తనానికి దగ్గరపడుతున్న ఈ వయసులో ముప్పైఏళ్ల క్రితం ఓ మధ్యాహ్నం హోటల్లో కలసి భోంచేసిన లాయరు ఎందుకో గుర్తొస్తుంటాడు.’

     ముఖ్యపాత్ర ఆరోజుల్లో తనస్థితిని ఇలా చెప్తాడు. ‘గుమాస్తాకి తోడు స్టెనోగా పనిచేసే నాకు ఏడొందలే ఎందుకో అర్థంకాలా. సరేలే అది మన ఖర్మ అనుకున్నా, జీవితం గడిచిపోతుందికదా అనుకుంటూ. ఇప్పటికీ అదే జబ్బు. ఆలాయరుగారి దగ్గర పనిచేసినంతకాలం నా కడుపులో ఆకలి నకనకలాడుతుండేది.’ 

     ఇందులో విమర్శ, నిరసనలాంటివేవీ లేవు. ప్రపంచంలోని కోట్లాదిమంది సామాన్యుల స్థితిని అంగీకరిస్తూ యథాలాపంగా చెప్పినట్టుగా ఉంటుంది.  

     ఆ మధ్యాహ్నభోజన సంఘటనకూడా సాదాసీదాగానే చెప్పబడింది; ‘నేను జేబులు తడుముకుంటున్నంతలో అటు వెయిటర్ రావడమూ ఇటు ఈయన రెండు ఫుల్ మీల్స్ ఆర్డరు ఇవ్వడమూ జరిగిపోయింది. భోజనంబల్ల ముందు కుంగిన భుజాలతో గొడుగులా కూర్చున్న ఆయన్ని చూస్తే ఎందుకో నవ్వొచ్చింది. ఆయన నిదానంగా తింటూ మధ్యమధ్యలో మాట్లాడుతూ చివరలో రెండుసార్లు సాంబారు వేయించుకున్నాడు.’ 

     శ్యామ్ కి అన్నేళ్ల తరువాత ఆ లాయరు ఎందుకు అనుకోకుండా గుర్తొచ్చాడో అతనికే తెలియదు. చివర దాన్నిలా చెప్తాడు; ‘ఇన్నేళ్ల తరువాత ఈవయసులో ఎప్పుడన్నా ఆ పూట కలిసి భోంచేసిన చిరుగుకోటు లాయరు గుర్తొస్తూంటాడు. వెడల్పాటి మొహంతో. ఎందుకనో. ఆరోజు అక్కడ వీధి మలుపు తిరుగుతూ , పొడవాటి చల్లని చెట్లకింద నడుచుంటూ ‘తల్లిదండ్రులతోనే జీవితం గడిచిపోయిం’దని చెప్పిన మాటలు ఎందుకనో ఇప్పుడూ వింతగా వినిపిస్తూంటాయి చెవుల్లో. అంతకంటే చెప్పేదేంలేదు. అతని గురించి నాకు ఇంకేమీ గుర్తులేదు. కానీ ఏ క్షణానో, ఏ చీకట్లోనో తటాలున గుర్తొచ్చి మాయమౌతూంటాడు. ఎందుకో తెలీదు మరి.’ 

     ‘ఆ మండే ఎండలరోజుల్లో నన్నెవరూ అలా అడిగింది లేదు’ అనిమాత్రమే అంటాడు శ్యామ్ మరోచోట. 

     ఆ మధ్యవయసు దిగువ మధ్య తరగతి లాయరు తల్లిదండ్రులను చూసుకోవడం కోసం పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడం, ఎవరూ భోజనానికి పిలవని శ్యామ్ ని ఆ మధ్యాహ్నం భోజనానికి పిలవడం ఈ రెండే ఆ ఙ్ఞాపకానికి మూలాలు అనుకోవాలి. 

     మనం గుర్తించముగాని అతి సాధారణంగా కనిపించే ఇలాంటివే ఙ్ఞాపకాలుగా పదిలంగా అందర్లో ఉంటాయి. దశాబ్దాల తర్వాత ఒక చిన్న కారణంగా ఇవి యథాతదంగా బయటికి వచ్చి ఆశ్చర్యపరుస్తాయి. ఇదే ఈ కథ విశిష్టత అనుకోవచ్చు.

     ఆధునిక కథాసాహిత్యంలో సంప్రదాయ శిల్పం ప్రకారంకాకుండా తమదైన శిల్పరూపంలో కొన్ని కథలు వస్తున్నాయి. ఇలాంటి కథలు అనుభూతిప్రధానంగా ఉండి మొదలు, మధ్య, తుదిలాంటివి కలసిపోవడమేకాక మెలొడ్రామా, స్పష్టమైన సందేశంలాంటివి ఉండవు. పాఠకులు ఎవరికివారు అనుభూతిచెంది సందేశాన్ని పరోక్షంగా తీసుకునేవిధంగా ఉంటాయి. 

     ఏరచయితైనా తమదైన స్వంత శిల్పం రూపొందించుకోవడానికి ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఐతే అందులో అంతర్ వైరుధ్యాలు ఉండకూడదు. ఒక్కోసారి అవి అనాలోచితంగా దొర్లుతూంటాయి. ఉదాహరణకు ఈ కథలో ఈ ముప్పైయేళ్లపాటు ఆనాటిసంగతులేవీ గుర్తులేవని చెప్తూనే అప్పటి చిన్న చిన్న వివరాలు కూడా స్పష్టంగా వర్ణిస్తాడు శ్యామ్. 

     రచయిత కథకు ఎండగుర్తు అని పేరెందుకు పెట్టారో అస్పష్టంగా మాత్రమే తెలుస్తుంది. ఇదీ ఒక అనుభూతిని తెలపడమే. ఒక ఎండాకాలపు నిర్లిప్తతలాంటి ధ్వని కథంతా పరచుకుని అలాంటి జీవితాలను కథంతా ప్రతిఫలిస్తూంటుంది.

     ఈకథలోని ప్రధానపాత్ర తన అనుభూతిని నిరాసక్తంగా పాఠకులకు బదిలీ చేస్తున్నట్టు కనపడుతుంది. కథలో వచ్చే రెండు పాత్రలూ సామాన్యపాత్రలే. దైనందిన జీవితం గడవడానికే కష్టపడుతున్న మనుషులు. ఐతే ఆ రకమైన జీవితాన్ని వాళ్లు నిరసనతోనో, నిరాశాయుతంగానో కాక ఉదాసీనంగా తిసుకున్నట్టు కనపడుతుంది. కథలో వర్ణించినవన్నీ దాదాపుగా ప్రత్యేకతలేవీ లేని సామాన్య సంఘటనలే. 

     కష్టనష్టాలకు అలవాటుపడిపోయి వాటిని ఉదాసీనంగా తీసుకునే అత్యధికుల జీవితాలు నిరాసక్తంగా గడిచిపోతాయి. ఈ వాస్తవాన్ని ఒక ఙ్ఞాపకశకలంగా అనుభూతిరూపంలో ఈ కథలో పంచుకోవడం జరిగింది. ఆ ప్రయత్నంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాఠకులను చేరడంలో రచయిత కృతకృత్యులయ్యారు. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.