అల్లిక

-నస్రీన్ ఖాన్

సున్నితత్వం నీ చిరునామా
దుఃఖాలన్నింటినీ గుండెలోతుల్లో కుదేసి
అప్పుడే విచ్చుకున్న పువ్వులా చక్కటి నవ్వులు చిందిస్తావ్
కవచకుండలంలా సహజంగా అబ్బినదేమో
రంకెలకైనా మృదుత్వమే  జోడిస్తావ్
 
ఎక్కడిదో ఈ సహనం
రంగు రంగుల దారాలతో అందమైన అల్లికేసి
పిట్టగూడులా కలుపుకుపోదామని తపన పడుతుంటావ్
నిటారుతనాన్ని
విచ్చుకత్తుల పదును వెన్నుపై సలపరిస్తూంటే
 
దోస్త్
ఏ చిరునవ్వులో జీవాన్ని రంగరించాలని తపిస్తున్నావ్
ఎప్పుడో పావువై బరిలో ఉన్నావ్
గమనించావా?
క్విడ్ ప్రో కో రోజుల్లో ఇంకా నీకు మానవతా ఆలోచనలేమిటి?
 
ఆర్ యా పార్
మనసుకు గాయాలని చింతిస్తున్నావా 
చిందేరక్తంలో ఏ ఖుర్బానీ కోసం వెతుకుతావ్ చెప్పూ
అన్నీ కలగలిసి ఒకే రంగై వెలిగిపోతూంటే
 
నీ ఆనుభవిక వేదనకో పేరు కూడా పుట్టుకొచ్చింది
అమాయకత్వం పేరుతో మహా మోసపోతోంది
వెర్రిగా నమ్మే నీ మంచితనం
ఫరవాలేదులే
నీకై జాలి సంధించి తృప్తి పడే లోకంపై
నీకు దయకలుగుతోంది కదూ
చిరునవ్వే నీ ఆభరణం!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.