ఒక్కొక్క పువ్వేసి-10
విస్మృత వీర నారి ఝల్కారీబాయి
-జూపాక సుభద్ర
చరిత్రను చరిత్రగా కాకుండా ఆధిపత్య కులదృష్టితో చూడడము వల్ల బహుజన కులాలకు చెందిన త్యాగాల చరిత్రలను కనుమరుగు చేయడం జరిగింది. చరిత్రంటే ఆధిపత్య కుల వ్యక్తుల చరిత్రనే చరిత్రగా చూపించుతున్నది ఆధిపత్య కులవ్యవస్థ. భారతదేశ చరిత్రలు తిరగేస్తే అణగారిన కులసమూహాల మహిళలు, మగవారు కనిపించరు. అణగారిన కులాల మహిళల త్యాగాలు, బలిదానాలు, చరిత్ర అంచుల్ని కూడా చేరని వివక్షల కారణంగా భారత ప్రధమ స్వాతంత్ర యుద్దంలో ఆంగ్లేయులతో వీరోచిత పోరాటమ్ చేసిన వీరాంగన ఝల్కారీ బాయి 1857 తిరుగుబాటు చరిత్రకు అందకుండా పోయింది.
భారత సమాజము హిందూ అగ్రకుల మగాధిపత్య సమాజము. యిది భిన్న అణగారిన, కుల, మత, జెండర్ అస్తిత్వాల చరిత్రలను సమాజానికి తెలుపకుండా జాగ్రత్త పడింది. బహుజన శ్రమకులాల చరిత్రలను అప్రస్తుతమ్ చేస్తూ, అవాచ్యం చేస్తూ.. ఆధిపత్య కుల మగ, మహిళా సమూహాల చరిత్రలనే ప్రచారం చేస్తుంది. అట్లా బ్రిటీష్ సైన్యంతో తలపడని, ఎదుర్కోని ఝాన్సీరాణి లక్ష్మీబాయిని వీరవనితగా పోరాట యోధురాలిగా చరిత్రకెక్కించి , బ్రిటిష్ సైన్యంతో ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధం చేసిన వీరనారి, దళిత కులానికి చెందిన ఝల్కారీబాయిని చరిత్ర లో లేకుండా చేశారు.
కానీ నిజానికి భారత సమాజములో ఉన్న అన్ని సమూహాల పోరాట చరిత్రలను, నెత్తుటి చరిత్రలను, త్యాగాల చరిత్రలను ప్రజలకు చేర్చాల్సిన అవసర ముంది.
రాణి లక్ష్మీబాయి మహిళా సైన్యం లో యుద్ధ నైపుణ్యాలు తెల్సిన, యుద్ధ విద్యల్లో ఆరితేరిన, ఆంగ్లేయులతో ప్రాణాలొడ్డి పోరాడిన ఝల్కారీబాయి పాత్ర విస్మరించలేనిది.
1857 తిరుగుబాటును అణచివేసిన అర్ధ శతాబ్ధి విజయోత్సవ సభలు బ్రిటీష్ ప్రభుత్వము లండన్ లో జరుపుకుంటా వుంటే…,
దానికి పోటీగా లండన్ నివాస భారత యువత ‘యాద్గార్ దివస్’ గా 1857 విప్లవ చరిత్రల సంబరాలు జరుపుకున్నది. దీనికి నాయకత్వము వహించిందీ, తర్వాత ‘ది ఇండియన్ వార్ ఇండిపెండెంట్’ రాసినది వీరసావర్కార్. 1857 తిరుగుబాటు జెండాగా, వీరనారిగా, విప్లవరాణిగా రాణి లక్ష్మబాయినీ గౌరవించే, కొనియాడే, సమావేశాలు ఆట, పాటలతో విజయోత్సవ సభలుగా జరిపింది భారతయువత. తర్వాత ఝాన్సీరాణిని జవహర్ లాల్ నెహ్రూ తన ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ బుక్ లో ఆదర్శం గా వివరిస్తే,.,.,
బి.ఎల్ వర్మ నవలగా, సుభద్ర కుమారి చౌహాన్, సుందర్ లాల్ , వంటి సాహిత్యకారులు తమ రచనల్లో ఝాన్సీ లక్ష్మి వీరత్వాన్ని కొనియాడారు. తర్వాత పాఠ్య పుస్తకాల్లో, చరిత్ర పుస్తకాల్లో, అకాడమీల్లో ఝాన్సీ లక్ష్మి బాయి వీర పోరాటకారినిగా ప్రభుత్వం విస్తృత ప్రచురణలు చేసి కొనసాగించింది. కానీ 1857 తిరుగుబాటులో అనేకమంది దళిత మగవాళ్ళు, దళిత మహిళలు బ్రిటీష్ సైన్యాలను ఎదురోడ్డిన వీరోచిత విప్లవ పోరాటాలు , చేసిన ప్రాణత్యాగాలు జాతీయోద్యమ చరిత్రలో కనిపించవు, వినిపించవు. ఈ వివక్షలను గ్రహించిన దళిత యువత 1857 తిరుగుబాటు ఉద్యమంలో అణగారిన కులాల చరిత్రలను వెలికి తీయడం, పరిశోధించి రాయడము 1960 తర్వాత మొదలైంది. అట్లా అనేకమంది చారిత్రక దళితనాయకులు, నాయకురాండ్రని వారి పోరాటాలను, స్వరాజ్యం కోసం వారు చేసిన బలిదానాలను బైటకు తీయడం జరిగింది. అట్లా మట్టి పొరల నుంచి బైటకి తీసిన వాళ్ళలో ఝల్కారీబాయి, ఉదాదేవి, మాతాదీన్ భంగి, చెత్రంజాతవ్ , బల్లూరామ్ మెహతర్, బంకే చమేర్ వీర పాసీలు ప్రముఖులు. వీరి చరిత్రలు, చరిత్ర పుస్తకాల్లో కీర్తింపబడుతున్న ఆధిపత్య కులాల కన్నా ఉన్నతమైనవి, ఆదర్శమైనవి. వీరి చరిత్రలు పుస్తకాల్లో లేకున్నా స్థానికంగా ప్రజల నోళ్ళలో కథలుగా, పాటలుగా ప్రసిద్ధి పొందుతున్నవాటిని ఇంకా అక్కడిక్కడి ప్రస్థావనలతో అణగారిన చరిత్రలను నిర్మించడం జరుగుతుంది. సావర్కార్ తన పుస్తకంలో ప్రచురించినట్లు ఝల్కారి బాయి ఝాన్సీరాణికి దాసి కాదు. ఝల్కారీబాయి ఝాన్సీలక్ష్మి భాయి ఏర్పాటు చేసిన మహిళా సైన్యంలో కమాండర్.
ఝల్కారీబాయి 22 నవంబర్ 1830 లో బుందేల్ ఖండ్ ఝాన్సీలోని భోజలా గ్రామమ్ లో పుట్టింది. తల్లి దనియా, తండ్రి మాల్ చంద్, కోరి కులానికి చెందినవారు. చిన్ననాడే తల్లి చనిపోతే తండ్రి అన్నీ తానై పెంచాడు. తండ్రికి ఒక్కటే సంతానంగా ఉన్నందున అల్లారు ముద్దుగా పెంచినా పని పాటలు చేసుకోవాల్సిందే పేద కులాల్లో. పశువులు కాసేందుకు అడవికి పోయేది. తన 12 ఏండ్ల వయస్సులో అడివిలో పులి పశువుల మీద పడితే పశువులను కాపాడుకోనీకీ పులితో తలపడి చంపింది. యింకేముంది ఒక 12 ఏండ్ల ఆడపిల్ల పులిని వేటాడి చంపింది ఆహా ఓహో అని ఝల్కారీ పేరు ఆ చుట్టుపక్కల మారు మోగింది. ఝల్కారీబాయి చిన్ననాటి పేరు ఝలారియా. పులిని చంపిన వార్త ఝాన్సీరాణి లక్ష్మీబాయికి, ఆమె సైన్యం లో సైనికుడుగా వున్న పూరన్ కుటుంబానికి చేరినది. అట్లాంటి వీరత్వం వున్న అమ్మాయిని కొడలుగా చేసుకోవాలి అని
పూరన్ తల్లి ఇష్టపడింది. ఝల్కారీబాయి వివాహము సైనికుడు పూరన్ తో జరిగింది.
పూరన్ కుటుంబము ఝాన్సీ కోటకు దగ్గరగా ఉన్న ‘నయాపూరా’ బస్తి వాసులు. ఝాన్సీ లక్ష్మీ బాయి భర్త రాజా గంగాధరరావు దళిత వృత్తికారుల సేవలు ఝాన్సీ కోటకు దగ్గరగా వుండాలి అని ‘నయాపూరా’ బస్తీని ఏర్పాటు చేసిండు. ఝల్కారి భర్త పూరన్ వాళ్ళు బట్టలు నేసే పేదరిక కోరి దళితులు. పూరన్ సైన్యంలో చేరి కుస్తీ, కత్తిసాము, తుపాకీ, ఫిరంగులు పేల్చడం, గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు. ఝల్కారీబాయి 12వ ఏటనే పులిని చంపిన సాహసాన్ని విని ఆమెను పెండ్లి చేస్కున్నడు.
ఝల్కారీ అప్పుడప్పుడు సైనికుడైన తన భర్త తో రాజ్ మహల్ కు వెళ్ళేది. ఝల్కారీ రూపురేఖలు చూసిన ఝాన్సీలక్ష్మీబాయి ఈమె అచ్చు నాలాగానే వుందనీ ఆశ్చర్యపోయింది. ఝల్కారీ గురించి విన్న ఝాన్సీ రాణి ఆమెను చూడ్డంతో….. ఎట్లయినా ఝల్కారీ ని మహిళా సైనిక దళం లో చేర్చు కోవాలనుకున్నది. ఝల్కారీ భర్త పూరన్ ప్రోత్సాహము తనకు సైన్యం లో చేరాలనే ఆసక్తి తో అతని దగ్గర గుర్రపుస్వారీ, కత్తియుద్ధం, మల్లయుద్ధం, ఫిరంగులు పేల్చడం, బాణ విద్యలు నేర్చుకున్నది. సైనికుడైన భర్త పూరన్ , ఝాన్సీరాణి లక్ష్మీబాయి ప్రోత్సాహంతో యుద్ధ నైపుణ్యాలు ఒంట బట్టించుకున్న ధీర వనిత ఝల్కారీబాయి. నేను కూడా దేశ సేవ చేయాలి, బ్రిటీష్ వారిని తరిమేసేందుకు ఎంతటి ప్రాణత్యాగానికైనా వెనకాడవద్దు అనే నిర్ణయాలు వెన్నాడేవి. ఒక అంటరాని కోరి కులం దళిత మహిళ సైనిక మహిళా దళానికి నాయకురాలుగా ఎదగడం సాధారణ విషయం కాదు. అది ఒక అద్భుతం. తనలో వున్న ధైర్య సాహసాలకు ఝాన్సీరాణి, భర్త పూరన్ ప్రోద్బలము వల్ల యిలా ఝల్కారీబాయి ఎదిగిందనవచ్చు.
ఝల్కారీబాయి సైనికురాలిని అవు తానంటే … ,అత్త ‘లోకం ఆడిపోస్కుంటది. పెద్దలు నిన్ను సుఖంగా వుండనిస్తారా, మనశ్శాంతి గా బతకనిస్తారా ‘అని హెచ్చరిక చేసింది. ‘పూరన్ తన పెండ్లాన్ని సైనికురాలిగా చేస్తున్నాడట యిది మన సమాజానికి విరుద్దం గాదా!, మన యింటి కోడలు మన ముక్కులు కత్తిరించే పనులు చేస్తుందనీ, అత్త అదుపు చేయదా, ముసుగు లేకుండానే వూల్లే తిరుగుతుంది యిదేమీ ఆడిది.’ యివన్ని ఝల్కారీబాయి, పూరన్ ఏమి పట్టించుకోక యుద్ద విద్యా శిక్షణ లో మునిగిపోయారు. వారిద్దరి లక్ష్యం ఒకటే… యుద్దాల్లో ఆరి తేరి బ్రిటిష్ వాళ్ళను మన దేశం నుంచి వెళ్ళగోట్టాలి అని.
వీరోచిత సాహసాలతో పెరిగిన ఝల్కారీ కోరిక సైనికురాలిని అవ్వాలని. ఆ కోరికను భర్త దగ్గర సంపూర్ణంగా నెర వేర్చుకుంది. పెద్ద పెద్ద గుర్రాలను వశపరుచుకోవడం, కత్తులు దూరం నుంచి, దగ్గర నుంచి, గాలిలో ఎలా విసరాలో, వాటి నైపుణ్యాలను పట్టుకున్నది. యీ విద్యల్లో ఝల్కారీబాయికి ఎవరూ సాటి లేరు అన్నంతగా ప్రతిభ సాధించింది. ఝల్కారీ తో పాటు బరీషన్ , మోతీబాయి జూహీ, సుందర్, ముందర్, కాశీబాయి లాంటి అనేక మంది మహిళలు ఝల్కారీ ని ఆదర్శంగా చేసుకొని సైన్యంలో చేరిండ్రు. తన యుద్ద విద్యా నైపుణ్యాల ప్రదర్శన చూసిన రాణి లక్ష్మిబాయి సంతోషించి ఝాల్కారి బాయినీ మహిళా సైనికాధికారిగా నియమించింది.
బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఆజ్ఞతో 1854లో (మార్చి 7) ఝాన్సీ రాజ్యం ఆంగ్లేయుల పాలనలో కలుపబడింది. అట్లా కలుపబడిన రాజ్యాన్ని తిరిగి సాధించిన కొన్నాళ్లకే మల్లా బ్రిటీష్ సైన్యాలు కోటను సమీపిస్తుoటే,. వారిని పారదోలదానికి యుద్ధానికి సన్నద్ధమైనది, మహిళా సైన్యం. ఝాన్సీ రాణికి రక్షణ కల్పించాలంటే ఝాన్సీరాజ్యాన్ని కాపాడుకోవాలి అని తన తోటి మహిళా సైనికురాళ్లకు చెప్పి ఉత్తేజితుల్ని చేసింది. ఆ మహిళా సైనికులు తుపాకులున్న వాళ్ళు తుపాకుల్ని పేల్చితే, తుపాకులు లేని వాల్లు యిటుకల్ని యిసుర్తూ తెల్ల వాళ్ళమీద దాడి చేసిండ్రు, యింకొందరు వేడినీళ్ళు శత్రు మొకాల మీద పోసిండ్రు. పూరన్, ఝల్కారీబాయి బ్రిటిష్ సైనికుల్ని శవాలుగా చేసిండ్రు. కానీ తెల్లావాళ్లు ఝాన్సీకోటను చుట్టూ ముడుతూన్నపుడు ఝాన్సి రాణికి నమ్మకస్తురాలు, దగ్గరి మనిషి అయిన ఝల్కారీబాయి ‘ఝాన్సీరాణి ఆంగ్లేయులకు పట్టుపడకూడదు, ఆమెను సురక్షిత ప్రాంతానికి పంపించే ఆలోచన చేసింది.ఎందుకంటే రాణి రక్షణ బాధ్యత మహిళా కమాండర్ గా ఝల్కారికి ఎక్కువ వుంటది. ఈ ఆలోచన ను యింకా తన దగ్గరి మిత్రులు, స్నేహితులు సమ్మతించారు. ఒక దిక్కు బ్రిటిష్ సైన్యాలు కోట ద్వారాలను ఆక్రమించుకుంటుంటే .. ఝల్కారీ, పూరన్ లు భీకర యుద్ధం లో వుండి సైన్యాన్ని ముందుకు నడిపిస్తున్నారు. యింకోవైపు 1857 తిరుగుబాటు విప్లవ కారుడని పుస్తకాల్లో పేరున్న తాంతియా తోపే బ్రిటీష్ సైన్యాన్ని ఎదిరించలేక పారిపోయాడు. ఝాన్సీరాణి లక్షీబాయి కూడా తన దత్త పుత్రున్ని వీపున కట్టుకొని రాత్రివేళ గుర్రం పై కూర్చొని నమ్మకమైన సైనిక పటాలమ్ తో ఝాన్సీకోటకు దండంబెట్టుకొని ఉత్తర భారతం వైపు వెళ్లిపోయింది 4 ఎప్రిల్ 1858 లో.
ఝాన్సీరాణి వెళ్ళిపోయేదాకా బ్రిటిష్ వాల్లను ఏమార్చడానికి, కాలయాపనచేసే వ్యూహంతో ఝల్కారి బాయి ‘చర్చలకు సిద్ధమా’ అనే వర్తమానం పంపిoది, ఝాన్సీరాణి పేరుతో. ఝాన్సీ రాణి దుస్తులు ధరించడం, ఝాన్సీరాణి రూపురేఖలున్నందువల్ల బైటవారెవరూ గుర్తు బట్టలేదు. ఝాన్సీరాణి రక్షణకు తానే ఝాన్సీరాణి అని బ్రిటిష్ వాళ్ళతో తలపడింది ఝల్కారీబాయి. ఆ యుద్ధంలో ఝల్కారీ భర్త పూరన్ వీర మరణం పొందాడు. ఝాన్సీరాజ్యం కొరకు. ఝల్కారీబాయికి భర్త ప్రాణాలు పోయిందాని కంటే ఝాన్సీరాజ్య రక్షణే కర్తవ్యంగా తీసుకున్నది.
ఆమె కత్తి విద్యా విసుర్లకు, చతురతకు ఆంగ్లేయులు బబ్బుర పడినారు. ఆంగ్లేయుల వందల మంది సైన్యాన్ని కత్తికోకండగా చేసింది. మెరుపుదాడులు ఆంగ్లేయుల్ని మించి చేస్తుంటే… హఠాత్తుగా ఒక దొంగ దెబ్బ ఆమె గుండెల్లో దిగితే… కింద బడే లోపే ఆమె శరీరమ్ తూటాల జల్లెడ అయింది. ఒక వీరనారి అమరత్వం చెందింది. మాతృభూమి రక్షణ కోసం, స్వాతంత్రం కోసం వీరమరణం పొందిన ఝల్కారీబాయి సమాజానికి చిరస్మరణీయురాలు.
ప్రముఖకవి మాతాప్రసాద్ అన్నట్లు భారత ప్రధమ స్వాతంత్ర సంగ్రామం లో మహిళా సైన్యంగా ఝల్కారీబాయి బ్రిటిష్ సైన్యం తో పోరాడిన స్పూర్తి బుందేల్ ఖండ్ దళిత సమాజానికే కాదు, దేశంలోని మహిళా సమాజానికే గొప్ప గౌరవం. ఝాన్సీరాణి ఒక మగధీరుడిలాగా బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడి వీరమరణం పొందినదని అనేక సాహిత్యాలు, చరిత్రలు వచ్చినాయి. ఆ అబద్ద చరిత్ర ను యిప్పటికి కొనసాగిస్తున్నారు. గనుకనే ‘మణికర్ణిక’ అనే సినిమా యిమద్య కూడా వచ్చింది. కానీ బ్రిటిష్ సైన్యాలను మట్టి కరిపించింది, తుత్తునియలు చేసి హోరాహోరీగా పోరాడింది ఝాన్సీ రాజ్యంలోని భోజలా గ్రామ్ కోరి దళిత కులానికి చెందిన ఝల్కారీబాయి.
ఝాన్సీ లో జాబాబీ కీర్తన మండలి పాటలు ఝల్కారీ దుర్గామాత అని, ఆమె ఆంగ్లేయుల సైన్యాన్ని తుద ముట్టించిన దేవతగా పాడుతూ ఉండేవారు. తరువాత దళిత అస్తిత్వ ఉద్యమాలు సాహిత్యాలు వచ్చి 1960 తర్వాత ఝల్కారీ బాయి మీద విస్తృత సాహిత్యము, పరిశోధనలు వచ్చినయి. భవానీ శంకర్ విశారద్ ఝల్కారీ జీవిత చరిత్ర రాయడం జరిగింది.ఝల్కారీ పుట్టిన ఊరు భోజలా, అత్తవారి ఊరు ‘నయాపురా’ కోరి బస్తీని, ఆమె చుట్టాలు బందువుల్ని సంప్రదించి, స్థానిక వ్యవహారం లో వున్న వీర గాధల్ని సేకరించి రాసాడు. తర్వాత వీరనారి ఝల్కారీబాయి సమితి, వీరాంగణ మెమోరియల్ ట్రస్టు, ఆమె విగ్రహాలు, జయంతులు వర్ధంతులు నేడు విస్తృతంగా జరుగుతున్నయి. కానీ యిది దేశమంతా ఝాన్సీలక్మీ బాయి చరిత్రలాగా విస్తరించకపోవడం కూడా వివక్షే. కానీ ఝల్కారీ వీరత్వాన్ని చూసిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ భారత మహిళల్లో ఒక్క శాతమ్ అయినా ఝల్కారిబాయిలా పొరాడి వుంటే మేము ఎప్పుడో పారోపోవాల్సి వచ్చేదని జూన్ 4/1858 లో డైరీలో రాస్కుండంటే… ఆమె దేశ భక్తి, శక్తి యుక్తులు దేశానికి, మహిళలకు ఎంత ఆదర్శమో తెలుస్తుంది. అట్లాంటి సైనికురాలికి, కమాండర్ కి చరిత్రలో దక్కాల్సిన గుర్తింపు, గౌరవాలు దక్కలేదనే చెప్పాలి. కానీ ఆమె నెత్తుటి త్యాగాలు స్వాతంత్రోద్యమానికి పునాదిరాళ్ళు గా నిలిచి ఉంటాయి.
*****
జూపాక సుభద్ర కవయిత్రి, కథకురాలు, కాలమిస్టు, వ్యాసకర్త, అనువాదకురాలు, పరిశోధకరాలు, వక్తగా, సంఘసేవకురాలు, ప్రభుత్వ ఉన్నతాధికారిణి. బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రస్తుతం తెలంగాణ ఉద్యోగుల సంఘంలో కీలకంగా పనిచేస్తున్నారు.
సుభద్ర గారు తెలుగు సాహిత్యంలో, మహిళా సాహిత్యంలో ఉన్న అగ్రకుల బావజాలాన్ని ప్రశ్నిస్తూ, ఆధునిక సాహిత్యంపై విమర్శ చేస్తూ దళిత, బహుజన సాహిత్యం యొక్క ఉన్నతిని పెంపొందిస్తూ రచనలు చేసున్నారు.