కక్క నవలా సమీక్ష
-కాళేశ్వరం కృష్ణమూర్తి
వేముల ఎల్లయ్యగారు ఈ నవలను తెలంగాణ మాండలికంలో రాశారు. తెలంగాణ మాండలికంలో వచ్చిన నవలలు అరుదు. అందులో తెలంగాణ దళిత నవలలో వచ్చిన మొదటి నవలగా ఈ నవలను చెప్పవచ్చు. ఇక నవలలో కథా నాయకుడు ‘కక్కడు’. తన పూర్వీకులు దొరల వద్ద, పటేండ్ల వద్ద జీతగానిగా పని చేస్తూ బానిసలుగా బతికినవాళ్ళు. కాని కక్కడు అలా కాదు చైతన్యం కల్గిన దళిత వ్యక్తి. కులంతో పాటు వచ్చే ఆచారాలు, సంప్రదాయాలు అన్నీ తెలుసుకొని నేర్చుకున్న వ్యక్తి. చిన్నప్పటి నుండి జీతగానిగా పని చేస్తూ అనేక దెబ్బలు, తిట్లూ భరిస్తూ తన జీవితాన్ని పటేండ్లకు, దొరలకు ధారపోసిన వ్యక్తి. ఆత్మాభిమానం గలవాడుగా మనకు నవలలో కన్పిస్తాడు. భావోద్వేగాలు ఉన్న పరిణతి చెందిన వాడుగా కన్పించినా పూర్తిస్థాయిలో చదువుకోలేని వ్యక్తి. అయితే ఈ నవలలో అనేక బూతు పదాలున్నప్పటికీ అవి సందర్భానుసారంగా అర్ధం చేసుకోవాలని నవల ఆధారంగా మనకు అన్పిస్తుంది. ఇప్పటికీ దళితుల్లో చిన్న పిల్లల నుండి ముసలివాళ్ళ వరకు చాలా బూతు పదాలు, సామెతలను మాట్లాడతారు. ఎందుకంటే కోపాన్ని, ఆవేశాన్ని అణగదొక్కుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. ఇది తర తరాలుగా వస్తున్న సాంప్రదాయం.
ఇతర కులాల్లో కూడా ఈ ఆచారం ఉన్నప్పటికీ రచయితలు వాటిని నవలల్లో గాని, కథల్లోగాని, కవిత్వంలో గాని ప్రతిబింబించలేక పోయారు. దానికి కారణం ఏమైనప్పటికీ ఇతర రచయితల రచనల్లో ఈ పదాలు, సామెతలు కన్పించకుండా జాగ్రత్త పడుతారు. కాని ఈనవలలో అలా కాదు.దళితుల వాస్తవిక జీవితాలు, వారి ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతి ఎలా ఉంటుందో రచయిత తెలియజేసే ప్రయత్నం చేశారు. ఈ నవలలో ‘కక్కడు’ తన తల్లికి మారు వివాహం చేయించడం గొప్ప సంస్కరణగా భావించాలి. ఇది వరకు ఎందరో కవులు, రచయితలు తమ సాహిత్యంలో సంస్కరణలు ప్రవేశ పెడితే అందరూ ఆహ్వానించారు. ఇక్కడ కూడా అలాగే ఆహ్వానించదగ్గ విషయమే!తల్లిని అత్తవారింటికి పంపే సన్నివేశం వేళ పాఠకులు కూడా భావోద్వేగం చెందుతారు.
ఒంటరిగా ఉన్న కక్కనికి పకీరు తాత రూపంలో మరో వ్యక్తి ఆదర్శంగా కనిపిస్తాడు. పకీరు తాత తనకు తెలిసిన విషయాలన్నీ కక్కనికి చెప్పడం తాత ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి గా కనపడతాడు. ఊళ్ళో వాళ్ళందరికీ మంచి వ్యక్తి గా తలలోనాలుకలా మెదులుతూ సర్పంచిగా తనే అనే విషయం దొర చెప్పే వరకు తెలియదు. తన కులం వాళ్ళకు వ్యతిరేకంగా తన చేతనే వేలి ముద్ర వేయించి దొర కేసు పెట్టిస్తాడు. అమీన్సాబ్ వచ్చి అడిగే వరకు తెలియదు తనే సర్పంచిని అనే విషయం. ఈ విషయం ఊళ్ళో వాళ్ల ఆడవాళ్ళకు తెలిసి తాతను నిలదీయడంతో అవమానంగా భావించి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంటాడు. కక్కడు ఎంత కష్టం చేసినా తన కష్టానికి తగిన ఫలితం దక్కుతలేదని గ్రహించి పటేల్ కు బాకి పైసలు కట్టడం, దొర దగ్గర జీతం కుదుర్చు కోవడం అతని నిజాయితిని తెలియజేస్తుంది. తను కొన్ని అక్షరాలు నేర్చుకొని బాగోతం నేర్చుకోవాలని ఆశ పడటం తన ప్రతిభను నిరూపించుకోవాలని ఆరాటపడటం మైసాసురుని పాత్రకు కక్కడే జీవం పోయగలడని వేషగాళ్లు నమ్మడం అతని కసిని తెలియజేస్తుంది. దేవతలు, రాక్షసులకు యుద్ధం జరిగినట్లు,ఇక్కడ దొరలకు తన కులం వాళ్ళకు జరుగుతున్నట్లుగా ఊహించడం అతని సూక్ష్మబుద్ధి కి నిదర్శనం. ఈ సమయంలో తన పిక్కలను (దొంగల రూపంలో) కోయడంతో తన పాత్రను చేయలేక పోతాడు.
రచయిత ఈ నవలలో చదువుకంటే ఎక్కువగా ఆచారాలు, సంప్రదాయాలకే ప్రాధాన్యం ఇచ్చారు. అంతేగాక కక్కడు ఎప్పుడైనా భావోద్వేగాలకు గురైనప్పుడు ఎవరినీ ఎదిరించలేని నిస్సహాయ స్థితిలో ఉండి ఏడ్వడం కొంచెం ఆశ్చర్యం కల్గిస్తుంది. నవల ముగింపులో దళితులకు భూములు, ఇండ్లు పొందేలా అధికారులు చెప్పడం వారి కర్తవ్యం, నిబద్ధతను తెలుపుతుంది కాని అది పూర్తి చేస్తే బాగుండేది.
****