కొత్త అడుగులు – 30
నీలిమా తరంగం
– శిలాలోలిత
ఈ నెల పరిచయం చేయబోయే కొత్త రచయిత్రి నీలిమ. పోలిటికల్ సైన్స్ లెక్చరర్ గా ఇబ్రాహీం పట్నం లో పనిచేస్తోంది. ఈ మధ్య అనేక అడ్డు గోడల్ని దాటుకుని పిహెచ్.డి సబ్మిట్ చేసింది. “రాష్ట్ర శాసన సభలో స్త్రీల నాయకత్వం పేరిట, విలువైన రిసెర్చ్ చేసింది. 40 కి పైగా కవితలు రాసినప్పటికీ ఇంకా పుస్తకం తీసుకురాలేదు. ఎట్టకేలకు త్వరలో వేస్తానని ఇన్నాళ్లకు మాట ఇచ్చింది.
సంస్కృత భాషా వ్యామోహం చాలా మంది కవితల్లో కనిపిస్తూ ఉండే సాధారణాంశం. నీలిమ కూడా మొదట్లో ఆ ప్రభావం లో కొంతమేర ఉన్నట్లు కవిత్వం చెబుతోంది. కానీ ఆమె దానిని దాటి, భాషా సంకెళ్లు చేధించుకుంటూ ఇప్పటి కవిత్వ ధోరణి లోకి ప్రవేశించింది. భావాలలో ఎంత గాఢత ఉందో, భాష అంత సరళంగా ఉంది. లోతైన విషయాలను కూడా సున్నితంగా చెప్పడం ఈమె ప్రత్యేకత.
ఈమె కవిత్వంలో కనిపించిన ఇంకొక గుణం మెత్తని స్వరం తో చేబ్తున్నట్లు కనిపించినా గట్టిగా ఎదిరించే ధైర్యం తో పాటు, ఒప్పించే తీరు, మార్పును అభిలాషిస్తున్న ధోరణీ కనిపించాయి.
నీలిమ ఖమ్మం దగ్గరున్న పందిళ్లపల్లి వూర్లో పుట్టింది. కవి వంశీకృష్ణ నీలిమ కు అన్నయ్య. నాటకరంగంలో నాలుగు అవార్డులు గెలుచుకున్న తాటికొండల నరసింహారావు గారి కూతురు నీలిమ. అమ్మ భ్రమరాంబ ప్రోత్సాహం తో సాహిత్ర్య ప్రవేశం చేసింది. నీలిమ డిగ్రీ చదేవే రోజుల్లో, ప్రారంభంలో పేరడీలు ఎక్కువగా రాసేది. కవిత్వ దిశ గా తన మార్గాన్ని మార్చుకుంది. పోలిటికల్ అవగాహన చాలా వుండటం వల్ల ఆమె కవితల్లో ఎక్కువగా రాజకీయ స్పృహ కనబడుతుంది. ఈ చైతన్యం అభినందించాల్సిన విషయం. గతంలో ఓ కధ కూడా రాసింది. “ఈ మగాళ్ళంతా ఇంతే “ కధ పేరు. అప్పట్లో ‘ఆంద్రభూమి’ పత్రికలో చర్చనీయాంశమిది.
నీలిమ మొదటి కవిత ‘రుతుచక్రం’ . సిటీ కేబుల్ లైవ్ లో వంశీ తో పాటు సీతారామ్, ప్రసేన్ లతో కవి సమ్మేళనం లో పాల్గొనటం సంతోషాన్ని, ఆత్మ విశ్వాసాన్ని ఇచ్చాయంది. ఎంతటి ఫిలింగ్స్ నైనా క్లుప్తంగా అర్ధమయ్యేలా కవితా రూపంలో చెప్పగలననుకుంది. అందుకే తనకి కవిత్వం అంటే చాలా ఇష్టమంది.
పెల్లితో కవితా వ్యాసంగం కొంతవరకు అందర్లానే అటకెక్కిందట. కానీ రాయాలన్న కాంక్ష చాలా వుండేదంది. 2014 లో వంశీ తనకు ‘కవిసంగమాన్ని’ పరిచయం చేయడం తనలో ఎంతో మార్పును తీసుకొచ్చిందట. మళ్ళీ నాలో దాగున్న కవిత్వం మీద ఆసక్తి బయటికి వచ్చిందంది.
ఈ రకంగా నా సెకండ్ ఇన్నింగ్స్ కి ’కవితాసంగమం’ ప్రధాన కారణమైంది అన్నది.
‘మరణాన్ని జయించి’ కవితలో లైంగిక హింసల నడుమ పిల్లలు, పెద్దలు వీరు వారని కాక, ఆడవాళ్లు గురవుతున్న దైన్య స్థితిని చాలా ఆగ్రహంతో చెప్పింది,
‘ నిరసనలూ నినాదాలూ
కంటినిండా ఉదృతంగా
కిందకి దూకే కన్నీటి ధారలూ
నిన్ను స్వాంతన పరచడానికి
నేనిచ్చే ఆయుధాలు
కాషాయ కర్కశత్వానికి
బలై పోతున్న ఓ మాభి పిల్లా
మరణాన్ని ఎదిరించి మళ్ళీ రావూ ‘ అని అభ్యర్థిస్తుంది.
‘న స్త్రీ ‘ – కవితలో కూడా , మతం, కులం, ప్రాంతం, తేడా లేకుండా జరుగుతున్న హింసల్ని ప్రస్తావిస్తూ ఎదిరించడమొక్కటే మార్గం అంటుంది. ‘లవ్ @2080’ – కవిత నడక వినూత్నంగా వుంటుంది. శతాబ్దాల తరబడి స్త్రీ పురుషుల మధ్య నున్న అడ్డుగోడల్ని వివరిస్తూ కంప్యూటర్ భాష తో కొత్తగా సమాజం పై రుద్ద బడుతున్న వైఖరిని, ప్రేమను అర్ధం చేసుకొని కుటుంబ వాతావరణంలో మొక్కలన్నీ మొగ్గ దశలోనే మాడిపోతున్న నిజాన్ని చెప్పింది.
‘నువ్వోచ్చాక’ కూడా కొత్త వ్యక్తీకరణతో ఇలా సాగింది. ‘ నువ్వోచ్చాక అమ్మ మౌనం వెనక భాషేమిటో అర్ధమైంది’ అంటుంది. ఇంత తేలిక మాటల్తో మౌన భాషను అద్దం లా చూపిస్తుంది. ‘ అలాగే అత్త అరుపు వెనుక ఆవేదన అర్ధమైందట. పిన్ని పురుషం, మాస్టార్లు చెప్పే స్వేచ్చా సమానత్వాల అసలర్ధం, అవసరమేమిటో తెలిసొచ్చింది. ‘ఏసి గదుల్లో ఉక్క పోయడమేంటో తెలిసొచ్చిందట’ ఇలా రకరకాలుగా అతనొచ్చాక మారిన జీవన విధానాన్ని చివరగా ఇలా చెప్పింది.
‘నువ్వోచ్చాకే
నేను అదృశ్యం అయి
నీడగా మిగలడమంటే
తెలిసింది.
దుఖం, వెళ్ళేటప్పుడు మంచి కవితలు. ప్రకృతి తో పూలతో పసి మనసు తో తనకున్న బాంధవ్యాన్ని చేబ్తూ చివర ముగింపుగా వెళ్ళేటప్పుడు అందరికీ అన్నీ చెప్పి వెళ్ళు
వెళ్ళేది రావడానికే అనే స్పృహ వుంటే
మరణం కూడా ఒక జననమే – అనేస్తుంది.
మరో కవితా – ‘మాకోక ఆయుధం కావాలి’ – ఇది చదువుతుంటే గుర్తొచ్చింది. ‘మనమే ఒక ఆయుధాలు’ – అని గతంలో ఎప్పుడో నే రాసిన కవిత.
‘పది లక్షల డాలర్ల ప్రశ్న’ – కవిత్వాభిమానులందరినీ ఆకట్టుకున్న కవిత.
‘వెళ్లనా ? వద్దా?
To be or not to be
షేక్ స్పియర్స్ మిలియన్ డాలర్స్ క్వశ్చన్
నాటకం జీవితం కాదు
జీవితమే నాటకమైన విషాద సందర్భమిది
నాటకానికి జీవితానికి నడుమ
అబేధం ఇప్పటి జీవన గీతం
‘ఊపిరుంటే చాలదు ‘ ఆలోచనాత్మకమైన కవితలు
‘కాస్త ఊపిరుంటే చాలదు బ్రతకడానికి
కొంచెం ప్రేమ కావాలి
కొంచెం స్వేచ్ఛ కావాలి
కొంచెం ఆధిపత్యం కావాలి-
ఇలా సాగిపోతుందీ కవిత మొత్తమ్మీద ‘నీలిమ’ కవిత్వం చూసేక రాబోయే తరంలో కాబోయే సీరియస్ కవిగా సాహిత్య లోకం లో తనకంటూ ఒక చోటు నిర్ణయించు కుంటుందనిపించింది.
*****
Nice mam… నీలిమ గారు congrts
చాలా బావుంది మా.. నీలిమ కవిత్వం, కథ పరిచయం కవిత్వంలో వున్న సున్నితత్వంతో కూడిన ఖచ్చితత్వాన్ని బాగా వివరించారు. అభినందనలు నీలిమ
నీలిమ పరిచయం బావుంది. ఇద్దరికీ శుభాకాంక్షలు