నడక దారిలో-16

-శీలా సుభద్రా దేవి

          ఇద్దరి మధ్యా లేఖలు పావురాలై ఎగరటం మొదలై ఆరునెలల పైనే అయ్యింది. కొత్త ఏడాది కొత్త ఊహలను ప్రోది చేసుకుంటూ అడుగు పెట్టింది. ఈ కొత్త సంవత్సరం నా జీవితంలో ఎన్నెన్ని మార్పులనో తీసుకువచ్చేలానే అనిపించింది. ఎన్నెన్ని  కొత్త అనుభవాలనో తొలి అడుగులోనే రుచి చూపిస్తూ కొంగ్రొత్త మలుపులను తీసుకు వచ్చేలానే ఉంది. అవి నాకు శుభసంతోషాలనే ఇస్తుందో , కష్టాల కడగండ్లు పాదాల ముందు పరుస్తుందో. అన్నింటినీ ఎదుర్కోగలిగే మనోబలాన్ని ఎప్పటికప్పుడు సమకూర్చుకుంటూనే ఉన్నాను.
         
          మామయ్య, అన్నయ్య ‘ఒకసారి విజయనగరం రమ్మని పెళ్ళి ఎప్పుడు ఎలా చేయాలో నిర్ణయించు కుందామని’ ఆయనకు ఉత్తరం రాసారు. ఉత్తరం అందగానే సంక్రాంతి, శని, ఆది వారాలు కలిసివచ్చేలా చూసుకుని రెక్కలు కట్టుకుని వచ్చారు.
 
          ఫిబ్రవరి 14 వ తేదీ ఆదివారం ఉదయం 8-30 గంటలకు మంచి ముహూర్తం ఉందని మామయ్య చెప్పారు. ముందు రోజు రెండవ శనివారము కనుక పెళ్ళికి వచ్చే వారికి వీలుగా ఉంటుంది కనుక అదేరోజు నిర్ణయించారు. పెళ్ళి విజయనగరంలోని ప్రముఖ బహుభాషావేత్త, పండితుడు, మా కుటుంబానికి సన్నిహితులు అయిన రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభా వివాహం చేసుకుని బంధుమిత్రులకు విందు ఇచ్చేలా నిర్ణయం చేసారు.పెళ్ళి తర్వాత హైదరాబాద్ కు నన్ను తీసుకువెళ్ళి అక్కడ  సాహితీ మిత్రులకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నానని ఆయన చెప్పారు.
 
          ఇవన్నీ చాలావరకూ నాతో ఉత్తరాల్లో సంప్రదించినవే. అయితే మాత్రం ఉత్తరాల్లో అన్ని కబుర్లు చెప్పేసరికి  ఇంకేమీ చెప్పేందుకు ఏమీ లేదో ఏమిటో అన్నీ పొడిపొడి మాటలే. మా దగ్గరలో  ఏమనిషి గాలి అయినా ఉందనుకుంటే అత్తిపత్తి లా ముడుచుకు పోయే ఈ వ్యక్తి తర్వాత్తర్వాత నా మనసులోకి  రాకుండానే బయటే నిలబడిపోతారో ఏమిటో అని నా లోలోపల సంశయం మొలకెత్తింది. అలా అని సినీమాల్లోలా హత్తుకొనే వుండాలని కాదు గానీ నాకోసం నాదైన మనిషిగా  నాకు అవసరమైనప్పుడు భరోసాగా ఉండాలని కోరుకోవటం తప్పు కాదు. సంసారం అంటేనే ఒకరిమీద ఒకరికి గాఢమైన నమ్మకం అనీ ఆ నమ్మకం సడలకుండా చూసుకోవాల్సిన బాధ్యత దాంపత్య ముడితో ఒక్కటైన భార్యాభర్తలదే అని  నా ఉద్దేశ్యం.
 
        ఇంక అప్పుడప్పుడు ఒంటరిగా ఉన్న సమయంలో నాతో  పెళ్ళికి ఏమేమి కొనాలో, తర్వాత సంసారం లో ఏమిటి సమకూర్చుకోవాలో సంప్రదించారు.
 
          ఒకరోజు చిన్నన్నయ్య మా ఇద్దరినీ ఫస్ట్ షో సినిమాకు తీసుకువెళ్ళాడు. పుత్సల వీధిలో నడిచి వెళ్తున్నప్పుడు బహుశా ఆ వీధిలో ఉన్న బంధువుల చూపులన్నీ మా వెంట వెంటనే నడిచి శల్యపరీక్ష చేసే ఉంటాయి. సినీమా అయిపోయాక ఇద్దరం ఎత్తుగా ఉండే అక్కడి రిక్షాలో ప్రయాణం ఒక కొత్త అనుభవం కలిగించింది. తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి పది దాటింది. అన్నయ్యా, అమ్మా నిద్రపోయారు. గేటు తలుపు కొట్టినా లేవలేదు.ఆయన చటుక్కున గేటు ఎక్కి గోడ దూకి గేటు తీసారు. నేనూ, చిన్నన్నయ్య ఆశ్చర్యపోయాము. నా దగ్గర తన హీరోయిజం చూపించటానికి ఇలా చేసారా అని ముసిముసిగా నవ్వు కున్నాను.
 
          ఎవరూ దగ్గర్లో లేనప్పుడు అంటే అన్నయ్యలు సాయంత్రం బైటకు వెళ్ళినప్పుడు మాత్రం డాబా మీద సూర్యుడు చీకటి దుప్పటి కప్పుకునేవరకూ, చిరువెన్నెల తుప్పర్లలో తడుస్తూ కూర్చుని కబుర్లు చెప్పుకునే వాళ్ళం. నేను పాడిన లలిత గీతాలు వినేవారు. పండుగ మూడురోజులూ నిముషాలలాగే గడిచిపోయాయి.
 
          ‘డిగ్రీ మూడవ సంవత్సరంకి హైదరాబాద్ లో ఏదైనా కాలేజీ లో చదవటానికి కుదురుతుందేమో స్నేహితులను  కనుక్కుంటాను’ అన్నారు కానీ ‘రాజకీయ పరిస్థితులు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రెండుగా విభజన జరిగేలాగే కనిపిస్తుంది. అలా జరుగుతే మా ఆఫీసులో కూడా మార్పు వస్తుందేమో. అప్పుడు ఎక్కడ చదవాలనేది ఆలోచిద్దాం. అయితే నా దగ్గరే ఉండి చదువు కుంటేనే బాగుంటుంది.” అనే అభిప్రాయం వెలిబుచ్చారు..
 
          డిగ్రీ మూడవ సంవత్సరం హైదరాబాద్ లో చదవటానికి కుదురుతుందా’ అని మాకు ఫిజిక్స్ చెప్పే మా ప్రిన్సిపాల్ సీతాకుమారి గారిని అడిగాను. యూనివర్సిటీలు వేర్వేరు  కనుక అది కుదరదని, అందులోనూ హైదరాబాద్ లోని ఉద్యమం నేపధ్యంలో  అసలు కుదరదనీ, ఈ ఒక్క ఏడాది ఇక్కడే చదవటమే మంచిదని అన్నారు ఆమె.
 
          హైదరాబాద్ లో తెలంగాణా ఉద్యమం తీవ్రంగానే ఉందని,ప్రత్యేక తెలంగాణ ఉద్యమం హైదరాబాద్ నుండి గ్రామాలకు విస్తరిస్తున్న వైనం కొంత, కొంతగా తెలుసు కుంటున్న కొద్దీ మనసును దిగులు కమ్ముకుంది.
 
          ఆంధ్రాలోనూ విశ్వవిద్యాలయాల పరిధిలో అసహనాలూ ఆందోళనలూ అప్పుడప్పుడు రాజుకుంటున్నా ఎక్కువగా తీవ్రతరం కాలేదు.
 
          ఈ పరిస్థితుల్లో యూనివర్సిటీ మారటం మంచిది కాదనే మిత్రులు అభిప్రాయం వెలిబుచ్చారు. ఆయనతో’ ‘ ఒక యూనివర్సిటీ కాలేజీలో చదువుతూ మరో యూనివర్సిటీ కాలేజీలో తర్వాతి సంవత్సరం చదవటానికి వీల్లేదట’ అన్నాను. అది నిజమేనని అందరూ చెప్పారు. ఇక మూడవ సంవత్సరం విజయనగరం లోనే చదవటం తప్పదేమో. అయితే పెళ్ళయ్యాక కూడా అన్నయ్యల మీద నా చదువు భారం పడకూడదని భావించాను. అందుకు ఆయనకూడా అవసరమైన డబ్బు పంపుతానని అన్నారు కానీ పెళ్ళయ్యాక కూడా మరో ఏడాది దూరంగా ఉండటానికి నా మాట తీసేయలేక ఆయన అతి కష్టం మీద ఒప్పుకున్నారు
 
          ఫస్ట్ ఇయర్ లోనే పెళ్ళిచేసుకుని చదువు మానేసిన నా సహాధ్యాయి సూర్యకాంతం పరిస్థితి నాకు రాకుంటే చాలు అనుకున్నాను.
 
          రెండు సంవత్సరాల క్రితం ఏర్పడిన ‘తెలుగు అకాడమీ’ మెంబర్లు ఆ ఏడాది నుండి కొత్తగా మొదలైన  తెలుగు మాధ్యమం కి అవసరమైన ఇంటర్ పుస్తకాలు తెలుగులో ప్రచురించాలని వాటికి చిత్రాలు వేయాలని ఆయనని అడిగారట. అవి వేస్తే డబ్బులు వస్తాయని,పెళ్ళి ఖర్చులకు ఉపయోగ పడుతుందని సంబరంగా అన్నారు. అందుకని ఇంకా ఉండాలని ఉన్నా వెళ్ళక తప్పదని తిరిగి హైదరాబాద్ బయల్దేరారు. వెళ్ళేటప్పుడు యథాప్రకారం నేను రాయటానికి అశ్రద్ధ చేస్తానేమోనని ప్రతీ వారం ఉత్తరం రాయమని చెప్పి కవర్లు కూడా కొని ఇచ్చారు.
 
          మళ్ళా యథాప్రకారం నేనూ, నా కాలేజీ చదువు మొదలైంది.పెళ్ళి సమయంలోనూ, ఆతర్వాత హైదరాబాద్ కి వెళ్తే చదువు కుదరదని ఈలోపునే నోట్స్, రికార్డులు పూర్తి చేయటం హడావుడిలో పడిపోయాను.
 
          హైదరాబాద్ నుండీ పెద్దపెద్ద రెక్కలతో ఎగిరొచ్చిన పావురాలు ప్రతీ వారం ఒలకబోసిన అనురాగాల మూటలు నా దోసిట్లో తొణికిసలాడుతూనే ఉన్నాయి.
 
          అన్నింటికీ సమయం సమకూర్చుకోలేక సంగీత కళాశాలకు వెళ్ళటం మానేసాను. ఒకరోజు అక్కయ్య దగ్గర నుండి వచ్చిన ఉత్తరం నాకు మరింత కంగారు తెచ్చిపెట్టింది.
“నువ్వు చదువు మధ్యలో పెళ్ళి చేసుకుంటున్నావు. చదువు మానేసే ఉద్దేశం ఉందా? ఒకవేళ గర్భం వేస్తే అప్పుడైనా మానేయాల్సి ఉంటుంది. చదువు పూర్తి అయ్యేవరకూ పిల్లలు వద్దనుకుంటే సూర్యారావు మామయ్య కూతురు డాక్టర్ కదా ఆమె సలహా ముందుగానే తీసుకో. వీర్రాజుతో ఈ విషయం సంప్రదించి నిర్ణయించుకో” అని రాసింది అక్కయ్య. ఈ విషయం ఇంతకు ముందు ఆలోచించనే లేదే అనుకున్నాను. వెంటనే ఆయనకి ఈవిషయం రాస్తే ఆయనకూడా నా ఆలోచనను సమర్థించారు. నేను మామయ్య కూతురు కి ఉత్తరం రాసాను.ఆమె వెంటనే సమాధానం రాసింది. బహిష్టు తర్వాత ఆరవరోజు రాత్రి  నుండి ఇరవైఒక్క రోజులు రోజుకొక మాత్ర చొప్పున వాడి ఆపేయాలనీ, తర్వాత రెండోరోజు మామూలుగా బహిష్టు వస్తుందనీ, ఈ రకంగా అవసరమైనంత కాలం వాడవచ్చని చెప్పింది. వివాహం తర్వాత విజయనగరం వచ్చేస్తే మరి వాడఖ్ఖరలేదని, నీభర్త వచ్చిన నెల మాత్రం మళ్ళా వాడమని చెప్పి ప్రిస్క్రిప్షన్ రాసి పంపింది. ఆ మాత్రలు వాడుతున్నప్పుడు కడుపులో తిప్పినట్లుగా ఉండొచ్చు అటువంటప్పుడు చప్పరించే సి-విటమిన్ మాత్రలు కూడా వాడమని రాసింది. ఆ ప్రిస్క్రిప్షన్ ను వీర్రాజుగారికి పంపాను. వెంటనే కొని పార్సిల్ లో పంపారు.
 
          అటు హైదరాబాద్ లోనూ,ఇటు విజయనగరం లోనూ నిముషాలు గంటలుగా, గంటలు రోజులుగా  పొడవుగా సాగిపోయాయో ఏమిటో  ఎదురు చూస్తున్న రోజు ఎంతకీ రానట్లే అనిపించింది.

*****

Please follow and like us:

4 thoughts on “నడక దారిలో(భాగం-16)”

  1. అత్తా .. ఇంటి దగ్గర మొదలు పెట్టి ఆఫీస్ లో పూర్తిచేసేసా 16…చాలా బావుంది ..అసలు. అటువంటి బాల్యాన్ని అప్పటి జ్ఞాపకాల్ని గుర్తుపెట్టుకోవడం ఒక ఎత్తు అయితే , వాటిని ఇన్నేళ్ల తర్వాత తిరిగి ఇంత వివరంగా తిరిగి రాయడం మరో ఎత్తు ..👏🏻👏🏻👏🏻అప్పటి స్థితిగతుల్ని , జీవన పరిస్థితుల్ని స్పృశిస్తూ నీ ప్రయాణంలో మజిలీలల్ని ఒక్కోటిగా చెప్పిన విధానం చదువుతుంటే ఒక అనుభవంగా ఉంది . ఇది కేవలమా మన కుటుంబ కథ లా కాకుండా అనేక కుటుంబాల జీవన గమనం లా అనిపించింది… రాసిన నీకు, నీ చేత ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టించిన నెచ్చెలి కి అభినందనలు

    1. నీ ఆత్మీయ స్పందనకు థేంక్యూ భారవీ.

  2. మేడం
    మీ 16వ ఎపిసోడ్ చదివాను.మీ ఇద్దరిమధ్య జరిగిన ఉత్తరాయణం గురించి చదివిన తర్వాత ఇద్దరు సాహిత్య కారులు ఉత్తరాలు రాసుకున్టే ఎలావుంటుందో వూహించుకోగలిగాను. కారణం నా పెళ్లికి ముందు కూడా నేను,మాఆవిడ,ఉత్తరాలు రాసుకున్న జ్ఞాపకం గుర్తుకు వచ్చింది. అవి ఇప్పటికీ మా ఆవిడ దాచుకోవడం,విషేషం.
    పెళ్లి చేసుకున్న తర్వాత చదువు పూర్తి చేయడం అందరికి సాధ్యం కాదు.కాని మీరు పట్టుదలతో ఆ పని సాధించిన ఘనత మీది.వీర్రాజు గారు అన్ని విధాలా సహకరిన్చిన విధానం ప్రశంశనీయం. మీరు రాస్తున్న విషయాలు,అప్పటి రాజకీయ, సామాజిక అంశాలను కూడా రికార్డు చేయడం గొప్ప విషయం.మీకు హృదయపూర్వక అభినందనలు మేడం.
    —డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ జిల్లా
    9866252002

    1. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు ప్రసాద్ గారూ

Leave a Reply

Your email address will not be published.