బతుకు చిత్రం-16

– రావుల కిరణ్మయి

          కుమ్మరి మల్లన్న ఇంటి నుండి  కురాళ్ళు పట్టడం కోసం ఆడబిడ్డలకు చీరలు పెట్టింది. ముత్తయిదు వలను పిలుచుకు రావడానికి బయలుదేరతీసింది .

          పెద్దామె, నడిపామె మాత్రం సంతోషంగా పెట్టిన చీరలు కట్టుక తయారయిండ్రు గాని చిన్నామె మూతి ముడిసింది. ఉల్లి పొర చీరలు పెడుతేంది?పెట్టకున్టేంది ?ఇగ ఇవి కట్టుకొని ఇంక తగుదునమ్మాని పేరంటాండ్ల పిలవడానికి పోవాల్నా?చూసినోల్లు ఏమనుకుంటరు/ఇంత గతి లేకుంటున్నర?అని మా మొగోల్లను అనుకోరా?అని ఎల్లగక్కింది.

          పెద్దామె,కల్పించుకొని,

          ఏందే ?సెల్లె !తప్పు గదా!అట్ల మాట్లాడుడు ?మనోళ్ళ సంగతి మనకెరుక లేనిదానే?వాళ్ళు ఉండి పెట్టక పోయిన్డ్రా?పోనీ లచ్చలు లచ్చలు పైసలు దీస్కోని దరియ్యక పెడ్తలేరా?ఆడివిడ్డంటే అర్థం జేసుకొని మసలాలే గని కానోల్లలెక్క తప్పులు లెక్కవెట్టద్దు. అని అంటే

          నడిపామె ,

          అవును సెల్లె ,సైదులుకు పెల్లేగాదని నానా తీర్ల మాట్లాడిరి,వదిన ఎంత తండ్లాడింది.ఇగ పెట్టువోతలు సుత ఏం తీసుకుంటనే లేదాయే!అమ్మానాయ్న లేనుక మన లగ్గాలన్ని,పురుళ్ళన్ని తనే మీదేసుకునే.మన అన్న సక్కగుంటేనా?ఎప్పుడు ఎకసక్కాలేనాయే!అండ్ల చిన్నోడు వానిచ్చ వాడు జేసుకొని వచ్చె.ఈ లగ్గమన్న ఉన్నంతల కండ్ల పంటోలే చెయ్యల్నని తొక్కులాడవట్టె .జర నువ్వు నిమ్మలంగుండు నాలుగు అచ్చింతలు వడేదంక.మాకయితే అత్తిన్తికాడ సాకిరి చేసీ చేసీ ఈ లగ్గం తోనన్న నాలుగొద్దులు ఉప్పోసవోతదని అచ్చినం.మల్ల నువ్వింట్ల జెయ్యకే,నీ దయ గని,అని బ్రతిమిలాడింది.

          అప్పుడే తానూ గూడా చీర కట్టుకొని వచ్చిన వీర్లచ్చిమిని చూసి ముగ్గురూ మాట్లాడడం ఆపేశారు.

          వదినా !ఇగ రాండ్రి బయిలెల్లుదం.మల్ల వర్జ్యం జొరవడుతది.రాంగ రాంగ ఇంకో ముఖ్యమయిన పని ఉన్నదని బయలుదేరతీసింది.

          చిన్నామె నిమ్మలానికి వచ్చి ,

          అయ్యో వదినా !సప్పుడోల్లు రావద్దా ?వట్టిగెట్ల తెత్తం?అన్నది.

          నిజమే గని ఆళ్ళకు పోయినకాడ ఇంకింత ఆలస్యమయిటట్టున్నదట.ఆగితే మనకు ముహూర్తం మించిపోద్ది,అని అంటే వీళ్ళ ముచ్చటిని రాజయ్య ,

          సప్పుడుకు ఏమున్నదే ?ఇప్పటికయితే సెల్లుల వెడుత ,మీరు వొయ్యి కుమ్మరింటికాడ చేసే పనులన్నీ చేసే యాల్లకు వాళ్ళే అందుతరు,ఏమంటరు ?అన్నాడు.

          ఏమనేది లేదే !నువ్వన్నది మంచిగనే ఉన్నది,ముందు పని గావాలె అని పెద్దాడిబిడ్డ అనగానే అందరూ కలిసి బయలుదేరారు.

                                           ————————-

          కుమ్మరి మల్లన్న శుభ్రంగా స్నానం చేసి వీళ్ళ కోసమే ఎదురు చూస్తున్నడు. చప్పుడు వినబడగానే వాకిట్ల కచ్చి ఎదురెళ్ళి స్వాగతం పలికాడు.

          ఆడబిడ్డలను మంచి చెడ్డా పలకరించాడు. మల్లన్నభార్య కూడా పలకరించింది. తరువాత,

          కుమ్మరిసారెకు, వామికి, గడపకు బొట్టు పెట్టారు.

          మగ పెళ్ళి కాబట్టి అయిదు కుండలని మల్లన్న తెచ్చి మంగళహారతి వద్ద పెట్టాడు.

          ఈర్లచ్చిమి బియ్యం,డబ్బులు పళ్ళెం ల పెట్టి ఇచ్చింది.పెళ్ళికి రమ్మని బొట్టు కూడా అప్ప జెప్పింది.

          మల్లన్న ,ఆయన భార్య సంతోషపడ్డారు. అడిగిన దానికంటే ఎక్కువ మొత్తంలో డబ్బు ముట్టజెప్పినందుకు.

          ఇంటికి మరలి పోతుండ దారిల నడిపామె ,

          వదినా !ఊళ్లె కుండలకు బాగనే పిరమున్నట్టున్నది అని.

          పిరమేమి లేదు వదినే!అంతటేట్లనో  ఇక్కడ గూడ అంతే నేనే కావాలనే ఇంకో యాభయి ఎక్కువిచ్చిన.అన్నది.

          అవునులే !ఎంత సంబరపడితే మనకంత మంచయితది అన్నది.చిన్నామె.అని మా గురించి కూడా అట్నే ఆలోచించితే మంచి చీరే పెట్టేదానివే ,అనుకున్నది గొనుక్కున్నట్టుగా.

          మిగతా ఇద్దరూ ఆమెను సైగ చెయ్యడం తో ఇక ఆగిపోయింది.

          రాజయ్య అన్నట్టుగానే చప్పుడు వాళ్ళు మధ్యలో ఎదురయ్యారు. వారిథి కలిసి చప్పుడు తో ఇల్లు చేరారు. 

                                 ——————————

          ముత్తయిదువలు ఎదురచ్చి కళ్ళకు నీళ్ళు ఇచ్చి అంతకు ముందే వేసిఉన్న ఈత చాప పై పెట్టారు. తరువాత చప్పుడుతోనే సున్నం రాసి పెట్టారు.

          ఈర్లచ్చిమి ,సున్నం రాయంగ పాటపాడవేంది వదినే?పట్టుచీర పెట్టననా ఏంది ?అన్నది.పేరంటానికి వచ్చిన గొల్ల కొమురక్కను,

          ఎహే !నీ చీర కోసం పాడ్తలేననుకున్టివా ?వదినే!నువ్వు వెట్టకుంటే నీదయినా పట్టుకవోత.నాకంత సతంత్రం లేదా ఏంది?ఇగో ఇను మల్ల ,అని అప్యాయంగా మొదలు పెట్టింది.

                       కూరాడు పుట్టెనో కుమ్మరి సారె పయి ….

                      కుమ్మరి మల్లన్నే బమ్మయి తిప్పంగా ….

                      భూమి పోలిక లెక్క గుండ్రనీ కుండ …..

                      చందమామ లెక్క చక్కనీ కుండ …..

                      పాపాయి లెక్కను పావురంగా దీసి …..

                      వామి అగడుల వెట్ట …..

                       అగ్గిదేవుని తోడ దీవేనార్థులంది …..

                        కురాడుగా మా ఇంట కొలువుగాను వచ్చె …..

                        పాల పొంగసొంటి సున్నమే రుద్ది …

                        పాలకుండ వోలె తీర్చీ దిద్ధంగా …..

                        పక్కుమని నవ్వినా చందంగా ….

                         అందంగ ఉండే ……….

                         కూరాడు సూడంగ కడుపునిన్డంగా …

                         కుమ్మరీసారే సల్లగుండాలే …….

                         కుమ్మరీ వామి ఆరకున్డాలే …..

                         కుమ్మరీ మల్లన్న కడుపు నిండాలే …..

                         మట్టి కలిసేదాక కూరాడు నిలువ …

                          లగ్గమయ్యే ఇల్లు లచ్చల వరహాల ..

                           పదికోట్ల రత్నాల రాసుల …..

                           ధాన్యాల సల్లగుండాలే …

                           పిల్లపాపల తోని …..

                           గిల గిల లాడాలే ……

                            నా పాటకు వదినె ……

                             పట్టుచీర వెట్టాలే ……

                              ——————

                             ——————-

                            ———————-

అని కొమురక్క పాడంగ అందరూ కలిసి సున్నం పెట్టడం పూర్తి చేశారు.

                                 ———————–

          మధ్యాహ్నం భోజనాల సమయం కావడం తో వచ్చిన వారికి కూడా భోజనాలను ఏర్పాటు చేసింది ఈర్లచ్చిమి.

          ఆ రోజు పూర్తి చేయవలసిన పనులను గూర్చి మాట్లాడుకుంటూ భోజనాలు పూర్తిచేశారు.

          సాయంత్రం గాడి పొయ్యిలు తవ్వవలసి ఉండగా  అందుకోసం బావలను కూర్చోబెట్టి రాజయ్య కొత్త పంచెలు  పెట్టాడు.

          ఆడబిడ్డలు,బావలు కలిసి ఇంటి వెనుక గది పొయ్యిలు తవ్వి అలికి పసుపు, బియ్యం పిండితో ముగ్గులు వేసి …

          మా అన్నలింట లగ్గమోయమ్మ….

          చుట్టాలు పక్కాలు చాల వచ్చేరు …..

          పొయ్యి రాళ్ళు ఏడెక్కి పగలకుండాలే….

          కట్టెలూ ఆరక మండుతుండాలే……

          మా వదినె మరదళ్ళు అలయకుండాలే ….

          పాయసాన్నము వంటి పలు రీతి వంటలూ …

          పెళ్ళి బంతిలోన వండిపెట్టాలే …..

          వరుణ దేవర నువ్వు ఆవలే ఉండు …..

          అగ్గి దేవర నువ్వు ఈవలే ఉండు …..

          —————————-

          —————————

          —————————

          అంటూ గాడి పొయ్యికి హారతిని ఇచ్చి పాట పాడారు.

          ఆడబిడ్డలు హారతులు పట్టుకోగా ముత్తయిదువలు కూరాళ్ళ కుండలు పట్టుకొని చప్పుడు తో కోమట్ల భాగ్యక్క మంచినీళ్ళ బావికి వెళ్ళారు.

          భాగ్యక్క కుంకుమ బొట్టు పెట్టి ఆనందంగా స్వాగతించింది.

          బావి చేరాలకు పసుపు,కుంకుమ అలంకరించి మందార పూలు సమర్పించి అగరుబత్తులు వెలిగించి బావికి పూజ చేశారు.ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా నీరు తోడు తుండగా,

భాగ్యక్క …

          మంచినీళ్ళ బావి మాది …

          మధురమైన నీళ్ళు మావి …

          చేద బొక్కెన బంగారుదేను ….

          ఏగిరముగా వేయకండమ్మా ….

          బావి నీటిని గిలగొట్టకండమ్మా….

          కూరాళ్ళు నింపేటి ఈ బావి ఎపుడూ …

          నిండు కూరాడయి ఉండుమనుచు …..

          చల్లంగ అనరమ్మ మీరు….

          మల్ల మల్ల వచ్చి పోరమ్మ ….

          నిత్య కల్యాణం పచ్చతోరణం గా ….

          బావి ఉండంగా సాగరమ్మా …..

          ———————

          ———————

          అని ఆనందంగా పాడంగా భాగ్యక్కకు కొత్త టవలు,రెండు జాకెట్ ముక్కలు బొట్టు వెట్టి  పెట్టి కూరాళ్ళ తో ఇంటికి వచ్చి గాడి పొయ్యి మీద పెట్టారు.

                                       ———————————–

          పసుపు కొట్నాలు పెట్టడం కోసం ఇంటిలో చాప వేసి విసుర్రాయిని దానిపై పెట్టారు. పసుపు కొమ్ములను గుండ్రాయి తో విసుర్రాయి పైన పెట్టి ముక్కలు చేసి దంచి పొడి చేశారు. పసుపు దంపేటప్పుడు కొమురక్క ,

          పసిడి రంగు తీరు పచ్చన్ని పసుపు ….

          మగువ మనసు మెచ్చి మగడు తెచ్చేను …..

          ————————————-

          ————————————–

          ————————————–

          అని అయిదుగురు ముత్తయిదువలు కొట్టుతున్నంత సేపు అలిసి పోకుండా పాడుతూనే ఉంది. అయిదు సోళ్ళ బియ్యానికి సరిపోను పసుపు, నూనె కలిపి తలబాల బియ్యం కోసం కొత్త గుడ్డ లోకి ఎత్తి మూట కట్టారు.

*****

ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.