మా అమ్మ విజేత-7

– దామరాజు నాగలక్ష్మి

పెళ్ళి హడావుడి, పెళ్ళి ఏర్పాట్లతో అందరూ సందడి సందడిగా వున్నారు.

          పెళ్ళనేసరికి అమ్మాజీకి అంతా గాభరా గాభరాగా వుంది. ఆటలు ఆడుకుంటూ వుండే అమ్మాజీకి అంతా విచిత్రంగా వుంది. సరదాగా ఆడుకుంటూ పాడుకుంటూ వుండడం, ఎవరి పెళ్ళిళ్ళయినా అయితే సరదాగా తిరిగడం మాత్రమే తెలుసు,  రాత్రి 2.00 గంటల ముహూర్తం.

          ఇంకా పెళ్ళికి టైము వుండడంతో… అమ్మాజీ గాభరా చూసిన పెద్దమ్మ పిల్లలు “అమ్మాజీ! మనం మన ఇంట్లో పూసిన గులాబి, తెలుపు, ఊదారంగు డిసెంబరు పువ్వులు – గొబ్బి పువ్వులు కోసి దండలు కట్టుకునేవాళ్ళం కదా… నీకు రాకపోతే మేము నేర్పించాం గుర్తుందా… మనం పోటీ పెట్టుకుంటే నువ్వే ముందర అన్నీకట్టేసేదానివి. అప్పుడు అందరం నిన్ను ముద్దులు పెట్టుకునేవాళ్ళం. సంక్రాంతికి నువ్వు ఎన్ని ముగ్గులు వేశావు. పెద్ద పెద్ద ముగ్గులన్నీ నేర్చుకున్నావు. ఇంకా నువ్వే మాకు చుక్కల ముగ్గులు నేర్పించావు. నువ్వు చాలా మంచిదానివి, చురుకైన దానివి. నువ్వు అన్నింటికీ భయపడకు” అని ధైర్యం చెప్పారు. 

          అమ్మాజీ వీళ్ళు చెప్పే కబుర్లు విని తనూ సంతోషంగా కబుర్లు చెప్తూ నవ్వుతోంది. మాట్లాడుతూ మాట్లాడుతూనే నిద్రపోయింది. “ఓసినీ బలే నిద్రపోయింది” అనుకుంటూ ఇంక వాళ్ళు కూడా అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయారు.

          ఒక గంట తర్వాత వీరలక్ష్మిగారు వచ్చారు. నిద్రపోతున్న మనవరాలిని ముచ్చటగా చూసుకుని-  “పాపం చిన్న పిల్ల.  దాని జీవితం ఇంకయినా బాగుపడితే బావుండును” అనుకుంటూ  “అమ్మాజీ…! అమ్మాజీ…! లే…!  పెళ్ళికి టైమవుతోంది” అని లేపింది. అమ్మాజీ… గబగబా లేచి “బామ్మా…. బామ్మా…” అంటూ ఆవిడ ఒడిలో ఒదిగిపోయింది. ఆవిడ ప్రేమగా దగ్గరకి తీసుకుని “లే… సీతక్కా వాళ్ళూ అందరూ రెడీ అయిపోయారు. నువ్వు రెడీ అవ్వాలి కదా…” అని, 

          “అమ్మాయ్ సావిత్రీ ఏదో పెళ్ళిపనులు ఎంతవరకు వచ్చాయో చూద్దామని వచ్చాను. అమ్మాజీ నన్ను వదిలిపెట్టట్లేదు” అని పిలిచింది.

          సావిత్రి వచ్చి మెల్లిగా అమ్మాజీని లేపి, తీసుకెళ్ళి స్నానం చేయించి, పెద్ద మేనమామ వీరభద్రం కొన్నా గులాబీ రంగు పట్టు చీర కట్టారు. ముద్దుగా బొమ్మలా ఉంది అమ్మాజీ! 

          పెళ్ళిటైము అవుతుండడంతో పెళ్ళి వారందరినీ విడిదికి వెళ్ళి పందిట్లోకి ఆహ్వానించారు. సరోజకి తమ్ముడే కాబట్టి అందరూ ఒకే కుటుంబంలా కలిసిపోయారు.

          సూర్యంని పీటల మీద కూచోపెట్టి పెళ్ళి కార్యక్రమం మొదలు పెట్టారు. పెళ్ళి కూతురుని తీసుకు రమ్మన్నాడు బ్రాహ్మడు. చిట్టితల్లి అమ్మాజీని బుట్టలో కూచోపెట్టి ఒక బొమ్మని తీసుకు వచ్చినట్టు తీసుకువచ్చి సూర్యం పక్కన కూచోపెట్టారు. పెళ్ళి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సూర్యం మంగళసూత్రం అమ్మాజీ మెడలో కట్టాడు. సూర్యం అమ్మాజీకన్నా 11 సంవత్సరాలు పెద్దయినా… ఇంకా చిన్నపిల్లాడిలాగే చేస్తుంటాడు.  పాపం అమ్మాజీ నిద్రతో తూలుతూనే వుంది.  ఎవరో ఒకరు పక్కన వుండి కబుర్లు చెప్తున్నారు.

          ఇంక తలంబ్రాల తంతు మొదలైంది. అందరూ అమ్మాజీని “నువ్వే ఎక్కువ పొయ్యాలి. నువ్వు ఓడిపోకూడదు” అంటూ హడావుడి పెట్టారు.

          ఇంక నిద్రమత్తంతా ఎగిరిపోయి అమ్మాజీకి ఎక్కడలేని హుషారు వచ్చి తలంబ్రాలు గబగబా పోసేస్తోంది. అందరూ సరదాగా పెళ్ళి కార్యక్రమం పూర్తిచేశారు. ఇంక అమ్మాజీని వెళ్ళి పడుకోమన్నారు. మర్నాడు మగ  పెళ్ళి వాళ్ళకి విడిదికి అమ్మాయిని సారె ఇచ్చి పంపాలి.

          అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. పొద్దున్నే 7 గంటలకల్లా అందరూ రెడీ అయిపోయి అందరికీ కాఫీలు అందించారు. టిఫిను ఉప్మా చేయించారు.  పెళ్ళివాళ్ళకి అన్నీ పద్ధతిగా గిన్నెల్లో పెట్టి బ్రాహ్మడికి ఇచ్చి పంపించారు. అందరికీ టిఫిన్లు అయ్యి రెడీ అయ్యాక చెప్పమన్నారు.

          వీరభద్రంగారు, సావిత్రి వీరభద్రంగారి తమ్ముళ్ళు అందరూ కలిసి చలిమిడి, అరటిపళ్లు, మినపసున్ని, లడ్డూలు, అరిసెలు, జంతికలు, పసుపు, కుంకం ఇవన్నీ తీసుకుని విడిదికి వెళ్ళారు. వీళ్ళందరినీ అన్నపూర్ణమ్మగారు, వెంకట్రావుగారు సాదరంగా ఆహ్వానించారు.

          అన్నపూర్ణమ్మగారు అమ్మాజీని దగ్గిరకి తీసుకుని, సూర్యంని పక్కన కూచో పెట్టుకుని “ఇంక నుంచీ నువ్వు ఆటలు అంటూ అటూ ఇటూ తిరగకు. ఇంటిపట్టునే వుండు” అన్నారు.

          సూర్యం హైస్కూలులో చదివేటప్పుడే ఆటలంటే చాలా ఇష్టంగా వుండేది. ఫుట్ బాల్ బాగా ఆడేవాడు. ఆటల పోటీలకి పక్క ఊళ్ళకి వెడుతుండేవాడు. ఆటల్లో ఎన్నో మెడల్స్ వచ్చాయి. ఎన్నో మెప్పులు పొందాడు. అయినా అన్నపూర్ణమ్మగారు కొడుకు ఎక్కడ చెడిపోతాడో అని భయపడుతూ వుండేది.

          పెళ్ళయిన తర్వాత అన్నపూర్ణమ్మగారు అమ్మాజీని, సూర్యంని తీసుకుని ఏలూరు వెళ్ళిపోయారు. అక్కడ మూడోకూతురు అంజనాదేవిని పిలిచి దీనికి పనులన్నీ నేర్పించు అంది. అంజనాదేవి అప్పటికే ఒక స్కూల్లో టీచర్ గా చేస్తోంది.  పొద్దున్నే లేచి పిల్లలని రెడీ చేసి తను స్కూలుకి వెళ్ళిపోయేది. స్కూల్లో 7.30 కల్లా వుండాలి కాబట్టి పనులన్నీ చేసుకునేది.

          పనిమనిషిని పెట్టుకోలేదు. టైముకు రాదు కాబట్టి. అమ్మాజీకి ఇంటిపని, బట్టలు ఉతకడం, వాటిని జాగ్రత్తగా మడతలు పెట్టుకోవడం అన్నీ నేర్పించింది.

          మెల్లి మెల్లిగా అమ్మాజీకి ఆటల మీద ధ్యాస పోయి పనులమీదకు మళ్ళింది. తన ఆడబడుచు అంజనాదేవి పిల్లలతో ఆటలు ఆడుకుంటూ వుండేది. వాళ్ళు కూడా అక్క అక్క అంటూ ప్రేమగా వుండేవారు.

          సూర్యంకి పెళ్ళి చేశాక ఉద్యోగం లేకపోతే కష్టమని అన్నపూర్ణమ్మగారు అనుకున్నారు. ఒకరోజు ఆంధ్రాబ్యాంక్ కి వెడితే వాళ్ళు “మీ అబ్బాయి ఖాళీగా వున్నాడుకదా… మా బ్యాంక్ కి పంపించండి పని నేర్పించి ఎంతో కొంత ఇస్తాం” అన్నారు.

          వాళ్ళు అడిగిందే తడవుగా అన్నపూర్ణమ్మగారు ఇంటికి వచ్చి “ఒరేయ్ సూర్యం నువ్వు రేపటి నుంచీ ఆంధ్రాబ్యాంక్ కి వెళ్ళు. వాళ్ళు పని నేర్పించి, జీతం ఇస్తానన్నారు” అంది.

          అమ్మ మాటకి ఎదురు చెప్తే ఎలా వుంటుందో తెలుసు కాబట్టి “సరే అమ్మా అలాగే” అని సూర్యం మారుమాట్లాడకుండా వెళ్ళిపోయాడు.

***

          సూర్యం ఆంధ్రాబ్యాంక్ కి వెళ్ళి మేనేజర్ ని కలిశాడు. ఆయన అన్నపూర్ణమ్మగారి మీద ఉన్న గౌరవంతో సూర్యంని లోపలికి తీసుకుపోయి ముందు చిన్న చిన్న పనులు నేర్పించమన్నాడు.

          సూర్యం బ్యాంక్ కి వెడుతున్నాడే కానీ పని మీద అసలు ధ్యాస వుండట్లేదు. ఎంత సేపూ ఆడుకోవాలనే… 4 గంటలకే నేను వెళ్ళిపోతానని గ్రౌండ్ కి వెళ్ళి ఆటలు ఆడుకుంటుండేవాడు. సరేలే కొత్త కదా అని వదిలేశారు.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.