యుద్ధం ఒక గుండె కోత-16
(దీర్ఘ కవిత)
-శీలా సుభద్రా దేవి
నింగిని తాకుతోన్న మంటల వృక్షాలు
ఆగి ఆగి చటుక్కున విచ్చుతోన్న జ్వాలా తోరణాలు
రేకులు రాలుస్తున్న నిప్పురవ్వలు
జూలు విదిల్చి ఆవులిస్తున్న మృగరాజు
ఒళ్ళు విరుచుకొంటున్న క్రూరత్వం
నిశ్శబ్ద శకలాలు చిట్లి జారిన శబ్దం
తాను కాల్చకుండానే దహించుకుపోవటాన్ని
అడవితీగల్ని అందుకొని ఎగబాకి
అబ్బురంగ చూస్తోన్న వానర సమూహాలు
రెండు నాలుకల ప్రహసనాల్ని చూస్తూ
నివ్వెరపోతూ నాలుకల్ని దాచేసుకొంటోన్న సర్పాలు
ముందున్నవి కదిలిపోతున్న దారిలో
గుడ్డిగా సాగిపోతూ బలైపోతోన్న
అమాయక మూగ జీవజాలాలు
శరీరభారంతో కదలలేక
నిలువునా దగ్ధమైపోతోన్న భారీకాయాలు
భయంతో సురక్షిత స్థానాలను
వెతుక్కుంటూ వెతుక్కుంటూ
ఎగురుకుంటూ సాగిపోతున్న వలసపక్షులు
తనవరకూ వస్తే ఆలోచించుకోవచ్చని
నిదానంగా కడుపునింపుకొంటోన్న బక్కప్రాణులు
అవకాశం చూసుకొని పొంచి ఉండి
హరాయించుకొనే శక్తి ఉందోలేదో గమనించుకోకుండానే
దరిచేరిన ప్రాణుల్ని
అందినంతమేరా పొట్టన పెట్టుకొంటున్న కొండచిలువలు
భయంకర క్రూర మృగాలు
కకావికలైపోతున్న సమూహాలు
ఎటుచూసినా ఎడార్లుసైతం మండిపోతున్న దృశ్యాలే!
రాక్షసత్వం దావానలమై
జనారణ్యాల్ని దగ్ధం చేస్తుంటే
అన్ని దిక్కులనుండీ ఉపిరాడనీకుండా
కమ్మేస్తున్న కమురు వాసన
మనసుల్నికూడా ఆవరించేస్తున్న పరాయీకరణలో
ఎటుపోవాలో దిక్కుతోచని మానవత్వం
భద్రమైన చోటుకోసం
వెతుక్కుంటూ – వెతుక్కుంటూ వచ్చి
అమ్మ గుండెలో దూరి ఊపిరి పీల్చుకొంటోంది
*****
(ఇంకా ఉంది)