రసహృదయాలు – రాగ రంజితాలు

-డా. కొండపల్లి నీహారిణి

గరికపూలెత్తిన నేలమీద
నడకలు నేర్చిన నీవు
జాతి వైరుధ్యాల మాటలనే మూటలుగా ఎత్తుకోవుగానీ
గోడకేసిన బంతి నీచేతికే వచ్చినట్లు
ఇక్కడేవో కొన్ని ఉత్తుంగ తరంగ భావాలు
శుభారంభాల కోసం ఓ పండగ
కొత్తగా మళ్ళీ వచ్చింది.
ఇంటిముందు పూలమొక్కను
ఎందుకు నాటుతున్నామో తెలిసీ తెలియనితనంతో
మొత్తం సముద్రాన్నంతా ఎత్తిపోసినట్లు
పెళ్ళి గురించి ఏవేవో అధిక ప్రసంగాలు

షడ్రసోపేతమైన జీవితాన్ని కావాలనుకునేప్పుడు ఒకరికోసం ఒకరు
వస్తు గుణేపంతంగా మారుతుండాలి
పండుగల వేళ మెలకువ నీకు పెందరాళే
యుద్ధం వద్దు అనుకునే – ఆ రోజు ప్రశాంతంగా మొదలవుతుంది.
ఉప్పురుచి ఉనికిని నేర్పినట్టు వంటింటివైపు
నీ అడుగులు కదులుతాయి.
తోరణాలు కట్టి తోడుగా వచ్చే అతని కోసమో
తొంభైతొమ్మిది తిట్లు తిట్టినా అనురాగాల పిలుపులతో నవ్వులు పూయించే
పువ్వులన్నీ అయ్యే పిల్లలకోసమో
ముగ్గుమురిపాల నుండి క్రీగంటి మెరుపులన్నీ నీవిచేసుకొని
పండిన చెట్టంత మనిషివై కనిపిస్తావు

ప్రపంచాన్నే కనగలిగే నీవు
స్త్రీ శిశువుతోబాటు పురుష శిశువునూ కంటావు
మెప్పులు కోరే మనసుకు
ఊరట మాటలు ఉండకున్నా
ఇవేవీ చేదు ముచ్చట్లు కావని
కనే కష్టాన్ని చిటికలో మరిచిన అనుభవంతో
ఉపాహార వ్యవహారలన్నీ చూస్తూనే ఉంటావు
బ్రతుకు నేర్పిన లక్షణాల కంటే ఎక్కువైన రుచులు
చుట్టిముట్టినప్పుడల్లా అనిర్వచనీయ
వేదనా తత్త్వరేఖ ఒకటి నీలో ఆవృత్తమవుతూ ఉంటుంది.
ఏ పండుగ వంటలు ఆ పండుగవని
గిన్నెలన్నీ గబగబా గుర్తుచేస్తుంటే
ఫోన్ గలగలకూ సమాచారం కంఠస్వరమవుతావు.

పర్వదిన సహన సమర గీతాలేవీ ఓ వారగా పెట్టేవిగావు
బండపచ్చళ్ళ నుండి / విద్యత్తు తిప్పుళ్ళు వచ్చినప్పటివరకూ
ఆకర్షణ వికర్షణలన్నీ పుల్లనై
జివ్వున నోరూరిస్తూనే ఉన్నవి
ధననర్తన చర్చోపచర్చల్లో
మాటబడేసే అలవాటులా మాటబడే అలవాటులా
కూరల పుళిహోరల ప్రత్యేకతల వడ్డనల వరకూ
నలభీమ పాకమన్న నానుడి మాత్రమే
ఏకపక్షమయ్యేవన్నీ వింటుంటేనే అతని సాయాసాయాల
విశ్లేషణా తోడవుతుంది.
ధననర్తనమో,  ఋణవర్తనమో
మనదైన నడతకు శక్తి ప్రేరకాలైనప్పుడు
అమ్మమ్మ చెప్పిన ఓరిమి చిట్కాలేవో తియ్యగాను అందుతాయి.

తరతరాల సహజగుణాల వ్యంజ్యనంతో
అతను చిటపటలాడించినా
పోపులు పెట్టిన నీవు ఎడమ చేతివాటంగా
ఆ మాటలన్నీ గిరవాటేస్తావు
కాలస్పృహను మరిపించి
మధు తిక్త కటు కషాయాలన్నీ పెనవేసుకున్న
మధ్యాహ్న భోజనం పూర్తవుతుంది
అంతలోనే ఏవీ విస్మృతికి గురికావు
కర్మాధీనత లోకరుచి తెలిసిన బుద్ధిమొత్తం
ఇప్పుడు ప్రకృతి కమనీయమైన కొత్త విద్య నేర్పిందన్న స్పృహతోనే
నీవున్నావని తెలియనివ్వని పనులేమి ఉన్నాయిగాని
అరుచుల గమనాలు ఇవి అని తెలిసిన అతడూ
వగరు ప్రాముఖ్యతనూ ఆస్వాదిస్తాడు

వెటకారాల కారాలన్నీ ఇద్దరినుండిపారిపోకపోయినా
పెసరుగింజ సామెతలాగా సరిహద్దులన్నీ రద్దయి
ఒద్దికలు మొత్తం సందెజాడల అలరింపులవుతాయి
తెల్లారి పండుగుండదు గదా
తెల్లవారి పండుగలేవీ ఉండవు కదా
యధావిధి అహంభావ వికారాలన్నీ వెంటబడుతూనే ఉంటాయి

అందాల లోగిలిలా మురిసిపోవాలని
వసంత ఋతుగీతాలెత్తే కోకిల ప్రతిసారీ
అట్లా వివాహ దినోత్సవ దశాంశాలకూ హాజరవుతూనే ఉంటుంది

ఎక్కువ తక్కువల అరమరికలను మరచి
ఆమని రాకను ఆహ్వానిస్తే రాగవిరాగాలన్ని సరికుదిరే పనిలో పడతాయి
ప్రేమైక భావానికి
ఆమె రసోదయ బింబము అవుతుంది
అతడు రసహృదయ తరంగ ప్రతీక అవుతాడు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.