“వెనుతిరగని వెన్నెల” డా.కె.గీత నవలా పరిచయం
-శ్యామల కల్లూరి
తెలుగు సాహిత్య వికాస పరిణామంలో కొన్ని ఆసక్తికర మార్పులు ఈ మధ్య చూస్తున్నాము. తెలుగు మాట్లాడే భాషా రాష్ట్రాలు ఒకటి నుండి రెండయ్యాయి. తెలుగు మాట్లాడే ప్రజల సంఖ్య నానాటికీ తగ్గుతూ వస్తోందని పరిశీలకులు చెప్తున్నారు. విదేశాలలో తెలుగు మాట్లాడే తెలుగు వారి వలనే మనభాష జీవించి వుండే సంభావన పెరుగుతూ వస్తున్నది. కాలేజీలలో తెలుగు రాష్ట్రాలలో తెలుగు భాషకి, భాషలో విద్యా బోధనకీ ప్రాముఖ్యం తగ్గుతూ వస్తోంది. యువతరంలో మాతృభాష ప్రభావం తగ్గుతుంటే పెద్దలలో పెరుగుతున్నది. కవిత చదివేవారు రాసే వారు తెలుగులొ మిగతా భాషలకంటే ఎక్కువే వున్నారు. గత రెండు మూడు దశాబ్దాలుగా నవల కంటే కథ ప్రాచుర్యం పెరిగింది అని విజ్ఞులు చెపుతున్నారు. కథా సంకలనాల రాశి గూడా పెరిగింది. అయితే మళ్ళీ నవల పుంజుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. నవలా పురస్కారాలు రాష్ట్రాలలోను తానా లాంటి సంస్థలు ప్రకటించటం మొదలెట్టాకా నవలా రచనకి ఔత్సాహికులు పెరిగారు గత మూడు నాలుగేళ్ళలోనే తెలుగు నవలల వస్తువులోను ప్రయోగాత్మక కథా కథనంలోను అనేకానేక మార్పులు వచ్చాయి. ప్రవాసాంధ్ర రచనలలో కూడా ఒక గాఢత వచ్చింది. మొదటితరం రచయితలు అమెరికా వెళ్లడమనే తమ అనుభవాన్ని చిత్రీకరించటంలోను వారి జీవితాలలో మాతృభూమిని వదిలాకా వచ్చిన అనుభవాల భావాల స్థాయీ బేధాలని విశ్లేషించడంలోను, భారతీయత దాని మాహత్యాలని తమ తర్వాత తరాలకి తెలియాలనే ఆకాంక్షలలో వాళ్లు ఎదుర్కొన్న సమస్యలు సాధక బాధకాలు, ఒక అయిదారేళ్లు అక్కడున్నాక భారతదేశపు మట్టికి దూరమై వాళ్లు పొందిన సౌఖ్యాలు, ఇక్కడే వదిలి వెళ్లామనుకున్న ఆ ఛాంధసాలు ఈ దేశపు బూజు, బూజుపట్టిన సంస్కృతి ఎక్కువగా భారతీయత మీద బెంగ తక్కువగా కనపడటం మొదలైంది. అయితే పిల్లలు పెద్దయ్యాక వాళ్లలొ భారతీయ వివాహ వ్యవస్థ మీద దాని పటుత్వం మీద నమ్మకం వాళ్ల పిల్లలు ఇక్కడి వాళ్లని చేసుకుంటే వివాహ బంధాలు నిలుస్థాయన్న విశ్వాసం కనిపిస్తుంది. ఇవన్నీ బాహ్య సామాజిక స్పృహ ఇక్కడి నుంచి వాళ్లని వెంటాడిన కులవ్యవస్థ పాతుకుపోయిన కుటుంబ ఆచారాలు అన్నీ నిలబెట్టుకోవాలన్న తాపత్రయం కనిపిస్తాయి. ఈ రెండు సంస్కృతులని జీర్ణించుకుని పుట్టిన గడ్డనీ అక్కున చేర్చుకున్న విదేశీ సంస్కృతినీ సమన్వయించుకోవటమన్నది ఇప్పుడు వస్తున్న నవలల్లో కనిపిస్తోంది. అక్కడ ఆ గడ్డ మీద వెలిసిన నవలలో గుర్తింపు ఇవ్వడానికి ప్రయత్నాలు బాగానే జరుగుతున్నాయి. ఈ మధ్య చదివిన పుస్తకాలలో రెండు చెప్పుకో దగ్గవి- మొదటిది కల్పనా రెంటాల గారి అయిదోగోడ డా. కె గీత గారి వెనుతిరగని వెన్నెల.
కల్పనగారి పుస్తకం కథల సంకలనం. ఇప్పుడు నవలని చర్చిస్తున్నాం కాబట్టి దాని గురించి మాట్లాడను. ఇక డా. గీత గారి వెనుతిరగని వెన్నెల. నాలుగొందల యాభై పేజీల సుదీర్ఘనవల. రెండు చిన్న సమస్యల గురించి ముందు చెపుతాను. ఇటీవల వచ్చిన నవలల్లో ఇది కొంచెం పెద్దదే. అందునా హార్డ్ బౌండ్. ఇప్పుడు తెలుగు నవలలు చదువుతున్న నవలలు వారిలో వయసుమళ్ళిన వారే ఎక్కువ. పుస్తకం పట్టుకుని కూర్చుని ఎక్కువసేపు చదవలేరు బరువు మొయ్యలేరు. ఇదే అనుకుంటూ నవల మొదలెట్టాను. కానీ మొదలెట్టి ఇరవై పేజీలు చదవగానే మళ్ళీ క్రింద పెట్టాలన్న ఆలోచనే రాలేదు. రెందు రోజుల్లో పూర్తి చెసేశాను. ఇది పూర్తిగా అమెరికా కాదు. గీత గారి స్టాంపుతో అమెరికా తో మొదలయ్యింది. నేటి తరం యువతీ యువకులకి అమెరికా లో చదవాలనీ అక్కడ వుద్యోగం చెయ్యాలనీ అక్కడి సహచరులని వెతుక్కుని వివాహంచేసుకోవాలనేవి చిన్ననాటినుంచి కనే కల దీనినే డాలరు డ్రీములని అంటూ ఉంటారు.
“యు హవ్ ఎరైవ్డ్ ఎట్ యువర్ డెస్టినేషన్” అన్న వాక్యంతో మొదలవుతుందీ నవల.
ఇది అమెరికాలో జిపియస్ సాయంతో ఉదయిని ఇల్లు వెదుక్కుంటూ వచ్చిన సమీర కారులో వచ్చిన అనౌన్స్మెంట్. ఇల్లు వచ్చిందని కారు దిగి పరిసరాలని పరిశీలిస్తూ మనసులోనే మెచ్చుకుంటూ తలుపు దగ్గర బెల్ కొట్టి అక్కడ అంతటా విస్తరించి వున్న ’సహాయ పేరుని చూస్తూ తలుపు తెరవడంకోసం వేచివుంది. చాలాసేపు ఆమెకి తన తల్లితో అనుబంధంగురించి మాట్లాడుకున్న తర్వాత ఆమె సంస్కారాన్ని తల్లికి్ ఈమెకి వున్న తేడాలని అంచనా వేసుకుంటూ అనుకోకుండానే తను భర్తనుంచి విడాకుల తీసుకోబోతున్నట్టు చెప్తుంది. తన తల్లి ఎందుకు కలవమని చెప్పిందో అనే మీమాంసలో కూడా పడ్తుంది. అప్పుడు ఉదయిని కాలక్షేపానికి చెప్తున్నట్టుగా తన ఇండియా స్నేహితురాలు గురించి చెప్పటం మొదలెడ్తుంది. అలా అమెరికానుంచి వేదిక ఇండియాకి మారుతుంది.
ఈ కథ ఇక్కడి నుంచీ తన్మయి అనే పదహారేళ్ళ యువతిది. కథ మొదలెట్టినప్పుడు స్కూలు ముగించబోతూ కాలేజీలో చేరబోయే యువతి తన్మయి. మధ్య తరగతి తల్లి తండ్రులు. తల్లి జ్యోతి తండ్రి భానుమూర్తి. తల్లి కొంచెం దుడుకు స్వభావమైతే తల్లినంతగా పట్టీంచుకోకుండా తన బాధ్యతలు తాను నిర్వహించుకుంటుంటాడు భానుమూర్తి. తల్లి ఆర్ధిక ఇబ్బందులలో కొట్టుమిట్టాడుతూ ప్రతిదానికీ అనుమానపడుతూ ఒక్కగానొక్క కూతురిమీద ప్రేమనికూడా కప్పివేసేంత డబ్బు మనిషిగా చిత్రీకరింపబడుతుంది. అమ్మమ్మ నరసమ్మతో కలిసి ధవళేశ్వరంలో ఒక పెళ్ళికి వెళ్ళి అక్కడ శేఖర్ కళ్లలో పడుతుంది. అప్పటికి ఇంటర్ ఫైనల్ ఇయర్ లో వున్న తన్మయి అతని బాహ్య సౌందర్యపు మత్తులో పడిపోతుంది. అలా మొదలైన పరిచయం శేఖర్ తీసుకున్న చనువుతో పెరుగుతూ పోతుంది. క్రమంగా ఉత్తరాలు రాయడం వాల్లింటికి రాకపోకలు సాగించడం చేస్తాడు శేఖర్. తండ్రి పెద్దగా అభ్యంతరం చెప్పకపోయినా జ్యోతికి ఎందుకో శేఖర్ రాకపోకలు నచ్చవు. ఈ లోపు డిగ్రీ కాలేజీ లో ప్రైవే టు గా చదవడం కొన్నిపెళ్ళి సంబంధాలు అడపా దడపా రావడం వీగిపోవడం జరుగుతుంది. చివరకు శేఖర్ కి వైజాగ్ లో ఉద్యోగం రావడంతో వాళ్ల వివాహం గురించిన చర్చలు ముందుకు నడుస్తాయి. ఉద్యోగం సంపాదించేదాకా కూతుర్ని చూడటానికి రావద్దని అల్లుడికీ, అతనికి ఉత్తరాలు రాయద్దని కూతురికీ చెపుతాడు భానుమూర్తి. పెళ్లి మాటల్లో కట్నకానుకల ప్రస్తావన వచ్చినప్పుడు వాళ్ళ నైజం డబ్బాశ తన్మయి కి అర్థమవుతుంది. కాని అతని పట్ల ఆమె ఆకర్షణ కళ్లు మూసుకుపోయేలా చేసిందని పాఠకుకులకి అర్థమవుతుంది. నెమ్మదిగా అక్కడితో మొదలైన శేఖర్ ఆమె పట్ల ప్రదర్శించిన ప్రేమ అంతా అబద్దమని మనకర్థమవుతుంది కానీ అంత దూరం వచ్చాక వెనక్కి వెళ్ళలేని నిస్సహాయత ఆమెని బాధించటం మొదలెడుతుంది. పెళ్ళికి ముందు చూపించిన ప్రేమలు ఆప్యాయతలు బూటకమనిపించటం మొదలెడుతుంది. జ్యోతి వాళ్ళ డిమాండ్ల వలన పడే ఆర్థిక ఇబ్బందులు వాళ్ళ దిగువ మధ్యతరగతి జీవితాలని అస్తవ్యస్తం చేయసాగింది. ఇన్నింటి మధ్య ఒకటే ఆశాకిరణం తన్మయి చదువుకోవాలనే తపన. అన్ని అడ్డంకులని ఎదుర్కొని ఎమ్.ఏ తెలుగులో చేరుతుంది. ఆంగ్లంలో వున్న అభిలాష నెరవేరదు అయితే ప్రావీణ్యం మాత్రం తగ్గదు. కొడుకు పుట్టడమనే మరో ముఖ్యమైన మార్పు ఆమే జీవితంలో ఉత్సాహాన్ని, బాధ్యతని పెంచుతుంది. శేఖర్ సంపాదనలో నిజాయితీ తగ్గినట్టు అర్ఠమైనా ఏమి చేయలేని అశక్తత ఆవరిస్తుంది. తను పురిటికి వెళ్ళినప్పుడు భర్త చేసే మోసం అతనికి వేరే స్త్రీలతో వున్న వ్యవహారాలగురించి తెలిసి నిలదీస్తే ఆమెని కొట్టి ఇంట్లోనుంచి వెళ్లి పోతాడు. ఆమె స్కాలర్షిప్ ఆధారంగానే ఆమె చదువు సాగుతుంది. అయితే ఇంటగెలవలేని తన్మయి రచ్చగెలిచి అంచలంచలుగా ఎదుగుతుంది. తన వ్యక్తిగత జీవితంలో వచ్చిన తుఫానులేవీ ఆమె చదువు మీద ప్రభావం చూపించవు. అలా ఏళ్లు భరించలేని పరిస్థితి వచ్చే దాకా భరించి భర్త నుంచి దూరమై చదువు కష్టపడి పూర్తి చేసి వివేకానంద స్కూలు లో టీచరుగా చేరుతుంది. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆమె ఎమ్. ఏ లో వున్నప్పుడు అక్కడ డిపార్ట్మెంట్ హేడ్, ఫ్రెండ్స్ అడుగడుగునా సాయం చేస్తారు. జీవితంలో ఆమెకి దేముడు ఇచ్చిన వరం తిట్టుకుంటూ అయినా ఒక్కత్తే కూతురయినందుకు తల్లి దండ్రులు ఇచ్చిన రక్షణ స్నేహితులు కరుణ దివాకర్ మధు అనంత అందరూ అన్ని రకాలు ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకుంటూ ఎదిగిన తీరు అద్బుతంగా అనిపిస్తుంది. అనుమానంతో ఆమె భర్త అవమానించినా కరుణలాంటి వాళ్ళు ఆమె పట్లగల ప్రేమతో పట్టించుకోకుండా అండగా నిలబడతారు. స్కూల్లో చేరాక కరుణ స్వభావం నచ్చక అతన్ని దూరంగాపెడుతుంది. తక్కిన అందరూ ఆమెకి జీవితాంతమ్ స్నేహితులే. స్కూలు వార్డెన్ గా వున్నప్పుడె జెఆర్ఎఫ్ కి ప్రిపేరయి సాధిస్తుంది. ఆ బెంచీల మీద చెట్లకింద కొడుకుతో కూచుని చదువు సాధించినా రాంకులు సాధించటం చదువు పట్ల ఆమె నిబద్దత కొక నిదర్శనం. అప్పుడె పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ప్రిపేరయి ఆ పరిక్షలో ఉత్తీర్ణురాలై ఉద్యోగంలో చెరి అక్కడొక మిత్రుణ్ణి సంపాదించుకుని స్వతంత్రంగా జీవిస్తుంది. తండ్రి అనారోగ్యం క్రుంగదీస్తుంది. ఆమె నిర్ణయాలని హర్షించలేని తండ్రి ఆమెకి దూరమవుతాడు. శేఖర్ తో ఆమెని కలపాలని ఆఖరి ప్రయత్నం చేసి ఆమె అంగీకరించక పోవడంతో అతను క్రుంగిపోతాడు. తల్లిదండ్రుల గౌరవ ప్రతిష్టలనేవి పిల్లల క్షేమం కంటే వాల్లకి ఎంత ముఖ్యమో రచయిత్రి ఎంతో సహజంగా వాస్తవ దృక్పధం తో చిత్రీకరిస్తుంది. ఆమె ఆరోగ్యం పాడయ్యి హాస్పిటల్లో వున్నప్పుడు, కొడుకు గురించి బెంగెట్టుకున్నప్పుడు అమె కొలీగ్ ఫ్రెండ్ సిద్దార్థ ఆమెకి అండగా వుండి సాయపడతాడు. జీవితంలో ఆమెకి ఎదురైన స్నేహితులందరూ ఆమె వ్యక్తిగతంగా ఎదుర్కొన్న ఒడిదుడుకుల మధ్య ఆమె జీవితాన్ని ఆమె మలుచుకున్న తీరు పట్ల ముగ్ధులై ఆమె పట్ల అభిమానాన్ని పెంచుకున్నవాళ్ళే. అంతకు ముందే ఆమె జీవితంలోకి ప్రభు ప్రవేశిస్తాడు. మంచితనానికీ మారుపేరయి స్నేహశీలిగా ఆమెకి అడుగడుగునా అండగా నిలబడతాడు ఆమెపై తన అభిమానాన్ని గానీ ప్రేమని కానీ దాచటానికి ప్రయత్నం చెయ్యడు. తన్మయి కూడా అతనిలోని ఎన్నో గుణాలతో ప్రభావితురాలై అతని పట్ల ఆకర్షితురాలైనా గత జీవితపు అనుభవాల నీడలు భయపెడతాయి. అతని ప్రేమని అంగోకరించటానికి భయపడుతుంది. ఆమె కథ పూర్తిగా తెలిసి అర్థం చేసుకున్న ప్రభు ఆమె భయాల్ని పోగడతాడు. చివరికి తను పూర్తిగా నిస్సహాయురాలైన సమయంలో అతని ప్రేమ అవసరాన్ని గుర్తించి వివాహమాడటానికి అంగీకరిస్తుంది. సిద్దార్థ అతని భార్య సాక్షి సంతకాలు చెయ్యగా వాళ్ళ వివాహమవుతుంది. సిద్దర్థ ఆమె కి సలహా ఇవ్వడమే కాక ప్రభుతో మాట్లాడి అతని మనస్సుని తెలుసుకుని అతని ప్రేమలో నిజాయితీని గుర్తించి తన్మయికి సలహా ఇస్తాడు.
అయితే వివాహం అవగానే తన్మయికి అతనిలోని అనేక కోణాలు తెలుస్తాయి. దుర్మార్గుడు కాదు. కానీ తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఆమెను వివాహం చేసుకోవాల్సి వచ్చిందనే అపరాధ భావనతో పెళ్ళి అయిన కొన్నాళ్ళకే తమ దగ్గరికి వచ్చి చేరిన అతని కుటుంబం యావత్తు భారాన్నీ బార్యభర్తలిద్దరూ మొయ్యాల్సి వస్తుంది. వాళ్ళు అధికారంతో అతనిపట్ల ప్రేమతో ఆమె పట్ల నిర్లక్ష్యంతో ఆమె జీవితాన్నంతా ఆక్రమించుకుంటుంటే ప్రభు నిస్సహాయుడై ఆమెకి దూరమవ్వడం మొదలవుతుంది. చివరికి తన కొడుకుని కూడా వాళ్లు తన నుంచి ప్రభునుంచి దూరం చెయ్యడానికి ప్రయత్నిస్తే తను పుర్వానుభావం నుంచి గడించి న ధైర్యంతో తన అధికారాన్ని తన జీవితం మీద పునరుజ్జీవింపచేసుకుని ప్రభుని సమర్థించుకుంటూనే అతని కుటుంబాన్నీ దారిలో పెడ్తుంది. కానీ ఆర్థికంగా భారం పెరుగుతుంటే తను ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వాళ్ళని స్వయం ప్రతిపత్తితో జీవించటానికి మార్గాలేర్పరుస్తుంది అత్తమామలు తప్ప అందరూ కొంత అదుపులోకి వస్తారు. ప్రభు అమెరికా అవకాశం వస్తే అది తన అవకాశంగా మలుచుకుని ఒక ఏడాది ఒక్కతే వుండి కష్టాలు పడి వీసా సంపాదించి అతని తో అమెరికాలో సెటిలవుతుంది. అతను తల్లిదండ్రులని కుటుంబాన్ని రప్పించ లేకపోవడం తో ఆమె జీవితం సుగమ మవుతుంది.
ఇదె ఉదయిని చెప్పిన తన్మయి కథ. సమీర ఆలోచనలో పడి తన విడాకుల గురించి పునరాలోచనలో పడుతుంది. తన భర్త దుర్మార్గుడు కాదు కనుక తక్కిన అన్ని సమస్యలు పరిష్కరించుకోగలన్నన్న ధైర్యం కూడగట్టుకుంటుంది.
ఒక కౌన్సిలర్ లా తను చెయ్యగలిగిన సహాయాన్ని సహాయలో నివసించే ఉదయిని సమీర తల్లి స్నేహితురాలు సాధిస్తుంది. చివర్లో ఒక చిన్న అస్పష్టతతో కథ ముగిసిందనిపించింది ఉదయిని తన్మయి ఒకరేనా అని కేవలం ఒక చిన్న సూచన ఇచ్చి రచయిత్రి వదిలేస్తుంది.
ప్రేమలు పెళ్లిళ్లూ ప్రేమపేళ్ళిళలో వున్న అభద్రతలు తల్లిదండ్రుల కుటుంబ నేపధ్యాలు వాళ్ళ సంప్రదాయానికి కట్టుబడాల్సిన నియమాలు సమాజ భయాలు ఇన్నిటినీ ఇండియా నేపధ్యంలో చూపెట్టి అవే సమస్యలని సరిదిద్దుకోడానికి ఉదయిని తను చెప్పిన కథ ద్వారా మరో జీవితాన్ని అమెరికాలో సరిదిద్దిన కథ తీరు సుఖాంతమని పించాయి తన్మయి స్వభావం చిన్నతనపు ఊహలు భావుకత్వం తిలక్ శేషేంద్ర లాంటి కవుల పట్ల సాహిత్యం పట్ల ఆమె మమకారం అది ఆమె జీవితాన్ని ప్రభావితం చేసిన విధానం ఆమె స్నేహశీలత్వం తన చుట్టూ వున్న వారికి తనకున్నంతలో సహాయ పడటం లాంటి గుణాలు తన్మయిని ఒక హీరోయిన్ని చేసి నిజజీవితంలో నిలదుక్కుకునేలా చేస్తాయి. ఇవన్నీ ముఖ్యంగా భావుకత్వం సాహిత్యంపట్ల మమకారం రచయిత్రి జీవితంలోంచి వచ్చాయనటంలో ఏమాత్రం సందేహమనిపించదు.
Syamala Kallury taught for over a decade and a half in the AP Govt colleges in Srikakulam and Visakhapatnam as Lecturer in English She moved to Delhi after marriage where she taught in Delhi University, and in the Department of Humanities and Social Sciences at IIT Delhi till 2011 She has two daughters Ahana and Kruttika, who live in UK and Dubai respectively. Currently she lives in Visakhapatman with her dog Subbu, a cocker spaniel. A bilingual writer and translator, Syamala authored many books. 1. Telugu Short Stories women’s Voices: An Inner Voyage(1930-2000) Asian Publication House (2001)2. Twentieth Century Telugu Poetry (2006) 3. Godavari Tales Viveka Foundation (2006) 4.స్వగతాలు (2009) 5. If you Want To be a Poet, Patridge India (2018) 6. కంచికి వెళ్లకూడని కథలు navachetana పబ్లిషర్స్ (2019) 7.భావవిహంగాలు Telugu translation of Tagore’ s Stray Birds (1988, 2019)8. Rajanigandha, translation of Papineni Sivasankar’s award winning poetry collection with the same title published by Sahitya Academy New Delare ఆ few of her పబ్లికేషన్స్ in addition to a number of academic articles