స్త్రీవాద కవిత్వంలో చెరగని సంతకం మందరపు హైమావతి. ఆంధ్రజ్యోతి ‘ఈ వారం కవిత’ ఒక నాటి యువ కవితా హృదయాల వేదిక. యువ కలాల యవనిక. పేజీ నిండుగా పరచుకొని అడుగు ముందుకు పడకుండా ద్వారం దగ్గరే నిలవరించే కవితా డోలిక. ఎన్ని హృదయాల్ని అలరించేదో, ఎందరి వేదనల్ని పలికించేదో, ఎందరి స్వప్నాల్ని ఉయ్యాల లూగించేదో!
“సర్పపరిష్వంగం” ఒక రోజు తొలిపేజీపై వచ్చి వాలింది. ఇంకేం, ఒక బలమైన స్త్రీ స్వీయ హృదయం ఆవిష్కారమైంది. ‘నేను ఋతువు నైన వేళ’, ‘లేబర్ రూమ్’, ‘అబార్షన్ స్టేట్మెంట్’ అంటూ అప్పటికే కొన్ని స్త్రీ ‘బాధ’ల గొంతుకలు ఒక ‘వాదం’గా ఎదుగుతూ కొందరి ‘పురుషాభ్యుదయుల’కు కూడా ‘ఇరిటేషన్’ తెప్పిస్తోంటే, ఏకంగా బెడ్ రూమ్ లో రొటీన్ గా జరిగే ఒక రాగరహిత కలాపాన్ని సబ్జెక్ట్ చేసుకున్నారు హైమావతి కొంచెం బోల్డ్ గా!
‘సర్పపరిష్వంగం’ రెండు దేహాల పులకరింతలు కావు నిజానికి, మధ్య తరగతి అతుకుల బతుకుల్లో ఇరుకిరుగ్గా రొటీన్ గా పడే అగచాట్లు,కూసింత ఏకాంత మనిపించేది అప్పుడేగా! అప్పుడేగా తన ప్రశ్నకు బదులొచ్చేది! రోజూ రొటీనుగా జరిగే ఆ అన్-రొమాంటిక్ రసజ్ఞత కంటే, రేపటి పాలవాడూ, పనిమనిషీ, చేబదులూ, ఇంటి అద్దెల ఈతిబాధలూ ఆక్రమించుకున్న హృదయంతో పాపం, “జీతం ఎప్పుడిస్తారు?” అంది, ఆ అమాయకపు కోరల్లేని సర్పం. ఇంకేముంది, కోరల సర్పం అహం దెబ్బతింది! రసజ్ఞత రసా భంగమయ్యే తీరు అనంత గదుల నాలుగ్గోడల మధ్య నిత్యకృత్యమే కాబట్టి ‘సర్పపరిష్వంగం’ చిత్రంగా ఒక నాదస్వరమై తెలుగు వచన గీతాల్లో నిలిచిపోయింది. చేరాతలు ప్రశంసలు కురిపించినా, ఒక పాఠకుడు ఇంటికొచ్చి ‘చీర’ పెట్టి సత్కరించినా, అహం దెబ్బతిన్న ఆ పురుష సర్పం నుంచి ఛీత్కారమే మిగిలింది. అయితేనేం, కవితా ప్రపంచం తోవ వెతుక్కోమంది. జీవితం కవిత్వీకరించమంది. “సర్పపరిష్వంగం” ఛందస్సుల పరిష్వంగాల్ని వదలాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది. చిన్ననాటి చిన్ని కృష్ణశర్మగారి కావ్యభాష తన వచనానికి అమోఘమైన పద సంపద కూర్చితే, సమ్మోహనమైన లాలిత్యం స్వంత మైంది. కవిత్వపు రంగు పులుముకోని ఒక్క పదమైనా దొరకని వచన ధార మందరపు వారిదైపోయింది.
నిజానికీ “నీలిగోరింట” విభిన్న రాగాల మేళవింపు, రంగురంగుల హరివిల్లు. పురివిప్పిన నెమలీకల మోహరింపు. ఒక్క జలదరింపుతో విచ్చుకున్న నీలి, నీలి మెరుపుల స్వర్ణ జలతారు కాంతుల వీవెన. విరబూసిన రంగురంగుల వసంతోద్యానవనం. ఏ సుమబాల వెనుక ఏ విషాదపు నీడ వుందో తడిమితే తప్ప తెలియని ఆర్ద్రత. అవి జ్ఞాపకాల పొగడపూల పరిమళాలో, పూలపై వాలిన చిరునామా లేని చెలిమి తలపుల సీతాకోక చిలకలో కావొచ్చు! బాల భానుడ్ని ఆకాశపు కొక్కేనికి తగిలించిన హరికేన్ లాంతరు వెలుగు కూడానేమో!
చాలా గీతాలు అందమైన పద బంధాలు, అలంకరించిన చిత్రాలు, అలుపెరుగకుండా ఎంతగా దూసి పోస్తారో మణుల్లా మెరిసే పదాల్ని వాక్యాలుగా నింపి రమణీయంగా తీర్చిదిద్దుతారు. అంతే అనుకుంటే పొరబాటే, గులాబీల వెనుక ముళ్ళు పాత చింతకాయ పచ్చళ్ళు. ఇంట్లో పొగబెట్టే నవాసారాల హోమాలతో పాటూ, పితృస్వామిక ఘాటెక్కిన గంధక ధూపాలతో తన దేహ సార్వభౌమత్వాన్ని అనునిత్యం ప్రశ్నించే మనువులు. మనువులెవరూ స్మృతుల్లో ఉండరు, అయ్యొక మనువు, అన్నొక మనువు, అమ్మ లక్కలు మాత్రం చీర కట్టిన మనువులు కాదా? సుందర సూర్యోదయాల్ని వంటింట్లో ఆవిష్కరించే దెవరు? పిండం ఇంకా బయటకు వచ్చీ రాకముందే సిగ్గు బిళ్ళ తోనో, డైపర్ తోనో మూయడం నేర్పిందెవరు? అవును వాడి కళ్ళు ఆఘోరాలా శవాన్నే తడుముతున్నాయ్ మరి! ‘నీలి గోరింట’ ఆధునిక పార్కు బృందావనపు తుప్పల్లో ప్రేమ కీటకం కుట్టి పెనుగులాడే ఈడురాని గోపికల్ని చూశేక బహుశా రాశారేమో ననిపిస్తుంది.
ఇంటర్నెట్ యుగంలో, అంగాంగాల ప్రదర్శనాలు, నీతి పద్యాలు పోయి, నీలి దుర్గంధాలూ, అక్షరాల గుడుల్లో శకారులూ, గిరీశాలూ, నీచ కీచక స్వాములు, సకల జనుల సమ్మోహ ఋతువు కామ ఋతువై నప్పుడు తలిరాకుల తరుణ మానసంపై మలినపు మాటల మరకలు అంతరంగ హంతకుల చిత్రాలు ఎవరికీ ఎప్పటికీ కనబడవ్ కదా! ప్చ్.. అంటో వాపోతారు హైమవతి
నీలి గోరింట ఒక చంద్ర శాల, మోహనరాగ సరాగాలు కురిపించే నులి వెచ్చని జ్వాల! కలల రెక్కలు విచ్చుకోకుండా కచ్చడాలు బిగించిన నిషేధ పరంపరల మనుస్మృతులే కాదు మనః స్మృతులు కూడా! ఈ నవరస రాగమాలికలో శివరంజని రాగాలే కాదు, కదలని స్తంభాలూ, కాంక్షా భ్రమణాలూ, ఒంటరి పిట్టల దిగులు పూలు కూడా గుది గూర్చారు హైమవతి.
శివారెడ్డి గారన్నట్టు అనాది నుంచి ఆధునిక స్త్రీ జీవితాన్ని చదివినట్టుట్టుంది ‘నీలిగోరింట’. కాలంతో పాటూ నడిచే పదచిత్రాలతో poetry is our character గా ఎలా మలచుకోవాలో చెబుతుంది ‘నీలి గోరింట’. ప్రతి అనుభవాన్నీ కవితా దృష్టితో చూసే అదృష్టవంతురాలు హైమవతి అంటారు ఓల్గా! నిజమే, ఈ నీలిగోరింట వనంలో విహరించే ప్రతి ఒక్కరికీ ఆ అదృష్టాన్ని పంచారు హైమవతి.