వ్యాధితో పోరాటం-3

కనకదుర్గ

మోరా వెళ్ళిపోయాక నాకు ఇండియాలో నొప్పి ఎలా వచ్చింది, అక్కడ డాక్టర్లు ఎలా ట్రీట్మెంట్ ఇచ్చారు అన్నీ గుర్తు రాసాగాయి. 

నొప్పి వచ్చిన రోజు శ్రీని ఇంటికి వచ్చాక జరిగిన సంగతి తెల్సుకుని, మన డాక్టర్ దగ్గరకు వెళ్ళి చూపించుకుందాము అని వెంటనే బయల్దేరారు. కైనెటిక్ హోండా స్కూటర్ పై వెళ్ళేపుడు పొద్దున వెళ్ళిన డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఇప్పుడు కొంచెం బాగానే వుందని చెబితే టెస్ట్స్ చేయించుకుని రమ్మని చెప్పింది. అలాగే అని చెప్పేసి వెళ్ళాము మా డాక్టర్ దగ్గరకు. ఆ డాక్టర్ పేరు రమేష్. పిడియాట్రిషియన్ కమ్ ఫిజిషియన్. చాలా జాగ్రత్తగా చూసి ట్రీట్మెంట్ చేస్తారు. చైతుని చిన్నప్పటి నుండి ఆయనే చూస్తున్నారు, అలాగే మేము మా కొచ్చే చిన్న చిన్న ప్రాబ్లెమ్స్ కి ఆయన దగ్గరకే వెళ్ళేవాళ్ళం. ఆయనకి జరిగినదంతా చెబితే ఇది ఆసిడ్ రిఫ్లక్స్ కావొచ్చు అని కొన్ని మందులిస్తాను, తగ్గేవరకు నూనెలు, మసాలాలు కాకుండా, మజ్జిగన్నం, ఇడ్లీ, కొబ్బరినీళ్ళు లాంటివే తీసుకోమని చెప్పారు. ఇంటికొచ్చి అలాగే చేసాము. రెండో రోజు నొప్పి మళ్ళీ మొదలయ్యింది, ఈ సారి వాంతులు కూడా మొదలయ్యాయి. వాంతులు కాకుండా మందులిచ్చారు. మూడోరోజుకి మంచినీళ్ళు కూడా ఇమడకుండా అయ్యింది. ఏదైనా హాస్పిటల్ లో వెళ్ళి అడ్మిట్ అవ్వాలనిపించసాగింది నాకు. పూర్తిగా నీరసించిపోయాను. నాలుగోరోజు శ్రీని ఇంట్లో వుండిపోయాడు. బాబు స్కూల్ కి వెళ్ళగానే డాక్టర్ రమేష్ దగ్గరకు వెళ్ళాము. 

ఆయన పరిస్థితి చూసి, ఐ.వి ఎక్కించి, “నాకు తెలిసిన మంచి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఉన్నారు, లెటర్ ఇస్తాను, ఆయనకి చూపిస్తే ఎందుకయినా మంచిది. ఐ.వి అయిపోగానే లేట్ చేయకుండా వెళ్ళండి, నేను ఇపుడే ఫోన్ చేసి మీరు వస్తున్నారని చెబుతాను. అక్కడ చాలా రష్ వుంటుంది. మీరు వెయిట్ చేస్తూ కూర్చోవద్దు, లెటర్ చూసి వెంటనే పిలుస్తారు. ఎందుకంటే ఒకోసారి ఎమర్జన్సీకి వెళ్ళాల్సి వస్తుంది ఒకవేళ ఇది పాన్ క్రియాటైటిస్ అయితే.” అన్నారు. 

అప్పటి వరకు ఆ పేరే వినలేదు. ఏం జరుగుతుంది ఆ జబ్బు వస్తే అని అడిగాము. “పాన్ క్రియాస్ కి ఇన్ ఫెక్షన్ వస్తుంది. గాల్ బ్లాడర్లో స్టోన్స్ వుంటే ఈ అటాక్స్ రావొచ్చు. ఒకోసారి ఏ కారణం తెలియదు, అది అపెండిక్స్ లా పేలిపోయే ప్రమాదం వుంటుంది. మీది అంత ఎమర్జన్సీ కాకపోవొచ్చు. కానీ పాన్ క్రియాటైటిస్ అనే అన్పిస్తుంది.” అని లెటర్ రాసి ఇచ్చి, మా ముందే ఆ డాక్టర్ కి ఫోన్ చేసి చెప్పారు మేము వస్తున్నామని. 

చైతు వస్తే ఇంట్లో ఎవ్వరూ లేకపోతే భయపడతాడని, డాక్టర్ రమేష్ ఇంటి దగ్గరే వుండే మా అత్తగారింటికి వెళ్ళి అపార్ట్మెంట్ లో వుండమని చెబుదామని వెళితే ఇంట్లో ఎవ్వరూ లేరు. మా అమ్మ వాళ్ళ పక్కింట్లో ఫోన్ వుంటే అక్కడికి చేసి అమ్మకి పరిస్థితి చెప్పి మా అపార్ట్మెంట్ దగ్గర వుండమని చెప్పాము. చుట్టు ప్రక్కల వాళ్ళింట్లో కూర్చోవచ్చు మేము ఇంటికి వెళ్ళేవరకు అనుకున్నాము. 

స్కూటర్ పై వెళితే కళ్ళు తిరుగుతాయని అక్కడే పెట్టేసి ఆటో తీసుకుని పంజాగుట్టలో ఒక నర్సింగ్ హోంలో పని చేస్తున్న ఆ డాక్టర్ దగ్గరకు వెళ్ళాము. అక్కడ పేషంట్స్ ని చూడగానే ఎక్కడ లేని నీరసం ముంచుకొచ్చింది. చాలా మంది వున్నారు. ఒక హాల్ లో వేరే వూళ్ళ నుండి వచ్చిన పేషంట్స్ క్రిందనే పడుకున్నారు. వారి కుటుంబ సభ్యులు వారి దగ్గర కూర్చొని ఉన్నారు. 

వెళ్ళగానే రిసెప్షనిస్ట్ దగ్గరకు వెళ్ళి లెటర్ ఇవ్వగానే వెంటనే తీసుకెళ్ళి డాక్టర్ కిచ్చిన 10 నిమిషాల్లో పిలిచి, డాక్టర్ గారు నవ్వుతూ పలకరించి, 

పరీక్షించి, “డాక్టర్ రమేష్ గారు చెప్పినట్టు లక్షణాలు చూస్తుంటే పాన్ క్రియాటైటిస్ అనిపిస్తుంది. రక్త పరీక్షకు రాస్తున్నాను. చేయించుకు రండి. రిపోర్ట్ రాగానే మీతో మాట్లాడతాను,” అన్నారు.  

మెడినోవా డయాగ్నస్టిక్స్ కి వెళ్ళాము. రిజిష్టర్ చేసుకున్నాక నర్స్ వచ్చి పిలిచింది. ఎప్పుడూ అంత పెద్ద లబోరేటరీలకు వెళ్ళింది లేదు. అప్పటికే భయం భయంగా వుంది. అక్కడ వాళ్ళు కొంచెం స్నేహంగా మాట్లాడతారేమో అని ఆశగా ఆ నర్స్ వైపు చూసాను. ఆమె రక్త పరీక్ష చేయడానికి రెడీ అవుతుంది. ఇంతలో మరో నర్స్ పరిగెత్తుకుంటూ వచ్చి,”రీటా నేను చేతులకు గ్లవ్స్ వేసుకునే వున్నాను ఆ అబ్బాయికి పరీక్ష చేసినపుడు అయినా నాకు చేతులు వణుకుతున్నాయి, నేను బ్లడ్ తీసేపుడు చెప్పాడు తను ఎయిడ్స్ పేషంట్ ని అని. నా చేతులు చూడు ఎలా వణుకుతున్నాయో?” అని తన చేతులు రీటా అనే నర్స్ చేతుల్లో పెట్టింది. 

అక్కడే వున్న నాకు వణుకెక్కువయ్యింది. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? 

ఎయిడ్స్ పేషంట్స్ వున్నారా ఇక్కడ? 

వుంటే మాత్రం పేషంట్స్ గురించి అక్కడ కూర్చున్న మరో పేషంట్ ముందర అలా మాట్లాడతారా? 

“డోంట్ వర్రీ యార్! ఆ గ్లవ్స్ టెస్ట్ చేసాక తీసి పడేసావా?”

“పడేసాను. చేతులు శుభ్రంగా యాంటీ బ్యాక్టీరియల్ సోప్ తో చాలా సేపు కడుక్కున్నాను.” 

“మరింకెందుకు భయపడటం? ఏం జరగదులే?” 

“ఏం కాదు కదా రీటా?” 

“ఏం కాదు డియర్, డోంట్ వర్రీ.”

“ఓకే తను లాస్ట్ పేషంటా? అయిపోగానే లంచ్ కెళ్దాం సరేనా!” అని ఆ నర్స్ వెళ్ళిపోయింది. 

నేను ఇదంతా తెల్లబోయి చూస్తున్నాను. 

బాబోయ్ ఇదేంటీ? పొద్దున వరకు వినని రోగం పేరు విని అది కాకపోతే బాగుండు అనుకుంటూ రక్తపరీక్షకు వస్తే ఎయిడ్స్ పేషంట్స్ ని టెస్ట్ చేసి బెంబేలుత్తుతున్న నర్స్ లను చూస్తే మతి పోతుంది. 

“ఏ చేతినుండి తీసుకోను బ్లడ్,” అన్న నర్స్ మాటతో ఉలిక్కిపడ్డాను.

“ఏదైనా పర్వాలేదు,” అన్నాను. 

రక్తం తీసాక, ” రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది?” అని అడిగాను.

“కొన్ని గంటలవుతుంది, మీ డాక్టర్ దగ్గరకు పంపిస్తాము ఆయన చూసి చెబుతారు రిపోర్ట్ లో ఏముందో అనే విషయం. ఇక మీరు వెళ్ళొచ్చు.” అని అన్నది. 

నాకు పొద్దున విన్న జబ్బు పేరు చెప్పి అది త్వరగా తగ్గుతుందా? చాలా సమయం పడ్తుందా? అని అడగాలని వుంది, కానీ ఆవిడ చేతులు కడుక్కుని లంచ్ కి వెళ్ళడానికి రెడీ అవుతున్నట్టుంది. నేను, ’థ్యాంక్యూ,” అని చెప్పి బయటకు వచ్చేసాను. 

బయటకు రాగానే శ్రీని కి చెప్పాను అక్కడ ఏం జరిగిందో. 

“నాకు ఇదంతా చూస్తుంటే కంగారుగా వుంది? మనం ఇంటికి వెళ్ళిపోదాం ప్లీజ్!” అన్నాను.

“అదేంటీ వాళ్ళు అలా ఎలా పేషంట్ అక్కడ కూర్చొని వుంది అనే విషయం మర్చిపోయి మరో పేషంట్ గురించి మాట్లాడుకుంటారు? జబ్బులతో వచ్చే పేషంట్స్ అసలే భయపడుతూ వుంటారు అనే సంగతి కూడా తెలియదా వారికి? ఏం మనుషులో? నువ్వేంటి అపుడే వెళ్దామంటావు? డాక్టర్ గారు రిపోర్ట్ వచ్చాక చూసి చెబుతానన్నారు కదా! పద హాస్పిటల్ కి వెళ్ళి వెయిట్ చేద్దాం!” అన్నాడు శ్రీని. 

హాస్పిటల్ కి వెళ్తుండగా శ్రీని పొద్దున్నుండి ఏమి తినలేదని గుర్తొచ్చింది నాకు. “నువ్వు ఇక్కడ హోటల్ లో ఏదైనా తినేసేయ్. ఇంకా ఎంతసేపవుతుందో ఏమో?” అన్నాను. 

“నాకాకలిగా లేదు. అదిగో అరటిపళ్ళ బండి, రెండు పళ్ళు కొనుక్కుని తినేస్తాను. నువ్వు కొబ్బరి బొండాం తాగుతావా?”

“అమ్మో నొప్పొస్తుందేమో!” 

“కొద్దిగా త్రాగి చూడు, నొప్పొస్తే త్రాగొద్దులే,” అన్నాడు. 

ఐ.వి ఎక్కించాక వచ్చిన కాస్త శక్తి అయిపోవచ్చింది. నీరసంగా అనిపించసాగింది. కొద్దిగా కొబ్బరి నీళ్ళు సిప్ చేసాను. 

శ్రీని అరటి పళ్ళు తినేసాడు. 

హాస్పిటల్లో ఖాళీగా వున్న దగ్గర కూర్చున్నారు.  

సాయంత్రం కావొస్తుంది. ప్రొద్దున వచ్చినపుడు వున్నంత హడావిడి లేదు. 

నాకెపుడెపుడు ఇంటికెళ్దామా అని వుంది. కూర్చోవటం కష్టం అవుతుంది. డాక్టర్ గారు ఇటు పేషంట్స్ ని చూస్తూనే, రికమెండేషన్ లెటర్స్ పట్టుకొచ్చిన పేషంట్స్ ని చూస్తున్నారు. వీళ్ళు కాక మరో ద్వారం గుండా మినిష్టర్లు, సెలబ్రిటీస్ వస్తే వారినీ చూస్తుంటారు. రిపోర్ట్ వచ్చిందా అని శ్రీని వెళ్ళి పి.ఏని అడిగి వచ్చాడు రెండు సార్లు. ’వస్తే మేమే పిలుస్తాం సార్. మీరు కూర్చొండి.’ 

 మేముండే అపార్ట్మెంట్స్ లో శ్రీని పని చేసే ఆఫీసులోనే పని చేసే ఒక కొలీగ్ ఇంట్లో ఫోన్ వుంది. మా అపార్మెంట్ కి రెండు సందులవతల వుంటారు. వాళ్ళకిద్దరు పిల్లలు. శ్రీని వాళ్ళింటికి ఫోన్ చేసి చైతు స్కూల్ నుండి వచ్చే సమయానికి మా అమ్మా, నాన్న వచ్చారా లేదా కనుక్కుని చెప్పమన్నారు. పిల్లల్లో ఒకరు వెళ్ళి చెబితే అమ్మ వచ్చి మాట్లాడి,  ’తాము వచ్చామని, కంగారు పడాల్సిందేమి లేదని,’ అన్నది.  రిపోర్ట్ వచ్చాక వచ్చేస్తామని శ్రీని చెబితే, ’ఏం పర్వాలేదు మేము ఎదురింట్లో వున్నాము. చైతుని తాతగారు పార్క్ కి తీసుకెళ్ళారు. మీ పని అయ్యాకే రండి!’ అని అమ్మ చెప్పింది. 

చీకటి పడటం మొదలయ్యింది. నేను కూర్చోలేక పోతున్నాను. చాలా నీరసంగా వుంది. 

ఇద్దరం వెళ్ళి పి.ఏ దగ్గరికి వెళ్ళి, ’రిపోర్ట్ ఈ రోజు వస్తుందా? లేక రేపు వస్తుందా? మేము రేపొద్దునే వచ్చి డాక్టర్ గారిని కలవొచ్చా?’ అని అడిగితే.

’రిపోర్ట్ వచ్చేవరకు లేట్ అవొచ్చు, మీరు పొద్దునే వచ్చి డాక్టర్ గారికి చూపించుకోవచ్చు,’ అని చెప్పగానే ’ధ్యాంక్యూ,’ అని చెప్పి బయటకు వచ్చేసాము.

*****

Please follow and like us:

2 thoughts on “వ్యాధితో పోరాటం- 3”

  1. అమ్మా దుర్గా…
    నీ కధనం చూస్తే , తరువాత ఏమి జరగబోతోందో అన్న ఆందోళన మొదలైంది మనసులో..

    1. బాబాయి గారు, ఒకటి గుర్తు పెట్టుకోండి. చాలా కష్టపడ్డాను, పడుతున్నాను ఇంకా.. కానీ ఎంత కష్టం వచ్చినా పిల్లల కోసం బ్రతకాలనే తపన, ఆరాటం నన్ను బ్రతికించడమే కాదు పిల్లల చదువులు, చైతన్య పెళ్ళి కూడా చూడగలిగాను..మనం ఇంకా మాట్లాడుతూనే వున్నాం. .. కంగారు పడకుండా చదవండి! 🙏🙏

Leave a Reply

Your email address will not be published.