చిలుకపలుకు

-ఆదూరి హైమావతి 

          అనగా అనగా అనకాపల్లి అనేగ్రామ సమీపాన ఉండే ఒక చిట్టడవిలో ఒక పెద్ద మఱ్ఱిచెట్టు మీద చాలా పక్షులు గూళ్ళు కట్టుకుని నివసించేవి. ఆహారం కోసం వెళ్ళిన పక్షులు అన్నీ సూర్యాస్తమయానికంతా గూళ్ళు చేరుకుని, అంతా తాము చూసిన వింతల గురించీ కబుర్లు చెప్పుకునేవి.
          ఒకరోజున ఒక చిలుక తనగూట్లోంచీ మాట్లాడుతున్న మాటలు పక్షులన్నీ విని,”చిలకమ్మా! ఏం పాట పాడు తున్నావ్! కొత్త పాటలా ఉందే! చెప్పవా!” అని స్నేహ పూర్వకంగా అడిగాయి.
          దానికి చిలుక “ఇది పాట కాదు మిత్రులారా! దీన్ని మనుషులు పద్యం అంటారు. ఈరోజు నేను పక్క గ్రామం లోని ఒక పాఠశాల వద్ద ఉన్న అరమాగిన మామిడి పండు తింటుండగా, అక్కడ పంతులు గారు పిల్లలకు చెప్తున్న మాటలన్నీ విన్నాను. ఆయన ఒక్కో పదం చెప్తూ పిల్లలచేత పలికిస్తూ, అర్థం చెప్తూ ఉండగా విని నేనూ పలికి నేర్చేసుకున్నాను. ఎంత బాగా చెప్పారో పంతులుగారు!. నాకు తియ్యని మామిడి పండు తినడంతో కడుపు నిండటంతో పాటుగా, కమ్మని పద్యం విని మనస్సుకు ఆనందం కలిగింది.”అంది చిలుక.
          “ఏదీ మరొకమారు చెప్పు పద్యం అందరం వింటాం” అంది పక్క గూట్లోని గోరువంక.
“ఆపద్యం అర్థంకూడా చెప్పు చిలకక్కా! నాకు బాగా అర్థంకావాలిగా” అంది పిచ్చుక.
          “సరే చెప్తాను.వినండి.

ఉపకారికి నుపకారము
విపరీతము కాదు సేయవివరింపంగా
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ!

          అంటే మేలు చేసినవారికి ఎవరైనా తిరిగి మేలు చేస్తారు. అది సహజం. ఐతే తనకు కీడు చేసిన వారికి కూడా మేలు చేయడం గొప్ప పని.’– అని అర్థం. మిత్రులారా! మీ అందరికీ బాగా అర్థమయ్యే ఉంటుంది. మనం కూడా దీన్ని పాటించను ప్రయత్నిద్దాం.” అంటూ వారందరిచేతా పలికించి పద్యం అందరికీ నేర్పించింది చిలకమ్మ.
కాలం గడుస్తుండగా—
          ఒక రోజున పక్షులన్నీ తిండికి వెళ్ళాయి రోజూలాగే. కొన్ని పక్షులు త్వరగా తమ బిడ్డలకు కడుపునింపాలని ఆహారం తీసుకొని సాయంకాలానికి ముందే గూళ్ళు చేరి గమనించాయి. ఆచెట్టు క్రింద వేటగాడు పన్ని పోయిన వలలో గోర్వంక పిల్లలు రెండు చిక్కుకుని అరుస్తున్నాయి.
          గోరువంక కూడా వచ్చి చూసి”అయ్యో! అయ్యో! నా పిల్లలు .మిత్రులారా! కాపాడండి. వేటగాడు వస్తే నా పిల్లలను పట్టుకెళ్ళిపోయి చంపి తినేస్తాడు. కాపాడండి, కాపాడండి ” అంటూ అరవసాగింది.
          ఇంతలో చిలకమ్మా, కాకమ్మా వచ్చి చెట్టుమీదకు చేరి గోరువంక అరుపులు విన్నాయి.
          చిలకమ్మ” గోరువంకక్కా!బాధపడకు ఏడిస్తే వచ్చేదేమీ ఉండదు. కాలహరణం తప్ప. చేయవలసిన పనిని గురించీ ఆలోచించాలి. ఉండు నా గట్టి ముక్కుతో ఈ వల త్రాళ్ళు తెంపుతాను “అంటూ క్రిందకొచ్చి, వల తాళ్ళను తన గట్టి ముక్కుతో తెంపసాగింది 3,4 తాళ్ళు తెంపగానే కాకి వచ్చి వాటిని వేరుచేసి పెద్ద కంత చేసింది.
గోరువంక ఏడుస్తున్న తన చిన్నారి పిల్లలను బయటికి రమ్మని చెప్తున్నా, అవి భయంతో కదల్లేక కూర్చున్నాయి. వెంటనే పిచ్చుకమ్మ ఆకంతలోంచీ దూరి చిన్నారి గోరువంక పిల్లలను కంతదగ్గరకు తెచ్చి ఎలాబయటికి వెళ్ళాలో చూపించాక , అవి మెల్లిగా గెంతుతూ కంత దగ్గరకు రాగానే, తల్లి గోరువంక వాటిని బయటికి లాక్కుంది. అలా వలలో పడ్ద పిల్లలను అంతాకలసి కాపాడారు.
          ఇంతలో వేటగాడు ఒక బుట్ట పట్టుకుని వచ్చాడు. ‘ఒక్క పిట్టైనా పడకపోతుందా !’అనే ఆశతో. చూడగా పిట్టలు వలలో లేకపోగా వల త్రాళ్ళు తెగి ఉండటం చూసి చెట్టు క్రింద కూర్చుని పెద్దగా ఏడ్వసాగాడు.
          “మూడు రోజులనుంచీ నా పిల్లలు పస్తుంటున్నారు. భగవంతుడా!ఈరోజైనా పిట్టలు పడితే ,పట్టుకెళ్ళి చంపి కాల్చి పిల్లల కడుపు నింపుదామనుకుంటే, వల కూడా చిరిగి పోయింది. ఏమిచేయను భగవంతుడా!” అని ఏడుస్తున్న వేటగాడిని చూసి, చిలకమ్మ కాకమ్మతోనూ, గోరువంకతోనూ, చెప్పి తనతో రమ్మని పాఠశాల వద్ద ఉన్న మామిడి, జామ పండ్లు చూపి కోసి వాటికి రెండేసి చొప్పున ఇచ్చి మెల్లిగా తొడిమ పట్టుకుని రమ్మని చెప్పింది. మూడు పిట్టలూ ఆరు మామిడి పండ్లు తెచ్చి వేటగాని ముందు వదిలాయి. మరలావెళ్ళి జామపండ్లు తెచ్చి వదిలాయి.
          ఇలామూడు మార్లు తెచ్చి తనముందు వదలిన పండ్లు చూసి వేటగాడు ఆశ్చర్యపడుతుండగా, చిలుక ” వేటన్నా! మేము పిట్టలం. మాకడుపులు నింపుకోను మేము కష్టపడి ఆహారం తెచ్చుకుంటాం. నీవు మనిషివి. ఏమైనా చేయగలవు. ఇలా మా పక్షిజాతినీ, జంతుజాతినీ హతమార్చి కడుపు నింపుకోకపోతే కాయ కష్టంచేసి సంపాదించుకుని నీ పిల్లలను పోషించుకో వచ్చు కదా! మనుషులు తప్ప అపకారం మరెవ్వరూ ఇతరులకు తలపెట్టరు. మేమంతా కలసి ఒక్కుమ్మడిగా నీమీద దాడిచేసి , నిన్ను మా ముక్కులతో పొడిచి చంపేయగలం ,అప్పుడు మేమూ మీ మనుష జాతిలా ఐపోతాం.అందుకే నీబిడ్డల ఆకలి తీర్చను మాకు నీవు అపకారం తలపెట్టినా,పండ్లు తెచ్చి ఇచ్చాం. నీ బిడ్డల వంటివి కావా మాబిడ్డలు. చూడూ అక్కడ పోలంలో ఉదయం నుంచీ రైతన్నలు ఎంత కష్టపడి పంటలు పండించుకుని, వారికేకాక మీ మానవజాతి కడుపులు నింపను శ్రమపడుతున్నారు.కిందపడ్ద గింజలను మేమూ ఏరుకతింటాం.ఐతే రైతన్నల పంటలకు అపకారం చేయం.నీవూ వారిలా శ్రమచేసి బతక లేవా!మాప్రాణాలు తీసి నీకడుపు నింపుకోడం తప్ప నీకు మరో పని తెలీదా! నామాటలు పాటిస్తే సరి, లేకపోతే మరోమారు ఇటుకనిపిస్తే ఊరు కోము. నీ ప్రాణంలాగే మాప్రాణాలూ, మా బిడ్దల ప్రాణాలూనూ.అపకారికి ఉపకారం చేయాలనే ఈ పళ్ళు తెచ్చిచాం .” అంటూ చిలకమ్మ దీర్ఘోపన్యాసం చెప్పింది.
          వేటగాడు ఆపళ్ళన్నీ సంచీలో వేసుకుని, మోకాళ్ళమీద కూర్చుని చేతులు పైకెత్తి పక్షుల కన్నింటికీ నమస్కరించి ” మీరు పిట్టలైనా నీతి నియమాలు కలిగినవారు, నాకళ్ళు తెరిపించారు. ఈరోజు మీరు నా ప్రాణాలు తీయగలిగినా, అపకారినైన నన్ను కాపాడారు. చిలకమ్మ చెప్పినట్లు శ్రమించి బతుకుతాను. మరొక మారు ఇటుకేసి రాను. ధన్యవాదాలు, ఈ వలను ఇక్కడే కాల్చేస్తున్నాను. ” అంటూ వలను ఊడదీసి అక్కడే మంట వెలిగించి కాల్చేసి వెళ్లాడు వేటగాడు.’ అపకారికి ఉపకారం అంటే ఇదేమరి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.