“ఇంగ సెలవా మరి!”

(యం.ఆర్.అరుణకుమారి కథలపై సమీక్ష)

   -అనురాధ నాదెళ్ల

          ఒక్క నెల క్రితమే విజయవాణి ప్రింటర్స్ ద్వారా ముద్రణ పొంది అందుబాటులోకి వచ్చిన కొత్త పుస్తకం ఈ నెల మనం మాట్లాడుకోబోయే “ఇంగ సెలవా మరి!”. ఎస్. అన్వర్ ముఖ చిత్రం పుస్తకానికి అందాన్ని, హుందాతనాన్ని ఇచ్చింది. రచయిత్రి యం. ఆర్. అరుణకుమారి గారి పేరు, కథలు పాఠకులకి సుపరిచితమే. 

          ముందుమాటలో ప్రముఖ సినీ కథా రచయిత వి. విజయేంద్రప్రసాద్ గారు ఈ కథలన్నీ ఆధునిక గ్రామీణ జీవన శకలాలని చెప్పారు. “సాహిత్యం జీవితాన్ని ప్రతిబింబించాలి. జీవితంలో దొరకని అనేక ప్రశ్నలకు సమాధానాలు సాహిత్యంలో దొరకాలి” అంటారు.

          ప్రసిద్ధ కవి, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ గారు కథల గురించి చెప్తూ మానవ సంబంధాల్లో పాటించవలసిన ఆర్ధ్రతను, బాధ్యతను చెబుతూ మనసు సున్నిత మూలాలను స్పృశించే రచయిత్రి అరుణకుమారి అంటారు.

          చిత్తూరు జిల్లా రచయితల సంఘం గౌరవాధ్యక్షులు కట్టమంచి బాలకృష్ణారెడ్డి అభిప్రాయంలో ప్రజాస్వామిక ప్రగతి కాముక దృక్పథంతో సమకాలీన సమాజాన్ని పరిశీలిస్తూ మానవ సంబంధాలలో తరిగిపోతున్న ప్రేమ, దయ, నిజాయితీ వంటి విలువలు కాపాడుకోవాలంటూ రచయిత్రి చెప్పిన కథలే ఇవి.

          వ్యక్తిత్వం అనేది ఒక వ్యక్తి అనుసరించి, గౌరవించే విలువల్లో కనిపిస్తుందనేది రచయిత్రి నమ్మకం.తల్లిదండ్రులను,అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లను, బంధువులను, స్నేహితులను, ఉపాధ్యాయులను, పొరుగువారిని అందరినీ ప్రేమించాలని, విశ్వనరులమై ప్రేమైక వసుధైక కుటుంబాన్ని నిర్మించుకోవాలని పిలుపునిస్తారు.

          ఈ సంపుటిలోని కథలన్నీ మానవసంబంధాలను గురించి చెప్పినవే. కరుణ రసాత్మకమైన కథలు. మనసును సున్నితంగా తట్టిలేపే కథలు.

          “అందుకో నా లేఖ” కథలో కాయ కష్టం చేసే మామగారు పల్లె నుంచి వచ్చినప్పుడు, అదీ ఆరోగ్యం బాగులేక కొడుకు డాక్టర్ దగ్గరకి తీసుకెళ్తాడని ఆశతో వచ్చిన ఆ పెద్దాయన్ని చీదరించుకుంటూ ‘వెధవ కంపు” అంటుంది కోడలు. ఆ అవమానం ఆ పెద్దాయన భార్యకి ఓర్చుకోలేని గాయమవుతుంది. తిన్నగా అయ్యవోరమ్మ దగ్గరకొచ్చి, నువ్వు నా కొడుక్కి ఏం నేర్పేవంటూ ప్రశ్నిస్తుంది. పైగా,

          “వొంట్లో రకతమంతా సెమట చేసి సంపాయించిన దుడ్లతోనే గదా నా కొడుకు అంతవోడయినాడు!” అంటుంది.

          తన దగ్గర చదువుకుని ప్రయోజకుడైన యువకుడు డబ్బు సంపాదన, దాని తాలూకు హంగూ ఆర్భాటాలలో మునిగి తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడన్న వాస్తవం తెలిసిన ఆ అయ్యవోరమ్మ తప్పులు సరిదిద్దుకోవటం మానవ ధర్మం అంటూ తన శిష్యుడికి రాసిన లేఖ ఈ కథ. మనుషుల్లో మానవత్వం మరుగున పడవచ్చు కానీ చచ్చిపోదన్న నమ్మకం తనకుందంటుంది అయ్యవోరమ్మ. ప్రేమగా శిష్యుడికి బాధ్యతను గుర్తుచేస్తూ. సున్నితంగా సూటిగా చెప్పిన కథనం.

          “ముత్యాల దారం” కథలో ఆ తల్లికి ఇద్దరు కొడుకులు. ఊళ్లో పెద్ద కోడలు పెట్టే బాధలు సహించలేక చిన్న కొడుకు దగ్గరకి వస్తుంది. పెద్ద కోడలు అనారోగ్యం పాలైందని తెల్సి తను వెళ్లి ఆమెను చూసుకోవాలని బయలుదేరుతుంది. చిన్నకొడుకు, కోడలు వారిస్తున్నా వినదు. పెద్ద కోడలికి సపర్యలు చేసి ఆమె ఆరోగ్యవంతురాలయ్యాక తిరిగి చిన్న కొడుకు దగ్గరకు ప్రయాణమవుతుంది.అత్తగారి నిస్వార్థ సేవతో కోలుకున్న పెద్ద కోడలు తనతప్పు తెలుసుకుని క్షమించమంటుంది. తమ దగ్గరే ఉండి పొమ్మంటుంది. తప్పు సరిదిద్దుకున్న భార్యను చూసి తృప్తి పడిన పెద్దకొడుకు తమ్ముణ్ణి ఉగాది పండక్కి పిలుస్తానంటూ ఫోన్ అందుకుంటాడు. అన్నదమ్ముల మధ్య ఆప్యాయతకి ఆ తల్లి పొందిన ఆనందం మన కళ్లను చెమరింపచేస్తుంది.

          “కొత్త బతుకు” కథ స్వార్థపరులైన పిల్లలు తల్లిదండ్రుల పట్ల అనుసరిస్తున్న అమానవీయ ధోరణి చెప్తుంది. పుట్టింటికొచ్చిన ప్రతిసారీ కొసరి కొసరి ఉండి వెళ్లే కూతుళ్లు తండ్రిపోయిన సందర్భంలో వచ్చినపుడు మాత్రం తమ ఇళ్ల దగ్గర బాధ్యతలను గుర్తుచేసుకుంటూ ప్రయాణమై వెళ్లిపోతారు. తల్లి బతుకమ్మ నిశ్శబ్దంగా చూస్తూండిపోతుంది. ఇంట్లో బియ్యం నిండుకున్నాయని కోడలుచెప్పిందంటూ కొడుకు ఒక ఐదు కేజీల బియ్యం తెచ్చి, ఆమె చేతికిచ్చి, మళ్లీ నెల రేషన్ వచ్చేవరకు ఇవి సరిపోతాయంటూ తన ఉద్యోగం ఊరికి వెళ్లిపోతాడు. తండ్రి లేకుండా ఒంటరిగా ఆ తల్లి ఎలా ఉంటుందన్న ఆలోచన ఎవరూ చెయ్యనూలేదు. తమతో రమ్మని ఆమెను కోరనూలేదు. ఖాళీ అయిన ఇంట్లో భర్త ఫోటో కేసి చూస్తూ ‘ఒంటిగా బతికేందుకు నాకసలే బయమని తెల్సుండీ నన్ను ఇడిసి ఎట్టా పోయావయ్యా” అంటూ ఏడుస్తుందామె. పక్కింట్లో ఉన్న సుగుణ వచ్చి జీవితం బస్సు ప్రయాణమని, ఎక్కేవాళ్లు ఎక్కుతూ, దిగేవాళ్లు దిగుతూ ఉంటారని చెప్తుంది. ఆమెకు తామంతా ఉన్నాం అంటూ ఓదారుస్తుంది. సుగుణ మాటల్లోని ప్రేమ, ఆప్యాయతలకు కంటేనే బిడ్డలు కాదు అనుకుంటుంది స్థిమితపడిన మనసుతో బతుకమ్మ.

          “వసంతరాగాలు” కథలో భర్త భార్య నుంచి విడాకులు కోరినప్పుడు బిడ్డలు తమకు తల్లి వద్దని, తండ్రితోనే ఉంటామని చెప్పి వెళ్లిపోతారు. పెరిగి, పెద్దవారై జీవితంలో స్థిరపడిన తర్వాత తల్లిని కలిసే ప్రయత్నం చేస్తారు. గాయ పడిన ఆ తల్లి మనసు వారిని చూసేందుకు కూడా ఇష్టపడదు. కానీ తండ్రి, నానమ్మ, అత్తయ్యల దుర్మార్గం పసితనంలోనే అర్థం చేసుకున్న ఆ పిల్లలు తల్లికి బరువు కారాదని ఆలోచించి, తండ్రి సంరక్షణలోనే ఉంటామంటూ కోర్టుకు చెప్పామని, తమ కాళ్లమీద నిలబడిన తర్వాత తల్లిని వెతుక్కుంటూ వచ్చామని చెప్తారు. పిల్లల ఆర్తిని అర్థం చేసుకున్న తల్లి వారిని దగ్గరకు తీసుకుంటుంది.

          “రెక్కలు చాచిన పంజరం” కథలో భర్త పోయిన జీవమ్మను కొడుకు తన ఇంటికి తీసుకొస్తాడు. ఆమె పల్లె వెళ్లిపోతానంటుంది. కారణం ఏమిటో కోడలికి అర్థంకాదు. జీవమ్మ కూతురు వచ్చి విషయమేమిటంటూ తరచి తరచి అడుగుతుంది తల్లిని. నాలుగు గోడల మధ్య ఉండాల్సినప్పుడు ఎక్కడైతే ఏమిటి అంటుంది ఆవిడ విరక్తిగా. వంటిల్లు, పడకటిల్లు అన్నీ జీవమ్మ జీవితంలో పంజరాలే. ప్రపంచమే పంజరం అయిపోయింది ఆమెకు. తన కోడలు చదువుకున్నది కనుక విశాల ప్రపంచంలో ఆమెస్వేచ్ఛా విహంగం అన్న భ్రమలో ఉంటుంది. కానీ కోడలు కూడా ఉన్నది పంజరంలోనే అనీ, తలుపులు తీసి ఉన్న ఆ పంజరంలో ఆమె చుట్టూ ఎన్నో ఆంక్షలున్నాయని జీవమ్మ అర్థం చేసుకుంటుంది. తను బతికిన పల్లె పంజరం పట్నానికీ రెక్కలు చాచిందా అనుకుంటుంది ఆవేదనగా.

          భర్త బతికినంత కాలం ఆయన అదుపాజ్ఞల్లో భయంతో బతికిన తాను ఇప్పుడు ఆ భయాన్ని వదిలించుకుందుకు పల్లె వెళ్లి ఆ ఇంట్లో స్వేచ్ఛగా తిరగాలని, తనకు నచ్చినట్టు బతకాలని నిర్ణయించుకున్నానని కూతురికి చెప్తుంది. తనకు తానుగా బతికే ధైర్యం తెచ్చుకున్నాక తిరిగి వస్తానంటుంది జీవమ్మ. భయంతో ముడుచుకుపోయిన బతుకు పక్షి రెక్కలు ఎలా విప్పార్చి ఎగరుతుంది అని ప్రశ్నిస్తుందామె. చదువు రాని మొద్దు అని తండ్రి చేత మాటలు పడిన తల్లి మాటల్లోని ఆలోచన, వివేకం కూతురిని విస్మయపరుస్తాయి. మారని మగవారి మనస్తత్వాలు స్త్రీ జీవితాన్ని ఎక్కడైనా, ఎప్పుడైనా మరింత క్లిష్టతరం చేస్తూనే ఉన్నాయి.

          సంపుటికి తలమానికమైన కథ “ఇంగ సెలవా మరి”

          ఈ కథలో నీల పాత్ర ఉన్నతమైన వ్యక్తిత్వంతో పాఠకుల మనసులో స్థానం సంపాదించు కుంటుంది. కథంతా ఆమె చుట్టూ నడుస్తుంది. చెట్లకి నీళ్లు పోస్తూ, మొగ్గలు కోస్తూ వాటికి సంరక్షణ చేస్తూ వాటితో మాట్లాడే సున్నిత హృదయ ఆమె. తన ధోరణికి నవ్వుతున్న జనంతో అవి మాట్లాడలేవు కానీ మనం మాట్లాడితే వాటికి అర్థం అవుతుందంటుంది. ఉమ్మడి కుటుంబంలోని పెద్దల, పిల్లల బాధ్యతను ఆనందంగా, అలవోకగా ప్రేమగా తన భుజాలపై మోసేస్తుంటుంది. వాళ్ల అవసరాలు కనిపెట్టి, తీరుస్తూ అవి అన్నీ తన భర్త మాట మీద తాను అమలు చేస్తున్నానంటుంది. అన్ని విషయాలు స్వంతంగా సమర్థవంతంగా నిర్వహిస్తూ, తీరా తన పేరెందుకు చెప్తావని భర్త అడిగితే ఆ ఇంటి యజమానిగా ఆయనకి అందరూ మర్యాద ఇవ్వాలని, అప్పుడే ఆయనకి ఇంటా, బయటా గౌరవం అంటుంది నీల.

          జీవితమంతా తనవెంట నడిచివస్తూ, అంతలోనే ముందుగా తనదారి చూసుకుని పల్లెలో శాశ్వత నిద్రపోయిన నీల దగ్గరకు ఒక పండుగ నాడు వచ్చి తన ఒంటరితనపు గోడు చెప్పుకుంటాడు ఆమె భర్త. ఆమె ఆదరించిన కుటుంబ సభ్యులు, బంధువులు, ఊరివాళ్లు కూడా ఎవరికి వారుగా బతికేస్తుంటే మనుషుల మధ్య ఆప్యాయతలు, అనుబంధాలు ఏమైపోతున్నాయంటూ బాధ పడతాడు. నీల చూపించిన ప్రేమ దారుల్లో నడవలేని వారి అసమర్థత ఆయనకు ఆవేదన కలిగిస్తోందంటాడు. ఆఖరుగా ఆమె ఒడిలో కాస్సేపు పడుకుంటానంటూ ఆ మట్టిలో ఒరిగిపోతాడు. ఎంతో సున్నితమైన భావన, అందమైన కథనంతో చదువుతున్న వారి మనసును కొల్లగొట్టేస్తుంది ఈ అందమైన వచనం. భార్యాభర్తల మధ్య ఉండవలసిన అపురూపమైన బాంధవ్యం, ఆ బంధంలో నేర్చుకోవలసిన సమన్వయం గురించి చెప్పిన ఈ కథ పేరు సంపుటికి పెట్టటం ఎంతైనా సమర్థనీయం.

          “మీ ఇంటికి పొండి” కథలో ఊరివాళ్లని పంచాయితీకి పిలిచి, అందరి సమక్షంలో తల్లిదండ్రుల్ని తన ఇంటినుంచి వెళ్లి వాళ్ల బతుకులు వాళ్లని బతకమని మీనాక్షి చెప్తుంది. వృద్ధాప్యంలోనూ కూతురి కుటుంబం కోసంపాటుపడుతున్న ఆ జంటను మీనాక్షి వెళ్లిపొమ్మనటంతో ఊరంతా ఆశ్చర్యపోతుంది. అల్లుడు తన తప్పేం లేదంటాడు. ఒక్కగానొక్క కూతుర్ని వదిలి ఉండలేక పెళ్లి చేసి, ఆమె ఇంటనే ఉంటున్న ఆమె తల్లిదండ్రులు ఒళ్ళు దాచుకోకుండా రెక్కలు ముక్కలు చేసుకుంటూ ఉంటారు. ఇలాటి అత్తమామల అండ చూసుకుని ఇంటి బాధ్యత పట్టించుకోకుండా వ్యసనాలకు అలవాటు పడతాడు మీనాక్షి భర్త. తనదైన ఆస్తిని ఒక్కోటిగా అమ్ముకుంటూ, అది పూర్తిగా హరించుకుపోయాక అత్తమామల భూమిని అమ్మకానికి పెట్టించమని మీనాక్షిపై ఒత్తిడి తెస్తుంటాడు. తల్లిదండ్రులు తమ కోసం చేస్తున్న చాకిరీ, త్యాగం మీనాక్షికి సహించరానిదిగా ఉంటుంది. భర్త ప్రవర్తనలో మార్పు రావాలంటే తనను కన్నవారిని వాళ్ల మానాన వాళ్లని పంపెయ్యటమే మార్గం అని ఆలోచిస్తుంది. ఊరు ఊరంతా తెల్లబోయినా మీనాక్షి తన మాట మీద నిలబడుతుంది. తల్లిదండ్రులకి తన మనసులో మాట చెప్పి ఊరడిస్తుంది. భర్త లో మార్పు రాకపోయినా తాను రైతు బిడ్డనని, కష్టపడటం తనకు కొత్తకాదని నమ్మకంగా చెపుతుంది. ఒక కుటుంబం సవ్యంగా నిలబడేందుకు భార్యాభర్తలిద్దరూ సమానమైన బాధ్యత వహించవలసిందే. మరొకరిపైన ఆ భారం పెట్టి తప్పించుకోవటం అసమంజసం, అన్యాయం కూడా. భర్తలో మార్పును ఆశిస్తూ ఆలోచనాపరురాలైన మీనాక్షి సరైన నిర్ణయం తీసుకుంటుంది.

          “గూట్లో రామచిలుక” కథలో ఆర్థికంగా కుటుంబాన్ని ఆదుకుందుకు భర్త, అత్తమామల ఒత్తిడితో పసిబిడ్డను వదిలి సౌదీ వెళ్లిన జమున తిరిగి రావాలనుకున్నా భర్త మరికొన్నాళ్లుండి, మరింత సంపాదనతో రమ్మనటంతో చాలా ఏళ్లు గడిచిపోతాయి. తన బిడ్డను చూసుకోవాలన్న ఆశతో చెప్పకుండా వచ్చేసిన జమునకు ఇంట్లో తన స్థానంలో మరొక స్త్రీ కనిపిస్తుంది. తన రక్తం పంచుకున్న బిడ్డని ఆ ఇంట పనిమనిషిగా చూస్తుంది. డబ్బు వ్యామోహం తన భర్త, అత్తమామల్లాటి మనుషుల్ని ఎలాటి స్థాయికి తీసుకెళ్తుందో జమునకు అర్థమవుతుంది. తన కర్తవ్యం అర్థమై భర్త,  అత్తమామల్ని ఇంటి నుంచి తక్షణం వెళ్లి పొమ్మంటుంది.

          “అపురూపమా అందుకో నా లేఖ” కథలో కొడుకును కని తీరవలసిందే అన్న భర్త మూర్ఖత్వానికి తలవంచి ప్రాణాలకు తెగించి కొడుకును కంది ఆ ఇంటి ఇల్లాలు. వాడి పేరు అపురూపమని పెట్టుకుంటారు. వాడు పెద్ద చదువులు చదివి విదేశాల్లో స్థిరపడి పోయాడు. తల్లి కొడుకు కోసం ఎదురు చూసి చూసి ఆఖరికి తన మరణ సమయానికైనా వస్తాడా అని వాపోతుంది భర్త దగ్గర. ఆమె అకస్మాత్తుగా కన్నుమూస్తుంది. ఆ కొడుకు రాలేకపోతాడు. ఇక తండ్రి వంతు. ఆయన మరణించేక దూరాన ఉన్న కొడుకు వచ్చే వరకు ఆ శరీరాన్ని ఐసుపెట్టెలో పెడతారు. అందులో ఉన్న ఆ తండ్రి శరీరం తనలోని పంచప్రాణాలు పోయినా ఆరోప్రాణాన్ని నిలుపుకుని కొడుకు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. కరోనా పుణ్యమా అని విమానాల రాకపోకలు లేకపోవటంతో వస్తాడు వస్తాడు అనుకున్న కొడుకు రాలేని పరిస్థితి ఎదురవుతుంది. తన కొడుకు వచ్చి ఐసుపెట్టెలో చల్లబడి గడ్డకట్టిన తన శరీరాన్ని ఒక్కసారి గుండెలకు హత్తుకోవాలని కోరుకుంటూన్న ఆ తండ్రి కొడుకు రాలేడని, అల్లుడు తల కొరివి పెడతాడని తెల్సి అప్పటిదాకా నిలుపుకున్న ఆరోప్రాణాన్ని వదిలేస్తాడు. ఇలాటి సంఘటనలు వాస్తవ ప్రపంచంలో చూస్తున్నాం. కన్నవారి ఆర్తి, ప్రేమ అందుకోలేని దూరాల్లో మిగిలిపోతున్న బిడ్డల్ని చూస్తున్నాం. కళ్లు చెమరింపచేసే కథ.

          “ఏడడుగులు” బాడీ షేమింగ్ గురించి చెప్పిన కథ. ప్రస్తుత ప్రపంచం కృత్రిమమైన ఆకర్షణలకు, అలంకారాలకు విలువనిస్తూ ఎదుటి మనిషిని ఆ కొలతల్లో, ఆ ప్రమాణాల్లోనే చూస్తోంది. బాడీ షేమింగ్ కి గురైనవారి మనోవ్యథ వర్ణనాతీతం. ఇలాటి మిథ్యా విలువలను పట్టించుకోకుండా ఆత్మస్థైర్యంతో ఎదురు నిలబడటమే సరైన పరిష్కారం.

          “ప్లీజ్ నాన్నా, నా కొడుకు భద్రం!” కథలో తనను రాజకుమారిలా పెంచి పెద్దచేసిన తండ్రి మరణం ఆమెను వివశురాల్ని చేస్తుంది. ఆయన ప్రేమను, ఆయన ఆనవాళ్లను తన కొడుకులో చూసుకుంటుంది. తాతయ్య త్యాగబుద్ధి, సదాశయాలు ఆమె కొడుకు తన స్వంతం చేసుకుంటాడు. అపురూపంగా ఇరవై ఏళ్లు పెంచుకున్న అలాటి కొడుకు అకస్మాత్తుగా ప్రమాదానికి గురై, బ్రెయిన్డెడ్తె అని తెల్సినపుడు ఆ తల్లి పడిన వేదన, మరణయాతన ఈ కథ. తను మరణించి వచ్చేదాకా తన కొడుకును ఆ పై లోకంలో జాగ్రత్తగా చూసుకొమ్మంటూ తండ్రికి చేసిన నివేదనే ఈ కథ.

          రచయిత్రి తన జీవితంలో ఎదురైన విషాదం గురించి పుస్తకం అట్ట లోపలి భాగంలో పాఠకులతో పంచుకోవటం మనసును మెలిపెడుతుంది.

          ఈ సంపుటిలోని ఇరవై ఒక్క కథల్లో చాలావరకు ఈ నాడు, సాహిత్య ప్రస్థానం, ప్రతిలిపి, కస్తూరి, వార్త, ఆంధ్రజ్యోతి, గోదావరి వంటి పత్రికల్లో ప్రచురించబడినవే.

          అన్నీ యదార్థ జీవితాలకు దగ్గరగా ఉండి, జీవితాల్లోని వివిధ కోణాలను ఆవిష్కరిస్తాయి. అన్నీ కూడా ఓటమిని, భయాన్ని ఎదిరించి నిలబడమనే ధైర్యాన్నిచ్చే కథలు. మనిషి జీవితం ఎంత అపురూపమైనదో, అనుబంధాలెంత అవసరమైనవో ఈ కథలు చెపుతాయి. ప్రస్తుత సమాజంలో సంపాదన, గెలుపు మాత్రమే అవసరమైనవిగా భావిస్తూ మనిషితనాన్ని మరచిపోతున్న వారిని లోలోపల ఉన్న హృదయాన్ని జాగృతం చేసుకొమ్మని, ప్రేమానురాగాల మధ్య జీవితాలను సంపన్నం చేసుకొమ్మని రచయిత్రి హితవు చెప్తున్నారీ కథల ద్వారా.

రచయిత్రికి అభినందనలు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.