కొత్తదారి
-పి. శాంతాదేవి
ఎందరో మగమహరాజులు మహానందంగా కోసుకుతింటూ రసాలు జుర్రుకుంటున్న ఫలాలు…
ఇంకెందరో సతీమణులు – లోకాచారాన్ని ప్రశ్నించాలన్న ఆలోచనకూడా లేకుండా అందిస్తున్న సేవలు…
హద్దుల్లేని ఈ మగ ప్రపంచంలో, ఆవిడో అడుగు ముందుకేసింది…
పి శాంతాదేవి కథ – కొత్త దారి
***
“లోపం ఎక్కడుంది? తను అన్నింటికీ సర్దుకుపోతోంది కదా! తను ఏమీ కావాలని అడగదు. అనారోగ్యం వచ్చినా, మరీ తప్పనిసరి అయితే తప్ప పైకి చెప్పదు. పొద్దున్న, రాత్రి వాళ్లేమి పెడితే అది తింటోంది. తన భర్త చెప్పిన పనులన్నీ చేస్తోంది. ఎటొచ్చీ పూర్వంలా వంట చెయ్యలేకపోతోంది. శక్తి చాలట్లేదు. వయస్సు మీద పడింది. సరిగ్గా కనపడదు. చేతులకు పట్టు ఉండడం లేదు. త్వరగా చేయలేక పోతోంది. కొంచెం ఏమయినా తేడా వస్తే కోడలు సహించదు” వరండాలో తన మంచం మీద కూర్చున్న సావిత్రమ్మ ఆలోచిస్తోంది.
తను వంట చేయట్లేదని ఆయనకు కోపం. చేస్తే కోడలికి కోపం. కోడలికి కోపం వస్తే కొడుక్కి కోపం వస్తుంది. వాళ్ళిద్దరికీ వస్తే మనవలకి వస్తుంది. ఇంట్లో అందరికీ తనంటే కోపమే. ఏంచెయ్యాలి? తన మాట విని వంట చేయట్లేదని ఆయన తన గదిలోంచి నెట్టేశాడు. ఇప్పుడు తన మంచం వసారాలోకి మారింది. పొద్దున్న కోడలు ఆఫీసుకి వెళుతూ కొడుకుతో అన్న మాటలు ఆవిడ మనసులో ములుకుల్లా గుచ్చుకున్నాయి.
“భర్తకి కావలసినట్లు చేయలేని మనిషికి విలువ ఎందుకివ్వాలీ? ఆ గదిలో కాకపోతే ఈవిడ మంచం వెయ్యడానికి ఇంకా చోటెక్కడుందీ? వరండాలో వేయించాను. మంచం వెయ్యడానికి ఎక్కడైనా ఒకటే.”
అక్కడికి తను రోజంతా పడుకుంటున్నట్లు! వంట చెయ్యలేకపోతోంది కానీ రోజంతా ఇంట్లో పని చేస్తూనే ఉంటుంది తను. పొద్దున్న కూరలు తరిగి ఇస్తుంది. పాలు కాచి అందరికీ కాఫీలు ఇస్తుంది. పచ్చళ్లు ఏమైనా చెయ్యాలంటే రుబ్బుతుంది. ఇల్లంతా, పెరడంతా శుభ్రం చేస్తుంది. ఉతికిన బట్టలు మడతలు పెడుతుంది. మధ్యాహ్నం కాఫీలు ఇస్తుంది. స్కూలు నుంచి వచ్చిన మనవల పనులు చూస్తుంది. కోడలు ఆఫీసుకి వెళిపోతుంది కదా.
అయినా ఇన్నేళ్లు ఆగకుండా ఇంటి చాకిరీ అంతా చేసింది. ఐదుగురు పిల్లల్ని కని, పెద్దవాళ్లని చేసి, పెళ్లిళ్లు చేసి, మనవలని పెంచింది. ఈనాటికి డెబ్బయ్యోపడిలో శరీరం అలిసిపోయి పని చేయలేకపోతే అందరికీ చేదయిపోయింది. ఇది లోకం తీరా, లేక తన తప్పా?
ఆలోచనలో పడి కొట్టుకుపోతున్న సావిత్రమ్మ పెద్దపెద్ద కేకలతో ఈ లోకంలోకి వచ్చింది. పక్కనున్న పెంకుటింటిలోంచి పెద్దగా అరుపులు వినిపిస్తున్నాయి.
“మూల కూర్చుని మింగుతూ మమ్మల్ని చంపుకు తింటున్నావు,” ఇంకెవరిమీద! పాపం! దేవమ్మమీదే! గవరయ్య తల్లి మీద అరుస్తున్నాడు. దేవమ్మకి కూడా తనలాగే వయస్సు మీద పడింది. తనకంటే దురదృష్టవంతురాలు. తనకి భర్త ఉన్నాడు. ఆయనకి పెన్షన్ వస్తుంది. అది ఇంట్లో ఇస్తాడు కాబట్టి పిల్లలు కనీసం తన భోజనం బరువు అనుకోవడం లేదు.
దేవమ్మ భర్త పోయాడు. పదేళ్ళు అయింది. కానీ దేవమ్మకి ఒంట్లో శక్తి ఉండేది. ఇంటిచాకిరీ అంతాచేసేది. అది కాక నేతపనిచేసేది. అందుకని ఇన్నాళ్ళు గడిచాయి. రెండేళ్ళుగా దేవమ్మకి కీళ్లవాతం పట్టుకుంది. పాపం కీళ్ళు చాలా నెప్పులెడతాయని ఎన్నోసార్లు తనతో చెప్పుకుని ఏడిచింది. దానితో కాళ్ళు చేతులు కూడా స్వాధీనం తప్పాయి. పనిచేయలేక పోతోంది. దానితో భారమయిపోయింది.
“అలా మూలుగుతూ పడుకోకపోతే లేచి నడవచ్చుగా! నడవకపోతే కీళ్ళు ఇంకా బిగుసుకుపోతాయి. మందులిప్పించడానికి నా దగ్గర ఏమన్నా పాతరుందా? రెక్కాడితే గాని డొక్కాడదు” గవరయ్య అరుస్తున్నాడు. భార్య ఎసం దోస్తోంది. ఏడుస్తూ ఏదో అంటోంది దేవమ్మ. “వెధవ ఏడుపూ నువ్వూను. ఈ ఏడుపే ఇంటికి దరిద్రం. అంతకంటే చావరాదూ?”
“చావు రావట్లేదురా!”
“నువ్వే చావచ్చు”గవరయ్య గట్టిగా అరిచాడు.
సావిత్రమ్మ మనసు పాడయిపోయింది. అయ్యో! ఎంతెంత మాటలంటున్నాడో! పాపం! దేవమ్మ ఏం చేస్తుంది! మందు కూడా ఇప్పించక పోయినా తన ఏడుపేదో తను ఏడుస్తోంది. ఇంతలో ఆవిడకి తన గురించి గుర్తు వచ్చింది. అమ్మో! తనకి ఏమయినా అనారోగ్యం వస్తే? తన గతి ఏమిటి? తనదీ దేవమ్మ పరిస్థితే! తేడా అల్లా గవరయ్య అరుస్తాడు. తన కొడుకు అరవడు అంతే! కానీ తనకు తెలుసు వాడికి తనంటే ప్రేమ లేదని! ఇన్నేళ్ళు కాపురం చేసిన భర్తకే లేదు!
ఏభై ఏళ్ళ పైన కలిసి బ్రతికారు. తను ఎంత కష్టం అయినా సహించి అతన్ని సుఖపెట్టింది. ఈ ఆఖరువాడు పుట్టే సరికి తనకి 45 ఏళ్ళు. తను ఎంత కాదన్నా విన్నాడు కాదు. బిడ్డ కడుపున పడ్డప్పటి నుంచీ తను అనారోగ్యం పాలయ్యింది. తను ఎంత కష్టపడింది? చావుకి సిధ్ధమయ్యింది. ఎలా బ్రతికింది ఆ దేవుడికి తెలుసు.
వాడికీ అస్తమానూ అనారోగ్యమే. ఎన్ని రాత్రిళ్ళు తను అలా మేలుకుని ఉండేది? ఆయన ఎప్పుడూ అదో రకమే. అతని ఉద్యోగమూ, అతని సుఖమే తప్ప ఇంకేదీ పట్టేది కాదు. తానే అన్నీ అగచాట్లూ పడింది. ఇవాల్టికి తను అందరికీ చేదయ్యింది. తనకి డబ్బు లేదు, ఆదాయమూ లేదు. ఒంట్లో ఓపిక లేదు. భర్తకి ఆదాయం ఉంది. అందుచేత ఆయనంటే ఇష్టం,తనంటే అయిష్టం.
ఆలోచిస్తూనే అందరికీ కాఫీలు ఇచ్చింది. కొడుకూ,కోడలూ ఆఫీసునుంచి వచ్చారు. వాళ్ళకీ కాఫీలు ఇచ్చింది. తను సాయంత్రం కాఫీ ఎప్పుడో మానేసింది. ఏ పూటకాపూట భోజనం చాలు. కాఫీ అందుకుంటూ కోడలు చూసిన చూపు సావిత్రమ్మలో కలవరం లేపింది. ఏమిటలా చూస్తోంది? అది సానుభూతి కాదు. ఒక రకమైన సవాలు. దేనికి? తను ఏమీ మాటలాడలేదే? మరి సవాలు దేనికి? కలవరపడుతూ అరుగు మీద కూర్చుంది.
పక్కింట్లోంచి దేవమ్మ ఏడుపు వినిపిస్తోంది. దేవుడిని తిడుతోంది. తన బ్రతుకు ఇలా చేసినందుకు దేవుడిని తిడుతూ ఏడుస్తోంది.
మనుషులు ఎంత పిచ్చివాళ్లు? తప్పు చేసిన వాళ్ళు ఎదురుగా ఉంటే, వాళ్ళు చేసిన, చేస్తున్న తప్పు అంతా కచ్చితంగా కళ్ళకు కనబడుతూ ఉంటే, కనిపించని దేవుడు ఏదో చేశాడని ఆయన్ని తిడతారు! ఇంట్లోంచి మాటలు వినిపిస్తున్నాయి. కొడుకు తండ్రితో మాటలాడుతున్నాడు కాబోలు.
“నాన్నగారూ, ఖర్చులు పెరిగిపోతున్నాయి. మీరిచ్చే పెన్షను డబ్బు మీ ఖర్చుకే సరిపోతోంది. మరి అమ్మ మాటేమిటి? ఆవిడ ఖర్చు ఎవరు భరిస్తారు?”
“అదేమిటి? నా పెన్షను అంతా నీకిస్తున్నాను. ఇంకా నేనెక్కడ నుంచి తేగలను?”
“మీ ఫిక్సెడ్లున్నాయి కదా! అవి ఇవ్వండి. నాకు ఇంటి ఖర్చులకి డబ్బు చాలట్లేదు.”
“ఫిక్సెడ్లిస్తే, రేపు నాకేదయినా జబ్బు చేస్తే డబ్బు ఎక్కడినుంచి వస్తుంది?”
“మరయితే అమ్మ ఖర్చుల మాటేమిటి? ఆవిడకి ఏ ఆదాయం లేదు. పోనీ ఇంట్లో ఏ పనీ చేయదు. కూర్చో పెట్టి పోషించడానికి నాకు మాత్రం ఎక్కడిది? నేనూ, సుమతీ సంపాయించేది మాకూ, పిల్లలకీ సరిపోతోంది. పిల్లల కోసం కొంచెం అయినా ఆదా చెయ్యాలి కదా! పోనీ అంటే అన్నయ్యలు కూడా ఏమీ పంపించరు. ఆవిడను నేను పోషించలేను.”
“మరేం చేస్తావు?”
“ఏ వృద్ధాశ్రమానికో పంపించేస్తాను. నేనొక్కడినే ఎంతకని భరించను?”
“నీ ఇష్టం “ అన్నాడు భర్త.
సావిత్రమ్మకాళ్ళ కింద భూమి కదిలిపోయినట్లయ్యింది. ఏమిటిది? ఏం మాటలాడుతున్నారు వీళ్ళు? డెబ్భై ఏళ్ల తను గత ఏభయి ఏళ్లుగా అందరికీ చాకిరీ చేసింది. ముప్పై ఏళ్ళు పని చేసిన ఆయనకి ప్రభుత్వం పెన్షన్ ఇస్తోంది. మరి తన ఏభై ఏళ్ల పనికి విలువ లేదూ? భోజనం పెట్టడానికి కూడా బాధపడుతున్నారే! ఇదేం న్యాయం? తను ఎక్కడికి వెళ్ళాలి? అయినా తను ఎందుకు వెళ్ళాలి? ఇది తన ఇల్లు. ఈ ఇంట్లో తనకి హక్కు ఉంది. తను వెళ్ళదు.
అయితే ఇందాక కోడలి కళ్ళల్లో సవాలు ఇదన్నమాట! “నిన్ను ఇంట్లోంచి తరిమేస్తాను, ఏం చేస్తావు?” అని. తను ఏ ఉద్యోగమూ చేయలేదు. వీళ్ళందరికి చాకిరీ చెయ్యడానికి తన శరీరం అరగదీసింది. తన కోసం తను ఏమీ చేసుకోలేదు. తనకి ఎక్కువ నగలు కూడా లేవు. ఈ కుటుంబమే తన ధనం అనుకుంది. ఇవాళ తనని ఎక్కడికో పంపించేస్తారుట!
సావిత్రమ్మకి కాళ్ళూ చేతులూ ఆడట్లేదు. మంచో చెడో, తిట్టుకుంటూనో కొట్టుకుంటూనో, ఏదో ఒక చోట తన వాళ్ళ మధ్య తను ఉంది ఇన్నాళ్లూ. ఇప్పుడు ఎక్కడకు వెళుతుంది? సావిత్రమ్మకి చాలా భయం వేస్తోంది. ఎవరికి చెప్పుకోవాలి? ఎలా? ఏం చెయ్యాలి? ఎవరిని ఆశ్రయించాలి? తన పుట్టింటి వాళ్ళతో ఏనాడూ సంబంధం ఉండనిచ్చాడు కాదు తన భర్త. ఇవాళ ఎవరు తనని ఆదుకుంటారు? తన అక్కచెల్లెళ్లు, వాళ్ళ పిల్లలతో సుఖంగా ఉన్నారు. తనకే వచ్చింది ఈ ఖర్మ. తన తప్పేమిటి? ఎంత ఆలోచించినా సావిత్రమ్మకి తన తప్పేమిటో అర్ధం కాలేదు.
ఆవిడ ఆ రాత్రి భోజనం చేయలేదు. అందరూ అన్నాలు తిన్నాక వంటిల్లు కడిగి వచ్చి అరుగు మీద పడుకుంది. ఆవిడ ఎవరితోనూ మాట్లాడలేదు. ఆవిడ బాధ కొడుకు కానీ, భర్త కానీ పట్టించుకోలేదు. ఆవిడ అన్నం తినకపోవడం కోడలు గమనించినా అడగలేదు. భయంతో, బెంగతో, ఎందుకో తెలీని అవమానంతో సావిత్రమ్మ వరండాలోకి వచ్చి తన మంచం మీద వాలింది. కంటిమీద కునుకు లేదు. కళ్ళలో నీళ్ళు రావట్లేదు. ఆవిడ మనసు మొద్దు బారిపోయింది.
తెల్లవారు ఝామున అయిదు గంటలకి మంచం మీద నుంచి లేచి కాలకృత్యాలు తీర్చుకుందామని ఇంట్లోకి వెళ్లబోయింది. ఇంకా వీధి తలుపులు తెరవలేదు. సందులోంచి పెరట్లోకి వెళదామని అరుగు దిగింది. పక్కింట్లోంచి దేవమ్మ నడవలేక నడవలేక నడుస్తూ కర్ర సాయంతో బయటికి వచ్చింది. నెమ్మదిగా అడుగులేస్తోంది.
“ఎందుకు దేవమ్మా, పొద్దున్నే లేచావు? చలికి కీళ్ల నెప్పులు ఎక్కువవుతాయి. కాస్సేపు ఆగక పోయావా?” అడిగింది సావిత్రమ్మ.
“నెప్పులకేమమ్మా, రాత్రింబగళ్ళు ఉంటూనే ఉంటాయి. ఇంకపడుకోలేనమ్మా. కాసేపు నడుస్తా” అంది దేవమ్మ.
తన పని చూసుకోడానికి సావిత్రమ్మ పెరటి వైపు నడిచింది. అడుగులేస్తూ బయటికి వచ్చిన దేవమ్మ కాలువ వైపు దారి తీసింది. వీధి చివరన గుమ్మంలో ముగ్గేస్తున్న లక్ష్మమ్మ చూసి ‘అదేమిటి కీళ్ళునెప్పులన్న దేవమ్మ పొద్దున్నే ఎక్కడికి బయలుదేరింది?’ అనుకుంది. అలా నెమ్మదిగా కుంటుతూ అడుగులేస్తూ దేవమ్మ కాలువ దగ్గిరికీ, కాలువలోకీ వెళ్లిపోయింది.
“భగవంతుడిని వెతుక్కుంటున్నాను”అందిట దార్లో కనబడి, ఎక్కడికెళుతున్నావని అడిగిన సూరమ్మతో. ఏమో అనుకుంది సూరమ్మ.
తరువాత కాలువకి బట్టలుతకడానికి వెళ్ళిన చాకలి చంద్రానికి కాలువలో ఏదో కనబడితే వడ్డుకి చేర్చాడు. తీరా చూస్తే దేవమ్మ! తన కొడుక్కి కష్టం తప్పించడానికి భగవంతుడిని వెతుక్కుంటూ బయలుదేరిన దేవమ్మ!
అందరూ కాలువ ఒడ్డున చేరారు. అందరితో పాటూ వచ్చిన సావిత్రమ్మకి ఒళ్ళు జలదరించింది. దేవమ్మదీ తనదీ ఒకటే సమస్య. దేవమ్మ తనకు తోచిన పరిష్కారం వెతుక్కుంది. మరి తన మాటేమిటి?
కాళ్లీడ్చుకుంటూ వెనుదిరిగిన సావిత్రమ్మకి సందు చివరన సూరమ్మ కనిపించింది.
“కొడుకు చూడకపోతే ఇంకా బ్రతుకే లేదా అమ్మ, దేవమ్మ చూసారా ఎంత పని చేసిందో?” అంది.
“ఎలా బ్రతకాలి సూరమ్మా, శరీరంలో శక్తి లేదుగా!” దీనంగా అంది సావిత్రమ్మ.
“ఈ లోకంలో అందరికీ రకరకాల పరిస్థితులు, అవసరాలు ఉంటాయమ్మా. కొందరికి పిల్లలుండరు. అందుకని వారికి బాధ. కొందరికి పిల్లలుంటారు కానీ వాళ్ళని పెంచడం కష్టం అవుతుంది. కొందరికి పిల్లలు పనికిరారు. అలా ఎన్నో రకాలు. మనకున్న శక్తితో ఇంకొకరి అవసరం తీరిస్తే మన అవసరం గడవదా అమ్మా?” అడిగింది సూరమ్మ.
“నిజమే సూరమ్మా”అంటూ ఇంటివైపు నడిచింది సావిత్రమ్మ. తన సమస్య ఎరిగున్నట్టు ఎంత మంచి ఆలోచన చెప్పింది సూరమ్మ! నిజమే, తనకున్న శక్తితో చిన్న చిన్న పనులు చెయ్యగలదు. ఆ అవసరం ఉన్న వాళ్లుంటారు. తను అలాంటి వాళ్ళను వెతుక్కోవాలి. బ్రతకగలిగినంత కాలం బ్రతకాలి. మంచానపడిననాడు ఆలోచించవచ్చు. ముందెప్పుడూ తన కోసం తను సంపాదించుకోలేదు. ఇప్పుడు సంపాదించుకోవాలి. ఈ ఆలోచన వచ్చాక సావిత్రమ్మకి కొంచెం ఊరట కలిగింది.
నాలుగు రోజులు గడిచాయి. ఆ రోజు మధ్యాహ్నం అరుగు మీద కూర్చున్న సావిత్రమ్మని స్కూలు టీచరు విశాల పలకరించింది. ఆ మాటా ఈ మాటా చెబుతూ మధ్యలో అంది. “మా స్కూల్లో చదువుతున్న ఒక అబ్బాయికి హటాత్తుగా ఏదో జబ్బు చేసిందండీ. పాపం పిల్లాడు లేవలేకపోతున్నాడుట. తల్లి లేని పిల్లాడు. పనులు చేయడానికి మనిషిని పెట్టారుట. అతని ఆలనా పాలనా చూసేందుకు ఎవరైనా కావాలని వెతుక్కుంటున్నారు. మీ కెవరైనా తెలిస్తే కాస్త చెప్పండి మామ్మగారూ”.
“ఎవరో ఎందుకమ్మా, నేనే వస్తాను. రెండు పూటలా భోజనం పెడితే చాలు. అవసరం ఉంటే అక్కడే ఉండిపోతాను. లేకపోతే ఇంటికి వస్తాను.” అంది సావిత్రమ్మ.
“మీరా? మామ్మగారూ, మీకేమిటి అవసరం?” ఆశ్చర్యపోయింది విశాల.
“అవసరానికేముందమ్మ, తల్లి లేని పిల్లాడు అంటున్నావు. నాకు జాలిగా ఉంది. నా అవసరం మా ఇంట్లో పెద్దగా లేదు. నాకు పెద్ద పనులు చేసే శక్తి లేదు. కానీ పిల్లాడిని చూడగలను. నాకూ కాలక్షేపం అవుతుంది. పిల్లాడికి అవసరం తీరుతుంది.”
“ఎంత పెద్ద మనసు మీది! రండమ్మా, ఇవాళే పరిచయం చేస్తాను.” అంది విశాల.
కాళ్ళకి చెప్పులు తొడుక్కుని కొత్త దారి వెతుక్కుంటూ బయలుదేరింది ఏడు పదుల సావిత్రమ్మ.
*****
పుట్టి పెరిగింది విజయవాడలో. ఆకాశవాణిలో లలితసంగీతగీతాలకి వాయిద్యకారుడిగా పాల్గొంటూ పాలొంటూ సైన్యంలో చేరి, రెండు దశాబ్దాల తర్వాత మరో పదకొండేళ్లు కార్పొరేట్లో కదం తొక్కి, మూడేళ్లక్రితం దానికీ గుడ్ బై చెప్పినప్పట్నుంచీ, గాత్రధారణలు, అనువాదాలు చేస్తూ, కథలూ కవితలూ రాసుకుంటూ, సాహిత్యారాధనలో ఢిల్లీలో నివసిస్తున్నాను.
కధ చాలా బాగుంది,ముఖ్యంగా ముగింపు,
అభినందనలు