కథా మధురం
దర్భా లక్ష్మీ అన్నపూర్ణ
‘ప్రతి స్త్రీ తనని తాను గౌరవించుకోవడం నేర్వాలి..’
అని చెప్పిన దర్భా లక్ష్మీ అన్నపూర్ణ గారి కథ – ‘మనోరథం ‘ !
-ఆర్.దమయంతి
స్త్రీ తనని తాను గౌరవించుకోవడం అంటే తన విలువని వ్యక్తపరచుకోవడం! కానీ, కొంతమంది మగాళ్ళు అర్ధం చేసుకోరు. అర్ధమయ్యాక -మరి కొంతమంది సహించుకోలేరు.
‘ఆఫ్ట్రాల్..నువ్వేమిటీ, నీకు గౌరవమేమిటి? దాన్ని నేను లెక్క చేయడమేమిటీ? అని తేలిక చూపు చూస్తారు. అలా స్త్రీలను తక్కువ చేసి ట్రీట్ చేసే వారికి ఈ కథ ఒక గుణపాఠం గా నిలుస్తుంది అని చెప్పడంలో ఎలాటి సందేహమూ లేదు.
***
అసలు కథేమిటంటే :
పర స్త్రీ వ్యామోహంలో కూరుకుపోయిన భర్తని వదిలేసి పుట్టిల్లు చేరుతుంది సత్యవతి. కాలం వొడిలో గాయం మానుతుంది. అప్పటికి యేళ్ళు గడచిపోయాయి. అంతలో హఠాత్తు గా (మాజీ) భర్త నించి ఓ ఉత్తరం వస్తుంది. ఏమనంటే – తను ఆమెకి చేసిన ద్రోహన్ని మన్నించి ఇంటికి తిరిగి రావాలని అందుకు మూడో మనిషి కూడా తన సమ్మతి ని తెలియచేసిందంటూ..ఆ ఉత్తరం సారాంశం.
సత్యవతి కి ఈ ఉత్తరం ఒక షాక్ అయితే, తల్లి ఆమెని తొందరపెట్టడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆమె ఆ పాటికే ఒక ప్రధాన నిర్ణయం తీసుకుని వుంటుంది. అయితే, తాను పునః వివాహం చేసుకోవాలనుకున్న కామేశ్వర రావు తో దూరంగా వుండాలని, తిరిగి భర్త ప్రహ్లాదరావ్ దగ్గరకే వెళ్ళాలనే తల్లి నిర్ణయానికి సత్యవతి ఇచ్చిన తనదైన ధీటైన జవాబే – ఈ కథ – మనోరధం!
ప్రియ పాఠకుల్లారా! తప్పక చదవండి
***
కథలోని స్త్రీ పాత్రలు, స్వభావ సుగుణాలు:
ఆత్మాభిమాని సత్యవతి :
ఈ కథలో ప్రధాన పాత్రధారి. ఆత్మాభిమాని. భర్త తో కాపురం సజావుగా సాగిపోతోందని సంతోషపడినంత సేపు పట్టలేదు. ఆమె దుఃఖించేందుకు! భర్త మరో స్త్రీ ఆకర్షణలో పడినందుకు – గుండె పగిలిన ఆమె ఇల్లు విడిచేస్తుంది – అవమానంతో! భర్త చేసిన మోసం కంటే ఆమెనెక్కువగా బాధపెట్టిన సంగతేమిటంటే – వెళ్తుంటే అతను అడ్డు చెప్పకుండా, మౌనం వహించడం ఆమెని మరింత గా కుంగదీస్తుంది.
ఇలాటి క్షణాల్లోనే నాకు స్త్రీ అంటే విపరీతమైన జాలి, కరుణ కలుగుతాయి. పాపం! ఎంత అమాయకత్వం కాకుంటే!- కట్టుకున్నవాడికి భార్య పట్ల ఆ పాటి కృతజ్ఞత, మర్యాదలే కనక వుంటే..అతను అంత పెద్ద తప్పు చేస్తాడా? అని.
ఆమెకి ఆ పరిస్థితిలో అర్ధం కా(లే)దు. భర్త మోసపూరితనం.
నిజానికి, కట్టుకున్న వాడి కసాయితనాన్ని ఏ భార్యా ఓ పట్టాన జీర్ణించుకోలేదు. కారణం ఒకటే. భర్తని త్రికరణ శుద్ధిగా నమ్మడం. స్త్రీలో గల ఈ పవిత్రమైన సుగుణమే ఒక్కోసారి ఆమె పాలిట శాపమౌతుందేమో! అని అనడానికి ఒక ఉదాహరణ గా నిలుస్తుంది సత్యవతి. లోతైన నీళ్ళల్లో మునక ఎంత ప్రమాదమో.. కాపురాన భర్తని పూర్తి గా నమ్మడమూ అంతే ప్రమాదం.. అని ఓ మెలకువ ని కలిగిస్తుంది సత్యవతి. ఇలాటి హెచ్చరికలు నేటి తరం స్త్రీలకు చాలా మేలు చేస్తాయి. లేకపోతే చెప్పి రాని తుఫానుకు మల్లే మనసు అల్లకల్లోలమైం మనిషి ఆగమైపోదును.
మమకారానికి మరో పేరు స్త్రీ :
సత్యవతి గతం మర్చిపోయి హాయిగా బ్రతుకుతోందన్న మాట ఒట్ఠి ఉత్తిమాటే..అనిపిస్తుంది, ఎప్పుడంటే – భర్త ప్రహ్లాదరావ్ నించి ఉత్తరం అందుకున్న క్షణాన ఆమె ఉద్వేగానికి లోనయినప్పుడు. అతని పట్ల పాషాణంలా మారిన ఆమె గుండె సైతం..వింతగా స్పందించడం చూస్తే..అనిపిస్తుంది..స్త్రీ మమకారానికి మరో పేరు కదా అని! తాళి కట్టిన మహిమేమో కానీ, అతడు జీవితాన్ని ఎంత బుగ్గి చేసినా, తిరిగి అతని రాకతోనే నందనవనమౌతుందని భావించే పిచ్చి సీతమ్మలెందరో!
విరిగిన మనసు కి రాగద్వేషాలుండవు :
ఉత్తరం ఎక్కణ్ణించని తల్లి అడిగిన ప్రశ్నకి సత్యవతి జవాబిస్తూ, భర్త తనని ఆహ్వానిస్తున్నాడని చెబుతూ మరో వాక్యాన్ని కూడా చేర్చుతుంది. ‘అందుకు సులక్షణ మనస్ఫూర్తిగా ఒప్పుకుందట..’ అని! ఆ వార్త తల్లికి ఆనందం గా వుంటుంది కానీ, ఆమె తన జీవితంలోని పూర్తి విషాదమంతా ఆ ఒకేఒక్క వాక్యం లోనే నిండిందన్న సంగతి..సత్యవతి మనసెరిగిన వారికి మాత్రమే తెలుస్తుంది.
అంత విషాదం లోనూ ఆమె ఈ ‘ఉత్తరం..’ అనే అంకాన్ని విశ్లేషించుకుంటూ అనుకుంటుంది.. జీవితం చరమాంకం లో అయినా భర్తలో మార్పు రావడం, చేసిన తప్పుకు పశ్చాత్తాపపడం జరిగిందంటే..సంతోషించదగిన విషయమే కదా! అని సమాధానపడుతుంది. – అంతే కాని, కోపం తో కానీ, కసితో కాని ఆ ఉత్తరాన్ని చించి ముక్కలుగా చేసి చెత్త బుట్టలో పారేయదు. పైపెచ్చు- ‘ఎదుటివారి నుంచి ప్రేమతో కూడిన శాంతియుతమైన ఓ ప్రతిపాదన వచ్చినపుడు ఏ మనిషి మనస్సు మాత్రం సంతోషించదు! ‘ అని తలబోస్తూ, తన హృదయ వైశాల్యాన్ని చాటుతుంది.
లోపాలెన్నున్నా, ఎదుటి మనిషిని మనిషి గా చూడటం సత్యవతిలోని సుగుణం ఎంతైనా అనుసరణీయం. ఈ స్వభావం అలవరించుకోవడంవల్ల ఏ మనిషికి శతృవులు వుండరు. ఎవరితోనూ శతృత్వమూ వుండదు.
స్త్రీ మనసు గట్టిది కూడా :
స్త్రీ ఒక సారి ప్రేమిస్తే – జన్మంతా ఎలా కట్టుబడివుంటుందో..వంచించిన మగవాని పట్ల కూడా అంతే శాశ్వతం గా కఠినమైపోగలదు. అని అనడానికి సత్యవతి పాత్ర ఓ సోదాహరణం గా పేర్కొనాలి. ఆడదాని మనసు మెత్తనే! కానీ, ప్రతికూల పరిస్థితుల్లో గట్టి గా నిలబడగలదు కూడా!
సీతా దేవి తనకు ఆదర్శమన్న ఆధునిక మహిళ :
‘నువ్వు తిరిగి భర్త దగ్గరకి వెళ్ళడమే సబబు..’ అంటూ తీర్పు ఇచ్చిన తల్లితో సీతాదేవి తనకు ఆదర్శమని పేర్కొనడం.. ఆనాడు శ్రీరాముడు తన వెంట రమ్మంటే రానన్న సీతమ్మ తిరస్కారం వెనక దాగిన ఆ పవిత్ర మూర్తి ఆత్మగౌరవం ఎంతో విలువైనదనీ, ఆమె వ్యక్తిత్వమే తనకు ఆదర్శమని చెబుతున్న సత్యవతి ని చూస్తే అబ్బురమేస్తుంది. పరిపూర్ణమైన స్త్రీ వ్యక్తిత్వానికి ప్రతిబింబం లా నిలిచిన పాత్ర – సత్యవతి పాత్ర!
ప్రహ్లాద రావ్ వుత్తరం లో అంటాడూ.. ఇప్పుడు తాను చాలా ఎదిగిపోయినట్టు..ఉదార స్వభావాన్ని అలవరచుకున్నట్టు, అందుకే భార్యని ఉద్ధరించేందుకు నడుం కట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు.. పెద్ద పోజు కొడుతున్న ప్రహ్లాదరావుకి మెత్తని చెప్పుతో జవాబు చెప్పిన నారీమణి ఈమె. ‘ఏమిటీ! నువ్వా! నా పైని కరుణ కురిపించడం!? నీ చిటికెన వేలి సాయంతో నా జీవన యానం సాగిపోతుందనుకున్న.. నా నమ్మకాన్ని కాల్చేసి, నన్ను నడి సముద్రం లో వదిలేసి..తప్పుకున్న నువ్వా! నా పైని కరుణ కురిపించడం? ‘ అని ఆ మాయగాణ్ని చూసి జాలిగా నవ్వినట్టు అనిపిస్తుంది. వెంటనే ‘శభాష్ సత్యవతి! నీ మనో నిబ్బరానికీ..! అని మెచ్చుకునేంత సంబరం కలుగుతుంది పాఠకునికి!
వైవాహిక బంధాల విలువను పెంచిన స్త్రీ మూర్తి :
సహజంగా పెళ్ళయిన స్త్రీ – భర్త వల్ల మోసపోయినా, దగాపడినా, నిర్దాక్షిణ్యం గా ఇంట్లోంచి గెంటివేయబడినా..భగ్గున రగులుతుంది. అరుస్తుంది. యాగీ చేస్తుంది. . తనకు న్యాయం చేయాలంటూ – మీడియాని ఆశ్రయిస్తుంది. అంత వరకు వెళ్ళలేని వారు కనీసం ఇంట్లోనే పెద్దల సమక్షం లో అయినా, చిన్నపాటి పంచాయితీ పెట్టించి, పదిమందితో మొగుడికి గడ్డి పెట్టిస్తుంది. లేదా, తెగతెంపులు చేసుకుని, తనకు రావాల్సిన సొమ్ము ఎంతో.. లెక్కలు చూసుకుని విడిపోతుంది.
కానీ ఇలాటివేవీ సత్యవతి జీవితంలో జరగలేదు. అసలు – వ్యతిరేకించి పోరాడే పోరాటాలు ఏవీ వొద్దనుకుంటుంది. అందుకే చట్టరీత్యా విడాకులు తీసుకోవడాన్ని కూడా విస్మరిస్తుంది.
ఆడదానికి ఆడదే శతృ వు కారాదు..అని బోధిస్తుంది :
తమ ఇద్దరి మధ్య సులక్షణ ప్రవేశించడం వల్ల తన జీవితం ఎలా తలకిందలైందో..ఎంత నరకాన్ని అనుభవించిందో ఆమె అంతరాత్మకి తెలుసు. భర్త ఆహ్వానం తో తిరిగి ఆ ఇంటికెళ్తే..తానూ అదే పొరబాటు చేసినట్టు కాదా? అని తల్లిని ప్రశ్నించే సత్యవతి పాత్ర స్త్రీ ఔన్నత్యానికి ప్రతీక గా నిలుస్తుంది.
మరు ప్రేమ లూ వుంటాయి.. అని రుజువు చేసిన పాత్ర :
ఒకసారి జీవితంలో మగని వల్ల మోసపోయి, గుండె కోతని అనుభవించిన సత్యవతి..మరో సారి మనువాడాలని మనసా వాచా..అభిలషిస్తుంది. అయితే ఆమె వివాహం చేసుకోవాలనుకోవడం వెనక ఒక ఆదర్శం వుంది. ఒక సేవా దృక్పథమూ వుంది.. ఒక అసహాయునికి తాను తోడై నిలవాలనుకునే హృదయ పరిణితి గల స్త్రీ మూర్తి తన కథ కి అందమైన ముగింపుని ఇచ్చుకుంది. పదిమంది కి ఆదర్శప్రాయురాలిగా మిగిలింది.
***
సత్యవతి తల్లి శేషారత్నం :
భర్త తో లక్షణం గా కాపురం చేసుకుంటూ, పిల్లా పాపలతో కళకళలాడాల్సిన కూతురు..ఒంటరిగా..శాశ్వతం గా తన కళ్ళ ముందు విషాదం గా కదులుతుంటే ఏ తల్లికైనా ఎంత నరకం గా వుంటుంది కదూ? శేషారత్నం పరిస్థితి మరి అలాగే వుంది. కూతురికి తోడుగా అయితే నిలిచింది కానీ, తాను మాత్రం ఎన్నాళ్ళు బ్రతుకుతుందనీ? తను పోయాక కూతురి పరిస్థితి ఏమిటన్న చింత ఆ పెద్దామె గుండె ని పట్టుకుని, పీల్చి పిప్పి చేస్తోంది.
ఇంకా చెప్పాలీ అంటే..కూతురు వెతుకున్న మరో బంధానికి ఈమె సమ్మతీ, సహకారమూ వుండే వుంటుందనిపిస్తుంది.
కానీ అల్లుడి నించి వచ్చిన ఉత్తరం తో ఆవిడ పటలేని ఆనందం తో ఉక్కిరిబిక్కిరైపోతుంది. ఇక కూతుర్ని వెంటనే అక్కడికి పంపేయాలన్న ఆత్రపడిపోతుంది.
‘ఆడపిల్ల ఎప్పటికైనా ‘ఆడ’ పిల్లే!’ అనే నానుడిని వొంటినిండా పట్టించుకున్న తల్లి శేషారత్నం. పెళ్ళయ్యాక ఆడపిల్ల పుట్టింటి కి వస్తే ఆనందపడే తల్లి, ఇక ఇక్కడే స్థిరంగా వుంటుందని తెలిస్తే ఎంత విషాదమౌతుందో మాటల్లో చెప్పలేం. నవమాసాలు మోసిన ఆ తల్లికి ఇంట్లో కూతురు భరించలేనంత భారం గా వుంటుంది. ఇంటికి ఆడపిల్ల లక్ష్మీ దేవి అనో, చందమామ అనో, దీపం లాంటిదనో..తలచి మురిసే ఆ తల్లే భర్త వదిలేసిన ఆడపిల్ల ఇంట్లో వుంటే ఇల్లంతా చీకటైపోయినట్టు, జీవితమంతా భారమైపోయినట్టు ఫీలౌతుంది. అలాటి తల్లి పాత్రే ఈ శేషారత్నం కూడా!
కూతురు భర్త దగ్గరికి వెళ్ళనంటె హతాశురాలౌతుంది. మరో వ్యక్తి తో వివాహాన్ని వ్యతిరేకిస్తుంది. సత్యవతి మొదటి భర్త దగ్గరకి వెళ్లడమే ఆమె దృష్టిలో ధర్మ పథం అని వొక్కాణిస్తుంది.
కూతురి వైఖరిని ముందుగా ఖండించినా..ఆమె వివరణకి, వితరణకి ముగ్ధురాలౌతుంది. మార్పుని ఆహ్వానిస్తుంది.
రెండు తరాల అంతరాలకి, ఆంతర్యాలకి వారధిలాటి పాత్ర – శేషారత్నం పాత్ర!!
***
సులక్షణ :
కథలో ఈ పాత్ర ప్రత్యక్షం గా కనిపించదు కానీ, ఇతర పాత్రల మాటల్లో తరచూ వినిపిస్తూ, కనిపిస్తూ వుంటుంది.
పెళ్ళయిన వాణ్ణి ప్రేమించి, అతని జీవితం లో ప్రవేశించి, తిష్ట వేయడమే కాకుండా..అతని జీవితం లోంచి భార్య నిష్క్రమించడానికి ప్రధాన కారకురాలుగానిలిచే పాత్ర!
ఏమి ఆశించి వచ్చిందో! కడ దాకా అతని తోనే కలిసి బ్రతుకుతున్నా..ఆమె మనశాంతికి దూరమౌతుంది. ఏ మనిషికైనా తప్పు చేసినప్పటి కంటే..చేసింది తప్పని తెలిసొచ్చినప్పుడు – బ్రతుకు నరకం గా వుంటుంది. మనసుకి శాంతి కరువౌతుంది. తన వల్ల సాటి ఆడదాని జీవితం భగ్నమైందన్న సత్యం సులక్షణ లో పశ్చాతాపాన్ని కలిగిస్తుంది.
చేతులు కాలాక..అన్న చందాన..సులక్షణ లా పొరబాటు నిర్ణయం తీసుకోకండి అనే సందేశాన్ని మిగిల్చిపోతుంది ఈ పాత్ర!
***
ఇవీ ఈ కథలోని పాత్రలు, వాటి స్వభావాలు, సుగుణాలు.
***
కథా సాహిత్యం లో గుర్తుండిపోయే కథలను అందించే రచయిత్రులలో ఒకరు- శ్రీమతి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ! విభిన్న తరహా కథలకి వీరి కలం ఓ ప్రత్యేకం. ‘కథా మధురం..’ కోసం తన కథ ని అందచేసినందుకు నెచ్చెలి తరఫున అభినందనలతో బాటు ధన్యవాదాలు కూడా తెలియచేసుకుంటున్నాను.
***
ప్రియ పాఠకుల్లారా!
కథామధురంలో కథని, కథపై సమీక్షని చదివి మీ మీ హృదయస్పందనలను నెచ్చెలితో పంచుకోవాల్సిందిగా మనవి.
ఆర్.దమయంతి.
*****
మనోరథం
– దర్భా లక్ష్మీ అన్నపూర్ణ
ఆరోజు వచ్చిన ఉత్తరాన్ని పోస్ట్ బాక్స్ లోంచి తీసి దానిమీద చేతివ్రాతని చూసిన సత్యవతికి అది ఎవరిదో వెంటనే గుర్తుకు రాగానే గుండెల్లో ఏదో తెలియని గగుర్పాటు కలిగింది.
ఒక్క క్షణం అపనమ్మకం!
‘తను అనుకుంటున్నది నిజమేనా! ‘ అన్నసంశయం కలిగింది.
మళ్ళీ పరిశీలనగా- మనస్సులో నిక్షిప్తమైవున్నఏవో పొరల్నికదుపుతూ- వాటితో చేతిలో వున్నదానిని సరిపోల్చుకుని తను అనుకుంటున్నది నిజమేనన్న నిర్ధారణకి వచ్చింది.
ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ ఈ చేతివ్రాతని తను చూస్తుందని ఆమె కలలో కూడా ఊహించలేదు.
‘ఇన్నేళ్ళ తర్వాత తనకి చెప్పవలసింది ఏముందని ఈయన నీ ఉత్తరం వ్రాశారు?’
ఎక్కడో గతకాలపు స్మృతుల్లో నిక్షేపాలుగా మిగిలిపోయిన అనుభూతుల పరిమళాలు హఠాత్తుగా ఙ్ఞాపకాలుగా మారి గుబాళించటానికి ప్రయత్నిస్తున్నాయ్.
అది గతంలోని గాఢమైన ఓ ప్రేమానుబంధపు పరిమళాల్ని మోసుకు వచ్చిన లేఖ అయినందువల్ల ఆమెలో ఓ విధమైన అలజడి ప్రారంభమయింది. తనలో యింకా ఆ ఙ్ఞాపకం వల్ల ఇంత అలజడి కలుగుతుందని ఆమె కూడా అనుకోలేదు. ఆవును మరి – అది ఎంత గాఢంగా తన హృదయపు లోతుల్ని తాకి తన మనస్సులోని – శరీరంలోని ప్రతి అణువులోనూ ఇంధ్రధనుస్సుల్ని పూయించిన అనుబంధమనీ! ఆ ప్రేమలోని వెచ్చదనం, చిలిపితనపు చినుకులూ కలసి ఆ అద్భుతాన్ని చేశాయ్.
ఉత్తరాన్ని చేతిలో పెట్టుకుని సోఫాలో కూర్చుండిపోయింది సత్యవతి. ఙ్ఞాపకాల వెల్లువ ఆమెని ఒక్కసారిగా ఒక్క కుదుపు కుదిపింది! ఆత్రంగా ఆ ఉత్తరాన్ని విప్పి చదవాలని వుంది- ఇందులో తన మనస్సుకి నచ్చే, ఆనందkaramaina విషయం ఆయన చెప్పగలిగింది ఏమీ ఉండదు..అన్న నిర్లిప్త భావమూ కలిగింది.
‘కనీసం యిప్పటిదాకా ఆయన నీకు చేసిందానికి బాధపడుతున్నావంటే నీకు కొంచెం ఆనందం కలుగుతుందేమో! ‘ ఆమె మనస్సులో ఒక్క క్షణంపాటు ఇటువంటి ఆలోచన మెదిలింది. వెంటనే అప్రయత్నంగా సత్యవతి పెదవులమీద చిన్ననవ్వు కదలాడింది.
పరిస్థితులని బట్టి ఒక మనిషికి ఆనందం కలిగించే విషయాలు ఎన్ని రకాలుగా వుంటాయ్ !
‘ఎంతసేపు ఇలాగ? చదవక తప్పదు..’ – అనుకుంటూ ఉత్తరాన్నివిప్పింది సత్యవతి.
‘మరిచిపోయింది అనుకున్న బాధని ఈ ఉత్తరం మళ్ళీ ఏవో మాటలు మోసుకువచ్చి గుర్తు చేయదుకదా..!’ అన్నసంశయం అంతర్లీనంగా ఆమెని భయపెడుతోంది! ఆ విషయం ఆమెకే అంత స్పష్టంగా అర్థం కావటం లేదు.
ఒక విచిత్రమైన మానసికావస్థలో ఉత్తరాన్నిచదవటం ప్రారంభించింది. అందులో యిలా వుంది.
‘ప్రియమైన సత్యవతి!
నువ్వు అనుమతి యిస్తే నిన్నుసత్యా అని సంబోధించాలని వుంది. ఎన్నో వ్రాయాలని వుంది. నువ్వు కుశలం అని భావిస్తాను. మేము ఇక్కడ బాగానే వున్నాం!
సూటిగా అసలు విషయం చెప్పేస్తాను! నిన్ను మళ్ళీ మన యింటికి తీసుకురావాలని వుంది. ఇందుకు సులక్షణ కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకుంది. దయచేసి ఈ వాక్యాన్నిమాత్రం తప్పుగా అర్థం చేసుకోకు. తనవల్ల నీ జీవితానికి అన్యాయం జరిగిందని సులక్షణ చాలా బాధపడుతోంది.
వయస్సుతో పాటు మా యిద్దరి ఆలోచనల్లోనూ పరిపక్వత వచ్చిందని భావిస్తున్నాను. నువ్వు నీ చిరునవ్వుతోకూడిన అంగీకారాన్ని అక్షరాల్లో పొదిగి జవాబు వ్రాస్తే.. సులక్షణా, నేనూ వస్తాం నిన్ను తీసుకురావటానికి. నీ పెదవుల మీది ఈ చిరునవ్వు మిగిలిన నీ జీవితం లోకి ప్రవాహమై పారాలి! ఎంతో పెద్ద ఉత్తరం వ్రాయాలని వుంది. కానీ, మాటలు దొరకటం లేదు. నీ జవాబు కోసం ఎదురు చూస్తూ..
-ప్రహ్లాదరావ్.
ఉత్తరం చదవటం ముగించిన సత్యవతికి అనిపించింది- ఏదో ఒక ఆనంద వీచిక తన హృదయాన్ని తాకుతూ వెళ్ళిపోయినట్టు! అందుకేనా ఆయన ‘ నీ చిరునవ్వు ‘ అంటూ వ్రాసింది ! ఇది ప్రేమపట్ల నమ్మకమా !
అయిదు నిముషాలు ఆలోచించిన సత్యవతికి ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థం అయింది. ఈ సృష్టిలో ప్రతి మనిషీ తనకు ఇష్టం లేని మనిషి కూడా తనని ప్రేమించాలనే కోరుకుంటాడు. ఆ ప్రేమకు బదులుగా ద్వేషాన్ని యివ్వాలనుకుంటాడు గానీ- ఏ మనిషీ ద్వేషాన్నిమాత్రం ఆహ్వానించడు.
ఈ ఆహ్వానాన్నీ -ఈ ప్రేమనీ తను మన్నించాలా?
అప్పుడే అటుగా వచ్చిన సత్యవతి తల్లి శేషారత్నం చేతిలో ఉత్తరంతో దీర్ఘాలోచనలోమునిగిపోయినట్టుగా వున్న కూతుర్ని చూసి కించిత్ ఆశ్చర్యపోయింది. ఉత్తరం వ్రాసింది ఎవరయి వుంటారు?
“సత్యా! ఉత్తరం ఎక్కడ్నుంచి వచ్చింది ? అంత దీర్ఘాలోచనలోపడిపోయావ్ ? అయినా ఇప్పుడు ఉత్తరాలెవరు వ్రాస్తున్నారు ఫోన్లు వచ్చేశాక-? “
‘ఈ ఉత్తరం వ్రాసిందెవరో చెబితే తల్లి గాభరాపడటమో,ఆనందపడటమో, కోపంతో విరుచుకు పడటమో – ఏదో ఒక భావావేశానికి లోనవుతుంది. తప్పదు! ‘ అనుకుంది సత్యవతి. అయినా ,చెప్పక తప్పదు!
“ఫోన్లో చెప్పలేని విషయాలున్నపుడూ, నేరుగా చెప్పలేని- చెప్పటానికి యిష్టం లేని సందర్భాలు ఉన్నపుడు ఎవరయినా ఉత్తరాన్ని ఆశ్రయించవలసిందే! ” సత్యవతి గొంతు మంద్ర స్థాయిలో పలికింది.
కూతురి జవాబు స్పష్టంగా అర్థం కాని శేషారత్నంగారి కనుబొమ్మలు ప్రశ్నార్ధకంగా ముడివడ్డాయ్. అసలు అలాంటి మాట, సందర్భం ఏమిటి?
గుండెలనిండా ఊపిరి పీల్చుకుని అంది సత్యవతి “ఒకప్పుడు నా జీవితంలోకి అడుగిడి నిష్క్రమించిన ప్రహ్లాదరావుగారు! ” తల్లి అమితంగా ఉలిక్కిపడుతుందని ఆమెకి తెలుసు. అలాగే జరిగింది కూడా.
శేషారత్నంగారు నాలుగయిదు నిముషాలపాటు ఏమీ మాట్లాడలేదు. ఆవిడ కళ్ళముందు ఏవేవో దృశ్యాలు కదలాడసాగాయ్. సత్యవతికీ, ప్రహ్లాదరావుకీ వివాహం అయి యిద్దరూ సుఖంగా సంసారం చేసుకుంటున్నఅందమైన దృశ్యాలు, ఆ తర్వాత ప్రహ్లాదరావ్ పని చేస్తున్నస్కూల్లోనే సులక్షణ టీచర్ గా రావటం, ప్రహ్లాదరావ్ జీవితంలోకి తొంగి చూడటం, యిద్దరూ ఒకరి ఆకర్షణలో ఒకరు పడిపోవటం, అది తెలిసి సత్యవతి తల్లడిల్లిపోవడం..ఆ పైన నిర్ణయం తీసుకుని, ప్రహ్లాదరావు జీవితంలోంచి నిష్క్రమించాలని ఆమె గట్టి నిర్ణయం తీసుకోవటం- అప్పుడు ప్రహ్లాదరావ్ మౌనం వహించటం- అన్నీ వెంటవెంటనే జరిగిపోయాయి. ఆ తర్వాత – అప్పటి నుంచీ యిప్పటివరకూ సత్యవతి మోడువారిన జీవితాన్నిగడుపుతోంది!
తల్లి మనస్సులో గతకాలపు స్మృతులు తుఫానులా భీభత్సం సృష్టిస్తున్నాయని సత్యవతి ఊహించింది.
నిజానికి తన జీవితంలోని లోటుని చూస్తూ తనకన్నాకూడా ఎక్కువ ఆవేదనని అనుభవించి ఉంటుంది ఆ తల్లి హృదయం!
“నన్నుమళ్ళీ ఆయన తన జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు! అందుకు సులక్షణ కూడా ఒప్పుకుందిట!” – సత్యవతి వదనం, పలుకులు కూడా నిర్వికారంగా వున్నాయ్.
శేషారత్నంగారు హఠాత్తుగా ఆలోచనల్లోంచి తేరుకుంటూ అన్నారు”ఒక్క నిముషం! నీకూ నాకూ కాఫీ తెస్తానుండు.” అలా అంటూనే ఆవిడ కాఫీ చెయ్యటం కోసం వంటింట్లోకి వెళ్ళిపోయారు. తల్లి తీరుకి చిన్నగా నవ్వుకుంది సత్యవతి.
మనస్సులో ఏదయినా గందరగోళ పరిస్థితి ఉన్నపుడూ, ఆనందంగా ఉన్నప్పుడూ కూడా అమ్మ కాఫీని ఆశ్రయిస్తుంది.
ఉత్తరం ద్వారా వచ్చిన ఈ ఆహ్వానం తల్లికి ఆనందాన్నేకలిగిస్తుంది. ఎప్పుడో అప్పుడు కూతురు భర్త నీడలో వుంటే చాలుననుకునే తల్లి మనస్తత్వం ఆవిడది. అది ఓ సగటు తల్లి మనస్తత్వం! అమ్మఅప్పుడే తనని ప్రహ్లాదరావుగారి దగ్గరికి పంపించెయ్యటానికి నిర్ణయం తీసేసుకునే వుంటుంది.
ఈ విషయంలో తను ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. ముందు రాబోయే జీవితంలో తను ఈ ప్రపంచంనుంచి నిష్క్రమిస్తే కూతురు ఒంటరిదయిపోకూడదని ఆ తల్లి తాపత్రయం. అన్నదమ్ములు ఉన్నా, వాళ్ళ చెంతకి తను చేరదని అమ్మకి తెలుసు.
తన అన్నదమ్ములు – ముందు కొన్నాళ్ళు ఆయన మీద కోర్టులో కేసు వెయ్యాలని కోపంతో ఊగిపోయారుగానీ, అందువల్ల వాళ్ళకి లేనిపోని చికాకులూ, ఇబ్బందులూ కలగటం తనకి యిష్టం లేక ససేమిరా వద్దంది. తన జీవితానికి అవసరమైన ఆర్థిక భద్రత కల్పించటానికి ఆయనే ముందుకు వచ్చారు.
ఆయన నుంచి ఆర్థిక సహాయం తీసుకోవటానికి తనకి యిష్టం లేకపోయినా అన్నదమ్ములకి తను భారం కాకూడదన్నఉద్దేశ్యంతో ఒప్పుకుంది.
కొన్నిలక్షలు తన పేరున బాంకులో జమచేశారు ఆయన.
స్త్రీ తన పౌరుషాన్నీ, ఆత్మాభిమానాన్నినిలుపుకోవటానికి, తన వ్యక్తిత్వాన్ని ఉన్నత స్థితిలో నిలుపుకోవటానికీ ఆర్థికంగా స్వతంత్రురాలై వుండటం ఎంత ఆవశ్యకమైనదో..తనకి బాగా తెలిసింది ఆ క్షణంలోనే!
ప్రేమాభిమానాలతో ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకుంటున్నపుడు ఈ స్వతంత్రం, స్వేచ్ఛ అన్న పదాల అవసరం వుండదు అనిపిస్తుంది. ఆవి ఏమాత్రం ,రవ్వంతయినా లోపించినా ఈ రెండు భావాలూ మనస్సులో విజృంభించటం ప్రారంభిస్తాయ్.
తను కాలక్షేపానికి ఒక స్కూల్లో చేరింది. మనిషికి ఏదో ఒక కాలక్షేపం అంటూ వుండాలి. ఆయన తనని కాదు అన్న కొత్తలో పెనుదుఃఖంతో కాలక్షేపం చేసింది. నెమ్మదిగా కాలం చూపించిన ప్రభావంతో మనస్సు నెమ్మదించటం ప్రారంభించి , కాలగమన వేగం తగ్గిపోయి మనస్సుకి పిచ్చెక్కుతున్నట్టుగా అనిపించసాగింది. అప్పుడు ఏదో ఒక పని చెయ్యవలసిన ఆవశ్యకత కనిపించింది.
ఆలోచిస్తూ గతంలోకి వెళ్ళిపోయిన సత్యవతి మనస్సు వర్తమానంలోకి వచ్చింది.
రాగానే యిప్పటివరకూ జరిగిన అనుభవాలతో ఎంతో నిబ్బరంగా మారిపోయిందనుకున్నతన మనస్సు ఈ ఉత్తరం చూడగానే అలజడికి గురవటం జ్ఞాపకం వచ్చింది ఆమెకి.
ఏమిటీ అలజడి?! ప్రేమ అనేది ఒకసారి ఒకచోట పుట్టాక పరిస్థితుల ప్రభావంవల్ల , వైకల్యం వల్ల అది చెదిరిపోయినా వాటిమూలాలు లోపల్లోపల తెలియకుండానే తిష్టవేసి వుంటాయా? లేకపోతే తనలో ఏమిటీ అలజడి! ఈ ఉత్తరం వ్రాసిన మనిషికీ తనకీ అనుబంధం తెగిపోయి ఎన్నాళ్ళయిందని! ఏదో గతజన్మలోని విషయం లాగా మరుగున పడిపోయింది. అలాంటిది మళ్ళీ యిప్పుడు…వేసి వుంటాయా? లేకపోతే తనలో ఏమిటీ అలజడి! ఈ ఉత్తరం రాసిన మనిషికి తనకీ అనుబంధం తెగిపోయి ఎన్నాళ్ళయిందని! ఏదో గతజన్మలోని విషయం లాగా మరుగున పడిపోయింది. అలాంటిది మళ్ళీ యిప్పుడు..
అమ్మ మనస్సు ఆనందంగా ఉందని తెలుస్తోంది. తన మనస్సూ ఆనందంగానే వుంది.
ఎదుటివారి నుంచి ప్రేమతో కూడిన శాంతియుతమైన ఓ ప్రతిపాదన వచ్చినపుడు ఏ మనిషి మనస్సు మాత్రం సంతోషించదు! శాంతం, ప్రేమ దైవస్వరూపాలు. వాటికి ఆనందం యిచ్చేశక్తి వుంటుంది.
శేషారత్నంగారు యిద్దరికీ కాఫీ కలుపుకుని తీసుకు వచ్చారు. తల్లి చేతిలో కాఫీ కప్పు అందుకుంటూ అనుకుంది సత్యవతి-నిజానికి తనకి అన్నిసార్లు కాఫీ త్రాగటం ఇష్టం వుండదు. తల్లి కోసం అప్పుడప్పుడు త్రాగుతూ వుంటుంది.
మరి ఈ విషయంలో అమ్మ కోసమని చెప్పి తను ఆవిడ ఆలోచనలకి అనుగుణంగా మసులుకోగలదా? ఆవిడకి నచ్చినట్టుగా నిర్ణయం తీసుకోగలదా?
తన మాజీ భర్త ఒకప్పటి ఆలోచనా తీరులోని కఠినత్వాన్నీ, విశృంఖలత్వాన్నీ తను మర్చిపోగలదా? అన్నట్లు ఇప్పుడు ప్రహ్లాదరావ్ మాజీ భర్త అంటే అమ్మ ఒప్పుకోదు. ఎందుకంటే తను ఆయనకి విడాకులేం ఇవ్వలేదు. కలసి వుండటానికీ, విడిపోవటానికీ మనస్సు ప్రధానం గానీ తనకి వాటితో పని లేదు అనిపించింది. ఉండటం అంటూ వుంటే ఆ పని ప్రహ్లాదరావుగారికి వుండాలి- ఆ ప్రేయసితో వివాహాన్నిచట్టబద్ధం చేసుకునేందుకు.
శేషారత్నంగారు కాఫీ త్రాగటం పూర్తిచేసి లేచివెళ్ళి తను రోజూ పూజించుకునే భగవంతుని ముందుకి వెళ్ళి కూర్చున్నారు. కొన్ని ఆలోచనలు మనస్సుని గందరగోళపెడుతున్నా కూతురు చెప్పిన ఆ ఒక్కమాటా మాత్రం ఆవిడకి నచ్చుబాటుగా వుంది.
అందుకే భగవంతుడి ముందు కూర్చున్నారు ఇది జరిగేలా చూడమని ప్రార్ధిస్తూ!
“అమ్మా-నేనలా కామేశ్వరరావుగారి యింటికి వెళ్ళి వస్తాను! ” చెప్పులు వేసుకుంటూ అంది సత్యవతి.
“ఆగు సత్యా! ఇప్పుడెందుకు అక్కడికి!” శేషారత్నంగారు ఆశ్చర్యంగా అన్నారు.
ఇది సత్యవతి ఊహించని ప్రశ్నేం కాదు.”అదేమిటమ్మా-నిన్నటికీ, యిప్పటికీ పరిస్థితులేం మారిపోయాయని? ఇంకో రెండు రోజుల్లో ఆయనకీ నాకూ వివాహం జరగబోతోంది! ఆ ఇంటి బాధ్యతలు నావిగా భావించాను! ఇవ్వాళ వాళ్ళమ్మాయికి పెళ్ళిచూపులు”
“నువ్వు ఎక్కవలసిన రైలు మారింది-నీ ప్రయాణపు దిశ మారింది!”
“అది ఎప్పటికీ మారదు!” తల్లి జవాబుకోసం ఎదురుచూడకుండా చెప్పులేసుకుని వెళ్ళిపోయింది సత్యవతి.
***
ఇక కూతురు ఇంటికి తిరిగి వచ్చేవరకూ శేషారత్నంగారు కాలుగాలిన పిల్లిలా అటూ యిటూ తిరుగుతూనే వున్నారు. ఏ విధంగా చెబితే సత్య వింటుంది అన్నదే ఆవిడ ఎదురుగా ఉన్న ప్రశ్న!
ఈ కామేశ్వరరావుగారు సత్యవతికి సత్సంగంలో మిత్రుడు. ఆరునెలల క్రితం భార్యావియోగం కలిగిందాయనకి. లేటు వయస్సులో పుట్టిన ముగ్గురు ఆడపిల్లల బాధ్యత, భార్య మీద వుండే అమితమైన అనురాగం వల్ల ఆయన అనారోగ్యానికి లోనయ్యారు. లేచి చురుగ్గా తిరగలేని పరిస్థితి.
ఆయనకి అండగా నిలబడాలనుకుంది సత్యవతి.
అప్పట్నుంచీ కూడా కూతురి ఆలోచనాతీరులో ఒక విధమైన స్పష్టత, నిదానం వుండటం ఆవిడకి తెలుసు.
కానీ ఇక్కడ వేరు!
ఇన్నాళ్ళూ తనని దూరంగా పెట్టాడన్న పగ, ప్రతీకారంతో, ద్వేషంతో ఆలోచనల్లో గందరగోళం వుండవచ్చు.
తల్లి పరిస్థితి ఊహించే సత్యవతి ఇంటికి తొందరగా వచ్చేసింది. శేషారత్నంగారు మళ్ళీ కూతురికి నచ్చచెప్పే ప్రయత్నం మొదలు పెట్టారు.
“అతగాడు నీకు అన్యాయమే చేసాడు. ఒప్పుకుంటాను. కానీ, ఇది వాటన్నిటినీ మర్చిపోవలసిన సమయం. తప్పు తెలుసుకుని పశ్చాత్తాప పడటం కన్నా గొప్ప విషయం ఇంకేమీ వుండదు. ఈ వయస్సులో నిన్ను ఆహ్వాఇస్తున్నాడూ అంటే అదేగా అర్ధం!”
“అదే అర్ధం కావచ్చు.- అయినా నేను వెళ్ళాలనుకోవటం లేదు.”
“ఆయనే కాకుండా ఆవిడ కూడా నిన్ను ఆహ్వానిస్తోందీ అంటే ఇంక కావలసింది ఏం వుంటుంది?”
“ఏమిటమ్మా నీ గొడవ? ఇప్పుడేం పెద్ద మార్పు జరిగిపోయిందని? నాకు ఈ రోజు కూడా నిన్నటిలాగానే వుంది!” సత్యవతి చాలా మామూలుగా అంది.
ఈ మాటకి ఇక ఆ తల్లి ఆశ్చర్యానికి అంతు లేదు. అందుకే ఏదో అనుమానంగా అన్నారు.
“పోనీ నీ దగ్గరున్న డబ్బుకోసం ఆయన ఆశ పడుతున్నాడూ అంటే అదంతా ఏ అనాథాశ్రమానికో వ్రాసేసి మీ దగ్గరకి వస్తానని చెప్పు. ఏమంటాడో చూద్దాం!”
“ఈ వయస్సులో నా డబ్బుతో వాళ్ళు పొందే లబ్ధి ఏం వుంటుందమ్మా! వాళ్ళకీ పిల్లలు లేరు!”
“అయితే ఇప్పటిదాకా చేసిన తప్పిదాలకి క్షమాపణలు చెబితేనే వస్తానని చెప్పు!” కూతురి మనస్సులో ఏం ఉందో తెలుసుకోవటానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు శేషారత్నంగారు.
సత్యవతి కూర్చున్న చోటునుండి లేచి ఆరిన బట్టలు తెచ్చి మడత పెట్టడం మొదలు పెట్టింది.
“ఇప్పుడు ఈ వయస్సులో మనస్సుల్లో క్రొత్త బంధం ఏ మాత్రం ఇముడుతుందని!నిన్నటిదాకా వున్న పరిస్థితి వేరు. ఈ రోజు పరిస్థితి వేరు. నువ్వు వున్నన్నినాళ్ళూ ఆయనతో కలసి జీవించాలి. ఒకప్పుడు మీవి కలసిన మనసులు. అది చాలు యిప్పటి సానుకూలానికి. మొన్నటి రోజున ముందు ముందు జీవితంలో నువ్వు ఒంటరిగా వుండవలసి వస్తుందని కామేశ్వర్రావుగారితో వివాహం అనుకున్నాను. ఆడపిల్లలు కూడా అభిమానంగా వుంటారులే అని కూడా!”
వీళ్ళిలా మాటల్లో వుండగానే సత్యవతి స్నేహితురాలు హేమలత వచ్చింది.
శేషారత్నంగారు తన మనస్సులోని బాధని చెప్పుకుని “నువ్వయినా నీ స్నేహితురాలని ఒప్పించటానికి ప్రయత్నించు హేమా!” అన్నారు.
ఎలాగో అలా ఈ వివాహానికే అడ్డుపుల్ల వేస్తే సమస్యకి పరిష్కారం దొరుకుతుందనుకున్న హేమలత “మీ అమ్మగారు చెప్పినట్టు ఈ వయస్సులో వివాహానికి ఏ విధంగా ప్రయోజనం వుంటుందని?” అంది.
“నేను ఆయనకి సహాయంగా ఉండాలనుకున్నాను!”
“అందుకు వివాహం ఎందుకు?”
“అవును-ఈ వయస్సులో మళ్ళీ పెళ్ళి ఏమిటి?పోనీ-యిన్నాళ్ళూ నీలో పేరుకుపోయొన కోపాన్నీ, కసినీ ఆయన ముందు బయటపెట్టి మనస్సుని తేలిక చేసుకుని – అప్పుడు ఆయన చెప్పిన మాట గురించి ఆలోచించు!” శేషారత్నం గారు మళ్ళీ యింకో ప్రయత్నం చేశారు.
“యిక నా జీవితం గురించి తాపత్రయపడటం మానెయ్యమ్మా!”
“పోనీ ఆ సులక్షణని పంపించేస్తేనే వస్తానని చెప్పు!”
“అమ్మా!” ఇంక చాలు నీ ఊహాగానాలు..అన్నట్టుగా అంది సత్యవతి.
“అసలు యిటువంటి సందర్భాలలో..మగవాడు చెడ్డవాడు, స్త్రీకి ద్రోహం చేస్తున్నాడు అంటూ నెత్తీ, నోరూ కొట్టుకుంటూ మైకులు పట్టుకుని అరుస్తూ ఉంటాం కానీ-అసలు స్త్రీకి స్త్రీయే శతృవు! ఆడదానికి ఆడదే ద్రోహం చేస్తోంది. అసలు ఆ సులక్షణకి అప్పటికే పెళ్ళయిన ప్రహ్లాదరావుని ప్రేమించాననటం తప్పు కదూ!. పేరుకే సులక్షణ!” అన్నారు శేషారత్నంగారు.
నువ్వు ఎంత చెప్పినా నా నిర్ణయం మారదన్నట్టుగా సత్యవతి ఓ చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది.
“యిక నువ్వేదయినా చెప్పటానికి ప్రయత్నించు హేమా!” శేషారత్నంగారు నీరుగారి పోయారు.
“ఇప్పుడు కామేశ్వరరావుగారితో నీ వివాహం అవసరమా?” హేమలత స్నేహితురాలి కళ్ళల్లోకి చూస్తూ అంది.
“నేను ఆయనకి సహాయంగా ఉండాలనుకున్నాను. ఈ సహాయం రెండు రోజులతో ముగిసిపోయేది కాదు. అందుకే వివాహం అనుకున్నాం. ఎప్పటికీ వుండేది ఆ మిత్ర బంధమే!”
“రాముడిలా సంఘానికి భయపడుతున్నావా?”
“ఎప్పుడూ తన సుఖం, తన స్వేచ్ఛ అనుకునేవాళ్ళకి అలాగే అనిపిస్తుంది! రాముడ్నినీ మానసిక స్థితిలో చూడకు!
“వ్యక్తే సంఘానికి ప్రతీక!”
“అందుకే రాముడు చాకలివాడి మాటలకి అంతటి ప్రాధాన్యతనిచ్చాడు. సంఘజీవితంలో ఇతరుల నడవడికని ఒక పద్ధతిలో వుంచటానికి వివాహం అనుకున్నాం. అవునూ- స్త్రీ పడే కష్టాల గురించి ప్రస్తావించే సందర్భం వస్తే రాముడు సీతను అడవులకు పంపించెయ్యటమే ఙ్ఞాపకం వస్తుంది అందరికీ! నాకెందుకోఅది సరి కాదనిపిస్తుంది. రామాయణాన్నిమనం విన్నప్రతిసారీ ఒక అనిర్వచనీయమైన అనుభూతితో వింటాం. సీతాదేవికి మన హృదయాల్లోవున్న స్థానం మహోన్నతమైనది. కనుక ఒక చాకలివాడు ఏదో అన్నాడని రాముడు సీతను అరణ్యాలకి పంపించెయ్యాలా? అని అనిపిస్తుంది.
అక్కడ రావణాసురుడి చెరలో సీత ఎలా వుందో, ఆమె ఎంతటి శక్తిమంతురాలో మనకి వాల్మీకి మహర్షి అర్థమయ్యేలా చెబుతూ వుంటాడు.
కానీ ఆ చాకలివాడు అలా కాదుగా! అప్పటి వర్తమానంలోవున్న అతి సాధారణ మానవుడు! సీతమ్మతల్లి మహాసాధ్వి అని అతగాడికీ తెలుసు. కానీ పరిస్థితుల పట్ల ఇష్టం లేనితనం! స్పష్టత లేకపోవటం. అందుకే రాముడిని వెర్రి రాముడిగా భావించాడు సీతను వెనక్కి తెచ్చుకోవటంలో! నలుగురూ అనుకుంటున్నదానికి రాముడు ప్రాధాన్యతనివ్వలేదని అతగాడి భావం.
ప్రజల దృష్టిలో రాముడు వెర్రివాడయితే ఆ రాజ్యప్రజల మంచి చెడ్డలు నిర్దేశించటంలో ఆయనకి పట్టు వుండదు.
ఒకవేళ సీత రాజ్యంలోనే వుంటే రాముడ్ని వెర్రిరామయ్య అన్నందుకు అంతకన్నా ఎక్కువగా బాధపడి వుండేది
యిక్కడ రాముడు ఒక మహారాజుగా ఒక ప్రాపంచిక ధర్మాన్నినిలబెట్టటానికి ఒక అలౌకికమైన ప్రేమ మార్గాన్ని విశ్వసించాడు.
అది-ఎక్కడ వున్నా ఎలా వున్నా సీతా, తనూ వేరు వేరు కాదు.
పాట్టాభిషిక్తుడవు కమ్మన్నప్పుడూ, అరణ్యవాసాలకి వెళ్ళమన్నప్పుడూ కూడా రాముడు ఒకే విధంగా స్పందించాడట! సీత ఎలాంటి పరిస్థితినయినా ఎదుర్కోగల ధీశాలి అని రాముడికి తెలుసు! అయినా ప్రేమాతిశయంతో దుఃఖించాడు.
సంఘాన్ని ఒక పద్ధతిలో నడిపించగల ఒక ధర్మం కావాలి. లేకపోతే అది కప్పల తక్కెడలా అవుతుంది. సంఘంలో ప్రతివాడి మనస్సూ స్వయంగా నిభాయించుకోగల శక్తి కలదయి వుండదు. ఎన్నోబలహీనతలు కలవాళ్ళు వుంటారు. వాళ్ళని శాసిస్తూ అదుపులో పెట్టగల ఒక సాంఘిక దండం కావాలి. సంఘం అనే భయమే వాళ్ళని చెడ్డవాళ్ళుగా మారకుండా చేస్తుంది.
మనం చేసే ప్రతిపనీ మనకోసమే అయివుండాలి అనుకోవటం – ఒక సగటు మనస్తత్వం వున్నవాడు చేసేపని. నేనూ, నా సుఖం, నా స్వేచ్ఛ…ఎప్పుడూ ఇదే భావంతో జీవిస్తే జీవితం ఒక సమయంలో రసహీనంగా వుండి విసుగు పుడుతుంది.
అప్పుడప్పుడు పక్కవాడికోసం జీవించటంలో ఆనందం వుంది. మళ్ళీ ఆ ఆనందం నీదే అవుతుంది. చివరిగా అనుభూతులు నీ సొంతమే! ఆలోచన ఇంకొకరికోసం!
స్వేచ్ఛ అనే మాట స్వార్ధానికి సంకేతంగా, ప్రత్యామ్నాయంగా వుండకూడదు. ఎదుటి వారికి స్వేచ్ఛ కలిగించటంలోనూ మన స్వేచ్ఛ దాగివుంటుంది. అది విశృంఖలమైన స్వేచ్ఛాలాలస బంధనం నుండి లభించే స్వేచ్ఛ.
సంఘంలో ప్రతి వ్యక్తీ తన ప్రవర్తనా ధర్మంగాఈ సంఘానికి పాలకుడే! అందుకే బాధ్యతతో వ్యవహరించాలి.
సీత రాముడితో ఎందుకు వెనక్కి రాలేదూ…తన స్వాభిమానం రాజ్యానికి మేలు చేయాలని! రాముడి మీద కోపంతో కాదు! నేను సీత అంతటి వివేకవంతురాలిని! అఫ్ కోర్స్! నా భర్త రాముడిలా ప్రవర్తించలేదు!
అన్నిటికన్నా ఒక స్త్రీగా జాలి గుండె గలదాన్ని! ఒక స్త్రీ మరొక స్త్రీకి రక్షణ కవచం కావాలని భావించేదాన్ని! భర్త ప్రేమని యింకొకరు భాగం పంచుకుంటూ వుంటే ఆ బాధ ఎలా వుంటుందో నాకు తెలుసు. ఆ బాధ నావల్ల యిప్పుడు సులక్షణకి కలగ కూడదు!
నేను ఆయనకి దూరంగా జీవించటాన్ని అలవాటుపడిపోయాను! అందుకే నేను ఆయన దగ్గరకి వెళ్ళ కూడదనే నిర్ణయించుకున్నాను!”
శేషారత్నంగారికీ, హేమలతకీ కూడా ఆమె మాటల్ని కాదనాలనిపించలేదు మరి!
ఆమె మనోరథం వేయి సూర్యుళ్ళ కాంతితో వెలిగిపోతున్నట్టుగా వుంది!
***
(అపూర్వ చిత్ర సహకారంతో కౌముది-రచన కథలపోటీలో బహుమతి పొందిన కథ.)
***
రచయిత్రి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ పరిచయం :
పుట్టింది తూర్పుగోదావరిజిల్లా, ఊబలంకలో.
ప్రస్తుతం ఉంటున్నది బెంగుళూరులో.
వీరి భర్త ఇస్రో లో సైంటిస్టుగా చేశారు.
వీరి అబ్బాయిలిద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు.
వీరి కథలు, నవలలు ఆంధ్రప్రభ, పత్రిక, జ్యోతి, రచన, ఈనాడు, స్వప్న, ఆంధ్రభూమి మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి.
కొన్ని కథలకీ, నవలలకీ బహుమతులు కూడా అందుకున్నారు.
*****
ఆర్.దమయంతి
పలు వార మాస పక్ష దిన పత్రికలలో సబ్ ఎడిటర్ గా పని చేసిన అనుభవం వుంది. వంద పైని కథలు, అనేక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. సమీక్షలు, సినిమా రివ్యూలు, ఇంటర్వ్యూలు చేయడం అంటే తెగని మక్కువ. ఘాటైన విమర్శలతో సాహితీ వేత్తలని బెంబేలెత్తించడం కంటే, రచనల్లోని మంచిని గుర్తించి ప్రశంసించడం మంచిదంటారు. పొరబాట్లుంటే, సద్విమర్శతో సూచించడమూ మేలైన రచనలు అందుతాయనీ, తద్వారా ఉత్తమసాహిత్యాన్ని చదవగల అవకాశంవుంటుందనీ, అదే తను చేయగల సాహితీ సేవ అని అభిప్రాయపడతారు.
కథ కాని కథ, ఈ కథ ఎందుకు నచ్చిందంటే, నేను చదివిన కథ వంటి అనేక శీర్షికలను వివిధ ఆన్లైన్ మాగజైన్స్ – సారంగ, వాకిలి, సాహిత్యం (గ్రూప్) లో నిర్వహించారు.
ప్రస్తుతం ‘సంచిక’ ఆన్లైన్ మాస పత్రికలో ‘ట్విన్ సిటీస్ సింగర్స్ ‘ ఫీచర్ ని, ‘ తెలుగు తల్లి కెనడా ‘ మాస పత్రికలో ‘సిరిమల్లె చెట్టుకింద ..’ అనే శీర్షికలని నిర్వహిస్తున్నారు.
వీక్షణం (బే ఏరియా సాహిత్య సాంస్కృతిక సంస్థ0, తెలుగు జ్యోతి (న్యూజెర్సీ ) వార్షికోత్సవ పత్రికలలో ఆర్.దమయంతి గారి కథలు ప్రచురితమయ్యాయి. ఆంధ్ర భూమి వారపత్రిక, స్వాతి (వీక్లీ, మంత్లీ) నవ్య వీక్లీ, మయూరి పత్రికలలో తో బాటు ఈమాట, కినిగె, వాకిలి, పొద్దు, సారంగ, లలో కూడా అనేక కథలు పబ్లిష్ అయ్యాయి.
రచయిత్రి ప్రస్తుతం – నార్త్ కరొలినా (అమెరికా) లో నివసిస్తున్నారు.