చాతకపక్షులు  (భాగం-14)

(తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల)

– నిడదవోలు మాలతి

          తరవాత రెండు నెలల్లో మరో మూడు పార్టీలు అమెరికన్ల ఇళ్లలోనూ, ఇండోఅమెరికను ఇళ్లలోనూ అయ్యేయి. తపతి మళ్లీ ఎక్కడా కనిపించలేదు. 

          క్రమంగా గీతకి ఇక్కడి జీవనసరళి బోధపడసాగింది.. ఓసాయంత్రం రాధ ఫోన్ చేసింది వాళ్లింట్లో పాట్‌లక్కి పిలవడానికి . హరి ఫోన్ తీసుకుని, సంగతి విని. “అలాగే, వస్తాంలెండి.” అన్నాడు.

          “గీతగారికి ఇంకా కొత్త కదా. ఈసారికి వదిలేస్తాం. ఏం తేనక్కర్లేదని చెప్పండి” అంది రాధ.

          “అయ్యో. అలా అంటారేమిటండీ. గీతకి కొత్త కానీ నాకు కాదు కదా. నేను చేసి తెస్తాను ఏదైనా,” అన్నాడు హరి.

          రాధ నవ్వి, “సరేలెండి. మీఇష్టం. తేకపోయినా మేం అపార్థం చేసుకోం.” అంది.

          హరి నవ్వి ఫోను పెట్టేసి, గీత వేపు తిరిగి “రాధ. శనివారం వాళ్లింట్లో పాట్‌లక్కి అని చెప్పడానికి పిలిచారు” అన్నాడు.

          గీతకి భాగ్యంగారింట్లో తపతి అవస్థ చూసిన తరవాత పార్టీలంటే ఆసక్తి తగ్గింది. 

          “ఏమిటండీ ఈపార్టీలు, వారాలు చేసుకున్నట్టు” అంది, చిరాకు దాచుకోడానికి విశ్వప్రయత్నం చేస్తూ.

          “చెప్పేను కదా. ఇక్కడ నలుగురూ కలుసుకోడానికీ, మంచీ చెడ్డా మాటాడుకోడానికీ ఇదొక్కటే వెసులుబాటు అని. అయినా రాధఇంట్లో పార్టీ వేరుగా వుంటుందిలే. ఇక్కడి మంద వేరు.”

          గీతకి అర్థం కాలేదు. “ఆఁ?” 

          “భాగ్యంగారింటికి వచ్చినవాళ్లు ఇక్కడ నిలదొక్కుకు స్థిరపడిపోయినవాళ్లు. వాళ్ల తాపత్రయాలు వేరు. రాధఇంటికి వచ్చేవాళ్లంతా యువతరం. వీళ్ల ధోరణి ముందొకసారి చూశావు కదా.”

          “ఎప్పుడు?”

          “అదే నువ్వు వచ్చినరోజున మనింటికి వచ్చేరు చూడూ, వాళ్లే. సుమతీ, టేష్, విశ్వం, గణపతీ,.. ఆకోవలోవాళ్లే మరో నలుగురు వచ్చినా రావచ్చు.”

          “ఆహా” అంది గీత అర్థమనస్కంగా. 

          “తపతిగారు కూడా రావొచ్చు” అన్నాడు హరి.

          “రాధగారు చెప్పారా?” అంది. తపతిమాట ఎందుకొచ్చిందో అర్థం కాక.

          “లేదు. రాధకి వరసకి మేనత్త అవుతారావిడ. అంటే ఆవిడ వీళ్లకి పెద్ద దిక్కన్న మాట” అన్నాడు హరి నవ్వుతూ. 

          తపతి వస్తుందేమో అన్నమాటతో గీతకి రవంత ఉత్సాహం వచ్చింది. 

          “అయితే ఏం చెయ్యను పాట్‌లక్కి?” 

          “నువ్వింకా కొత్తపెళ్లికూతురివే అన్నారు రాధగారు. ఈసారికి నిన్ను వదిలేశార్ట.”

          “ఇంకా పెళ్లికూతురేమిటండీ. నాప్రాణానికి కొన్నియుగాలు అయిపోయినట్టుంది” అని, “బజ్జీలు చెయ్యనా? చులాగ్గా అయిపోతాయి.”

          “మిరపకాయ బజ్జీలా?”

          గీత తల అడ్డంగా ఆడించింది నవ్వుతూ. 

***

          శనివారం సాయంత్రం ఐదున్నర అయింది గీతా హరీ రాధా మాధవుల ఇంటికి వచ్చేసరికి.

          వాళ్లది మూడు గదుల చిన్నయిల్లు. వూరికి తూర్పుదిక్కున వుంది. అభివృద్ధి అంతా పశ్చిమదిక్కునే. ఆ విధంగా కూడా తరతమ బేధాలు తెలుస్తాయి ఎవరు ఏ దిక్కున వున్నారు అన్నదాన్నిబట్టి. ఇల్లు చిన్నదయినా ముచ్చటగా వుంది. ముందు గదిలో టీవీ, స్టీరియో వున్నాయి. గోడమీద బాలాజీ బొమ్మా. పిల్లల ఫొటోలూ వున్నాయి. 

          ఆరు అయ్యే సరికి అందరూ పోగయ్యేరు తలో గిన్నే పుచ్చుకుని. గీత పూరీ, కూరా చేసింది. సుమతి కోక్, టేష్ కేక్ కొని తెచ్చేరు. టేష్ వాళ్ల ప్రొఫెసరుగారు పెసరపప్పు దాల్ తెచ్చారు. రాధ ఫ్రైడ్ రైస్, వైట్ రైస్, రైతా, సాంబారు, వంకాయకూరా చేసింది. భాగ్యంగారు పులిహోరకి నిలయవిద్వాంసులు. ఆవిడ వస్తారంటే మరెవరూ చెయ్యరు ఆ వంటకం. ఇంకా చిప్స్, crackers, ఛీస్ ముక్కలూ, బీరూ, జూసూ కూడా పెట్టేరు బల్లమీద. 

అందరూ తలో ప్లేటు పుచ్చుకుని మాటల్లో పడ్డారు. 

హరి చెప్పినట్టే ఆరోజు అక్కడ చేరిన వారందరూ కుర్రాళ్లే, భాగ్యంగారూ, హనుమయ్య గారూ తప్పిస్తే. చదువుకుంటున్నవాళ్లూ, చదువు అయి వుద్యోగాలవేటలో పడ్డవాళ్లూను. వీళ్ల మొహాల్లో రేపెలా అన్న చింత కనిపించదు. భవిష్యత్తు గురించిన బెంగలుండవు. రాజెవరికొడుకన్నంత ధీమా వాళ్లమొహాల్లో. చదువులకయ్యే ఖర్చులూ, రిటైరయిన తరవాత ఏంచెయ్యాలిలాటి అంశాలు లేవు వాళ్లసంభాషణల్లో. వాళ్లమాటల్లో దొర్లుతున్నవి ప్రొఫెసర్లమీదా, బాసులమీద… జోకులూ, సినిమాలూ, రాజకీయాలూ.

          “దాల్ చాలా బాగుంది. మీరే చేసేరా? రిసెపీ ఇవ్వాలి నాకు” అన్నాడు టేష్ వాళ్ల ప్రొఫెసరుతో, బీరు చప్పరిస్తూ.

          ఆయన తనప్లేటులోకి పరీక్షగా చూస్తూ, “లెటస్ సీ. మొదట ఒక కప్పు పెసరపప్పు ఓక క్వార్టు గిన్నెలో పోసి, రెండున్నర కప్పులు నీళ్లు పోసి …” అంటూ పావుగంట సాగదీశాడు. 

          గీతకి నవ్వొచ్చింది. ఇంత పెసరపప్పు ఉడకపెట్టి ఉప్పూ, జీలకర్రా చల్లితే పోయేదానికి ఆయన ఓ క్రతువులా వివరిస్తున్నాడు. అంతకంటె తమాషా టేష్ అంత ఉత్సాహంగానూ చెవులప్పగించి వినడం. 

          గీతకి ఎడంవేపు కూర్చున్న భాగ్యంగారు గీతని పలకరించేరు, “మీరేమి తెచ్చారు?” అంటూ. 

          గీత చెప్పింది. “అలానా. ఈకూర మీరు చేసినదేనా? చానా బాగుంది. మావారికి ఈపాట్లక్కులూ అవీ పట్టవు. మనింటికి పిలిస్తే మనమే చెయ్యాలి అంటారు.” అందావిడ కంచంలో అన్నం పప్పూ కెలుకుతూ. 

          వారిపల్లెలో వారు సామంతులు. కులపెద్దలుట! ఆవిడ మాటలోనూ తీరులోనూ ఆ రాజసం కనిపిస్తుంది. వాళ్లింట్లో భోజనాలంటే పింగ్‌పాంగ్ బల్ల నిండిపోతుంది ఆవిడ చేసిన వంటకాలతో. మళ్లీ ఒక్క వస్తువు కూడా ముందురోజు చెయ్యరు. స్వామివారి నైవేద్యానికి పనికిరాదని. 

          భోజనాలు అవుతుండగానే, టేష్ తను తెచ్చిన జురాసిక్ పార్క్ కెసెట్ పెట్టేడు విసిఆర్‌లో. గీతకి సైన్సు ఫిక్షను ఆసక్తి లేకపోయినా వాళ్ల ఉత్సాహం చూస్తుంటే సరదాగానే వుంది. 

          దాదాపు అందరూ తినడం అయిపోయింతరవాత వచ్చింది తపతి. ఆవిడని చూస్తూనే గీత మొహం గుప్పున విప్పారింది. తపతి కూడా నవ్వుమొహంతో దగ్గరికి వచ్చి, “మీరు వస్తారని రాధ చెప్పింది.” అంది. 

          రాధ తపతిని పలకరించి, “రండి. అందరిభోజనాలూ అయిపోయేయి.” అంటూ ఆప్యాయంగా బల్లదగ్గరికి తీసికెళ్లింది. 

          “నాకు ఆకర్లేదు. లంచ్ ఆలస్యంగా తిన్నాను” అంటూ తపతి పళ్లెంలో కొంచెం అన్నం, కూరా పెట్టుకుని వచ్చి గీత పక్కన కూచుంది. 

          “సంగీతం నేర్చుకుంటానన్నావు, పిలవలేదేం?” అంది గీతతో చనువుగా. 

          ఏకవచనంలో సంబోధనకి గీత రవంత అక్కశు పడింది. మరోపక్క సంతృప్తిగా కూడా వుంది. 

          “నేను నేర్చుకుంటాననలేదు. మీరు నేర్పుతానన్నారు,” అంది కవ్విస్తూ.

          “నువ్వు నేర్చుకోను అనలేదు కదా” అంది తపతి. 

          ఇద్దరూ తేలిగ్గా నవ్వుకున్నారు. తపతి అలా నిష్కల్మషంగా మాటాడుతుంటే గీతకి విజయవాడలోనో గుంటూరులోనో వున్నంత హాయిగా వుంది. 

          “మీ ఫోన్నెంబరు నాకు తెలీదు,” అంది నెమ్మదిగా. 

          “హరికి తెలుసనుకున్నాను. సరేలే, చెప్తాను రాసుకో” అంది తపతి. 

          తొమ్మిది దాటేవేళకి హనుమయ్యగారూ, భాగ్యంగారూ లేచి శలవు పుచ్చుకున్నారు తెల్లారి వేరే పనులున్నాయి అంటూ.  మరో అరగంటకి తపతి కూడా వెళ్లొస్తానంటూ లేచింది. వెళ్లేముందు గీతచెయ్యి పుచ్చుకుని ఆప్యాయంగా నొక్కి, “తప్పకుండా పిలు” అంది. గీతకి ప్రాణం లేచొచ్చింది. 

          గణపతీ, మాధవ్, సుమతీ, హరీ పేకాట మొదలు పెట్టేరు. రాధ గీతపక్కన కూర్చుని కబుర్లు మొదలెట్టింది. 

          ఆరాత్రి హరీ, గీతా ఇంటికి చేరేసరికి ఒంటిగంట దాటింది. అది మర్నాటికిందే లెఖ్క. గీతకి. తన జీవితంలో అర్థరాత్రి దాటి మేలుకొని వుండడం ఇదే ప్రథమం.

***

హరి ఫిలడెల్ఫియా వెళ్లడానికి ఆయత్తమవుతున్నాడు పనిమీద. మర్నాడే ప్రయాణం. “నాలుగు రోజులపాటు ఒక్కదానివీ వుండగలవా? గణపతినో, టేషునో అడగనా సాయంగా వుంటారేమో?” అని పదిసార్లు అడిగేడు గీతని. 

          గీతకి ఏం చెప్పాలో తోచలేదు. అతనిమాట నిజమే. పుట్టి బుద్ధెరిగి తనెప్పుడూ ఎక్కడా ఒక్కర్తీ వుండలేదు. వుండవలసిన అవుసరం రాలేదు. అసలు మనదేశంలో అలా ఒక్కరూ వుండడం సాధ్యం కాదు కదా. ఇరవైనాలుగ్గంటలూ ఇంటా బయటా బిలబిల్లాడుతూ జనాలు. ఇక్కడ అలా కాదు. ఇరుగూపొరుగూ అయినా పనిగట్టుకు పిలిస్తే తప్ప పలకరు. ఎవరిగొడవ వారిదే. 

          హరే మళ్లీ “టేషూ, గణపతీ కూడా పగలు వాళ్లపనుల్లో వుంటారు. రాత్రి వచ్చి పడుకోమంటాను సాయంగా.” అన్నాడు. గీత సరేనని తలూపింది.

          హరి ఇల్లు వదలగానే గీతకి గుండెల్లో గుబులు పెల్లుబికింది. రోజూ అతను ఆఫీసుకి వెళ్లడంలేదూ? ఏరోజు అతను ఈ టైములో ఇంట్లో వున్నాడు కనక! కానీ అలా సర్దుకు వూరుకోలేక పోతోంది. పగలంతా వున్న రెండుగదుల్లో కాలు కాలిన పిల్లిలా తిరిగింది. సాయంత్రం ఆరున్నరకి టేషు ఫోను చేసేడు తను వచ్చేసరికి ఎనిమిది దాటుతుందని, తనకోసం ఎదురు చూడొద్దనీ, భోజనం చేసేయమనీ,  

          హరి ఫిలడెల్ఫియాలో దిగగానే ఫోను చేశాడు. మళ్లీ మీటింగవగానే ఫోను చేసేడు. రాత్రి పడుకోబోయేముందు మళ్లీ చేస్తానని చెప్పేడు. అన్నిటికీ సరే సరేనంటూ ఊఁ కొట్టింది.

          టేషు వచ్చేసరికి పదయింది. అతను ఆలస్యం అయినందుకు చాలా నొచ్చు కున్నాడు. గీత ‘ఫరవాలేదండీ’ అంటూ రెండు కంచాలు పెట్టింది. 

          “అయ్యో అదేమిటండీ. నేను చెప్పేను కదా మిమ్మల్ని తినేయమని” అన్నాడు మళ్లీ బాధ పడుతూ. 

          గీత కూడా అంతగానూ నొక్కి చెప్పాల్సొచ్చింది ఫరవాలేదంటూ. 

          తెల్లారుతూనే, టేషు గబగబా కాఫీ తాగేసి వెళ్లిపోయాడు, గీత breakfast  అంటే టైము లేదన్నాడు. 

          గీతకి అతను ఇంట్లో వున్నట్టే లేదు. రోజు గడవడం మహ కష్టంగా వుంది. లంచి చేసుకోవాలని కూడా అనిపించలేదు. హరి ఫోను చేసి అడిగితే “తిన్నాను” అంది. బావురుమని ఏడవాలని వుందని చెప్పాలనిపించింది కానీ చెప్పలేదు. 

          తపతి గుర్తొచ్చింది. పిలిచి చూద్దాం అని ఫోను చేసింది. 

          తపతి ఇంట్లోనే వుంది, “హలో”

          “నేను గీతని”

          “ఓ. నేనే అనుకుంటున్నాను పిలుద్దాం అని. ఏం చేస్తున్నావు?”

          “ఏం లేదు.”

          “రోజూ ఏంచేస్తావు ఈవేళప్పుడు?”

          “ఏం చేస్తానో నాకే తెలీదు. పనీ లేదు తీరుబడీ లేదు. ఏం చేస్తున్నానో తెలీకుండానే రోజు గడిచిపోతుంది.” అంది గీత పేలవంగా నవ్వి.

          “నేనింకా లంచి చెయ్యలేదు. రా. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ తిందాం,” 

          ఆ పిలుపుకోసమే ఎదురు చూస్తున్నట్టు, “వచ్చేస్తున్నా” అని చెప్పి ఫోను పెట్టేసి, బయల్దేరింది గీత.

***

          తపతి ఇల్లు ఊరిపొలిమేరల్లో వుంది. ఇంచుమించు పొరుగూరి కిందే లెక్క. చిన్నఇల్లే కానీ ఇంటి చుట్టూ పూలమొక్కలూ, కూరగాయల తోటతో ఆహ్లాదకరంగా వుంది. 

          తపతి గుమ్మందగ్గర నిలబడి గీతకోసం ఎదురుచూస్తోంది. తనని సాదరంగా ఆహ్వానించింది. చాలాకాలం తరవాత చిన్ననాటి మిత్రురాలిని కలుసుకున్నట్టుగా వుందే కానీ నిన్నో మొన్నో పరిచయమయిన కొత్తమొహాంలా అనిపించలేదు ఇద్దరికీ. 

          ఆకబురూ, ఈకబురూ చెప్పుకుంటుంటే, గీత అడిగింది, “ఇంత కలుపుగోల్తనం ఒలకబోస్తున్నావు నాదగ్గర. ఊళ్లో మరి నీకీ అప్రతిష్ఠ ఏమిటి? అక్కుపక్షిలా ఒక్కత్తివీ ఈమూల కూచుంటావుట,” అంది. 

          తపతి నవ్వింది, “బాగుంది నీ ఆక్షేపన. పదసౌలభ్యం నీదేనా? ఎవరిమాటో వల్లె వేస్తున్నావా?”

          “భాష సొంతం. భావాలు దోచుకున్నాను. బాగుంటే చెప్పు. కాపీరైటు చేసేసు కుంటాను.”

          “ముందు లంచ్  మాట చెప్పు. ఏం చేసుకుందాం? ఉప్మావా రవదోశా?”

          “జీడిపప్పేసి రవదోశ చేస్తానంటే నేనెప్పుడూ ఒద్దనను.”

          “ఉప్మాలో వేసుకుంటాం కానీ జీడిపప్పు రవదోశలో ఏమిటి. సరే వేస్తాను, బాగు లేకపోతే ఆపాపం నీదే.” అంది తపతి వంటింట్లోకి నడుస్తూ. 

          రవదోశలూ, మిరప్పళ్ల పచ్చడీ గిన్నెల్లో సర్ది, రెండు కంచాలూ, మంచినీళ్లూ గీతకి అందించి, “పద” అంది. 

          గీత అయోమయంగా చూసింది, “ఎక్కడికి?”

          “మా బృందావనంలో వనభోజనాలు” అంది పెరట్లోకి దారి తీస్తూ. భుజాన వేసుకొచ్చిన దుప్పటీ ఓచెట్టుకింద పరిచింది. తపతి పళ్లేలూ, పాత్రలూ అమరుస్తుంటే, గీతకి తనూ సత్యం కాలేజీ ఆవరణలో చెట్టుకింద కూర్చుని మధ్యాన్నాలు టిఫిను తినడం గుర్తుకొచ్చింది. కళ్లు చెమ్మగిల్లేయి.  

          “అచ్చు మనవూళ్లో వున్నట్టే వుంది,” అంది గీత వివరాలజోలికి పోకుండా.

          “అవును, నాకూ అంతే. ముఖ్యంగా ఈ రెండు నెలలూ ఆగస్ట్, సెప్టెంబరు నులివెచ్చగా ఎండపొడ సోకి జోకొడుతుంటే నిద్దరతూకం అలాటప్పుడు అసలు మనం ఏదేశంలో వున్నాం అన్న స్పృహ వుండదు” అని, “ఇంతకీ నువ్వు ఇక్కడ ఎలా తేలేవో చెప్పనేలేదు. మేనరికమా?” అనడిగింది తపతి.

          “లేదు, ప్లేనురికమే. చూస్తుంటే ఇక్కడికొచ్చిన అమ్మాయిల్లో సగంమంది నాలా వచ్చినవాళ్లేలా వుంది,” అంది గీత. 

          “అంటే?”

          “వయసులో వున్న అబ్బాయిలు ‘మేం ఇప్పుడే పెళ్లి చేసుకోం’ అంటూ అమెరికా వచ్చేస్తారు. ఇక్కడ వంటపనులూ, ఇంటిపనులూ చేసుకోలేక ‘పెళ్లి చేసుకుంటాం’ అంటూ ఏడాదిలోపునే తిరిగి ఇండియా వచ్చేసి, పెళ్లి చేసుకు వచ్చేస్తారు అంది మా సత్యం. ఆమాటల్లో సత్యం నాకిప్పుడే అర్థమవుతోంది.” అంటూ తనపెళ్లి విశేషాలు చెప్పింది గీత. 

          “తమాషా ఏమిటంటే ఇలా జరిగే పెళ్లిళ్లకి ఏ మూఢమాసాలూ, శూన్యమాసాలూ ఆటంకం అవవు. ఏవేళప్పుడయినా ఓ దివ్యముహూర్తం చూడగల శాస్త్రులుగారు ఎక్కడో అక్కడ దొరుకుతాడు” అంది మళ్లీ హేళనగా నవ్వుతూ. 

          తపతి గీత మొహంలోకి పరీక్షగా చూస్తూ, “ఏం నీకు ఇష్టంలేదా?” అంది.

          “అదేం లేదు. నిజానికి మాఅమ్మ అంది కూడాను. ఇంత హడావుడిగా ఒప్పేసుకోడం ఎందుకు? ఆలోచించుకో,” అని. 

          తపతి మరి ఏప్రశ్నలు వెయ్యలేదు. ఇలాటి నిర్ణయాలకి అనేక కారణాలు. 

          కొంచెంసేపు అయింతరవాత తపతి నెమ్మదిగా అంది, “ఇందాకా అడిగేవు నేనెందుకు అందరితోనూ కలవనని. వచ్చినకొత్తలో నేనూ ‘అందరిలాగే మనం, మనవాళ్లూ’ అంటూ తపించిపోయేను. నిజానికి ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది కూడాను. ఇమాన్యూల్  ‘నాతో అమెరికాకి వచ్చేయి’ అని నన్ను పిలిచినప్పుడు, అతను ఏంచెప్పేడో తెలుసా? ‘ఇండియాలోలాగ అమెరికాలో జనులు కాకుల్లా పొడుచుకు తినరని, ప్రతివారూ ఎదటివారి ప్రైవేసీ గౌరవిస్తారనీ.”

          “ఇమాన్యూల్ ఎవరు?” గీత అడిగింది. 

          “నీకు చెప్పలేదు కదూ. మన నోటిదురుసు జనాలనుండి నను బ్రోచి ఎత్తుకొచ్చేసిన దక్షిణ నాయకుడు”. 

          తపతిముఖం, ఆ ముఖంలో వ్యథా గమనించి. గీత మౌనం వహించింది. మనసు మనసుతో స్పందించడానికి మాటలు అక్కరలేదు. ఆ అమ్మాయిమనసు మూలిగింది బాధగా. 

          తపతే అంది మళ్లీ. “అదంతా మరో పెద్ద కథ. నిజానికి రెండు కథలు. నేను ఇక్కడికి ఎలా వచ్చేనన్నది ఒక ఎత్తూ, ఇక్కడివారిలో ఎందుకు ఇమడలేకపోయాను అన్నది మరొక ఎత్తూ.”

* * * * *

(ఇంకా ఉంది)

చిత్రకారుడు: ఆర్లె రాంబాబు

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.