అవును ….మీరు విన్నది నిజమే …
దయచేసి నన్ను నాకు వదిలేయండి !
తెలతెలవారుతూనే తెగ పనులున్నట్లు
ప్రొద్దుకుంకేవరకు పడీ పడీ విన్యాసాలు చేస్తూ
ఇన్నిరోజులు ఆకాశ సంద్రంలో ఈదులాడేను !
ఇప్పుడారెక్కలు సత్తువ ఉడిగి చతికిలపడ్డాయి
రంగురంగు ఈకలు పాలిపోయి నేలకు జారుతున్నాయి
ఇప్పుడే రెక్కలొచ్చి వాటికి రంగులొచ్చిన
వయసొచ్చిన వన్నెలాడి పిట్టలు కొన్నినన్ను చూసి
ఇక్కడున్నావా అంటూ
ఎకసెక్కాలాడుతూ కారుకూతలు కూస్తూ
కిందామీదకు పల్టీలు కొడుతూ తిరుగుతున్నాయి
నాకునిజంగా నవ్వొస్తుంది
ఆ వయసు దాటొచ్చిన దాన్ని కాదా నేను ??
పుట్టబోయే బిడ్డల కోసం మూతి ముక్కలు చేసుకుని
రెక్కలు సాచి ఎగిరి ఎగిరి పుల్లా పుడక ఏరి గూళ్ళు కట్టి సాకిన వైనం
ఇప్పుడెవరికి గుర్తు !
పోనివ్వు
ఇప్పుడిక ఈ ఆఖరి మజిలీలో …
చేరవలసిన చోటుకే చేరుకున్నాను
ఆకాశపు వడిలో ఆకుపచ్చని తోటలో ఏటి ఒడ్డున
చివరి మలుపులో చింతలుడిగి సేద తీరుతున్న నన్ను
దయచేసి నా దారికి నన్ను వదిలేయండి !
మీ పిలుపులరొదతో నాకు తపోభంగం చేయకండి !