మా అమ్మ విజేత-8
– దామరాజు నాగలక్ష్మి
“నేను స్కూల్లో చదివినప్పటి నుంచీ ఫుట్ బాల్ బాగా ఆడేవాడిని, ఫుట్ బాల్ ప్లేయర్ గా ఎన్నో మెడల్స్ వచ్చాయి, నాకు ఆటలో బాగా పైకి రావాలనే కోరిక వుంద”ని మేనేజర్ కి చెప్పాడు. అన్నపూర్ణమ్మగారు మాత్రం “కొడుకు ఆటలు ఆడి పాడయి పోతాడని ఏమైనా సరే ఉద్యోగంలో స్థిరపరచండి” అని ఆంధ్రాబ్యాంక్ బ్యాంక్ మేనేజర్ కి చెప్పింది. బ్యాంక్ మేనేజర్ రాఘవయ్యకి ఆటల గురించి కొంత తెలుసు కాబట్టి మెల్లిగా దారిలోకి తెచ్చుకోవాలనుకున్నాడు.
రాఘవయ్య ఒకరోజు సూర్యం దగ్గిర కూచుని “చూడు సూర్యం నువ్వు ఆటలు ఆడుకుంటే బాగానే వుంటుంది. కానీ అమ్మ నీకు పెళ్ళి చేశారు కదా… ఇక నుంచీ నువ్వు నీ భార్యకి అన్నం పెట్టాలి. బట్టలు కొనివ్వాలి. కొన్ని రోజులకి పిల్లలు పుడతారు. వాళ్ళని పెంచి పెద్దచెయ్యాలి. ఇవన్నీ వుంటాయి. నువ్వు ఇక్కడ పని నేర్చుకున్నావంటే నీకు ముందు ముందు పెద్ద జీతం వస్తుంది. అప్పుడు నువ్వు మీ అమ్మగారిని డబ్బులు అడగక్కరలేదు” అని చెప్పారు.
ఏమనుకున్నాడో ఏమో సూర్యం “సరేనండీ! రేపటి నుంచీ మానకుండా ఆఫీసుకి వస్తాను” అని చెప్పాడు.
రాఘవయ్యగారు బుజం తట్టి వెళ్ళిపోయారు.
సూర్యం మర్నాటి నుంచీ పొద్దున్నే భోజనం చేసి బ్యాంక్ కి వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. బ్యాంక్ లో చిన్న చిన్న అకౌంట్స్ రాయడం నేర్పించారు. చిన్నతనం కావడం వల్ల మెల్లి మెల్లిగా పనిచేసేవాడు. ఒక వారం రోజుల్లో మొత్తం పని అంతా నేర్చుకున్నాడు. కానీ ఫ్రెండ్స్ తో సిగరెట్ కాల్చే అలవాటు వల్ల, బ్యాంక్ లో కూడా సిగరెట్ కాలుస్తూ పనిచేసేవాడు. ఎవరూ ఏమీ అనలేకపోయేవారు. అప్పట్లో ఆఫీసుల్లో సిగరెట్ కాల్చడం అనేది పెద్ద తప్పుగా భావించేవారు కాదు.
సూర్యం ఆఫీసుకి వెడుతుంటే అమ్మాజీకి అదో పెద్ద సంతోషంగా వుండేది. పన్నెండు సంవత్సరాల అమ్మాజీకి ఉద్యోగం అంటే ఏమిటో తెలియదు. ఆఫీసుకి వెడితే డబ్బులు మాత్రం వస్తాయని బాగా తెలుసు.
ఆడబడుచు అంజనాదేవి ఏ పని చెప్పినా చక్కగా నేర్చుకుని చేసేది. అప్పటి నుంచీ కష్టపడడం అంటే ఏమిటో తెలుసుకుంది. అమ్మాజీ పనితీరుకు అన్నపూర్ణమ్మ గారు కూడా చాలా సంతోషపడేది.
***
12 సంవత్సరాల అమ్మాజీ ఒకరోజు పొద్దున్న లేస్తూనే వాంతులు చేసుకోవడం మొదలు పెట్టింది. అంజనాదేవి స్కూలుకి వెళ్ళాలనే హడావుడిలో వుంది. ఇక అన్నపూర్ణమ్మగారు అమ్మాజీ దగ్గర వుండి. కంగారు పడద్దని చెప్పారు. ఆవిడకి నాడి పట్టుకుని చూడ్డం తెలుసు కాబట్టి అమ్మాజీ చెయ్యి పట్టుకుని చూసి అమ్మాజీ గర్భవతి అని తెలుసుకుంది.
గబగబా ఇంట్లో వైద్యంతోనే వాంతులు ఆగేలా చేసింది. ఇంత చిన్న పిల్ల గర్భవతి అయ్యిందే అనే ఒక పక్క విచారంగా వున్నా… సరే ఇది తప్పనిది కదా… అనుకుంది.
అసలే బక్క పలచగా వున్న అమ్మాజీ ఈ వాంతులతో అతలాకుతలం అయిపోతోంది. అన్నపూర్ణమ్మగారు ఇంటికి దగ్గరలోనే వున్న డాక్టరుకి కబురు చేసింది. ఆవిడ ఏవో చిన్న టాబ్లెట్లు ఇచ్చి వెళ్ళిపోయింది.
అమ్మాజీకి మెల్లగా నెలలు నిండుతున్నాయి. అలాగే చిన్న చిన్న పనులు చేస్తోంది.
9వ నెల వచ్చింది. అమ్మాజీ కోసం ఒక రూము ఏర్పాటు చేశారు. అమ్మాజీని అక్కడే కూర్చోమన్నారు. ఇంతలోకే “కడుపు నెప్పిగా వుంది” అని ఏడవడం మొదలు పెట్టింది. అన్నపూర్ణమ్మగారు మంత్రసానిని పిలిచారు. అది ఏ కడుపు నెప్పి అనేది ఎవరికీ అర్థంకాలేదు. ఒక చాటలో కొంచెం మట్టిపోసి అమ్మాజీని దానిమీద కూచోపెట్టారు. కానీ ఊహించని రీతిలో అమ్మాజీకి ప్రసవం కావడం మొదలయి మొదట తల బయటికి వచ్చింది. “అయ్యో….!” అనుకుంటూ మంత్రసాని బయటకు వచ్చే పిల్లకోసం సహకరించడం మొదలుపెట్టింది. కానీ మొత్తం శరీరం బయటికి వచ్చాక చూస్తే మగపిల్లాడు. ప్రాణం లేకుండా బయటికి వచ్చాడు. అందరికీ ఒకసారి నీరసం, నిస్సత్తువ ఆవహించింది. అమ్మాజీ అలసిపోయి పడుకుంది.
అన్నపూర్ణమ్మగారు ఆ పిల్లాడి శరీరాన్ని సూర్యంకి ఇచ్చి ఏం చెయ్యాలో చెప్పింది.
అమ్మాజీకి చాలా ఏడుపు వచ్చేసింది. తన బాబుని ఏం చేశారని అడుగుతోంది. ఎవరూ ఏమీ సమాధానం చెప్పలేదు.
* * * * *
(ఇంకా ఉంది)
నా పేరు దామరాజు నాగలక్ష్మి
నేను పుట్టినది వరంగల్ జిల్లా హనుమకొండ. పెరిగినది చదువుకున్నది పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం. ప్రస్తుతం హైదరాబాదు వాస్తవ్యులం.
దినపత్రికలకి వ్యాసాలు రాయడం, కవితలు రాయడం, కథలు రాయడం నా అభిరుచులు. మొక్కలు పెంచడం, ప్రకృతి ఆరాధన ప్రత్యేక అభిరుచులు. స్త్రీల సమస్యలలో పాలు పంచుకుని వారికి తగిన సలహాలు ఇచ్చి సహకరించడం నాకు నచ్చిన విషయం.