మా కథ
రచన: దొమితిలా చుంగారా
అనువాదం: ఎన్. వేణుగోపాల్
అప్పుడు ఫ్లాష్ లైట్లు పట్టుకొని వచ్చిన ఓ నలుగురు నన్ను కొట్లోంచి బయటికి లాక్కుపోయారు. నా తోటి ఖైదీ నాకు ధైర్యం చెపుతూనే ఉన్నాడు. వాళ్ళు ఇదివరకు నేనుండిన కొట్లోకి లాక్కెళ్ళారు. అక్కడ ఒక అధికారి చాల కోపంతో, మండిపడుతూ కూచున్నాడు. వాడు మామూలు దుస్తుల్లోనే ఉన్నాడు. నన్ను గదిలో పడేయగానే వాడు నా వైపు అసహ్యంగా, కోపంగా ఓ చూపు విసరి “నా కొడుకును కరిచింది, ఈ కుక్కేనా? నా కొడుకు. ముఖాన్ని రక్కింది ఈ ముండేనా?” అని అడిగాడు. ఈ మాటంటూనే పెక్కున తన్నాడు. నా రెండు అరచేతులూ కింద పెట్టించి, వాటిమీద రెండు బూట్ల కాళ్ళతో తొక్కడం మొదలు పెట్టాడు.
“ఈ చేతులు మళ్ళీ నా కొడుకును రక్క లేకుండా నాశనం చేస్తాను…. నేను గాని, వాళ్ళమ్మగాని ఎన్నడూ వాడి ఒంటిమీద చెయ్యేసి ఎరగమే… అలాంటిది… దొంగ లంజా… ఏం చేయదలచుకున్నావు నా కొడుకును, తినేస్తావా ఏమిటి?” అంటూ విపరీతంగా కొట్టాడు. “సరే, నీ పాపం పండేందుకుగాను త్వరలోనే ప్రసవించబోతున్నావు గదా, నీ బిడ్డమీదనే ప్రతీకారం తీర్చుకుంటాను” అని వాడు ఓ కత్తి బైటికి తీసి నా ముందే దాన్ని నూరడం మొదలెట్టాడు. నా బిడ్డ పుట్టేసరికి ఆ కత్తి మంచి పదునుగానే తయారవుతుందని, దానితో నా బిడ్డను ముక్కలు ముక్కలుగా తరిగేస్తానని అన్నాడు.
నాకు చాల భయం వేసింది. వాడి మాటలు తలచుకొని వణికి పొయ్యాను. ‘ఒక పసి కూనని అలాచెయ్యడానికి వాళ్ళకి చేతులెట్లా ఆడుతాయో’ ననే ఆలోచన నన్ను వెంటాడింది.
నేను కల్నల్ తో “చూడు, నువ్వూ తండ్రివే. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. తనను తాను రక్షించుకోలేని నా గర్భస్థ శిశువు మీద నీ కొడుకు ఎక్కి తొక్కాడు. ఆ నిస్సహాయ పిండాన్ని నీ కొడుకు తన్నాడు, పిసికాడు. కనుకనే నాకు వీలైన రీతిలో నన్ను నేను రక్షించుకోవాల్సి వచ్చింది. ఒక తల్లిగా నేను నా బిడ్డను రక్షించుకోవాల్సి వచ్చింది. నేను చెయ్యని ఎన్నో పనులు చేశానని ఆయన ఆరోపించాడు. నాకు గెరిల్లాలతో సంబంధాలు లేవు. గృహిణుల సంఘంలో మాత్రం పని చేశాను. ఇప్పుడు మీరు దయదలిచి వదిలేస్తే దాంట్లో కూడ పని చెయ్యను. దయచేసి నన్నొదిలేయండి. నన్ను వెళ్ళిపోనివ్వండి. నేనేతప్పూ చెయ్యలేదు. తాను మోస్తున్న నిస్సహాయ శిశువును కాపాడుకోవడం తల్లి బాధ్యత కాదా? నా స్థానంలో ఉండి ఉంటే నీ తల్లి కూడా నేను చేసిన పని చేసేదే…”
కత్తి సాన పెట్టడం అపకుండానే వాడు నా వైపు చూసి నవ్వి “ఈ టక్కరిది ఎలా బతిమిలాడుతుందో చూడు!” అని వాడి మనుషులతో అన్నాడు.
తనకేమీ తొందర లేదనీ, నేనెంత కాలం దుఃఖిస్తే తనకంత సంతోషమని, ఆ రకంగా తన ప్రతీకారం తీరుతుందనీ, అలాంటి కారు కూతలు కూస్తూ క్రూరంగా నవ్వుతూ వాడు కొట్లోంచి బైటికెళ్ళిపోయాడు.
విధి కూడ నన్ను చిన్న చూపు చూసిందా అన్నట్లు నాకప్పుడే నొప్పులు మొదలయ్యాయి. బైట సైనికుల అడుగుల చప్పుడు వినిపిస్తోంది. నాకు నొప్పులు క్షణక్షణానికీ ఎక్కువై భరించరానివిగా మారాయి. నొప్పులు అణచుకోవడానికి ప్రయత్నించాను. పళ్ళు కరిచి నొప్పి బిగబట్టాను. ఇప్పుడు ప్రసవం రాకపోతే బాగుండుననుకున్నాను. ఇక చివరికి “ఒక వేళ ఇప్పుడే ప్రసవం వస్తే మృత శిశువు పుడితే బాగుండును. నా కళ్లముందే వాడు దాన్ని హత్య చేయడం నేను చూడలేను” అనుకున్నాను. నేనప్పుడు ఎంత ఆందోళన, ఎంత భయం అనుభవించానో! కొంత సేపటికి బిడ్డ తల బైటికి వెళ్ళింది. బలవంతాన ఆ తలను లోపలికి తోసేశాను… ఎంత భయంకరమైన సంఘటన అది!
మరికొంత సేపటికి ఇక నేను తట్టుకోలేక పోయాను. కొట్టు మూలకెళ్లి మోకాళ్ళ మీద కూచున్నాను. గోడకు ఒరిగి మొఖాన్ని గోడలో కప్పెట్టేసుకున్నాను. ప్రసవం రావడానికి నేనే ప్రయత్నమూ చేయలేదు. మొఖాన్ని గోడకు ఒత్తి, మొఖం చిట్లిపోవడంలో ప్రసవపు నొప్పుల్ని అణచుకుంటున్న క్షణంలో పాప బయటపడింది. బతికి ఉండి పుట్టిందో, చనిపోయి పుట్టిందో నాకు తెలియదు. నాకు గుర్తున్నదల్లా నేనిక నొప్పులకి తట్టుకోలేక గోడకు మొఖం అదిమిపట్టి మోకాళ్ళ మీద కూర్చున్నాననేదే. తల బైటికి వెళ్లడం లీలగా గుర్తుంది. అప్పుడే నేను స్పృహ తప్పి పడిపోయాను.
తర్వాత ఎంత సేపటికోగాని కలలోంచి మేలుకున్నట్లు మేలుకుని చూసేసరికి నేను పడుకుని ఉన్నాను. కప్పుకుందామనీ, కాళ్ళు కదిలిద్దామని ప్రయత్నించాను. కాళ్ళు లేనట్లనిపించింది. నా ఒంట్లో చెయ్యి తప్ప మరే అవయవమూ లేనట్టనిపించింది. కప్పుకోవడానికి దుప్పటేమీ దొరకలేదు. ‘ఎక్కడున్నాన్నేను? నేనెక్కడున్నాను’ అని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాను. టకటకమని బైట బూట్లచప్పుడు వినిపించి నాకు నా పరిస్థితి తెలిసి వచ్చింది. “పా పేదీ” అంటూ లేచి కూచుందామని ప్రయత్నించాను. ఒళ్లంతా మొద్దుబారి పోయి ఉంది. అక్కడే నేలమీద గడ్డ కట్టుకు పోతున్నాను. నా వళ్ళంతా తడిసి ముద్దయి ఉంది, ప్రసవమప్పుడు వచ్చే రక్తమూ, చీము ఒంటి నిండా అంటుకున్నాయి. చివరికి నా వెంట్రుకలు కూడా ఆ చీముతో, నెత్తుటితో తడిసిపోయాయి. అప్పుడు నేను అతికష్టం మీద ప్రయత్నించి పాప బొడ్డు పేగు కోసం వెతికాను. ఆ పేగుతోపాటే చెయ్యిపోనిచ్చి చూస్తే పసికూన చేతికందింది….నా చిట్టితండ్రి పూర్తిగా చల్లబడి, మంచు గడ్డయిపోయి ఆ కటిక నేల మీద పడి ఉన్నాడు. వాడు నా లోపలే చచ్చిపోయాడా? బయట పడ్డాక చూసే వాళ్ళెవరూ లేక చచ్చిపోయాడా? ఏం జరిగి ఉంటుంది?
వీడి కోసం నేనెన్ని కష్టాలు పడ్డాను! వీడి కోసం ఎదురుచూస్తూ ఈ కొట్లో, చీకట్లో నేనెంత కన్నీరు మున్నీరుగా విలపించాను….! చివరికి నా పసికూన నా శత్రువుల చేతుల్లో, ఆ వెధవల చేతుల్లో, ఆ మూర్ఖుల చేతుల్లో ఇలా దిక్కులేని చావుకు బలై పోయాడు.
నేను వాడ్ని దగ్గరికి లాక్కుని నా ఒంటి వేడి వాడిలోకి పంపిద్దామని ప్రయత్నించాను. నా బట్టలన్నీ వాడికి చుట్టబెట్టాను. నా కడుపు మీద పడుకోబెట్టుకొని అదుముకుని వెచ్చజేశాను… అంతకంటే నేను వాడికేం చేయగలను? వాడి తల ఒక ఎముకల సంచిలాగ బొలబొలమని శబ్దం చేస్తోంది.
అప్పుడో సైనికుడు నన్ను పిలవడానికి వచ్చాడు. నేనా సమయానికి నా కొడుకు ఒకే సమయంలో నవ్వుతున్నట్లూ, ఏడుస్తున్నట్లూ కల గంటున్నాను. ఆ సైనికుడు “ఏమమ్మోయ్ – లే – లే” అన్నాడు.
“ఒక్క క్షణం ఆగుబాబూ… నా కొడుకు ఏడుస్తున్నాడు”
“కల్నల్….. కల్నల్.. ఆ స్త్రీ ప్రసవించింది… ప్రసవించింది” అంటూ ఆ సైనికుడు పరుగెత్తాడు. “ప్రసవించిందా?” అంటూ ఆ కల్నల్ లోపలికొచ్చి ‘లేవే ముండా’ అంటూ ఒక తన్ను తన్నాడు. నేనప్పటికి సగం గడ్డకట్టుకుపోయి ఉన్నాను. గనుక ఆ తన్నుతో నాకేమీ అనిపించలేదు. నా నడుముకింద భాగమంతా స్పర్శజ్ఞానం కూడా లేకుండా పోయింది. అప్పటికింకా మాయ బైటికి వెళ్ళలేదు గనుక ఒళ్ళంతా మొద్దుబారి ఉంది. చూపు కూడ సరిగా అనడం లేదు.
కల్నల్ నామీదికో లైట్ వేశాడు. అప్పుడు నేను. నా చిన్నారి బాబును చూసుకోగలిగాను. కల్నల్ వాడ్ని లాగి పైకెత్తి చూసి కోపంగా నా మీదికి విసిరేశాడు. బాబు మృత శరీరం నా కడుపు మీద దబ్బుమని పడింది. అప్పటికి బాబు ఒంటి నిండా ఉండిన మురికి అంతా కల్నల్ చేతుల కంటింది. “పంది, దొంగలంజ….” అని మొరిగి “కొంచెం నీళ్ళు పట్రండిరా..” అని కేకేశాడు. అప్పుడు వాళ్ళో రెండు బకెట్ల నీళ్ళు తెచ్చి నా మీద గుమ్మరించారు. ఆ నీళ్ళు ఒంటి మీద పడ్డాక నాలో చలనం వచ్చింది. అటూ ఇటూ కదల గలిగాను. నాకు కాళ్ళున్నాయని గుర్తించగలిగాను. కాని అవి నా నడుముతో కలిసి లేకుండా ఎక్కడో ఉన్నట్లనిపించింది. అప్పుడు ఒక సార్జెంట్ లోపలి కొచ్చి నా నాడి చూసి “ఈవిడ త్వరలోనే చచ్చిపోతుంది. మనం ప్రశ్నలడగడానికి వీల్లేకుండా అవుతుంది. ఈ విడ్ని ఎలాగైనా బతికిద్దాం. చూడబోతే ఈ విడింకా మాయ వొదిలినట్టు లేదు…” అని వాళ్ళతో అని నాతో “మాయ వెళ్లిపోయిందా?” అని అడిగాడు. నాకు తెలియదన్నాను. అప్పుడాయన పరీక్షించి చూసి, ఇంకా వెళ్లిపోలేదని, కొంత సేపు నా బాధ్యత తాను తీసుకుంటాననీ, కల్నల్ ఆ తర్వాత ప్రశ్నలడగవచ్చనీ, అలాగే వదిలేస్తే నేను చచ్చిపోతాననీ అన్నాడు. కల్నల్ ఇంక విధిలేక అక్కడ్నించి వెళ్ళిపోయాడు.
సార్జంట్ వేడినీళ్ళు పట్టుకు రమ్మని ఒక సైనికుణ్నీ, రెండు దుప్పట్లు పట్టుకురమ్మని మరో సైనికుణ్ని పంపించాడు. “నేను నీకు మేలే చేస్తాను. నువు నాతో సహకరించాలి” అని నాతో అన్నాడు. మాయని బయటికి లాగే ప్రయత్నం చేశాడు గాని సగమే’ బైట పడడంతో ఇక నన్ను తిట్టడం మొదలెట్టాడు. “ఏం కాదలచుకున్నావమ్మా నువ్వు? స్త్రీవై ఉండీ, కడుపుతో ఉండీ ఈ గొడవలన్నీ ఎందుకు నీకు? కల్నల్ కొడుకును ఎందుకు కొరికావు? మీ ఆడవాళ్ళు ఇలా ఎందుకు పేట్రేగి పోతారు?” అన్నాడు.
సైనికులు రెండు బకెట్ల నీళ్ళు తెచ్చారు. ఆయన నన్ను శుభ్రంగా స్నానం చెయ్యమన్నాడు. నేనప్పుడు తలారా స్నానం చేశాను. సార్జెంట్ తన దగ్గరున్న శాలువా ఒకటి నాకు కప్పాడు. ఓ పాత దుప్పటి నా ఒంటి చుట్టూ చుట్టాడు. ఇంకో దుప్పటి నా తలకు చుట్టాడు. నేనింక నిలబడలేకపోయాను. కాళ్ళలో పట్టు లేక నిస్సత్తువగా అక్కడే కూలబడిపోయాను.
“సరే – ఇక్కడే నా కొడుకు చచ్చిపోయాడు. నేనూ ఇక్కడే చచ్చిపోతాను. నాకు మీరెందుకు సాయపడుతున్నారు. నేను చచ్చిపోతాను. నేనేగనక చావకపోతే… చావకపోతే.. నన్ను మీరెన్నెన్ని ఇక్కట్ల పాలు జేశారు. అందుకు మీరు చింతించొద్దూ? మీరు బాధపడాలి. మీరు నేను కమ్యూనిస్టునన్నారు. ఇంకేమేమో నాకు అర్థంకాని పేర్లు పెట్టారు. ఇప్పుడు నేను బతికి బయటపడితే మాత్రం తప్పకుండా కమ్యూనిస్టు నవుతా… ఇప్పుడు మీరంటే నాకెంత అసహ్యంగా ఉందో తెలుసునా? మీరు నాకేదైనా మేలు చేయదలచుకుంటే, నన్ను చంపెయ్యండి…” అన్నాను.
“నువు కొద్ది సేపు మాట్లాడకుండా ఉండు. ఇన్నాళ్ళూ దేవుణ్ని మరిచిపోయావు గదూ – కనీసం ఇప్పుడు ప్రార్థన చేసుకో….” అని ఆయన వెళ్ళిపోయాడు.
*****
పుట్టింది వరంగల్ జిల్లా రాజారం. కవి, సాహిత్య విమర్శకుడు, అనువాదకుడు, పత్రికా రచయిత, వక్త, రాజకీయార్థిక శాస్త్ర విద్యార్థి, తెలుగు రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక వీక్షణం సంపాదకుడు. రచనలు: ‘సమాచార సామ్రాజ్యవాదం’, ‘కల్లోల కాలంలో మేధావులు – బాలగోపాల్ ఉదాహరణ’, ‘అమ్మకానికి ఆంధ్రప్రదేశ్’, ‘కథా సందర్భం’, ‘కడలి తరగ’, ‘పావురం’, తెలంగాణ నుండి తెలంగాణ దాకా, విచ్ఛినమవుతున్న వ్యక్తిత్వం, ‘పోస్ట్మాడర్నిజం’, ‘నవలా సమయం’, ‘రాబందు నీడ’, ‘కళ్లముందటి చరిత్ర’, ‘పరిచయాలు’, ‘తెలంగాణ – సమైక్యాంధ్ర భ్రమలు, అబద్ధాలు, వాస్తవాలు’, ‘శ్రీశ్రీ అన్వేషణ’, ‘లేచి నిలిచిన తెలంగాణ’, ‘ప్రతి అక్షరం ప్రజాద్రోహం – శ్రీకృష్ణ కమిటీ నివేదిక’, ‘రాబందు వాలిన నేల’, ‘ఊరి దారి- గ్రామ అధ్యయన పరిచయం’, ‘విద్వేషమే ధ్యేయంగా విశాలాంధ్ర మహారభస’, ‘కవిత్వంతో ములాఖాత్’, 20కి పైగా అనువాదాలు. సంపాదకత్వం: ‘Fifty Years of Andhrapradesh 1956-2006’, ‘Telangana, The State of Affairs’, ’24గంటలు’, ‘హైదరాబాద్ స్వాతంత్య్ర సంరంభం’, ‘జన హృదయం జనార్దన్’, ‘సమగ్ర తెలంగాణ’ పుస్తకాలకు సంపాదకత్వం వహించారు.