మిట్ట మధ్యాహ్నపు మరణం- 8

– గౌరీ కృపానందన్

          మణి దిగ్బ్రమ చెందిన వాడిలా, కలలో నడుస్తున్నట్టుగా వచ్చాడు. ఉమ దగ్గిరికి వచ్చి, “ఏమైంది ఉమా?” అన్నాడు.

          పరిచయమైన ముఖాన్ని మొట్ట మొదటిసారిగా చూడగానే ఉమకి దుఃఖం కట్టలు తెంచుకుంది. పెద్దగా ఏడిచింది.

          “మణీ! ఏమైందో చూడు. ఎంత రక్తం? కత్తి పోట్లు! సార్! ముఖాన్ని చూపించండి.” వెర్రి దానిలా అరిచింది.

          “మిస్టర్ మణీ! మీరు ఈమెకి బంధువా?”

          “అవును సార్. నేను తనకి మేనమామను.”

          మణి మూర్తి ముఖాన్ని చూసీ చూడగానే రెండు చేతులతో తన ముఖాన్ని కప్పుకుని ఏడ్చాడు.

          “మణీ! కెన్ యు టేక్ కేర్ ఆఫ్ హర్?”

          “తప్పకుండా. ఏమైయ్యింది సార్?” అన్నాడు వెక్కిళ్ళ మధ్య.

          “పుస్తకాలను చూద్దామని అరగంట క్రిందికి వెళ్లాను. ఆ లోపల … ఆ లోపల…”

          “ఉమా! ఊరుకోమ్మా. భయపడకు. నేను వచ్చేసానుగా. నేను చూసుకుంటాను. నీవు ఇక మీద ఇక్కడ ఉండవద్దు. నాతో వచ్చేసేయ్. సార్! నేను ఉమను తీసుకుని వెళ్ళవచ్చా?”

          “బంధువులు వస్తే వాళ్ళతో కలిసి విక్టోరియా హాస్పిటల్ కి రండి. మేము అక్కడ ఉంటాం. ఇనిక్వెస్ట్ చేసి పోస్ట్ మార్టం చేయించాలీ.”

          “సార్! కమిషనర్ గారు వస్తున్నారు.”

          కమిషనర్ రాగానే అక్కడ ఉన్న పోలీసు అధికారులంతా అలర్ట్ అయ్యారు. “జరగండి… జరగండి.”

          “ఉమా ఇటు వైపు రా.”

          ఉమ మణితో కలిసి కారిడార్ లో నిలబడింది. పోలీసు అధికారులు మళ్ళీ గదినంతా పరిశీలించారు. ఉమ చుట్టుపక్కల పరిసరాలను గుర్తించనట్లు అలాగే నేలమీద చతికిలబడి కూర్చుంది.

          “ఏమైంది ఉమా? కళ్ళు తిరుగుతున్నాయా?”

          “లేదు.” అన్నదల్లా మళ్ళీ ఏడవ సాగింది.

          “లేచి రా ఉమా! ఇక్కడ్నుంచి వెళ్లి పోదాం. ఈ దిక్కు మాలిన హోటల్ వద్దు. అసలు ఈ ఊరే వద్దు.”

          గదిలో సంబాషణ కొనసాగుతోంది.

          “మాదవరావ్! మీరు సి.ఓ.డి. కి ఒక రిక్విసిషన్ కి ఏర్పాటు చేయండి. క్లూస్ చాలా ఉన్నాయి. షూస్ గుర్తులు కూడా క్లియర్ గా ఉన్నాయి.

          “అవును సార్.” 

          “MAYA! ఇదేంటి? మాయ అని ఎవరైనా స్త్రీ ఇక్కడ ముందు స్టే చేసిందోమో ఎంక్వయిరీ చేయండి. డబ్బేమైనా పోయిందా? నగలు, పర్స్ వగైరా…”

          “అడగాలి సార్.”

          “ఇంకా అడగలేదా?”

          “చాలా బాధలో ఉంది. జవాబు చెప్పే స్థితిలో లేదు.”

          “ఇవన్నీ వెంటనే అడిగి తెలుసుకోవాలయ్యా. పది రోజులు దాటినా ఏడుస్తూనే ఉంటారు. ఎక్కడ ఉంది ఆమె? నేను మాట్లాడుతాను.”

          “కారిడార్ లో ఉంది సార్.”

          కమిషనర్ గది బైటికి వచ్చారు. ఆయనకు దాదాపు నలభై ఐదేళ్ళు ఉండొచ్చు. హత్య తాలూకు సంఘటన ఆయన మీద ఎక్కువగా ప్రభావం చూపించినట్లు లేదు. చురుకుగా ఉన్న చూపులతో తన చుట్టూ ఉన్న వాళ్ళని పరిశీలిస్తూ ఉమ దగ్గిరికి వెళ్ళారు. ఆయన కళ్ళు మణిని సందేహంగా చూశాయి.

          “ఏమైందమ్మా? నేల మీద కూర్చున్నారే. ఒంట్లో బాగా లేదా?”

          ఉమ కళ్ళెత్తి చూసింది.

          “ఈయనేనమ్మా కమిషనర్ గారు.”

          ఉమ లేచి నిలబడడానికి ప్రయత్నించింది.

          “ఫరవాలేదు. మీరు కూర్చోండి. ఐ యామ్ సారి మిసెస్ ఉమా. మీకు పెద్ద షాక్ తగిలింది. ఏడవకండి. ఏడవడం వల్ల ఏ ప్రయోజనమూ లేదు.”

          “ఆయన్ని హత్య చేసింది ఎవరు? దేని కోసం?”

          “అది మీరే చెప్పాలి. నగల కోసమా? డబ్బు కోసమా? ఎవరైనా శత్రువులు ఉన్నారా? చాలా డబ్బు తెచ్చారా?”

          “ప్రయాణపు ఖర్చుల కోసం తీసుకుని వచ్చారు.”

          “ఎంత?”

          “తెలీదు. సూట్ కేస్ లో ఉంచారు.”

          “వెరిఫై చేయండి మాధవరావ్. మీరు నగలు ఎక్కవగా పెట్టుకుని వచ్చారా?”

          “లేదు. వంటి మీద ఉన్న నగలు మాత్రమే. మిగిలినవి ఊళ్ళో ఉన్నాయి.”

          స్ట్రక్చర్ మీద అతని శవాన్ని తీసుకు వెళ్తుండగా ఉమ లేచింది.

          “నేనూ ఆయనతో వెళతాను.”

          “ఉమా! ఇదిగో చూడూ. అమ్మా నాన్నలు వచ్చాక సాయంత్రం వెళదాం. సార్! మీ ప్రశ్నలన్నీ తరువాత అడగవచ్చా? తను ఇంకా షాక్ నుంచి కోలుకోలేదు.”

          “మీరు ఎవరు?”

          “ఆమెకి మేనమామ. పేరు మణి.”

          కమిషనర్ ఒక్క నిమిషం ఆలోచించి, “సరే, తీసుకెళ్ళండి” అన్నారు.

          “ఏడవకు ఉమా!” మణి ఆమె భుజాలను పట్టుకుని లేవదీయ బోయాడు. ఉమ అతని చేతుల్ని తోసేసి తానే లేచింది.

          “ఉమా! పోయిన వాళ్ళ కంటే బ్రతికి ఉన్నవాళ్ళు ముఖ్యం.” మెల్లిగా నడిపిస్తూ హోటల్ నుంచి బైటికి తీసుకొచ్చాడు.

          చెట్టు క్రింద రెస్టారెంట్ కుర్చీలో కూర్చోబెట్టాడు.

          “కాఫీ తాగుతావా ఉమా?”

          “ఏదీ వద్దు. నాకసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. నేనేమైనా పీడకల కంటున్నానా మణి? ఇది కలే అయితే నన్ను లేపు. ఇప్పుడు నిజంగానే ఆయన లేరా? బాబ్జీ…. బాబ్జీ..” సన్నగా రోదించ సాగింది.

          మణి అలాగే ఆలోచిస్తూ కూర్చున్న వాడల్లా, “ఉమా ఏడవకు. అందరూ నిన్నే చూస్తున్నారు. మూర్తి చచ్చి పోలేదు. ఈ శరీరాన్నివదిలేసి, అతని ఆత్మ ఇంకో శరీరంలోకి ప్రవేశించింది. అంతే! ఆత్మకి మరణం లేదు.”

          ఉమ తలెత్తి చూసింది.

          “ఇప్పుడు టైం ఎంత?”

          “నాలుగున్నర.”

          “నాన్నగారు ఎప్పుడు వస్తారు?”

          “సాయంత్రం లోపల వచ్చేస్తారు.”

          “మూర్తి నాన్నగారు కూడా వస్తారా?”

          “ఆయనకు కూడా విషయం తెలియచేశారు. వస్తారు.”

          “నేను హాస్పిటల్ కి వెళతాను,”

          “వద్దు ఉమా! నువ్వు హాస్పిటల్ కి వెళ్ళ కూడదు. అమ్మా, నాన్నా అందరూ హోటల్ కే వస్తారు. అక్కడికే వెళదాం.”

          424 నంబరు గదిని పరిశీలిస్తున్న ఫింగర్ ప్రింట్స్ నిపుణులకి కొత్తగా షూ ప్రింట్స్ దొరికాయి. వాటిని జాగ్రత్త్హగా ట్రేస్ చేశారు. షూ కంపెనీ పేరు స్పష్టంగా కనబడింది.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.