యాత్రాగీతం

బహామాస్ 

-డా||కె.గీత

భాగం-4

మయామీ నగర సందర్శన- విజ్కాయా మ్యూజియం & గార్డెన్స్

          విన్ వుడ్ వాల్స్ సందర్శన కాగానే అక్కణ్ణించి సరాసరి విజ్కాయా మ్యూజియం & గార్డెన్స్  (Vizcaya Museum & Gardens) చూసేందుకు వెళ్లాం. ఒక్కొక్కళ్ళకి  $10 టిక్కెట్టు. అప్పటికే కాస్త మేఘావృతమై ఉంది ఆకాశం. మేం కారు పార్కు చేసి ఇలా నడవడం మొదలుపెట్టామో లేదో పెద్ద వాన మొదలయ్యింది. అదే కాలిఫోర్నియాలో అయితే వణికిపోయేవాళ్ళం. మాయామీలో అందునా వేసవిలో ఈ వాన భలే ఆహ్లాదంగా అనిపించింది. 

          కారుపార్కింగు నించి దట్ఠమైన చెట్లు, కాలిబాటల మధ్య అక్కడక్కడా సుందరమైన శిల్పాలతో అందమైన గార్డెన్ లో నుంచి కాస్త నడవగానే అత్యంత ఠీవిగా నిల్చున్నట్టున్న అందమైన పురాతన భవంతి కనిపిస్తుంది. అదే మ్యూజియం. 1914-1922 ల మధ్య మెడిటరేనియన్ శైలిలో నిర్మించబడింది ఈ భవంతి. ఈ ప్రాంతాన్ని కోకోనట్ గ్రోవ్ అంటారు. అంటే “కొబ్బరి తోట” అన్నమాట. జేమ్స్ డీరింగ్  (James Deering) అనే పారిశ్రామికవేత్త తమ శీతాకాల వసతి గృహంగా దీన్ని నిర్మించుకున్నారట. బయటకు పురాతన భవంతిలా కనిపించే ఆధునిక గృహం ఇది. భవంతిని నిర్మించిన కాలానికి అందుబాటులో ఉన్న టెలిఫోను, ఫ్రిజ్ , హీటింగ్ సిస్టమ్ వంటివెన్నో ఆధునిక సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. సముద్రతీరాన్ని అనుకుని ఉన్న ఈ భవంతి ఇప్పుడు మాయామీ నగర చరిత్రలో గొప్ప సంస్కృతీ ప్రతిరూపం. 

          భవంతి పశ్చిమ ద్వారం నుంచి లోపలికిఅడుగుపెడుతూనే ఓపెన్ టాప్ తో ఉన్న పెద్ద హాలులోకి అడుగుపెడతాం. అక్కణ్ణించి ఉత్తర ద్వారం లో నుంచి వెళ్తే  పెద్ద స్విమ్మింగ్ పూల్, దక్షిణ ద్వారంలో  గార్డెన్, తూర్పున సముద్రం దర్శనమిస్తాయి. సముద్రం వైపు ఒడ్డున ఓడని పోలిన నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. 

          ఇక్కడి   గార్డెన్ లో దాదాపు నాలుగువందల ఏళ్ల నాటి పురాతనమైన వృక్షం కూడా ఉంది. అంతేకాకుండా దాదాపు రెండువేల రకాల మొక్కలున్నాయి ఇక్కడ. రెడ్ బెర్రీ స్టాపర్, యుజీనియా కంఫ్యూసా లాంటి అరుదైన వృక్షాలు, అమెరికా సంయుక్త రాష్టాల్లోనే పెద్దవైన 8 రకాల వృక్షాలు ఉన్నాయిక్కడ. 

          భవంతి లోపల అన్ని గదులని జేమ్స్ డీరింగ్ నివసించనప్పట్లా సుందరంగా తయారుచేసి ఉంచారు. అక్కడ  ఉన్న కళాఖండాలు చూడడానికి అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా సీలింగు నించి వేళ్ళాడే అతి పెద్ద పక్షి పంజరం, పెద్ద పడవ, విక్టోరియా శైలిలో ఉన్న నిర్మాణాలు, రోమన్ శైలిలోని శిల్పాలు కనువిందు చేస్తాయి. 

          వర్షం బాగా పడుతున్నందువల్ల భవంతి చుట్టూ తిరగలేకపోయాం. కానీ ఆవరణలో నుంచుని సముద్ర తీరం వైపు,బయటకుచెట్ల వైపు  చూడడం కూడా ఓ అత్యద్భుతమైన, అందమైన అనుభూతే!

****

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.