యుద్ధం ఒక గుండె కోత-17

(దీర్ఘ కవిత)

-శీలా సుభద్రా దేవి

ఖాండవ దహనంతోగాని

జఠరాగ్ని చల్లారని ఈ మహానలానికి

శాంతి ఎప్పుడు కలుగుతుందో?

ఎన్ని ప్రాణాల్ని పుడిసిటపట్టి

ఔపోసన పడ్తే చల్లారుతుందో?

ఎందరు తల్లుల గర్భశోకాన్ని మింగితే 

ఎందరు పసిపిల్లలు తల్లి ఒడిని వదిలి

దారి పక్కన గడ్డిపూలై తలవాల్చేస్తే

ఎందరు కన్నెపిల్లల యవ్వన స్వప్నాలు

గాలిమేడలుగా కూలిపోతే

ఇంకెందరి విచక్షణ కోల్పోయిన

యువావేశాలు యుద్ధయాగంలో సమిధలైతే

ఎందరు యువకులు సిద్ధార్ధులై

మృత్యువును అన్వేషిస్తూపోతే

ఎప్పటికి… ఎప్పటికి

ఈ మహానల జ్వాల సద్దుమణిగేది?

ఈ భయంకర జ్వాలాదాహానికి

బలయ్యే జనారణ్యాలెన్ని?!

తల్లుల్లారా!

మన దుఃఖాన్నీ, మన ఆగ్రహాన్నీ, మన ఔదార్యాన్నీ

ముప్పేటలుగా అల్లి

త్రివేణీ సంగమ ప్రవాహంచేసి

ఇటు మళ్ళిద్దాం రండి!

అప్పటికైనా దప్పిక తీరి చల్లారుతుందేమో!

మన క్షుభిత హృదయాల్ని

యజ్ఞగుండం మీద పరిచి

యాగజ్వాల తనలోకి తానే మండేలా చేద్దాం

తన సెగ తననే దహించినపుడైనా

మండే గుణాన్ని జీర్ణం చేసుకుంటుందేమో

గుండెమంట కలిగిస్తున్న ఒత్తిడిని

ఒక నిడుపాటి ఊర్పునుచేసి

దానికదే రగిలేలా వీచుదాం

క్షణికావేశంలో దహించడం సులువే

ఓ మహాయుద్ధానలమా!

చల్లని నవనీతం పూసి

సేదతీర్చటం తెల్సిన తల్లులం

మాకు సోకుతున్న సెగని తట్టుకోనయినా

నిన్ను ఉపశమింప చేయటమే మా లక్ష్యం

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.