రాగో
భాగం-22
– సాధన
అనుకున్న ప్రకారం అందరూ తోలుబొక్క దగ్గర జమ అవుతున్నారు. ఆడ, మగ పిల్లలు కూడా ఉన్నారు. ఎక్కడికి పోవాలో, ఏం చేయాలో ఎవరికీ అంతు చిక్కడం లేదు. పాండు వస్తే గానీ సంగతి తేలదు అనుకుంటున్నారు ఆయా ఊర్ల సంఘాలవాళ్ళు.
‘అన్నలొస్తారేమో’ అన్నట్టు మెట్టదిక్కు, వాగు దిక్కు చూస్తున్నారు. చూస్తూ చూస్తూ ఉండగానే జనం పెరిగారు. దూరం నుండి వచ్చినవారు కొందరు చెట్ల కింద నడుం వాల్చారు. పిల్లలకు తల్లులు పాలు పడుతున్నారు. యువకులు హుషారుగా ఒకర్ని ఒకరు పలకరించుకుంటున్నారు.
దూరం నుండే పాండు రావడం చూసిన ఒక బాయి “పాండు దాద” అనేసరికి అందరూ బిల బిల లేచారు.
“రాం! రాం!” “లాల్ సలాం దాదా” అంటే “లాల్ సలాం” అని అందరిని పలకరిస్తూ చేయి కలుపుతున్న పాండు చుట్టు పెద్ద గుంపు తయారైంది. అతని కబురు వినడానికి అందరూ చెవులు రిక్కించారు.
“దాదా! జెర నాకు ఆలస్యమైంది. మనందరం ఇవ్వాల కలుసుకోవాలనుకున్నాం కదా! రావల్సిన వాళ్ళందరూ వచ్చినట్టే కదా!” అని మొస తీసుకొని అందర్నీ కలియ చూసాడు పాండు –
“మనందరం ఇవాళ ‘ఆలూరు’కు పోవాలి. గొడ్లు మల్లే వేళకు బయలుదేరితే సరిగ్గా వేళకి జేరుతాం. అక్కడ షావుకార్ల ఇళ్ళు ఒక్కటైనా సరే విడిచి పెట్టకూడదు. అందరూ హుషారుగా ఉండాలి.
ఈ షావుకార్లంతా బట్టెబాజిగాళ్ళన్నది మనకు తెలుసు. ఏడ్చినా మొత్తుకున్నా వదిలి పెట్టొద్దు. తలుపులు లోపల్నుంచి బిగిస్తారు. అందరూ గొడ్డళ్ళు తెచ్చుకున్నారు కదా! మన సంఘం దాదాలు కొందరి దగ్గర పలుగులు కూడా ఉన్నాయి. తలుపు తియ్యలేదని ఏ ఇల్లు, ఏ దుకాణం వదలొద్దు.
పనికిరాని సరుకులు, అనవసరమైన బరువులు నెత్తిన పెట్టుకోవద్దు. ముఖ్యంగా నూకలు, మిర్చి, పప్పు, బట్టలు మనకు కావలసినవి ఏవీ మిగిలిపోనివ్వద్దు. కుదువబెట్టిన వారి వస్తువులు తెచ్చుకోవాలి.
తర్వాత ప్రతి ఇంట్లోనూ సంఘం దాదాలు కూడా కొందరుండాలి. అప్పు పలు, పద్దుల పుస్తకాలు మిగిలిపోకుండా చూడ్డం మీ పని. –
దాదా, మనం ఏ షావుకార్నిగాని, ఆ ఇళ్ళల్లో ఏ ఆడమనిషినిగాని ఏమీ అనొద్దు. ఎవర్నీ చంపొద్దు. వాళ్ళు ఇన్నేళ్ళు మనల్ని దోచుకొని, దాచుకొన్న మన కష్టార్జితం మనం తెచ్చుకుందాం. అంతే.
అయితే ఎవడైనా అడ్డుకున్నా ఎదురుకున్నా మనం దేనికీ జంకొద్దు. ఏం జరిగినా ఫరవాలేదు.
ఇప్పటి దాకా ఈ కబురు మనం కడుపులోనే పెట్టుకున్నాం. బయటికెక్కడా పొక్కలేదు. పోలీసులు రావాలంటే మూడుగంటలైన పడుతుంది. కనుక ఏమీ గాబర పడకుండా మన పని అంతా నిబ్బరంగా చకచకా చెయ్యండి.
ఒకవేళ ఏదేనా జరిగినా అడుగు వెనక్కి వేయకుండా గట్టిగా నిలబడండి. మనం చాలా మందిమే ఉన్నాం. మనం దేనికీ భయపడొద్దు. మనకి అన్ని దన్నులు ఉన్నాయి. మర్చిపోకండి. నేను కూడా మీలోనే ఉంటున్నాను. ఏదైనా మాటుంటే మళ్ళీ నేనే చెప్తాను.
ఆఁ దాదా! ఒక్కటి బాగా మతికుంచుకోండి. అక్కడున్నంత సేపు ఎంత పని ఉన్నాసరే ఎవ్వరూ ఏ ఊరు పేరుగాని, ఏ దాదా పేరుగాని బయటకి అనొద్దు.
మరొక సంగతి – జావో, అంబలో, నీళ్ళో ఉంటే తాగేసి తయారుకండి” అంటూ సంఘం పాండు కార్యక్రమం అంతా వివరించి జాగ్రత్తలన్నీ చెప్పాడు.
ఊపిరి తీస్తున్న చప్పుడు మినహా మరొక శబ్దం లేకుండా అందరూ చెవులు రిక్కించి వింటున్నారు. ఆ మునిమాపు చీకట్లో చెట్లనీడల్లో కలిసిపోయి మొత్తం ఎందరున్నారో చెప్పడం కష్టమే.
చిక్కబడుతున్న చీకటిని చీల్చుకుంటూ ఆ నీడల దండు కదిలింది.
* * *
ఆలూరు అప్పుడే నిద్రలోకి జారుకుంటున్నది. పద్దులు చూసుకున్న పెద్ద షావుకార్లు దీపాలు మల్పి మంచాలు ఎక్కుతున్నారు. కోయగూడెం, మాలవాడ ఎప్పుడో చీకట్ల మునిగిపోయాయి. ఆరుతూ, వెలుగుతూ, బిక్కు బిక్కుమంటున్న సోలార్ లైటు పంచాయితీ గుమ్మం ముందు బెదురుతూ నిలబడింది.
సద్దుమణిగిపోయిన ఆలూరులో అకస్మాత్తుగా పెద్దరొద ప్రారంభమైంది. అర్థ రాత్రి వరద వచ్చినట్టు ఊళ్ళోకి కాపువీధి దాటుకుంటూ ఆ వరద షావుకార్ల వాడను ముంచెత్తింది.
ఒక్కసారిగా గందరగోళం, గగ్గోలు ప్రారంభమైంది. తలుపులు దబదబ బాదుతున్నారు. గొడ్డండ్ల దెబ్బలకు తలుపులు విచ్చుకుంటున్నాయి. ఆడవాళ్ళు, పిల్లలు గోడుగోడుమంటున్నారు. షావుకార్ల పెడబొబ్బలతో కోయ, కాపు యువకులు కూడ కొందరు పరుగు పరుగున ఆ వాడకు చేరుకొని తాము కూడ సందట్ల చేరిపోయారు. అవుతలి లైనులో గార్డు, గురూజీల గదుల్లో దీపాలు చప్పున మలిగిపోయాయి.
పుల్లయ్య షావుకారి పాండు కాళ్ళమీద పడి బోరుమన్నాడు. డబ్బులిచ్చుకుంటాను. తనను ప్రాణాల్తో వదలిపెట్టమని కాళ్ళవేళ్ళ పడుతున్నాడు. గోడౌన్ తాళాలు, తుపాకి వసూలు చేసుకొని సంఘం పాండు అతని వెంట యువకులు పుల్లయ్యను పక్కకు తోసేసి ముందుకు కదిలారు.
గోడౌను తలుపులు తెరుచుకునేసరికి కట్టతెగిన చెరువులా జనం లోపల చొరబడ్డారు. ఆ చీకట్లో తడుముకుంటూ జనాలు సరుకులు సర్దడం మొదలైంది. క్షణాల్లో జోరలు నిండుతున్నాయి. మూటలు నెత్తి కెక్కుతున్నాయి. డబ్బాలు, ప్యాకెట్లు భళ్ళున కింద పడుతున్నాయి. పది నిముషాల్లో పుల్లయ్య గోడౌను వరద తీసిన పంట పొలంలా బావురుమంది.
పాండు దళం బజార్లోకొచ్చేసరికి ఎదుటి గుమ్మంలో గప్పున చలిమంట లేచింది. అప్పుపత్రాలు, ఖాతా పుస్తకాలు తగలబడిపోతూంటే ఇంట్లో నుంచి బయటకు నడుస్తున్న గిరివి పెట్టిన నగలు, పాత్రలు ఆ మంటల వెలుగుల్లో ధగధగలాడు తున్నాయి.
ఆరగంటలో కోలాహలం సద్దుమణిగి దండంతా ఊరి బయటకు చేరుకుంది.
తుపాకీ భుజాన వేసుకొని పాండు ముందు దారి తీయగా మబ్బుపట్టిన మసక వెన్నెల్లో ఆ దండు చరచరా నడుచుకుంటూ అడవిలో కలిసిపోయింది. ఒంటి మామిడి దాటి పక్కకు తప్పుకొని బోడిమెట్ట దిగి ఒర్రె ఒడ్డున జంటమద్ది చెట్ల వద్ద కొచ్చేసరికి “దాదా ఇక్కడ దించుకుందాం” అన్నాడు పాండు.
బరువులు దించుకొని జనం ఒక్క పెట్టున ఒలో దిగి మొఖాలు కడుక్కొని దప్పిక తీర్చుకున్నారు. అందరు నీళ్ళు తాగి గడ్డకెక్కేసిరికి మద్దిచెట్టు మొదట్లో చిన్న నెగడు రాజేసిండ్రు. పాండు మరికొందరు సంఘంవాళ్లు సామానులన్నీ వరుసగా సర్దుతున్నారు.
పాండు అక్కడే ఉన్న మొద్దుమీద నిలబడి “దాదాలు వినండి” అనేసరికి నిశ్శబ్దం చోటు చేసుకుంది.
“దాదా, మనం అనుకున్నట్టు అంతా ఏ అడ్డు లేకుండా చకచకా సాగింది. మన సామానులే కాకుండా కావలసిన సరుకులతో పాటు పుల్లయ్య తుపాకి కూడ తెచ్చుకో గలిగాం” అందరిని కలియచూశాడు.
నెగడు చుట్టూ బియ్యం , దినుసులు, బట్టలు దేనికవే విడివిడిగా పేర్చి ఉన్న సరుకుల గుట్టల్ని ఆడవాళ్ళు, దాదాలు చేతులతో తడిమి చూస్తున్నారు. కొర్రాయి ఎత్తి పట్టుకొని వెలుతురులో దగ్గరగా పరీక్షిస్తున్నారు. పాండు మళ్ళీ గొంతు సవరించుకొని “మనం కష్టపడి మోసుకొచ్చిన ఈ సరుకుల్లో ఏ ఒక్కటీ బేకార్ కాకుండా జాగ్రత్తగా తీసుకుపోయి వాడుకోవాలి. పోలీసులొచ్చినా సరే ఇవి మళ్ళీ వాళ్ళ చేతుల్లో పడనివ్వకూడదు. నిలవ ఉండే సరకులు ఇళ్ళల్లో దాచుకోవద్దు. ఎవరెంత బాధపెట్టినా, ఎవరు ఎవరి పేరు చెప్పొద్దు” అంటూ “పారీ! పంపకాలు త్వరగా కానిద్దాం” అంటూ పాండు పనిలోకి దిగాడు.
ఒకరి వెంట ఒకరు జనమంతా బియ్యం ఒక బోరలోకి పడుతూ ఉప్పు, కారం విడి విడి ముల్లెలు కడుతుంటే వంతులవారిగా క్షణాల్లో పంపకం సాగిపోతున్నది. గుడ్డల మూటవద్ద నిలబడి పాండు పేరు పేరున ఎవరికేది అవసరమో చూసి పంచెలు, దుప్పట్లు, లుంగీలు, రవిక బట్టలు చకచకా పంచుతున్నాడు. బట్టలు పుచ్చుకున్నవాళ్లు చేతులతో తడిమి చూసుకుంటూ, చెంపలకు రాసుకుంటూ నెగడు వెలుగులో అటు ఇటు తిప్పి చూస్తూ మురిసిపోతున్నారు.
ఒక ఎర్రటి సిల్కు జాకెట్టు గుడ్డ చేతికొచ్చే సరికి పాండు ఎదురుగా తన ఊరి శేడోయే వచ్చింది.
“ఇది మంచి బట్టబాయి” అని అందించబోతుంటే బోసిగా నవ్వుతూ “అది నేనేం చేసుకోను దాద, నాకున్న ఒక్క పోరి ఎప్పుడెదుగుతుందో, నాకైతే రవిక తీసి నాలుగేళ్ళయింది కాదా, దాని వంతకు నూకలో, కారమో పొయ్యి” అనేసరికి బిత్తరపోయిన పాండు గుడ్డల గుట్టలో నుంచి ఓ దుప్పటి తీసి ఆమె చేతికిస్తూ “నూకలిందులో పోయించుకో బాయి” అన్నాడు.
దువ్వెనలు, టిక్లీలు, బ్యాటరీ లైట్లు, నూనె సీసాలు, పౌడరు డబ్బాల కుప్ప దగ్గరికి చేరి పడుచువాళ్ళు తలా ఒకటి ఎంచుకుంటున్నారు.
నిమిషాల్లో పంపకాలు పూర్తయి భుజాలకెక్కి ముల్లెలు నెత్తిన కూచున్నాయి.
ఇక కదలడమే ఆలస్యం అన్నట్టు నిలబడిన జనాన్ని చూస్తూ పాండు “దాదా ఒక ముచ్చట మిగిలిపోయింది. మనం తెచ్చిన ఈ తుపాకీ అన్నలకిద్దాం. మీ విచారం ఎలాగుందో చెప్పండి.”
“వాళ్ళు మన పిల్లలే కదా! అది వాళ్ళ దగ్గరుంటేనే మంచిది” అన్నాడు – కేడెనార్ పటేల్ దల్సును చూస్తూ.
జనం అందరూ ఒక్కసారిగా ‘ఇంగో’ (అవును) అన్నారు. వెంటనే పాండు అందుకొని.
‘దండకారణ్య ఆదివాసి సంఘం’ అనగానే అందరు ‘జిందాబాద్’ అన్నారు.
ఆ మసక వెన్నెల్లో దాదాలందరు కలుద్దాం అంటే కలుద్దాం అని లాల్ సలాంలతో చేతులు కలుపుకుంటూ ఎవరి దారిన వారు బయలుదేరారు.
* * * * *
(ఇంకా ఉంది)
సాధన కమ్యూనిస్టు పార్టీ నాయకులు. తెలంగాణ రాష్ట్రలోని కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో జన్మించారు. అడవి కడుపులో ఆయుధంతో అనునిత్యం కత్తి అంచుమీద నడుస్తూనే మిగుల్చుకోవడానికి కాలం వ్యాకోచించదు కనుక క్రమశిక్షణకు లోబడి ఓవర్ టైం పనిచేసి సృజనశీలియైన సాధన రాసిన రెండో నవల రాగో. అడవిలో మనుషులుంటారని, ఆ మనుషులకు అభిమానాలు, అభిజాత్యాలు ఉంటాయని – ఆ మనుషులు, వాళ్ళ మధ్యన మరో ప్రపంచపు మనుషులు కలిసి అనురాగాల, అభిమానాల, ఆదర్శాల ఒక స్వాప్నిక ప్రపంచం కొరకు ఒక కఠోర సాయుధ పోరాటం చేస్తున్నారని సాధన నవలలు ‘సరిహద్దు’, ‘రాగో’ సాధికారికంగా ప్రతిఫలిస్తాయి.