విజయవాటిక-9
చారిత్రాత్మక నవల
– సంధ్య యల్లాప్రగడ
అమరావతి ఓడరేవు
విష్ణుకుండిన మహారాజుల కాలంలో వర్తకం దేశ విదేశాలలో అభివృద్ధి చెందింది.
విష్ణుకుండినులు ఎన్నోవిదేశాల వారితో వర్తకం సాగించారు. స్వరాష్ట్ర, పరరాష్ట్రిక వ్యాపారులు క్రయ విక్రయాలలో అభివృద్ధి చెందారు. విదేశాలైన సుమిత్రా, సిలోన్, జావా, సయాం, కంబోడియా, చీనా, జపాన్, మలయ మున్నగు తూర్పు దేశాలు నుండే కాక కొన్ని పశ్చిమ దేశాల నుంచి కూడా వ్యాపారం ఎంతో సాగుతుండేది.
సున్నితమైన పట్టు వస్త్రాలు, సన్న నూలు, బట్టలు, కత్తులు, బంగారు, వెండి జరీ చీరలు, దుప్పట్లు, దంతములు, దంతపు వస్త్రాలు, ఆభరణాలాకు ఎంతో లాభమైన వ్యాపారం ఉండేది. విష్ణుకుండిన రాజ్యపు వర్తకులు ఈ వస్తువులతో వ్యాపారం చేసేవారు. దేశవిదేశాలలో నౌకల మీద వ్యాపారం విరివిరిగా సాగేది. అప్పటిలో, మోటుపల్లి, కోడూరు, అమరావతి, వాడపల్లి ప్రసిద్ధమైన రేవు పట్టణాలు. ఆ రేవులన్నీ వచ్చేపోయే నౌకలతో కళకళలాడుతుండేవి.
***
అమరావతి రేవు ఆ రోజు కూడా ఎప్పటిలానే ఎంతో హడావిడిగా ఉంది. వర్తకులు సరుకులు దింపుకోవటంలో, వెళ్ళే నౌకలలో సరుకులు ఎక్కించటంలో అక్కడ హడావిడి, చప్పుడు ఒకరి మాట ఒకరికి వినపడనంతగా ఉంది.
రేవులోకి నౌక ఒకటి వచ్చి ఆగింది. దాని తెరచాప, నౌక తయారీ చూడగానే ఆ నౌక కళింగ నుంచి వచ్చినదని తెలిసిపోతోంది. అందులో నుంచి ముందు ప్రయాణీకులు దిగుతున్నారు. అందులో ఒక నృత్య కళాకారుల బృందంవారు ఉన్నారు. గుంపుగా దిగుతూ వారంతా రేవులో ఒక ప్రక్క నిలబడి వారి నాయకుని కోసము ఎదురు చూస్తున్నారు. అంతా కలిసి ఆరుగురున్నారు.
వారి నాయకుడు, యాభై సంవత్సరాల గోవిందుడు, రేవు పర్యవేక్షుని వద్దకు వెళ్ళి వరుసలో నిలబడ్డాడు.
కొత్త వారు ఊరిలోకి ప్రవేశించటానికి ఆరు రాగి నాణెలు సుంకం కట్టాలి. గోవిందుని వంతు వచ్చింది. ఆ అధికారికి తన వారిని చూపుతూ “మేము మొత్తం ఆరు మందిమి స్వామి! కళాకారులము. మా కళను ప్రదర్శించుకోవటానికి ఇటు వచ్చాము…” అంటూ సుంకం డబ్బు బల్ల మీద పెట్టాడు.
అధికారి వారిని, నాయకుడిని తిప్పి తిప్పి చూశాడు.
“నీ పేరు, ఊరు ఏమిటి పెద్దాయనా?” అడిగాడు అధికారి గోవిందుని.
“ఊరు మచిపల్లి, విజయనగరము. నా పేరు గోవిందుడు…” చెప్పాడాయన.
“మంచిది. ఎంత మంది వచ్చారు మీరు. ఎన్నాళ్ళుంటారేమిటి?”
“ఆరు నెలలు ఉంటాము. శివరాత్రి పోయాక వెళ్ళిపోతాము…” అన్నాడు గోవిందుడు.
“అమరావతిలో ఎక్కడా మీ బస?”
“రాచవీధి ప్రక్కన ఉన్న వసతిగృహము స్వామి!”
శివరాత్రికి, త్రికూటాపతి(కోట్టప్పకొండ) తిరునాళ్ళు పెద్ద ఎత్తున ఉంటుంది. అన్ని గ్రామాల వారు ప్రభలను కట్టుకు వస్తారు. దానికి దేశవిదేశ కళాకారుల ప్రదర్శనలు సామాన్యమే. కళాకారులు ఆరు నెలల ముందర వచ్చి, ఊరుఊరు తిరిగి చివరకు అక్కడకు చేరుకుంటారు. అక్కడ వారి ప్రదర్శన అయ్యాక వారి గ్రామాలకు తిరిగి వెడతారు. అది ఎప్పడూ జరుగుతున్న విషయమే. పెద్దగా అనుమానించవలసిన విషయమేమి ఆ బృందంలో లేదు.
అధికారి వారు ఇవ్వవలసిన సుంకం లెక్కకట్టి తీసుకున్నాడు. ఒక పత్రం మీద విష్ణుకుండినుల ముద్ర (పంజా విసురుతున్న సింహం)వేసి వారిని పంపించి వేశాడు.
అధికారి ఆ బృందం వెళ్ళిన తరువాత నమ్మకమైన సేవకుని పిలిచాడు. ఒక చిన్న పత్రం ఇచ్చి ఆ సేవకుణ్ణి పంపి తన పని చూసుకోవటం మొదలుపెట్టాడు. ఆ సేవకుడు ఆ పత్రాన్ని సరాసరి తీసుకుపోయి శ్రీకరుని నివాసములో ఇచ్చి వచ్చేశాడు. ఆ చిన్న పత్రం శ్రీకరునికి గడియలోపలే అందింది.
ఆ పత్రంలో ఒక చిత్ర సందేశము పంపాడు అధికారి. అందులో ఆరు చిన్న మువ్వలు, తెల్లరంగు, ఎర్ర రంగు పువ్వులు, వేసి ఉన్నాయి. శ్రీకరుడు అది చూచిస తదనంతరం కాల్చి వేసాడు.
ఎర్ర పువ్వులు కళింగకు సంకేతం. మువ్వలు వచ్చినవారు కళాకారులని, తెల్ల పువ్వులు వసతిగృహం సూచన. ఆరు మువ్వలు, వచ్చినది ఆరుగురని సంకేతంగా చెప్పబడింది.
శ్రీకరుడు ఆనాడు మరో సందేశం కోసం ఎదురుచూస్తున్నాడు. అతనికి ఆ సందేశం అందచెయ్యవలసిన వారు ఇంకా రాలేదు. కొంత తడవు ఎదురుచూసి, లేచి వచ్చి తన గుర్రం వలుకను ఎక్కి బయలుదేరాడు.
అమరావతిలో ఊరి సరిహద్దుల వద్ద ఒక పెద్ద బౌద్ధ విహారం ఉన్నది. అక్కడే మహాచైత్రం, బౌద్ధ బిక్షువుల వైద్యశాల కూడా ఉన్నాయి. శ్రీకరుడు ఆనాడు ఆ బౌద్ధాలయానికి వెళ్ళాడు. వైద్యశాలలో కొందరు రోగులు మాత్రమే ఉన్నారు. అతను మహాపరివ్రాజకుని నివాసమైన విహారము వద్దకేగి, అక్కడ ఉన్న భిక్షుకు అడిగాడు “ఆచార్యులు అందుబాటులో ఉన్నారా?” అంటూ
“ప్రభూ! ఆచార్యులు తథాగతుని ధ్యానములో ఉన్నారు. వారికి మరో గంట వరకూ పట్టవచ్చు. మీరు వచ్చారని చెప్పమంటారా?” అడిగాడు.
శ్రీకరుడు ఆలోచనగా నిలబడి, “వద్దులే భిక్షు… నేను మరల వస్తాను…” అని తన గుర్రం వైపు నడిచాడు. అలా నడుస్తూ ఉండగా మధ్యలో మరో భిక్షుకు దీపకుడు కలిసాడు. ఇద్దరూ పరస్పరం నమస్కరించుకున్నారు.
“అభివాదములు మహావీరా! మీరు ఇలా వచ్చారేమి?” అడిగాడు దీపకుడు.
“అభివాదములు!” అన్నాడు చిరునవ్వుతో శ్రీకరుడు.
“నేను రాలేని పరిస్థితి… ఆరామాన్ని విడవలేకపోయాను ఈ పొద్దు మహావీరా!”
“అనుకున్నాను. నాకు అందవలసిన తథాగతుని దీవెనలు ఈ పొద్దు అందలేదు… అందుకే నేనే స్వయంగా వచ్చాను”
“క్షమించండి!”
“పర్వాలేదు, విషయం చెప్పండి బిక్షు…”
“మీ అనుమానము నిజం. దేశములో అన్నీ చిన్నా పెద్ద గ్రామాలలో సభలు జరిపి బౌద్ధ బోధ చెయ్యాలని ఆచార్యులు దశబలబలి సంకల్పించారు. ఆయన ఈ విషయం ఇంకా ప్రణాళిక స్థాయిలోనే ఉంచారు, కాని మహారాజు యాగ కాలానికి దేశములో బౌద్ధ సభలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నవి. ఆచార్యుల వారు చాలా కలత చెంది ఉన్నారు…”
“మరి మిగిలిన మీ ఆచార్యులైన మహానాగ, నందులేమనుచున్నారు?”
“వారికీ మహాచార్యులకు మధ్య బేధాలొచ్చాయి మహావీరా! మొన్న వర్ధనుని దెబ్బ విహారానికి బాగానే తగిలింది…”
“అవునా! అయితే నా ఊహ నిజమైతే వారు కూడా రెండుగా మారొచ్చు. లేదా ఒక్కొక్కరు ఒక్కో విహారానికి తరలిపోవచ్చును. నీవు మాత్రము నీకిచ్చిన పని జాగ్రత్తగా చూసుకో దీపకా!” అంటూ శ్రీకరుడు చకచకా సాగి వలుకనెక్కి మాయమయ్యాడు.
ఆనాడు ఆ విషయం దీపకుడే స్వయంగా తీసుకెళ్ళాలి, కాని ఆచార్యుల ఆరోగ్యం బాగాలేక ఆయన సేవలో అతనికి కుదరలేదు. ఇప్పుడు ప్రభుల రాక గురించి విషయం కప్పి చెప్పటానికి ఆచార్యుల ధ్యాన మందిరం వైపు నడిచాడు.
అమరావతి, భట్టిప్రోలు బౌద్ధవిహారాలలో పెద్దవి, ముఖ్యమైనవి.
***
గోవిందుడు, వసతిగృహంలో తన బృందంతో సమావేశమై ఉన్నాడు.
“మనము ముందు ఈ రాజధానిలో ప్రదర్శన చూసుకొని ఇంద్రపురికి వెడుతున్నాము. ఇక్కడ మనము పదిహేను రోజులే ఉంటాము. ఇక్కడ మనకు ప్రదర్శనలు రెండే ఉన్నవి…” చెప్పాడతను.
బృందం సమ్మతిగా తలలు ఊపారు.
“మీరంతా జాగ్రత్తగా ఉండండి. ఒంటరిగా వెళ్ళకండి. ముఖ్యంగా నీవు…” అన్నాడు ఇరువై సంవత్సరాల హరికను చూస్తూ.
హరిక నృత్యంలో అందెవేసినది. ఆమె నృత్యం చూపరులను మత్తులో పడ వేస్తుంది. ఆమె ప్రాముఖ్యమైన నర్తకి, బృందంలో.
తల ఊపింది హరిక సరేనన్నట్లుగా…
బృందంలో మృదంగ వాద్యగాడు అడిగాడు “మనము ప్రభువుల ఎదుట ప్రదర్శిస్తున్నామా?”
గోవిందుడు తల ఊపుతూ “ఉన్నది. మొదటి ప్రదర్శన వారి సభలోనే. మనకు ప్రభువులు ఒక రోజులో కబురంపుతారు…” అన్నాడు.
హాయిగా నవ్వింది హరిక. ఆమెకు అన్నింటికన్నా రాజస్థానాలలో ప్రదర్శన ఎక్కువ ఆనందం కలుగుతుంది మరి. వారంతా నృత్యకళాకారులు, వివిధ విన్యాసాలతో మైమరపించే నృత్యంలో ప్రసిద్ధులు.
మరునాడు గోవిందుడు తన బృందంతో కలిసి అమరావతి రాజప్రాసాదము వెళ్ళాడు.
వారందరికి ప్రత్యేకమైన బస ఇచ్చి నృత్యానికి సిద్ధం అయిన తరువాత ఆస్థానానికి తీసుకు పోగలమని చెప్పారు, వారిని తీసుకువచ్చిన ప్రతీహారి.
కళాకారులు ముఖాలకు రంగులు అద్దుకుని నృత్యానికి సిద్ధపడుతున్నారు.
హరిక పచ్చని పట్టు చీర గోచిపోసి కట్టింది. బంగారు పువ్వులున్న రవిక తొడిగింది. ఆమె పొడవైన జుట్టు జడవేసి జడగంటలు బిగించింది. విరజాజులు, మరువము, కనకాంబరముల కదంబములు ధరించింది.
తలపై సూర్య చంద్రులు, నాగారము, చూడామణి, మకరిక, ముత్యాల పాపిడిబిళ్ళ, ముఖాలంకరణములు ధరించింది.
మెడలో వరుసలు వరుసలుగా వివిధ కంఠాభరణాలు, రత్నమేఖలలు, మణి మేఖలలు, నడుముకు మువ్వల వడ్డాణము, కింకీణీపురాలు, చేతులకు గాజులు, భుజ కీర్తులు, దండకడియాలు, కాళ్ళకు మువ్వలు, పాదభూషణాలు ధరించింది. పచ్చ మెరుపులు బుగ్గలకద్దింది.
సరయు అన్న మరొక యువతి కృష్ణునిగా వేషం కట్టింది.
మిగిలిన కళాకారులు వారి వారి పాత్రలకు తగినట్లుగా ఆహార్యాన్ని ధరించి సిద్ధమయ్యారు. వారందరిని సభాప్రాంగణానికి తీసుకుపోయాడు ప్రతీహారి. అక్కడ గుండ్రని వేదిక, ఆ ప్రాంగణము మధ్యన ఉంది. ఒక వైపు ప్రజలు, రాజ ప్రముఖులు కూర్చొనటానకి వీలుగా ఉంది. మరొక ప్రక్కన మహాదేవవర్మ, శ్రీకరవర్మ, మిగిలిన రాజ ప్రముఖులకు ఆసనాలు ఉన్నాయి. అప్పటికే అందరూ విచ్చేసి ఉన్నారు. మహాదేవ వర్మ, శ్రీకరునితో కలిసి వచ్చాడు. వారి ఆగమనముతో, కళాకారులు ముందుగా సభకు నమస్కరించి , వారి గురువులకు నమస్కారము చేసుకున్నారు.
తదనంతరం దైవప్రార్థన చేశారు. తరువాత జావళి నృత్యం మొదలైయింది. ‘జావళి’ కర్ణాటక సంగీత నృత్యాలో ఒక ప్రక్రియ. వారు ఎంత గొప్ప నృత్యకళాకారులో వారి జావళి అభినయం బట్టి తెలిసిపోతుందటారు. జావళిలో శృంగార రసం ప్రధానమైనది. సౌందర్య రసానుభూతి ప్రతీకలైన పదాలతో జావళి నిండి ఉంటుంది. కళావంతులు జావళిలలో ఉద్ధండులు.
జావళిలు సామాన్య రాగములో, సామాన్య తాళములో ఉంటాయి. చాలా వరకూ ప్రజల వాడుక భాషలో పాటలు ఉంటాయి. అందరూ విని అర్థం చేసుకొని రసానందం పొందగలరు. కేవలం శృంగార పరంగా ఉంటుంది ఇందులోని సాహిత్యం. ఈ శృంగారమంతా సంభాషణలా సాగుతుంది. పల్లవి, అనుపల్లవిలుగా ఉంటాయి. నాయికా-నాయికలు కలిసి చేస్తారు, చాలా మటుకు.
కాంభోజి రాగం, రూపక తాళములో ‘ఏమి మాయము’ అంటూ బృందం జావళి మొదలుపెట్టింది. రాధగా హరిక, కృష్ణ వేషధారిగా సరయు రంగం మీదకు వచ్చారు.
“ఏమి మాయము జేసిపోతివి
శ్యామసుందరాంగ నాతో…
నా మనోభావంబులెల్ల వేమారు నీ వెరిగియు నా యెడ..
ఏమి మాయము జేసి పోతివి…”
రాధగా… విసిగిన గోపికగా.. ఆ విసుగులో నునుసిగ్గును చూపుతూ…ఆ సిగ్గులో దాగిన కోరికను చూపుతూ… ప్రేమను కనబరుస్తూ… అంతలోనే కృష్ణుని పై విరహం చూపుతూ… హరిక నృత్యం సభాసదస్సులను ఆశ్చర్యంలో ముంచింది. చూపరులు కనురెప్ప వెయ్యటం మానివేశారు. ఆమె అందం… అంతకు మించి అభినయము చూసే వారందరిని రేపల్లెకు తీసుకుపోయింది.
బృందం ప్రదర్శించిన నృత్యం, స్వర్గం నుంచి రంభో, మేనకో, అప్సరగణమో దిగి వచ్చి నర్తిస్తున్నదా అన్నట్లున్నది. ఆమె నృత్యము ముగిసినా ఎవ్వరూ కదలలేదు.
గోవిందుడు వచ్చి నమస్కరించాడు. కళాకారులు వేదిక దిగి విడిదిగృహము వెళ్ళిపోయారు, సభ చప్పట్ల మధ్యన. మహాదేవవర్మ ఆనంద పరవశుడయ్యాడు.
శ్రీకరుని వైపు చూచి “కరా! వీరికి మన రాజ మందిరములో విడిది ఏర్పాటు చేయి…మరల చూద్దాం వీరి ప్రదర్శనను…” అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఆనాటి రాత్రి రాజ మందిరంలో ప్రత్యేక విడిదిగృహంలో గోవిందుని బృందం విశాంత్రిగా పడుకున్నారు.
అంతా నిద్రపోయారనుకున్న వేళ, వాళ్ళలో ఒకరు లేచి చిన్న పత్రంలో ఎగురుతున్న తెల్లని డేగను చిత్రించి, తన వద్ద ఉన్న పావురానికి కట్టి ఎగురవేశారు. (ఎగురుతున్న తెల్లడేగ విజయానికి గుర్తు)
ఆ పావురము ఉత్తర దిశగా వెళ్ళిపోయింది.
ఆ వ్యక్తి లోనికి వెడుతూ, మందిరం తలుపు తగిలి కాలికున్న మువ్వ జారింది. అది ఆనాటి నృత్యం చేసిన గోపిక కాలి మువ్వలా ఉన్నది.
* * * * *
(ఇంకా ఉంది)
తెలంగాణలో పుట్టి పెరిగారు. వివాహాంతరము అమెరికా వచ్చారు. గత పదహరు సంవత్సరాలుగా అట్లాంటా నగరములో నివాసముంటునారు. ఫీనిక్స్ విశ్వవిద్యాలయం నుండి ఎం. బి. ఎ డిగ్రి పొందారు. శ్రీవారు కొండల నల్లజర్ల టీ మొబైల్ లో పని చేస్తున్నారు. కుమార్తె మేఘన. స్టాంఫోర్డ్ లో రెసెర్చు అసిస్టెంట్ గా సైకాలజీ ల్యాబ్ లో పనిచేస్తున్నది. సాంఘిక సేవాసక్తితో వివిధ తెలుగు సంఘాలలో కార్యకర్తగా అట్లాంటా తెలుగు సంఘములో పని చేశారు. తానా, అమెరికన్ రెడ్‌క్రాస్, అట్లాంటా సాయి టెంపుల్, అట్లాంటా హిందూ టెంపుల్, వీ.టీ. సేవ ఇత్యాది సంస్థల్లో స్వచ్ఛంద సేవ సేవలందించారు. దక్షిణ ఆసియా స్త్రీల సంక్షేమం కోసము సేవలందించే ‘రక్షా’ సంస్థ వారి “Ramesh Bakshi Leadership” అవార్డును, ‘పాడుతా తీయగా’ వారి సహకార అవార్డును, సిలికానాంధ్రవారి అవార్డును అందుకున్నారు. “నేను వడ్డించిన రుచులు, చెప్పిన కథలు” అన్న పుస్తకం ప్రచరించబడింది. కౌముది, సంచిక, మాలిక, దర్శనం వెబ్ మ్యాగజైన్స్ లో వీరివి ప్రతినెలా ప్రచురితమౌతున్నవి. ఊహలుఊసులు అన్న తెలుగు బ్లాగు రచయిత.