షర్మిలాం “తరంగం”

మినీ భారతం 

-షర్మిల 

మనుషుల మనస్తత్వాలు రకరకాలుగా వుంటాయి.

మామూలుగా గతంలో మాదిరిగా పక్క పక్క ఇళ్ళల్లో నివసించే వారినేచూసే అవకాశం వుండేది.

ఇప్పుడలా కాదు అపార్ట్మెంట్ కల్చర్ బాగా ఎక్కువైంది.

అంతమంది ఒకే చోట నివశిస్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళని సన్నిహితంగా చూడడం వాళ్ళ మనస్తత్వాలను స్టడీ చేస్తుంటే ఒక్కో సారి ఆశ్చర్యం , ఒక్కసారి బాధ , ఒక్కో సారి ఆనందం కూడా కలుగుతుందనుకోండి.

ముఖ్యంగా ఈ అపార్ట్మెంటుల్లో పని చేసే వాచ్ మెన్ లకి దండలేసి సన్మానం చెయ్యబుద్దవుతుంది.

అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ అయితే లేనిపోని టెన్షన్ నెత్తికి తెచ్చుకున్నట్టే.

ఆ అపార్ట్మెంట్ వాచ్ మేన్ కుటుంబానికో అతి చిన్న గది కడతారు. వాళ్ళపరివారం సమస్తం అందులోనే బతకాలి.

కానీ అపార్ట్మెంట్ యజమానులంతా ఒకటే అనుకుంటారు.

మొత్తం సెల్లారంతా ఆ కుటుంబానిదే కదా ఏం పరవాలేదండీ అంటుంటారు.

మా శ్రద్ధా చిన్న పిల్లగా వున్నప్పుడు అడిగింది వాళ్ళు అంత చిన్న ఇంట్లో ఎలా వుంటారు పెద్ద ఇల్లు కట్టించండి అని

పైగా అందరి ఈగోలూ వాచ్ మెన్ మీద అజమాయిషీచేసే చల్లార్చుకుంటారు.

ఒకావిడ తను రాగానే లేచి నిలబడలేదని ఏమే ఒళ్ళు బలిసిందా అని అడగడం నిజ్జంగా నాకు తెలుసు !

పల్లెటూరి నుంచి వచ్చిన వాచ్ మెన్ పంచె కట్టుకుని గుమ్మంలో లిఫ్ట్ఎదురుగా కూర్చుంటాడట!

తెల్లారేసరికి లిఫ్ట్ దిగే వీళ్ళకి ఎదురుగా కనిపించడం అపశకునమట !

అందుకే వాళ్ళ అమ్మాయికి పెళ్ళి కుదరడంలేదట!

దేముడా ! ఎంత హాస్యాస్పదం !!

వాళ్ళ బుర్రల స్థానంలో ఏం వుందో!

ఇంకో అపార్ట్మెంట్ లో పూలు కోసుకొచ్చి ఇవ్వడం లేదని అతన్ని తెగ తిడుతున్నారు.

తెల్లారి ఏ మూడు నాలుగు గంటలకో లేచి రోడ్ న పడి కోస్తే తప్ప ఆ పూలు దొరకవు.

రాత్రి సెకండ్ షో వరకూ మెలకువగా వుండి గేట్లు తీసి తెల్లారగట్ట నిద్రలేకుండా లేవడం మానవ మాత్రుడికి సాధ్యం కాదు.

అయినా సరే ఆ పని చేస్తాడు. పగలు పడుకుంటే ఎప్పుడు చూసినా పడుకునే వుంటాడని ఫిర్యాదు.

ఆ వాచ్ మెన్ భార్య ఆ అపార్ట్మెంట్ లో పనిమనిషిగా నాలుగిళ్ళలో పనిచేసుకుంటున్నా ఎవరింట్లో పనిమనిషి రాకపోయినా పిలుస్తారు.

కుదరదమ్మా అంటే వీళ్ళని మార్చేసి కొత్తాళ్ళని తెద్దామంటూప్రతిపాదనలు.

కొత్తాళ్ళు ఏమన్నా వేరే గ్రహం నుంచి వస్తారా మళ్ళీ వాళ్ళదీ అదే పరిస్థితి!

సాటి మనిషిని బానిసలుగా చూసే మనస్తత్వం మనిషికి జన్మతో వస్తుందో ఏమో ?

జులుం చేసే అవకాశం ఎక్కడొచ్చినా వదలం.

నీకు పూజలకు పూలు కోసుకొచ్చి , నీ కారు కడిగి , నువ్వు రాగానే గేటు తీసే మనిషి అల్పుడా !

భేషజం ప్రదర్శించే అవకాశం రాగానే ఎదుటి మనిషిని కించపరిచే మనం గొప్ప వాళ్ళమా !!

ఒకవేళ ఎవరన్నా పోన్లెండి వాళ్ళూ మనుషులే మరమనుషులు కాదుగదా అని అంటే ఏ అడవుల్లోంచి తుపాకీ పట్టుకొచ్చిన నక్సలైటుని చూసినట్టు జడుసుకు చస్తారు.

చాలా సందర్భాల్లో నాకు అలా అయిపోయి బెదిరించాలనిపిస్తుంది.

వాచ్ మేన్ లను వదిలెయ్యండి !

ఇక వీరిలో ఇరుగు పొరుగు వాళ్ళు కొన్ని అపార్ట్మెంట్లలో కలిసిమెలిసి స్నేహంగా వుంటారు.

కొందరు వాళ్ళస్థాయికి తగిన వారితోనూ , కొందరు వాళ్ళ కులాల వారితోనూ స్నేహంగా వుంటారు.

ఏ పార్కింగ్ దగ్గరో పూలకుండీల దగ్గరో మడతపేచీలు పెట్టుకుని మొఖామొఖాలు చూసుకోని వారుంటారు.

కొందరు కులాల వారీగా అపార్టెంటు కట్టుకోవడం కూడా వుంది.

అనీ నెగటివ్ లే కాదు ప్రాణ స్నేహితుల్ని కూడా అపార్ట్మెంట్లు ప్రసాదిస్తాయి సుమా !

ఒక మినీ భారతదేశాన్ని చూడాలంటే ఏదన్నా అపార్ట్మెంట్ ని సందర్శించండి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.