అమ్మ గ్రేట్ 

-కందేపి రాణి ప్రసాద్

 
          ఒక బాదం చెట్టు మీద కోతి తన పిల్లలతో నివసిస్తోంది. ఈ చెట్టు ఉరికి చివరిగానూ, అడవి మొదట్లోనూ ఉన్నది. కోతి తన ఆహారం కోసం అడవికి వెళుతుంది. వెళ్ళడానికి బద్ధకం అనిపిస్తే ఊర్లోకి వెళుతుంది. ప్రజలు వండుకున్న అన్నం చపాతీలు, చిప్స్, కూల్ డ్రింకులు నచ్చినవన్ని తిని పిల్లల కోసం ఇంటికి తిసుకెళుతుంది. పిల్లలు చిన్నగా ఉన్నాయని ప్రతి సారి వెంట తీసుకురాదు. అప్పుడప్పుడు తీసుకు వెళుతుంది.
 
          కోతి ఊర్లోకి వెళితే చాలా వెరైటి ఆహారం దొరుకుతుంది. ఊర్లో ఒక ఆంజనేయ స్వామి గుడి ఉన్నది. ఆ గుడికి భక్తులు బాగా వస్తారు. అక్కడ భక్తుల దగ్గర అరటి పండ్లు తీసుకోవచ్చు. ఆంజనేయ స్వామి గుడి కాబట్టి అక్కడ కోతుల్ని ఎవరూ కొట్టరు. కనీసం అదిలించను కూడా అదిలించరు. అప్పుడప్పుడు కోతి ఊర్లోని ఈ గుడికి వస్తుంది. అడవిలోని చెట్ల కాయలు బోర్ కొట్టినపుడు ఇలా వస్తుంది. ఇంకా గుడిలో కొబ్బరి చిప్పలు కూడా ఉంటాయి. అబ్బ! చాలా రుచిగా ఉంటాయి.
 
          కోతి ఈ మధ్య తన పిల్లల్ని కూడా తీసుకొని వెళుతున్నది. ఏ చెట్టు కాయలు తినవచ్చు, ఏ చెట్టు కాయలు విషపూరితం అన్ని వివరంగా నేర్పుతున్నది. మెల్లగా అన్ని విషయాలు నేర్పాలి పిల్లలకు. అలా అడవిలోని విషయాలు నేర్పుతున్నది తల్లి కోతి.
ఒకసారి ఊర్లోకి కూడా తీసుకెళ్ళింది కోతి. చాలా పెద్ద పెద్ద చెట్లున్నాయి. ఇంకా కొంత మంది ఇళ్ళలో కుండిల్లో చెట్లు పెంచుకున్నారు. వాటిలో టమోటా, వంకాయ చెట్ల కాయలు కోసుకోవటం నేర్పింది తల్లి. మధ్యలో ఇంటి వాళ్ళు వచ్చి కొట్టబోతే తల్లి వాళ్ళనే భయపెట్టింది. దెబ్బకి ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకున్నారు వాళ్ళు. పిల్లలకు చాల నవ్వొచ్చింది. ‘మానవులు ఎలా భయపడుతున్నారో అని నవ్వుకున్నాయి. పిల్ల కోతులు తల్లిని చూసి “గ్రేట్ మమ్మీ” అనుకున్నాయి.
 
          గుడిలోని భక్తుల దగ్గర కొబ్బరి చిప్పలు, అరటి పండ్లు ఎలా నేర్పుగా తీసుకోవాలో నేర్పించింది పిల్లలకు. మనుష్యులు కొట్టకుండా నేర్పుగా తీసుకోవడం తెలియాలి. ఒకవేళ ఎవరైనా కొట్టబోతే వాళ్ళని భయపెట్టడం కూడా తల్లి చూపించింది. పిల్ల కోతులు భక్తులు చేతిలోని ప్యాకెట్లు చూపించి ఏమిటని అడిగాయి. “అవి ఆలుచిప్స్” అన్నది తల్లి. ‘మేమెప్పుడు తినలేదే’ ఆశ్చర్యంగా అడిగాయి. “ ఇంకా కుర్ కురే, వీల్స్, బనానా చిప్స్, బిస్కెట్స్, బూందీ చాల రకాలు తింటారి మనుష్యులు” అన్నది తల్లి కోతి.
అమ్మా నాకు ‘కుర్ కురే’ కావాలి అడిగింది పిల్ల. తల్లి నవ్వుకుంటూ వెళ్ళి ‘కుర్ కురే’ ప్యాకెట్ తెచ్చిచ్చింది. గబగబా తిన్నది పిల్ల చాలా బాగున్నాయమ్మా అన్నది. ఇంకో చిప్స్ ప్యాకెట్ తెచ్చి రెండో పిల్లకు ఇచ్చింది తల్లి. రెండు పిల్ల కోతులూ వాటిని తింటూ ఆనందంలో మునిగిపోయాయి. ‘ఇవాల్టికి చూసింది చాల్లే’ అంటూ తల్లి కోతి పిల్లలను తీసుకోని ఇంటికి వెళ్ళిపోయింది.
 
          ఒక వారం తర్వాత మరల పిల్లలకు చిప్స్, కుర్ కురే తినాలన్పించింది. అమ్మ నడిగితే ఈ రోజు,రేపు అంటూ దాట వేస్తోంది. ఒక రోజు అమ్మా బయటకు వెళ్ళగానే పిల్లలు రెండూ ఊర్లోకి వెళదామని అనుకున్నాయి. అది గుడికే వెళ్ళలనుకున్నాయి. చిప్స్, కుర్ కురే కోసం సాహసం చేద్దామనుకున్నాయి.
 
        అనుకున్నట్లే ఒక రోజు రెండూ ఊర్లోని గుడికి వెళ్ళాయి. కొట్లోంచి ఒకామె బయటకు వస్తుంటే ఆమె చేతిలోని ప్యాకెట్ లాకేల్లాయి. దూరంగా గోడ మీద కూర్చొని పర పర ప్యాకెట్ చించాయి. గుప్పుమని కారం ఎగిరి ఆ రెండు కోతుల కళ్ళలో పడింది. కారం మంటకు పిల్ల కోతుల కళ్ళు మండసాగాయి. ఆ మంటకు పిల్ల కోతులు ఎగరసాగాయి. కళ్ళు రుద్దుకున్నా మంటలు తగ్గలేదు. ఏడుస్తూ లబో దిబోమని ఏడ్చాయి. అక్కడున్న నీటి తొట్టెలో పడి కళ్ళు కడుక్కున్నాయి అయినా కళ్ళ మంట తగ్గలేదు. ఏడుస్తూనే ఇంటి దారి పట్టాయి.
 
          కొద్ది దూరం వెళ్ళగానే తల్లి ఎదురొచ్చింది. పిల్లల్ని చూసి జరిగింది తెలుసుకుంది. మరల నీళ్ళతో కడిగింది. ఎడవకండని ఉరడించింది. ఎన్నో ఉపచారాల తర్వాత పిల్లలు కళ్ళు తెరిచాయి. పిల్లలు రెండూ తల్లిని హత్తుకున్నాయి. “ ఈ కారం తింటారా మనుష్యులు “ అంటూ బేలగా అడిగాయి.
 
          తల్లి చెప్పింది “ మనం ఆహారం ఏమిటన్నది కూడా తెలుసుకోవాలి. ప్యాకెట్లను నిదానంగా విప్పాలి. అప్పుడు కారం కళ్ళలో పడేది కాదు. ఏదైనా అనుభవాలే పాఠలు నేర్పిస్తాయి. పోనిలే ఇది మన మంచికే జరిగింది. ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా ఉంటుంది. ప్రతి విషయాన్నీ జాగ్రత్తగా పరిశీలించాలి. చిప్స్, కుర్ కురే లాంటివి ఎక్కువగా పిల్లల దగ్గరే ఉంటాయి. అది గమనించాలి. ఆ గుడి వెనక రూముల్లో ఉన్న వాళ్ళు అన్నం కూరలు వండుకుంటారు. దాని కోసం సరుకులు కొనుక్కుంటారు. వాళ్ల కూరల్లోకే ఈ కారం ప్యాకెట్ తిసుకెళుతున్నది ఆమె. పరిస్థితులు. పరిసరాలు పరిశీలించి తెచ్చుకోవాలి. కూల్ డ్రింకుల లాగే మద్యం ప్యాకెట్లు ఉంటాయి. చూసి తెలుసుకోవాలి ఈ సారి చూపిస్తాను. పిల్లలు ఆశ్చర్యంగా నోరు తెరిచి వింటున్నాయి.
 
          వాటికీ తమ తల్లి ఎంతో గొప్పగా అనిపించింది. అమ్మకు ఎన్ని విషయాలు తెలుసు అనుకున్నాయి. “అమ్మా నువ్వు గ్రేట్ “ అన్నాయి అమ్మను హత్తుకుంటూ !

    *****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.