ఒక్కొక్క పువ్వేసి-12
రొమ్ములు కోసి పన్ను కట్టిన ప్రాణ త్యాగి – నాంగేళి
-జూపాక సుభద్ర
కేరళ రాష్ట్ర దక్షిణ ప్రాంతంలో బహుజన కులాల మహిళలు తమ చాతిమీద చిన్న గుడ్డ పేల్క వేసుకుంటే పన్ను కట్టాల్సిందే. కేరళ బహుజన కులాల మహిళలు రొమ్ము పన్ను మీద, రొమ్ము పన్నుల్లో కూడా వున్న వివక్షల మీద 17 వ శతాబ్దం నుంచి పోరాడు తున్నారని చరిత్రలు చెపుతున్నాయి. కేరళ బహుజన కులాల మహిళలు తమ చాతి మీద గుడ్డ ముక్క కప్పుకోడానికి శతాబ్దాలుగా పోరాడినారు. ఆ పోరాట స్పూర్తే నాంగేళి ప్రాణత్యాగానికి సంకేతంగా చరిత్రలో నిలిచింది. రొమ్ము పన్ను కి వ్యతిరేకంగా నాంగేళి చేసిన ప్రాణత్యాగము బ్రిటిష్ ప్రభుత్వాన్ని ట్రావెన్ కోర్ రాజ్యాన్ని ఒక కుదుపు కుదిపిన సంఘటన. నాంగేళి చరిత్ర నిన్న మొన్నటి దాకా తెలువదు బైటి ప్రపంచానికి. కేరళ ప్రభుత్వం తొమ్మిదో తరగతి పాట్యాంశముగా నాంగేళి చరిత్రను ప్రచురించింది.
టి.మురళి అనే చిత్రకారుడు, కె.గోపాలన్ కుట్టి సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ ప్రసిడెంట్, SN సదాశివం , ఎ సోషల్ హిస్టరి ఆఫ్ ఇండియా, రామన్ నాయర్, ఎల్.సులోచనా దేవి వంటి చరిత్ర కారుల పరిశోధనల వల్ల, కఠోర శ్రమ వల్ల కేరళ సమాజం లో వున్న దురాచారాలు, వాటి మీద జరిగిన నిరసనలు, వ్యతిరేకతలకు సంబంధించిన పోరాటాలు, నాంగేలి వంటి బలిదానాల చరిత్రలు బైటికొచ్చినవి.
కేరళ లో రాజు తన ఖజానాను భర్తీ చేసుకోడానికి వేసిన అనేకమైన పన్నుల్లో రొమ్ము పన్ను ఒకటి. అయితే పన్నులు కేవలం బహుజన కులాల మీదే వేసేవారు. సొమ్ములు ధరిస్తే ‘మెని పన్ను,’ మీసం కనిపిస్తే ‘మీసాకప్ప’ అని పన్ను వేసి కేరళ బహుజన కుల సమాజాలను ,జలగల్లా పీల్చి పిప్పి చేసేది కేరళ రాజస్థానం. యిలాంటి పన్నులు కేరళ బహుజన సమాజమ్మీద నుటా యిరవై రకాల పన్నులుండేవి(120). యిట్లా తమ ఖజానాలు బహుజన సమూహాలు కట్టే పన్నులతోనే నింపుకునేది రాజదర్బారు.
కేరళ సమాజంలో మహిళలు తమ కుటుంబ పెద్దల ముందు (ఆడ,మగ) రొమ్ముల మీద ఎలాంటి ఆచ్ఛాదన వేసుకో కూడదు. వేసుకుంటే,,. పెద్ద వారిని అగౌరవ పరచి అవమానించినట్లు. పనివాళ్ళు పెద్ద,చిన్న,ఆడ,మగ వాల్ల ముందు వేసు కోవచ్చు. యిది సవర్ణ మహిళల మీదున్న కట్టుబాటు.
ఇంట్ల వేసుకున్నా ,,.,పెద్ద వాల్లకు ఎదురు పడితే వెంటనే తీసెయ్యాలి. వేసుకుంటే., మందలింపులున్నా ఈ మహిళలకు రొమ్ము పన్ను కట్టే నిబంధనలు శాసనాలు లేవు.
కానీ బహుజన కులాల మహిళలకు తమ చాతి మీద ఏదైనా గుడ్డ పేల్క వేస్కుంటే పన్ను కట్టాల్సిందే. బహుజన మహిళలు సవర్ణ మహిళల వలె యింట్లోనే వుండి గడప దాటక తిని నీడపట్టున వుండే జీవితాలు కాదు. బైటికి పోయి పని చేస్తేనే బతుకు. ఈ మహిళలు తమ కుటుంబములో పెద్దల ముందు ఎట్లున్నా,., ఆసాముల ఆడ, మగ వాల్లు ఆమడ దూరాన వున్నా..,వారి ఇంటికి పరిసరాల్లో వున్నా తమ చాతి మీద నూలు పోగు కూడా వుండకూడదు. వుంటే శిక్షలు, దండనలు పన్నులు కొన్ని సందర్భాల్లో రొమ్ములు కోసి చంపేసిన ఘటనలు చరిత్రలో చాలానే వున్నాయి. చాతి మీద ఏదయినా గుడ్డ పేల్క కనబడితే పెద్దకులాల ముందు వారిని ‘ బే యిజ్జత్’ చేసినట్టేనట. యిలాంటివి ఎదిరించేందుకు,కట్టడి చేసేందుకు తన వంతు నిరసనగా నాంగేళి అని ఒక బహుజన మహిళ ప్రానమిచ్చి సమాజంలో ప్రభావశీలిగా చరిత్రలో నిలిచింది.
19 శతాబ్దంలో రొమ్ముల మీద వేసే పన్నును ‘మూలక్కారమ్’ అనీ, తలమీద వెంట్రుకలకు ‘తలక్కారం’ అని పిలిచేది. యిక దళితులకైతే దారుణ పరిస్థితి. వారికి క్షవరం చేసుకోవడం ఒక సవాల్. మంగలి వాళ్ళు ముట్టుకుని క్షవరం చేయరు, చేసుకునే సమయాలు, తీరికలు దొరకవు . జుట్టు పెరిగితే పన్ను, మీసం పెరిగితే పన్ను. ఛాతి పెరిగితే పన్ను ఇట్లా పన్నులు కట్టలేక చాలామంది దళితులు ఆఖలి చావులకు బలయ్యే వారట.
ట్రావెన్ కోర్ రాజభటులు ఇల్లిల్లు తిరిగి రొమ్ము పన్ను వసూలు చేసేవారు. ఈ క్రూరమైన దురాచారానికి కేరళ అణగారిన కులాల మహిళలు జీవన్మరణ సమస్యగా పోరాడిన చరిత్రలు, శిక్షలు అనుభవించిన చరిత్రలు, యీ పోరాటాల్లో ఎందరో బహుజన కులాల మహిళలు, రాజభటుల, అధికారుల దౌర్జన్యాలకు అత్యాచారాలకు బలయ్యారని చారిత్రక పరిశోధకులు బైటకు తీసుకొచ్చారు.
యీ పోరాట చరిత్రలన్నీ నాంగేళిని ప్రభావితం చేసినయి. నిత్యం తమ సమాజాల మహిళలు ఎదుర్కొంటున్న యీ దురాచారాలన్నీ నిర్మూలించడానికి ఏమైనా చేయాలి, యిది కొనసాగకూడదు. ఈ హింస, అవమానాలు, దౌర్జన్యాలు, అత్యాచారాలు ఆగిపోవాలి. ఆడవాళ్ళకు రొమ్ములుండడము ప్రకృతి సహజము. ఈ ప్రకృతి సహజాల మీద, పిల్లలకు పాలిచ్చే చాతి కండరాల మీద ఇట్లాంటి దుర్మార్గాలెందుకు, మా రొమ్ముల సైజుల్ని లెక్క గట్టి పన్ను వేసే యీ క్రూరత్వాల్ని యింకెన్నాళ్లు భరించాలి. తీవ్రమైన నిరసనతో బుద్ధి చెప్పాలనుకున్నది.
ప్రాణ త్యాగం చేస్తెనన్నా మామీద వున్న రొమ్ము పన్ను పోతదని తలపోసింది. అందుకే తన రొమ్ముల్ని కోసి రాజభటులకు పన్నుగా యిచ్చి ఆత్మ బలిదానం చేసుకొని ప్రభుత్వాలు రొమ్ము పన్నును నిషేధించేందుకు కదిలే టట్టు చేసిన మహా సంఘ సంస్కర్త నాంగేళి.
నాంగేళి కేరళ రాష్ట్రం లోని అలప్పుజ జిల్లాలోని చేర్తాల గ్రామానికి చెందిన మహిళ. ఆమె భర్త చిరుకందన్. ఆమె కల్లు గీసే వృత్తి అయిన ‘ఎజవా’ కులానికి చెందినది. ఆమె పూర్తి వివరాలు అంటే ఆమె తల్లిదండ్రులు ఎవరు, పుట్టు పూర్వోత్తరాలు తెలియదు. ప్రభావ శీలమైన జీవనాన్ని ప్రాణత్యాగంతో సమాజాన్ని కుదిపేసిన నాంగేళి గురించిన పూర్తి సమాచారమ్ యింకా తెలవాల్సి వుంది. నాంగేళి కాలంలో (19 వ శతాబ్దం) రొమ్ము పన్ను కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బహుజన మహిళలు పోరాటాలు చేస్తున్న పర్యావరణం వుండింది. నాంగేలి రొమ్ము పన్ను బాధల్ని స్వయానా అనుభవించుతూ ఆ పోరాటాల్లో భాగమైంది.
ఒక రోజు తన వూరు చేర్తాలా గ్రామంలో రొమ్ము పన్ను వసూళ్లకు రాజభటులు వచ్చారు. పన్ను వసూలు చేస్తూ తన ఇంటికి కూడా చేరుకున్నారు. ‘రొమ్ము పన్ను వసూలుకు రేపు రాజభటులు వస్తున్నారు శూద్ర, అతిశూద్ర, మహిళలు యిండ్లలో వుండి పన్ను సమర్పించాలహో అని ‘దండోరా’ వేయిస్తారు. అందుకని రొమ్ము పన్ను చెల్లించేందుకు వూరు వాడ మహిళలు యిండ్లల్లోనే, పనికి పోకుండా వుండాలి. అట్లా నాంగేళి కూడా యింట్లనే వున్నది. భర్త చిరుకందన్ పొలం పనులకు వెళ్ళిండు. రాజభటులు పన్ను వసూలుకు వచ్చినప్పుడు అరిటాకులో దీపం బెట్టి, ఆ ఆకులో పన్ను చెల్లించడం సంప్రదాయం. నాంగేళి చుట్టూత ‘రొమ్ము పన్ను’ పై నిరసనలు, వ్యతిరేకతలు ఉదృతంగా వున్న మహిళా చైతన్యాలున్నవి. బహుజన కులాల మహిళల మీద వేసే ‘రొమ్ము పన్ను’ ను శాశ్వతంగా ముగింపు పలకాలని నిశ్చయించుకున్నది. తనకన్నా ముందు ‘రొమ్ము పన్ను’ నిర్మూలన కోసం అనేక మంది త్యాగాలు విన్నది. యివన్నీ ఆమెను బలంగా పురికొల్పినయి. ఆత్మత్యాగము తన తీవ్ర నిరసనతో
కనువిప్పు కలి గించాలను కున్నది. ఆత్మ త్యాగానికి సిద్ధపడినది. భటులు రాగానే యింట్లకు పోయి తన రెండు రొమ్ముల్ని కొడవలి తో పర పర కోసి అరిటాకులో పెట్టి ‘యిదిగొండి రొమ్ము పన్ను తీసుకొని పొండి, ఇకనైనా ఈ పన్ను ఎత్తేయ మని మీ రాజుకు చెప్పుండ్రి.’ అని కాలువలు కడుతున్న నెత్తుటి మడుగులో ప్రాణం విడిచింది.
ఆ హఠాత్తు పరిణామానికి రాజభటులు బెంబేలెత్తి వూరి ఆడవాళ్ళకు భయపడి వెంటనే అంత్యక్రియలు చేస్తున్నప్పుడు పొలం నుండి వచ్చిన నాంగేళి భర్త చిరుకందన్ ఆమె మరణాన్ని చూసి తట్టుకోలేక అతను కూడా ఆమె చితి మీద పడి ఆత్మ హత్య చేసుకున్నాడని స్థానికంగా చెప్తారు. యిది 1803 లో జరిగినట్లు గా వుందని రికార్డులు చెప్తున్నాయి. నాంగేళి ప్రాణత్యాగం చేసిన ప్రాంతాన్ని ‘మూలచ్చి పరంబు’ (రొమ్ము ల మహిళా భూమి) గా పిలవబడింది. తర్వాత నాంగేళి బంధువుల్ని ఆ వూరు నుంచి తరిమేసినారనేది కేరళ అంతా ప్రచారంలో వున్న కథ.
నాంగేళి ఆత్మ హత్య ఘటన ట్రావెన్ కోర్ సంస్థానం, బ్రిటిష్ ప్రభుత్వాలు సంస్కరణ దిశగా పయనించే ఆలోచనలో, సంక్షోభంలో పడినయి. నాంగేళి ప్రాణత్యాగం తర్వాత పోరాట శక్తుల నిరసనలు, వ్యతిరేకతలు, ప్రతిఘటనలు తీవ్రరూపమ్ దాల్చినయి. రొమ్ము పన్నుకు వ్యతిరేకంగా నాంగేళి చేసిన ఆత్మహుతి మహిళా ప్రతి ఘటనకు సంకేతంగా నిలిచింది.
నాంగేళి ప్రాణత్యాగం తర్వాత 1813-1859 మధ్య, ఆ తర్వాత రొమ్ము పన్ను కు సంబంధించి అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. 1813 లో ట్రావెన్ కోరు కోర్టు దివాన్ ‘క్రిస్టియానిటీ’ తీసుకున్న మహిళలు తమ చాతిని కప్పుకోవచ్చని తీర్మానిస్తే… రాజ దర్బారు వ్యతిరేకించింది. నాడార్ మహిళలు ‘సవర్ణ మహిళలకు లాగానే మాక్కూడా రొమ్ములను కప్పు కునే హక్కు కావాలనీ, సవర్ణ మహిళలకు లాగానే మాక్కూడా రొమ్ము పన్ను వుండద్దు అని చేసిన పోరాటమును ‘చన్నార్’ పోరాటంగా ప్రసిద్ధి.
క్రిస్టియన్, ముస్లిం, సిరియన్ మతాల మహిళలకు పొడవాటి జాకెట్లు వేసుకోవడానికి అనుమతి వుండేది. నాంగెలి ప్రాణ త్యాగం తో బ్రిటిష్ మిషనరీలు కదిలిక తో, జోక్యంతో క్రిస్టియన్ మతం తీసుకుంటే., రొమ్ము పన్ను వుండదు అనే ఆర్డర్స్ జారీ అయినాయి. అప్పుడు పెద్ద ఎత్తున బహుజన కులాల మహిళలు క్రిస్టియన్ మతం లోకి మారి రొమ్ము పన్ను నుంచి విముక్తి అయినారు.
శతాబ్దాలు గా కేరళ బహుజన మహిళలు అనేక పోరాటాలు చేసి, దౌర్జన్యాలకు అత్యాచారాలకు గురై, అనేక ఆత్మ బలిదానాలు జరిగిన తర్వాత కూడా 1959 లో బహుజన కులాల మహిళలు సవర్ణకుల మహిళల్లాగా వస్త్ర ధారణ చేసుకోకూడదు అని ట్రావెన్ కోర్ రాజా వారి హుకుం జారీ చేసిండంటే.. కేరళ ప్రజలు, మహిళలు,చరిత్రలు ఇట్లాంటి రాజులను క్షమిస్తాయా? అట్లా కేరళ లో బహుజన కులాల మహిళలు రొమ్ములు కప్పుకోవటమ్ ఒక పెద్ద సమస్య గా 20 వ శతాబ్దం దాకా కొనసాగింది’ అని సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కె.గోపాలకుట్టి అంటాడు.
ఒక నాయర్ భార్య కాలికట్ భూస్వామి భార్య ముందిటికి ఛాతీ మీద గుడ్డ తో పొరపాటున వచ్చిందట. అంత గొప్ప భూస్వామి భార్య ముందు రొమ్ము మీద గుడ్డేసుకొని వచ్చి అవమానించిందనీ, అగౌరవించిందనీ ఆ నాయర్ భార్య రొమ్ములు కోసేసినారని చట్టాంబి స్వామి బయోగ్రఫీ లో రామన్ నాయర్, ఎల్.సులోచనాదేవి ప్రస్తావించారు.
ప్రాంత, వాతావరణ పరిస్థితులను బట్టి, శ్రమను బట్టి , శ్రమ లేని విశ్రాంతిని బట్టి, వారి వారి వస్త్రధారణ వుంటుంది. ఎవరికి అనుకూలంగా వారి వస్త్ర ధారణను ఎంపిక చేస్కోవడం వ్యక్తుల యిష్టంగా వుండాలి. కానీ సామాజిక ఆంక్షలతో నిబంధనలతో కాదు. వస్త్రధారణను ఎంపిక చేసుకోవడం వ్యక్తుల యిష్టంగా వుండాలి. కానీ సామాజిక ఆంక్షలో నిబంధనలో కాదు. వస్త్రధారణను సామాజిక వ్యక్తుల చిహ్నాలుగా ఆధిపత్య పురుష సామ్యం చేసింది.ఆ క్రమంలో జాకెట్టు జెండర్ కు సంబంధించిన ఒక ప్రతీష్టాత్మక పాత్ర చరిత్రలో పోషించింది.
తమ శరీరమ్మీద చిన్న గుడ్డపేలిక కప్పుకోడానికి కేరళ బహుజన కులాల మహిళలు శతాబ్దాల తరబడి పొరాడి, నాంగేళి వంటి ప్రాణ త్యాగాలు ఎన్నో చేయాల్సి వచ్చింది.
భారత దేశం అంతటా అనేక రూపాల్లో మహిళలు, అణగారిన కులాలు వేసుకునే బట్టలు,నగలమీద, చేసే శ్రమమీద, తినే తిండి మీద అనేక బలవంతపు, అవమానకర కట్టడులు దురాచాలు క్రూరత్వాలు మోపింది ఆధిపత్య కుల మగస్వా మ్యం.
యిప్పటికి కేరళ గ్రామాలకు పోతే ఆత్మగౌరవం గా జాకెట్లు వేసుకొని శ్రమల్లో వున్న మహిళలను చూస్తే.,. నాంగేళి ఆత్మ త్యాగ పోరాట చరిత్ర ప్రతీకలు మెరుస్తుంటాయి.
*****
జూపాక సుభద్ర కవయిత్రి, కథకురాలు, కాలమిస్టు, వ్యాసకర్త, అనువాదకురాలు, పరిశోధకరాలు, వక్తగా, సంఘసేవకురాలు, ప్రభుత్వ ఉన్నతాధికారిణి. బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రస్తుతం తెలంగాణ ఉద్యోగుల సంఘంలో కీలకంగా పనిచేస్తున్నారు.
సుభద్ర గారు తెలుగు సాహిత్యంలో, మహిళా సాహిత్యంలో ఉన్న అగ్రకుల బావజాలాన్ని ప్రశ్నిస్తూ, ఆధునిక సాహిత్యంపై విమర్శ చేస్తూ దళిత, బహుజన సాహిత్యం యొక్క ఉన్నతిని పెంపొందిస్తూ రచనలు చేసున్నారు.