పేషంట్ చెప్పే కథలు – 3
సరైన మందు
–ఆలూరి విజయలక్ష్మి
దడ, ఆయాసం, కాళ్ళుచేతులూ పీకటం, నడుము నొప్పి, గుండెల్లో మంట, చచ్చే నీరసం.
రాజేశ్వరి బాధలన్నిటిని ఓపిగ్గా వింటూంది శృతి. చెప్పిందే మళ్ళి చెప్తూందామె. ఒక్కొక్క బాధని చిలవలు పలవలు చేసి వర్ణించి చెప్తూంది. మధ్య మధ్యలో కన్నీళ్ళు పెట్టుకుని పయటచెంగుతో ముక్కు, కళ్ళు తుడుచుకుంటూంది. శృతి సహనం చచ్చిపోతూంది. ఐనా దిగమింగుకుని, చిరునవ్వును ముఖానికి పులుముకుని బ్రహ్మ ప్రయత్నం మీద ఆమె వాక్ప్రవాహాన్ని ఆపి, పరీక్ష చేయసాగింది.
“అమ్మగారూ! ఇంతకు ముందు దిట్టంగా ఉండెదాన్నండీ. ఆ మాయాదారి ఆపరేషన్ చేయించుకున్నాకే ఈ రోగాలన్నీ పట్టుకున్నాయి” శృతి స్టెత్ తో రాజేశ్వరి చెస్ట్ని పరీక్ష చేస్తూంది. తనో ప్రక్క దీక్షగా పరీక్షచేస్తున్నా, ఆవిడ మాట్లాడడానికే కంకణం కట్టుకోవడం చూసి చిరాకేసి పరీక్షా చెయ్యడం ఆపింది.
“ఏం ఆపరేషన్ చేయించుకున్నారు?” సాధ్యమైనంత మృదువుగా అడిగింది శృతి.
“పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేశారండి” గొంతుక కోసేసినంత బాధగా చెప్పిందామె.
“ఎన్నాళ్ళయింది!”
“నాలుగేళ్ళయిందండి. అప్పట్నుంచే నాకీ తిప్పలన్నీ. అప్పటి నుంచే వైట్ బట్టకూడా అవుతోందండి” చివరి విషయం గొంతు తగ్గించి చెప్పింది రాజేశ్వరి.
అది సరే, పిల్లలు పుట్టకుండా చేసిన ఆపరేషన్ కీ, మీ బాధలకీ ఏమిటి సంబంధం?”
ట్యూబెక్టమీ అయ్యాక తలనొప్పి వచ్చినా, తుమ్మొచ్చినా, దగ్గొచ్చినా, ఎన్నేళ్ళు పోయాకొచ్చినా, దాన్ని ఆపరేషన్ కి అన్వయించి, చేయించుకున్నందుకు పశ్చాత్తాపంతో బాధపడే మహిళల్ని చూస్తే చిర్రెత్తుకొస్తుంది శృతికి. కానీ మరుక్షణం వివేకం వెన్ను తడుతుంది. తాను చిరాకుపడి, కోపంతో చిందులు తొక్కినందువల్ల ప్రయోజనం లేదు. అసలు అలా చేయడం తన మూర్ఖత్వమే అవుతుంది. తాను మెడిసన్ చదువుకోక పోయుంటే, అసలేమీ చదువుకోక పోయుంటే ఈమెలానే ఉండి ఉండేది. ఇలాంటి కోట్లాది మహిళలకు తెలియచేప్పే శక్తీ లేదు తనకు. కానీ తనదగ్గరకు వచ్చే కొద్దిమంది స్త్రీలకు ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి తెలియచెప్పాల్సిన సామాజిక బాధ్యత తన మీదుంది.
వివరంగా రాజేశ్వరికి చెప్పసాగింది శృతి.
“అదేంటమ్మగారూ అలా అంటారు? చేయించుకున్నాళ్లంతా ఏదో ఒక భాధ చెప్తానే వున్నారు” అంది-శృతి కోరి అబద్ధం చెప్తూ తనని మభ్యపెడుతున్నట్లనిపించింది రాజేశ్వరికి. ఆమె భావాన్ని అర్ధం చేసుకున్న శృతి ఎలా మొదలుపెట్టాలో, ఆమెకెలా నచ్చచెప్పాలో తోచక ఒక నిమిషం మౌనంగా ఉండిపోయింది.
“మీ పేరేమిటన్నారు?”
“రాజేశ్వరండి”.
“మీ వయసెంత?”
“పాతికండి.”
“పిల్లలెంతమంది?”
“నలుగురండి. పెద్దదానికి పన్నెండో ఏడండీ, మొన్నే చుట్టరికం చూసామండి. రేపు శ్రావణంలో లగ్గాలెట్టుకుంటామండీ. ఇదిగో, ఇదేనండి మా పెద్దది. ముందు దీన్ని చూడండమ్మగారూ! పన్నెండో ఏడొచ్చినా ఈడు రాలేదండి. నక్కలా ఎండిపోయింది. పన్నెండో ఎడంటే ఎవరూ నమ్మడం లేదండి. మీరు మంచి మంచి మందులిచ్చి తొందరగా పెద్దమనిషయ్యేలా చూడాలండి. ఇదిట్లా ఉంటే చుట్టరికమెక్కడ తప్పి పోతుందోనని మా చెడ్డ భయంగా ఉందండి” కళ్లప్పగించి చూస్తూంది శృతి.
“ఏంటమ్మగారూ, అట్లా చూస్తున్నారు.”
“అబ్బే ఏం లేదు” తనముందు నిలబడ్డ పసిదాన్ని పరిశీలనగా చూస్తున్న శృతి జవాబిచ్చింది.
“దీం తరువాత దానికి పదేళ్ళండి. దానికి కూడా చుట్టరికం చూస్తున్నాం. అయినాళ్ళే లెండి. దీని తరువాత కానుపుకి దేముడు నా మొరిన్నాడండి. మగ నలుసు పుట్టాడండి. ఆడి తరువాత నాలుగేళ్లదాకా కానుపు లేదండి. యిక పుట్టరనే అనుకున్నా నండి. అంతలోకి ఈ చిన్నాడు కడుపున పడ్డాడండి” చెప్తూనే నాలుగేళ్ళ కొడుకుని ప్రేమగా దగ్గరకు లాక్కుని పయటచెంగు తొలగించి రొమ్ము నోట్లో పెట్టింది రాజేశ్వరి. ఆ దృశ్యం చూసాక రాజేశ్వరి సమస్తమైన బాధలకూ మూలకారణం కొంతవరకు తెలిసింది శృతికి.
“మీ ఆయనేం చేస్తారమ్మా?” భర్త ప్రసక్తి రాగానే రాజేశ్వరి ముఖం మేఘా వృతమైంది.
“ఏం చేస్తాడు? కూచుని మింగుతాడు. ఊరు బలాదూరు తిరుగుతాడు. పిల్లలు, పాడి గేదెలు… అన్ని పనులకీ నేను చావాల్సిందే. చిన్న మెత్తుపని ముట్టుకోడు. పని సంగతి సరే. ఇంటికొచ్చాక చచ్చానా, బతికానా అనైనా అడగడు. ఛస్! పోనీయండి. ఆయన మాటెవడిగ్గావాలి. నా పిల్లల కోసం నేను బతుకుతున్నానంతే.” విరక్తి గా అంది రాజేశ్వరి. ఆమె జబ్బేమిటో యిప్పుడు పూర్తిగా అర్థమైంది శృతికి. పసితనం పోకుండానే కాన్పులు, సరైన బలం చేకూరి మనశ్శరీరాలు మామూలు స్థితికి వచ్చే అవకాశం లేకపోవడం, నడుమెత్తలేని చాకిరీ, తన పనికి, ప్రేమకు, ఆప్యాయతకు చిన్న మెత్తు గుర్తింపు లేకపోవడం, భర్త నుంచి కొద్దిపాటి అనురాగాన్ని, ఆత్మీయతనూ పొందలేకపోవడం, ఎదిగిన పిల్లలకు పాలిచ్చే అజ్ఞానం, మరెన్నో భ్రమలు, అపోహలు, మూఢవిశ్వాసాలు. రాజేశ్వరి లాంటి స్త్రీలకు కావలసింది కేవలం టానిక్కులూ, మందులూ కాదు… మందుల చీటీ చేత్తోపట్టుకుని ఆలోచిస్తూంది శృతి.
*****
డా.ఆలూరి విజయలక్ష్మి ప్రముఖ రచయిత్రి, వైద్యులు, సంఘసేవకులు. దాదాపు 150 కథలు, 5 కథా సంపుటాలు, 4 నవలలు, 3 వైద్య సంబంధ గ్రంథాలు రచించారు. అనువాదాలు కూడా చేసారు. వీరి రచనలు వివిధ వార, పక్ష, మాస, దినపత్రికలలో ప్రచురితమయ్యాయి. కొన్ని కథలు ఆకాశవాణి విశాఖ పట్టణం, విజయవాడ కేంద్రాల నుండి ప్రసారమయ్యాయి. వనిత మాసపత్రికలో ‘ఆరోగ్య విజయాలు’ అనే శీర్షికను నిర్వహించారు.
డా . ఆలూరి విజయలక్ష్మీ గారు నాకు వ్యక్తిగతంగా తెలియక పోయినా 2005 నుంచి యానాంలో స్వచ్ఛంద సేవాసంస్థ ను నిర్వహిస్తున్న నేపథ్యంలో వారంటే నాకు ఎనలేని గౌరవం ఆరాధన భావం ఏర్పడ్డాయి .వారు రచయిత కావటం మాలాంటి రచయితలకు గౌరవం .వారి రచన చదవటం ఇదే ప్రధమం .ఒక రచన సామాన్యులకు అవగాహన కల్పించేదై ,మేల్కొలిపేదై ఉండాలని నమ్మి రచనలు చేస్తున్న నాకు ఈ కథ ఊతమిచ్చింది .చిన్న కథే అయినా సామాన్యంగా ఉండే అపోహలను అనాచారాలను ఎత్తి చూపించింది . సోషల్ ఏక్టివిస్ట్ గా బాల్యవివాహాలు ,మేనరికాలు ఎంత బహిరంగ రహస్యమో ఎంత అనర్థకమో నాకు తెలుసు ..సదరు సాంఘిక దురాచారాలను ఎత్తి చూపిన రచయిత శ్రీమతి Dr .ఆలూరి విజయలక్ష్మీ గారికి ఈ రచనలు ఆమోదించిన శ్రీమతి Dr. కె .గీత గారికి అభివందనాలు ధన్యవాదాలు ….
రత్నాకర్ పెనుమాక