బతుకు చిత్రం-18

– రావుల కిరణ్మయి

జరిగిన కథ: జాజులమ్మ , సైదులు అనుకోకుండా ఒక వర్షం పడిన రాత్రి రాములవారి కళ్యాణ గద్దెపై కలుసుకుంటారు.ఇద్దరూ ఆ ఊరువారు కాకా పోవడంతో జనమంతా మూగి ఆసక్తిగా రాత్రి ఏమి జరిగి ఉంటుందని ఆరాతీస్తూ చివరికి సైదులు తల్లిదండ్రులు వచ్చి అసలు విషయం చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు.

***

          సైదులు ముల్లుకర్రకు బారిజోల్లు ,పగ్గం తగిలించి భుజాన వేసుకోగా జాజులమ్మ దూపబుడ్డి నెత్తి పైన పెట్టుకొని సైదులు వెంట పోలు తిరిగింది. మంగళ హారతి పట్టుకొని ఆడబిడ్డ పోలు తిరుగుతూ

మంగళం అనరు ..సుందరాంగులు అందరూ …
మంగళం అనరూ …ఓ అమ్మలారా మీరూ …..
కోత్తజంట మా అన్న వదినేలూ ……
పోలు తిరగవట్టే హంస నడకల తీరూ …
మంగళం అనరూ ..కాంతలారా మీరూ ….
దండిగా భాగ్యాలు కలుగగానూ …….
చాలా సొమ్ములు నాకు కట్నాలుగిచ్చి …
కనక లచ్చిమి వంటి కోడలును ఈయా ….
మంగళం అనరూ ……………

***

          ఏ పిల్లా ! తోలిచూరు కాన్పు కొడుకు పుట్టాలని పాడు ,బిడ్డ అంటానవ్ ? నీ  కట్నం రాడు మల్ల !అని ఓ ముసలవ్వ నవ్వగా ..

          కట్నం నా ఇంటికి కోడలును పంపడమేనే అవ్వ !ఈ కాలాన ఆడపిల్లలకే కరువచ్చింది. అని సైదులు,జాజులమ్మ ల వైపు తిరిగి అవ్వ మాటలు పట్టించుకోకుండ్రి. సల్లగా బతికి సంతాన వతులవుండ్రి.అని దీవించింది.

          అయ్యవారు చుక్కను (అరుంధతిని )చూపించాడు.తూర్పు,ఈశాన్యము వైపు చూపిస్తూ పసుపు,కుంకుమ,అక్షింతలు ఆ దిశ వైపు చల్లించాడు. దీనితో పోలు తిరగ్డం,చుక్కను చూడడం వంటి తంతు ముగిసి అందరూ భోజనాలకు కదిలారు.
సైదులు కు జాజులమ్మకు పచ్చని అరటి విస్తరిలో భక్ష్యము. లడ్డు, జిలేబి, ముద్దపప్పు, అన్నం, పెరుగు గారెలు,బొప్పట్లు ఇలా అన్ని రకాల పదార్థాలను వడ్డించుకొని వచ్చి ఈర్లచ్చిమి, ఆడబిడ్డ దగ్గరుండి సైదులు తో జాజులమ్మ కు మొదటి ముద్ద పెట్టించగా, ఆడబిడ్డ

వదినె ..మా వదినె మ్మ సిగ్గేల తల్లి …..
అన్న రాముడు నీకు బువ్వ పెట్టేను…
ఉడుకన్న్న మాని ?ఎంచబోకమ్మా …
చల్లన్నమాని ?చిట్లించు కో కమ్మ…
పంచభక్ష్యాలు పెట్టబోకున్న ……
పాయసమంతటి పావురం చూపమ్మ ..

          అని ఒక్కో పదార్ధం పేరు చెపుతూ పాట పాడుతూ ఒకరిచేత మరొకరికి కడుపునిండా తినిపించింది. సాయంత్రం అవుతుండగా అయ్యవారు జాజులమ్మకు పెళ్ళి సారె పోసి , అప్పగింతలు చేయించి సాగాదోలాలని నిర్ణయించడం తో అందరూ ఆ ఏర్పాట్లలో మునిగిపోయారు.

          ఇత్తడి తాంబాలం నిండా పసుపుకలిపిన బియ్యం సర్పంచ్ గారు తేగా, అయ్య వారమ్మ కొత్త బట్టలు,కండువలు ,రవిక ముక్కలు తెచ్చింది.ఇలాగే కుడుకలు,గరిజెలు , పోకలు ,ఖర్జూరలు మరొకరు తేగా చూడడానికి కన్నుల పండువగా అనిపించింది పీరయ్యకు. తను తన భార్య బతికున్నా ఇంత ఘనంగా చేసేవాడిని కాదేమో !అను కున్నాడు. సాంప్రదాయ బద్దంగా జరుగుతున్న పెళ్ళి తంతు తన భార్య ఏ లోకాన ఉన్నా దివేనార్తులు పెడుతూనే ఉంటుందని నిమ్మలపడ్డాడు.

          ఈర్లచ్చిమిని ,రాజయ్యను కొత్త జంట తో పాటుగా పీటలపై కూర్చో బెట్టి అయిదుగురు ముత్తయిదువలు సారే పోయడం మొదలు పెట్టారు . సారె పోస్తుండగా
రమణి సీతమ్మకు రతనాల సారె …….
దశరథుడు పంపనే దండిగానూ …
పసుపు కుంకుమ తోడి ముత్యాల తోడి ……
పోకలు ,ఖర్జూర ఫలములా తోటి …
గరిజెలు ,కుడుకల పసిడి సారెమ్మా ……
కోత్తబట్టలతోటి కోర్కె దీరా ….
పోసినా ఈ సారె గౌరుకూ పంచు ……
ముత్తయిదు భాగ్యమూ వరముగా అడుగు ……
పోసిన ఈ సారె పోచమ్మ కిమ్మూ ..

          అంటూ సకల దేవపతలకూ పంచుమని ఆశీస్సులు పొందుమని ఒక పెద్దవ్వ పాడుతుండగా ఆ తంతు కూడా సంతోషంగా ముగించారు.

          అందరికీ పంచడం కోసమని ఐదు వేరు వేరు పెద్ద డబ్బాలలో కుడుకలు ,పసుపు , కుంకుమలు ,శర్కర ,పిల్ల పసుపు కొమ్ములు వేసి ప్రత్యేకంగా బియ్యంతో కలిపి మర పట్టించిన పచ్చ పిండిని ,గరిజెలనుసర్ది ,వాటితో పాటుగా కండువాలు ,రవికె ముక్కలు గట్ట కూడా ఈర్లచ్చిమికి అప్పగించారు.

          ఇంత ఘనమైన సారె అందుకోవడం ఈ ర్లచ్చిమికి చాలా సంతోషాన్ని శుభాన్ని సూచించింది.

          తరువాత పీరయ్యను పిలిపించి జాజులమ్మ చేతిని సైదులు చేతిలో ఉంచి
‘’ఇక నుండి నా బిడ్డ భారం నీదే ‘’అని చెప్పమనగా , పీరయ్య కు ఏడుపు పొంగుకు వచ్చి అనలేకపోయాడు.

          ఈర్లచ్చిమే ఓదార్చుతూ ‘ ‘’అన్నా !జాజులమ్మ ఇక నుండి నీకు మాత్రమె బిడ్డ కాదు. నాకు కూడా బిడ్డసొంటిదే ,నువ్వు రంది వేట్టుకోకు ‘’అని ఓదార్చగా కొంచెం శాంతపడి ,
ఆచారం ప్రకారం జాజులమ్మ చేతిని వరుసకు ఆడబిడ్డల యేవారందరి చేతుల్లోనూ , రాజయ్య చేతిలోనూ పెట్టాడు.

          జాజులమ్మకు మనసంతా తనవారిని ,ఊరును విడిచి పో తున్నానే బాధ దిగ మింగుకుని అందరి దగ్గరకూ వెళ్ళి పాదాలకు నమస్కరిస్తూ ఆశీస్సులు తీసుకున్నది.
జాజులమ్మ వాడలో ఉండే అవ్వ ,

ఆకాశం కురువుమని మబ్బులకు వల చందమామ ….
నీళ్ళనప్పగించి సాగనంపినట్టు ….
న్యాలకు మబ్బులు నిళ్ళప్పగించి ….
వానగా కురువుమని సాగనంపినట్టు ….

అని పాడి పాడి చివరగా ,

తల్లి సీతమ్మోలె మసలుకో తల్లీ !
భూతల్లి కున్నంత ఓర్పుతో ఉండి ….
పుట్టింటికే పేరు తెచ్చిపెట్టమ్మా ….
మెట్టింటి నే నివు పెంపు చేయమ్మా ….
అనే ఆకాంక్ష ల తో ముగించింది.

          పందిట్లో ఉన్న వారందరూ ఆడపిల్లలను గన్న తల్లిదండ్రులకు ఈ అప్పగింతలు ఏనాడయినా తప్పవని అనుకుంటూ కళ్ళలో నిరు తీసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు.
అయినవారు, కానివారు అందరూ ఈర్లచ్చిమి కి తల్లి లేని పిల్ల ,తల్లివైనా ,అత్తవైనా నీవేనని కడుపులో పెట్టుకొని చూసుకొమ్మని చెప్తుండడంతో ,ఈర్లచ్చిమి కూడా వారందరికీ మాట ఇచ్చింది.

          జాజులమ్మకు చిలకాకు పట్టుచీర కట్టించి మళ్ళీ ముస్తాబు చేశారు.సైదులుకు చింగులు పోసి ధోవతి కట్టించి అంగీ వేయించి రుమాలు చుట్టారు. ఆడ బిడ్డ భాషింగాలు కట్టి మంగళ హారతి వెలిగించి హారతి పళ్ళెం పట్టుకొని వెంట నడిపిస్తుండగా రాముల వారి గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నారు. అయ్యవారు ఇద్దరి పేర్లు గోత్రం తో సహా కలిపి అర్చన చేసి తీర్థప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించాడు.

          ఇంతలో ఎడ్లబండి ని అలకరించుకొని వచ్చారు.ఇద్దరూ దానిలో ఎక్కగానే ఊ రేగింపు మొదలయింది. దారిలో అంజన్న గుడికి ,భూలచ్చిమి ,మాలచ్చిమిలకు, పోశమ్మ, ఎల్లమ్మ తల్లులకు దండం పెట్టుకుంటూ ఊరి బయటి వరకూ ఉరేగింపుగా వచ్చారు . ఇక అక్కడి నుండి అందరూ ఆగి పోగా సైదులు తరుపువారు మాత్రమె ముందుకు కదిలారు.

***

          ప్రశాంతంగా ఊరు చేరుకున్నారు . ఊరిలో కూడా దారిలో ఎదురైనా దేవుళ్ళందరికీ మొక్కి ఇల్లు చేరుకున్నారు.

          కొత్త జంటను ఇంటిలోకి రానియ్యకుండా అడ్డు పడుతూ ఆడబిడ్డ వెళ్ళి ఇంటి లోపలి వెళ్ళి తలుపు పెట్టింది. “గలుమకాడికి వచ్చినం తలుపు తియ్యమని ” అడుగమన్నది.

ఎవరు వచ్చారు ?
మేము వచ్చాము .

అంటే ఎవరు? భార్యాభర్తలం .

నీ మొగని పేరేమి ?
జాజులమ్మ సిగ్గుపడి చెప్పలేదు .

నీ భార్యపెరేమి ?
సైదులు చాలా సిగ్గు పడుతూ నెమ్మదిగా ‘’జా ..జా ..జాజులమ్మ !అన్నాడు .

నాకు ఏమి ఇస్తావో నీ భార్యతో చెప్పించు ,బిడ్డనిస్తావా ?పడ్డనిస్తావా ?
అని అడుగగా ,

‘’ఈర్లచ్చిమి ఇద్దరూ కలిసి బిడ్డనిస్తామని చెప్పండిరా ‘’అని వాళ్ళతో చెప్పించింది .
తుపుబంధానం పేరిట సాగిన ఈ తంతు అక్కడున్న వారందరిలోనూ నవ్వులు పూయించింది.

ముత్తాల బళ్ళు వచ్చి ఆకిట్లో నిలిచినాయి ..
శ్రీలచ్చిమి తలుపు తియ్యమ్మా ….
ముత్తాల బళ్ళు రాలే ..ఆకిట్ల నిలవలేదు …
శ్రీలచ్చిమి తలుపు తియ్యనమ్మా ….

          ఇట్లా రసరమ్యంగా ఆడబిడ్డ పాట పాడుతుంటే అందరూ మైమరిచి పోయారు.
తరువాత ఇంటిలోకి ఆహ్వానించి నేరుగా ఐరోన్ల వద్దకు తీసుకువెళ్ళారు.అక్కడ దేవుళ్ళకు దండం పెట్టించి ఆడబిడ్డ భాషింగాలు విప్పి ఐరోన్ల పై న ఉన్న కంచుల్లో పెట్టింది .

*****

ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.