మిట్ట మధ్యాహ్నపు మరణం- 9

– గౌరీ కృపానందన్

          అమ్మ వచ్చీ రాగానే కూతురిని పట్టుకుని భోరుమన్నది.

          “నా తల్లే!  ఆ దేవుడికి కళ్ళు లేవా? ఈ కష్టాన్ని మన నెత్తిన పెట్టాడే.”

          “అమ్మా… అమ్మా! ఎంత రక్తమో తెలుసా? హనీమూన్ కి బెంగళూరుకి రావడం తప్పా అమ్మా? నేను మాత్రం బాగానే ఉన్నాను. ఆయన్ని ఎవరో చంపేశారు.” వెక్కి వెక్కి ఏడిచింది.

          “ నా తల్లే! నీ ఈ గతి రావాలా?”

          “అక్కా! తనని ఎక్కువగా మాట్లాడించకు. హిస్టీరికల్ గా ఉంది.”

          “మణీ! అసలు ఏమైయింది?”

          “ఏదో అయ్యిందిలే. ఇక జరగాల్సింది చూడాలి. ఉమా! ఏడుపుని ఆపు.”

          “శవాన్ని ఎక్కడికి తీసుకు వెళ్ళారు?” రామనాధన్ గారు తడబడుతూ అడిగారు.

          “విక్టోరియా హాస్పిటలుకి. అక్కడికి వెళ్ళాలా?”

          “అవును మణీ! వాళ్ళ అమ్మా నాన్న కారులో బయలు దేరి వస్తున్నారు. రాత్రే తిరిగి వెళ్లి పోవాలని అనుకుంటున్నారట. మణీ! మన కోసం కూడా ఒక టాక్సీ చూడు. రాత్రి మెయిల్లో టికెట్లు దొరుకుతాయా? ఫోన్ చేసి ఏర్పాట్లు చూడు.”

          “మణి అన్ని ఏర్పాట్లూ చేస్తాడు నాన్నా. ఏం మణీ! చెన్నైకి వెళ్ళగానే స్మశానానికి ఫోన్ చేసి ఏర్పాటు చేయించు.”

          “చూశావా అక్కయ్యా! అప్పటినుంచీ ఇలాగే హిస్టీరికల్ గా మాట్లాడుతోంది. ముందు ఈమెకి వైద్యం చేయించాలి.”

          “హాస్పిటల్ కి వెళదాం మణీ. వాళ్ళు అక్కడికే వస్తారు.”

          “ఏడవకు నా తల్లీ. కళ్ళు తుడుచుకో.” తల్లి కూతురి ముఖాన్ని కొంగుతో తుడిచింది.

          వాళ్ళు హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు మూర్తి అమ్మా నాన్నలు, అతని తమ్ముడు ఇంకా ఎవరెవరో బంధువులు వచ్చేశారు. అత్తగారిని చూసింది ఉమ. ఆవిడ మార్చురీ గేటు దగ్గర కూర్చుని, “నా కొడుకు చనిపోయాడు… చనిపోయాడు” అంటూ హృదయ విదారకంగా ఏడుస్తోంది. ఉమను చూడగానే, భుజాలను పట్టుకుని కుదుపుతూ, “నా బంగారు తల్లీ! మనం ఓడిపోయాం అమ్మా” అని మళ్ళీ ఏడిచింది.

          “అత్తయ్యా! మీకు ఎలా చెప్పను? క్రిందికి వెళ్లి వచ్చేసరికి నిద్ర పోతున్న ఆయన్ని ఎవరో…. ఆయన్ని ఎందుకు హత్య చేశారు?” మళ్ళీ మళ్ళీ అవే ప్రశ్నలు.. ఏడుపులు..

          మూర్తి తండ్రి కండువాను నోటికి అడ్డంగా పెట్టుకుని మౌనంగా విలపించారు. ఇనస్పెక్టర్ మాధవరావు ఆ వైపు రాగానే మణి అడిగాడు.

          “శవాన్ని ఎప్పడు ఇస్తారు సార్?”

          “ఇంకో అరగంటలో ఇస్తారు. చెన్నైకి తీసుకుని వెళ్తున్నారా?”

          “అవును. మూర్తి అమ్మా నాన్నా అలాగే అనుకుంటునట్లు తెలిసింది.”

          రామనాధం ఆయన దగ్గిరికి వచ్చారు.

          “సార్! నేను మా అమ్మాయిని తీసుకువెళ్ళచ్చా?”

          “మూర్తిగారి తండ్రిని కాస్త పిలవండి మణీ. సార్! మీ అమ్మాయిని మీరు తీసుకు వెళ్ళొచ్చు. కాని దానికి ముందు కొంచం ఆమెతో  మాట్లాడాలి.”

          “సరేనండి.”

          మూర్తి నాన్నగారు అక్కడికి వచ్చారు.

          “సార్! మీ అబ్బాయికి తెలిసిన వాళ్ళలో మాయ అని ఎవరైనా ఉన్నారా?”

          “ఆ పేరులో తెలిసిన వాళ్ళు ఎవరూ లేరండీ.”

          “ఆఫీసు ఫ్రెండ్స్?”

          “సారి సార్. ఆ పేరును నేను ఇంతవరకు విన్నది కూడా లేదు. ఎందుకు అడుగు తున్నారు?”

          “రూమ్ లో అద్దం మీద మాయా అని వ్రాసి ఉంది. కంగారు పడకండి. అన్ని  వివరాలను ఎంక్వయిరీ చేస్తున్నాము. మణీ! కాస్త ఉమ గారిని పిలవండి.”

          “ఎందుకు?”

          “కొన్ని ప్రశ్నలు అడగాలి.”

          “ఈ పరిస్థితిలో ప్రశ్నలు అడుగుతానంటారా?”

          “లేకపోతే మిమ్మల్నందరినీ ఈ ఊళ్లోనే ఉండమని చెప్పాలి. ముఖ్యంగా ఆవిడని కొన్ని ప్రశ్నలు అడగాలి.”

          ఉమ మెల్లగా అక్కడికి వచ్చింది.

          “సార్! ఇప్పుడు మీ ప్రశ్నలతో ఆమెకి కష్టం కలిగిస్తారా?”

          “నువ్వు ఉండు మణీ. సార్! మీరు అడగండి. నేను చెబుతాను” అంది ఉమ.

          ఇనస్పెక్టర్ర్, ఉమ ఇద్దరూ కొంచం దూరంగా ఉన్న కారిడార్ వైపు నడిచారు.

          “కూర్చోండి ఉమా! మిమ్మల్ని సూటిగా అడుగుతాను. జవాబు చెప్తారా?”

          “అడగండి.”

          “మిసెస్ ఉమా! మూర్తి గారిని మొట్ట మొదటి సారిగా ఎప్పుడు చూశారు?”

          “రెండు నెలల క్రితం. పెళ్లి చూపులకి వచ్చినప్పుడు.”

          “ఆ తరువాత?”

          “పెళ్లి పీటల మీద చూశాను.”

          “పెళ్లి ఎప్పుడు అయ్యింది?”

          “రెండు రోజుల క్రితం.”

          “ఐ యాం వెరి సారీ మిసెస్ ఉమా. మూర్తిని మీరు హత్య చేశారా?”

          ఉమ వెంటనే, “లేదు” అంది.

          “ఈ పెళ్లి మీ ఇష్టంతోనే జరిగిందా?”

          “అవును.”

          “ఈ పెళ్లి వల్ల ఎవరైనా నిరాశ చెందిన వాళ్ళు ఉన్నారా?”

          “నిరాశా! అంటే?”

          “వేరే ఎవరైనా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలన్న ప్రపోజల్ ఉండిందా?”

          “ముందొకసారి మా మేనమామయ్యకి నన్ను ఇచ్చి చేయాలనుకున్నారు, మాట వరుసకే. కానీ నాన్నగారు వద్దనేశారు.”

          “మీకు పెళ్ళయ్యే ముందు ప్రేమ వగైరాలు ఏదైనా ఉండి ఉంటే ఫ్రాంక్ గా చెప్పండి.”

          “అలాంటిది ఏమీ లేదు సార్.”

          “మామయ్య మణితో?”

          “లేదు.”

          “మూర్తి ఎలాంటి మనిషి?”

          “తెలీదు.”

          “తన గురించి అతను ఏమీ చెప్పలేదా?”

          “ఈ రెండు రోజుల్లో మేము శారీరకంగా తెల్సుకున్నదే ఎక్కువ. మానసికంగా దగ్గిర అవడానికి వ్యవధి లేక పోయింది.”

          “ఐ సీ. ఆయన ఎలా హత్య చేయబడ్డారో మీకు తెలుసా?”

          “తెలియదు. కానీ తెలుసు కోవాలనుకుంటున్నాను.”

          “మేము కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నాము. బాగా ఆలోచించి చెప్పండి. ఈ రెండు రోజుల్లో మూర్తిగారి ప్రవర్తన ఎక్కడైనా ఎప్పుడైనా వింతగా అనిపించిందా?”

          “లేదు. ఆయన గురించి నాకు పూర్తిగా తెలియదు. ఆయనకీ ఏ రంగు ఇష్టం? ఎలా ఉంటే ఆయనకి నచ్చుతుంది? ఎలాంటి పుస్తకాలు చదువుతారు? కనీసం ఆయన బ్లడ్ గ్రూప్ ఏమిటో కూడా తెలియదు.”

          “బ్లడ్ గ్రూప్ ఏమిటో మాకు తెలుసు. మీ మామయ్య మణి ఎలాంటి మనిషి?”

          “మంచి వాడు. ఇతరులకు సాయం చేసే మనిషి. అమాయకుడు.”

          “అలాగా. దివ్య ఎవరూ?”

          “దివ్యా? మీకు ఆమె ఎలా తెలుసు?”

          “మీ మామగారితో మాట్లాడుతూ నిలబడి ఉందే. ఆవిడేగా?”

          “అవును. ఆమె… ఆమె…”

          “చెప్పండి.”

          “మూర్తి మొదట ఆమెను చూడడానికి పెళ్లి చూపులకి వెళ్లి నచ్చిందని కూడా చెప్పారట. తరువాత జాతకాలు కుదరలేదని మూర్తి అమ్మా నాన్నలు వద్దన్నారని తెలిసింది.”

          “మణి, దివ్య దీని కోసమే బెంగళూరుకి వచ్చారా?”

          “లేదు. ఇద్దరూ మేము వచ్చిన రైలులోనే బెంగళూరుకి వచ్చారు, వేరు వేరు పనుల మీద.”

          “అలాగా. ఇంటరెస్టింగ్!” అన్నారు  మాధవరావు. “ఓ.కె. మీరు వెళ్ళొచ్చు.”

          “సార్! ఒక రిక్వెస్ట్.”

          “ఏమిటమ్మా?”

          “మూర్తిని హత్య చేసింది ఎవరో మీరు కనుక్కోగలరు కదా. అతన్ని నాకు చూపించండి.”

          “తప్పకుండా. ఇంకో విషయం. చాలా చిన్న వయస్సు మీది. ఇలాంటి దుర్ఘటనని ఎదురుకోవడం చాలా భయంకరమైన విషయం. కానీ మీ భవిష్యత్తును సంతోషంగా మలచుకోవాలి. జీవితాన్ని కాలదన్ను కోకండి.”

          “మూర్తిని చంపిన వాళ్ళ ఉద్దేశ్యం ఏమై వుంటుంది? ఆ హత్యకి కారణం ఏమిటి?”

          “ఏదైనా సరే. మనకి షాక్ కలిగించేదిగా ఉంటుంది.  మీరు వెళ్లి మణిని పంపించండి.”

          “మణీ! ఇనస్పెక్టర్ర్ గారు నిన్ను పిలుస్తున్నారు. ఏవో ప్రశ్నలు అడగాలట. దివ్యా! నువ్వు ఎప్పుడు వచ్చావు?”

          దివ్య ఉమని చూసి ఏడవసాగింది. “ఉమా! ఉమా! ఐ యాం సారీ. నీకు ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. ఆ దేవుడికి కళ్ళు లేవు.”

          “దేవుడే లేడు” అంది ఉమ.

          మూర్తి తమ్ముడు ఆనంద్ వచ్చి ఆమె పక్కన నిలబడ్డాడు.

          “ఆనంద్! క్రికెట్ లో ఇండియా గెలిచిందా? న్యూజిలాండా?”

          ఆనంద్ వెక్కి వెక్కి ఏడవసాగాడు. “వదినా! మీకు ఇంత అన్యాయం జరిగి ఉండ కూడదు.”

          “ఆనంద్! నాకో సాయం చేస్తావా?”

          “చెప్పండి వదినా.”

          “నువ్వూ, నేనూ కలిసి మీ అన్నయ్యని చంపిన హంతకుణ్ణి పట్టుకుందామా?”

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.