మూడు గ్రామాల సమాహారం – కోల్ కత్తా

-కందేపి రాణి ప్రసాద్

 
          నేను ఈ నేల 27వ తేదీ ఉదయం రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఏసియా వారి ఫ్లైట్ లో కోల్ కత్తా బయల్దేరాను. కోల్ కత్తాలోని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఎయిర్ పోర్టులో దిగాను. దీన్ని ఇంతకు ముందు ‘డమ్ డమ్ ఎయిర్ పోర్టు’ అని పిలిచేవారట. ఈ ఎయిర్ పోర్టు డమ్ డమ్ అనే ప్రాంతంలో ఉండటం వల్ల దీనికా పేరు వచ్చిందట. ఎయిర్ పోర్టు నుంచి హజ్రా ప్రాంతంలో ఉన్న వివేకానంద మెడికల్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ కు వెళ్ళాను. అక్కడ మాకు మూడు రోజులు సెమినార్ జరగనున్నది గావున నేను కోల్ కత్తాకు మిత్రులతో వచ్చాను. నేను నా మిత్రులందరూ కూడా శిశు వైద్య నిపుణులం. మేమందరం అక్కడికి దగ్గర్లో ఉన్న బాలి గంజ్ లోని ఓ హోటల్ లో రూములు తీసుకున్నాము. ఆ హోటల్ లో వెంకటేశ్వర స్వామి విగ్రహం పెద్దది పెట్టారు చాలా బాగున్నది.
 
          సాయంత్రం అందరం సరదాగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్ళాము. ఇంతకు ముందు కలకత్తా వచ్చినప్పటికీ, ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. చిన్నప్పుడు సైన్స్ సిటిలో జరిగిన మెడికల్ కాన్ఫరెన్స్ కు మమ్మీ డాడిలతో కలసి వచ్చాను. అప్పుడు మా హోటల్ ఎదురుగా నేషనల్ లైబ్రరీ ఉన్నది. మా అమ్మకు సాహిత్యం అంటే ఇష్టం కాబట్టి మమ్మల్ని ఆ లైబ్రరీకి తీసుకెళ్ళింది. వంద సంవత్సరాల చరిత్ర గలిగిన ఆ లైబ్రరీలో మనుషుల సంచారమే లేదు. మేమప్పుడు ఐదారు తరగతులు చదువుతున్నాము. చిల్డ్రన్ డిపార్ట్మెంట్ కు వెళితే చాలా సంతోషంగా ఎదురొచ్చి స్వాగతించారు. వారు ఎన్ని సంవత్సరాలయిందో పిల్లల్ని చూసి నాకు మా అన్నయ్యకు చాక్లెట్లు ఇచ్చి, అన్ని పుస్తకాలనూ చూపించి వాటి గురించిన వివరాలు ఒక్కొక్కటి ఓపికగా చెప్పారు. మేం వచ్చేస్తుంటే బయటిదాకా వచ్చి బై బై చెప్పారు. ఇప్పుడు ఆ విషయాలన్నీ గుర్తొచ్చాయి.
 
          దారిలో బండి మీద చాయ్ తాగాం. ఇక్కడ మట్టి పిడతలో చాయ్ పోసిచ్చారు. రోడ్డంతా చాల మురుకిగా ఎక్కడ చెత్త అక్కడే కనిపిస్తూ ఉన్నది. ఈ ఏరియా చాల పోష్ ఏరియా అని కారు డ్రైవరు చెప్పాడు కానీ చాలా అపరిశుభ్రంగా ఉన్నది. రోడ్డు పక్కన ఉన్న ఫుట్ పాత్ లపై చాలా మంది నివసిస్తున్నారు. అక్కడ ఉన్న పబ్లిక్ కుళాయిల దగ్గరే వారు స్నానం చేస్తున్నారు. స్త్రీలు స్నానం చేయడానికి కావలసిన కనీస మరుగు కూడా లేకపోవడం చూస్తే భాదనిపించింది. శాస్త్ర సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నాం అనుకుంటున్నాం గానీ చాలా కనీస అవసరాలు కూడా తీరటం లేదు.
ఇంకొంచెం ముందుకు పోతే రైళ్ళలాంటి ట్రాములు మెల్లగా నడుస్తూ మనుష్యులను మోసుకెలుతూ రోడ్డు మీద వెళుతున్నాయి ఇవే ట్రాములు. ప్రస్తుతం భారతదేశం మొత్తమ్మిద ట్రాములు నడిచే ఏకైక నగరం కలకత్తా మాత్రమే. ఒకప్పుడు మద్రాసులో కూడా ట్రాములు ఉండేవని మా అమ్మమ్మ చెప్పింది. ఈ ఎలక్ట్రిక్ ట్రాములు చాలా పాతదైన ఆపరేటింగ్ సిస్టమ్ తో నడుస్తున్నాయి. కోల్ కత్తా నుండి రోడ్డు ద్వారానూ, రైలు ద్వారానూ కూడా బంగ్లాదేశ్ రాజధాని డాకాను చేరుకోవచ్చునట. కోల్ కత్తాలో నాలుగు రైల్వేస్టేషన్లున్నాయి. సీల్ డా, చిత్పూర్, హౌరా, షాలిమార్ అనేవి నాలుగు రైల్వేస్టేషన్లు ఇందులో హౌరా రైల్వేస్టేషన్ భారతదేశంలోనే అతి పెద్ద రైల్వే కాంప్లెక్స్.
 
          కోల్ కత్తాను ఇంతకు పూర్వం కలకత్తా అని పిలిచేవారు. ఇది భారతదేశంలోని మూడవ పెద్ద నగరం. ఇది వెస్ట్ బెంగాల్ కు రాజధాని నగరం. హుగ్లీ నది ఒడ్డున ఈ నగరం నిర్మించబడింది నగరం తూర్పు తీరం వైపు 80కి.మీల మేర నది ఉన్నది. పడమటి వైపు బంగ్లాదేశ్ బార్డర్ ఉన్నది. తూర్పు భారతావనికి వాణిజ్య, సాంస్కృతిక, విద్య కేంద్రంగా కలకత్తా నగరం భాసిల్లుతున్నది. ఇక్కడ ఉన్న కోల్ కత్తాపోర్టు, భారతదేశంలోనే పురాతన పోర్టుగా పరిగణించబడుతుంది. ఈ నగరాన్ని భారతదేశానికి “సాంస్కృతిక రాజధాని” గా భావిస్తారు. ఈ నగరానికి City of Joy అని నిక్ నేమ్ కూడా ఉన్నది. ఇక్కడ జిడిపి రేట్ చాల పెరిగింది. ఇంతకు పూర్వం 60 డాలర్లు ఉంటే ప్రస్తుతం 150 బిలియన్ డాలర్లకు పెరిగిందట. భారతదేశంలో ముంబాయి, డిల్లీల తరువాతి స్థానం కోల్ కత్తాదే. ఇది పురాతన నగరం ఇక్కడ ఇళ్ళన్ని పురాతనంగా పాత కాలంలోని రంగులతో ఉంటాయి.
 
          మరునాడు వివేకానంద మెడికల్ కాలేజికి వెళ్ళాం. భారతదేశంలో సాధారణ ఇన్ ఫాంట్ మోర్ట లిటి రేట్ 33 గా నమోదు కాగా కోల్ కత్తాలో 41 గా నమోదవుతున్నది. ఇక్కడ ప్ర్తహి వెయ్యి మంది పిల్లల్లో అంటే ఐదు సంవత్సరాలు దాటని వారిలో 49 మంది అనేక వ్యాధుల వలన మరణిస్తున్నారు. ఇక్కడ కూడా మలేరియా, డెంగ్యూ చికెన్ గున్యా జబ్బులు ఎక్కువగా వ్యాపిస్తూన్నాయి. ఆసియా మొత్తంలోనే రెండవ పెద్ద ఇన్స్టిట్యూట్ అయినటువంటి “కలకత్తా మెడికల్ కాలేజీ” ఇక్కడ ఉన్నది. ఈ మెడికల్ కాలేజీ 1835 లో ఏర్పాటు చేశారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోనే అతి పెద్ద హాస్పిటల్ మరియు పురాతనమైన హాస్పిటల్ ‘sskm హాస్పిటల్’. ఈ నగరంలో పది మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ నగరంలో 48 గవర్నమెంట్ హాస్పిటల్స్, 366 ప్రైవేటు హాస్పిటల్స్ ఉన్నాయట. మొత్తం నగరంలో 27, 687 హాస్పిటల్ బెడ్స్ ఉన్నాయి. మెడికల్ నార్మ్స్ ప్రకారం ప్రతి పదివేల మందికి 9 హాస్పిటల్ బెడ్స్ ఉంటే చాలు. కానీ ఇక్కడ ప్రతి పదివేల మందికి 61 హాస్పిటల్ బెడ్స్ ఉన్నయన్న మాట. అంటే ఇక్కడ హెల్త్ కేర్ అంతగా అభివృద్ధి చెందిందన్న మాట. హెల్త్ కేర్ అభివృద్ధితో పాటు ఎయిడ్స్ భాదితులు ఎక్కువగానే ఉన్న నగరం కోల్ కత్తా.
 
          కోల్ కత్తా అనే పేరు ‘కోలి కటా’ అనే బెంగాలీ పదం నుంచి ఉత్పన్నమయింది. కోల్ కత్తానగరం మూడు గ్రామాల కలయిక వలన ఏర్పడిందట. కోలి కత్తా, సుత నూతి, గోవిందాపూర్ అనే మూడు గ్రామాలు కలసిపోయి ఒకే ఊరుగా ఏర్పడినపుడు ఆ మూడింటి లో ఒక పేరైన ‘కోలి కత్తా’ గా పేరు ఏర్పడింది. కాలక్రమేణా కలకత్తా గా మారిందని చెబుతారు. మరొక అభిప్రాయం ఏమంటే ఇక్కడ ఉన్న ‘కాళీ ఘాట్ ‘ వలన కూడా ఈ నగరానికి కలకత్తా పేరు వచ్చి ఉండవచ్చని. ఈ నగర జనాభా సుమారు 45 లక్షల మంది ఇక్కడి అధికారిక భాష బెంగాలీ. 1690 ప్రాంతంలో ఈ ప్రాంతం ఈస్టిండియా కంపెనీ చేతికి వచ్చింది 1773 నుండి 1911 దాకా కలకత్తా నగరం ఈస్టిండియా కంపెనీ ఆధీనంలోని భారతదేశానికి రాజధానిగా వ్యవహరించింది. ఆ తర్వాత కొన్ని భౌగోళికమైన అననుకూల పరిస్థితుల మూలంగా రాజధానిని కలకత్తా నుండి డిల్లికి మార్చవలసి వచ్చింది. భారత స్వతంత్రయ సంగ్రామ కేంద్రంగా కలకత్తా నగరం గట్టి పాత్రనే పోషించింది.
 
          కోల్ కత్తా అనగానే హౌరా బ్రిడ్జి, శాంతినికేతన్ గుర్తొస్తాయి. శాంతినికేతన్ కు రైల్లో వెళ్ళాలి. ఒక రోజంతా సమయం పడుతుంది అన్నందు వల్ల దాన్ని వాయిదా వేసుకున్నాం. కనీసం హౌరా బ్రిడ్జి చూడాలని వెళ్ళాం. ‘యమహా నగరి కలకత్తా పురీ’ అన్న వేటూరి గారి పాటలో ఉన్నంత అందంగా కనిపించలేదు. మట్టి కొట్టుకు పోయినట్లుగా రద్దీగా ఉండి. అక్కడ ఫోటో తీసుకోవాలని ఎంత ప్రయత్నించినా కుదరలేదు బ్రిడ్జి మీద కారు ఆపడానికి లేదట. అందుకే రెండు మూడుసార్లు అలాగే కారులో తిరిగి చూసి తృప్తి పడ్డాము. మా నిరుత్సాహం చూసిన కారు డ్రైవర్ విద్యా సాగర్ సేతు దగ్గరకు తీసుకెళ్ళాడు. అక్కడా చాల బావుంది ఫోటోలు తీసుకున్నాం.
స్వాతంత్య్ర  సమరంలో పాల్గొన్న పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చదువుకున్న ప్రెసిడెన్సీ కళాశాలను చూశాము. ఈ కళాశాల 1855 లో నిర్మించబడిందట. ఈ నగరంలో మొత్తం పద్నాలుగు విశ్వవిద్యాలయాలున్నాయి. మేనేజిమెంట్, కోల్ కత్తా, ప్రధమంగా అభివృద్ధి చెందినటువంటిది. 1857 లో నిర్మించబడిన యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా’ దక్షిణ ఆసియా మొత్తంలో తొలి ఆధునిక విశ్వవిద్యాలయం. 1780 లో మొహమ్మదీయుల కోసం ప్రారంభించబడిన “అలియా యూనివర్సిటీ” కలకత్తా నగరం మొత్తానికి పాతది. ఇంకా ఇక్కడ ఏమైటి యూనివర్సిటీ, ప్రెసిడెన్సీ యూనివర్సిటీ, IIM కోల్ కత్తా వంటివి ప్రసిద్ది చెందిన విశ్వవిద్యాలయాలు.
 
          మేమున్న మూడు రోజులలో ఎక్కువగా చూడలేకపోయాం. విక్టోరియా మెమోరియల్, సెయింట్ పాల్స్ కేథిప్రిల్, ఈడెన్ గార్డెన్స్, నికో పార్క్ వంటివి కారులో నుంచే చూసి ఆనందించాం. ఇవి మా టూరు విశేషాలు.

*****

(సమాప్తం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.