మెరుపులు-కొరతలు
డా.మనోహర్ కోటకొండ కథ “దేవకీ పరమానందం”
– డా.కే.వి.రమణరావు
పేదరికంలో ఉండి, చదువు మీద శ్రద్ధ ఉన్న ఒక కుర్రాడు అలాంటి ఇతర పేద, దిగువ మధ్యతరగతికి చెందిన వ్యక్తుల సహాయంతో చదువుకుని డాక్టరై స్వంతవూర్లో ప్రాక్టీసు పెట్టి సేవ చెయ్యడం ఈ కథ సారాంశం. కథాంశం పాతదే. ఇంచుమించుగా ఇలాంటి కథతో సినిమాలు కూడా వచ్చాయి. కథాంశం పాతదే అయినా చెప్పిన పద్ధతి, చూపించిన కొన్ని తాత్విక అంశాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. కథాస్థలం కడప శివారు ప్రాంతం. స్థూలంగా కథ ఇది.
నాగులయ్య గంగులమ్మలకు ఎనిమిది మంది సంతానం. అతను ఒక ప్రభుత్వ చిరుద్యోగి. పిల్లల్లో పెద్దవాడైన మురళి ఇంటరు చదువుతున్నప్పటి ఫ్ల్యాష్ బ్యాక్ సంఘటనతో కథ మొదలౌతుంది. తన తమ్ముడు వైద్యసహాయంలేక మరణించడం చూసిన మురళి డాక్టరు కావాలనే బలమైన ఆశయంతో ఉంటాడు. స్నేహితులందరూ గుంటూరుకి కోచింగ్ కి వెళ్తూంటే తను కూడా నాన్నను అడుగుతాడు. డబ్బు సర్దలేని నాగులయ్య కొడుకును కొడతాడు (తరువాత బాధపడతాడు). అది చూసిన తల్లి గంగులమ్మకు ఎలాగైనా కొడుకును కోచింగుకు పంపించాలని నిశ్చయించుకుని దేవుని కడప నుంచి వచ్చి తమకు పాలుపోసే సుబ్బారెడ్డిని సహాయం అడుగుతుంది. అతను తన అన్న కొడుకు రామిరెడ్డి ఒంటిమిట్టలో బ్యాంకు క్యాషియర్ గా ఉన్నాడని, ఆమె బంగారం కుదువపెడితే తన మాటమీద రామిరెడ్డి హామీగా ఉండి అప్పు ఇప్పించగలడని చెప్తాడు. గంగులమ్మ పసుపు తాడు వేసుకుని తన తాళిబొట్టును కొడుక్కిచ్చి పంపిస్తుంది. మురళి అల్లాబక్ష్ అద్దెషాపులో సైకిలు తీసుకుని శ్రమకోర్చి కడపనుంచి ఒంటిమిట్టకు వెళ్తాడు (అల్లాబక్ష్ అద్దె తీసుకోకుండా సైకిలు ఇస్తాడు). అక్కడ రామిరెడ్డి అతనికి అప్పు ఇప్పిస్తాడు. ఇంతవరకూ ఫ్లాష్ బ్యాక్ (ఆ తరువాత మురళి డాక్టరై తన స్వంతవూర్లో ప్రాక్టీసు పెడతాడు. తన తమ్ముళ్లను, చెల్లెళ్లనూ చదివించుకుంటాడు, ఈ క్రమం కథలో ఉండదు).
ఫ్లాష్ బ్యాక్ తరువాత సీన్ కట్ చేస్తే వర్తమానంలో మురళి తన స్వంతవూర్లో డాక్టరుగా ఒక ఇంటర్ చదువుతున్న అనిత అనే పేద ఆడపిల్లకు అరకొర వసతులతోనే ఒక క్లిష్టమైన ఆపరేషన్ చేసి ఆ పిల్ల ప్రాణాన్ని కాపాడతాడు. గంగులమ్మ తన కొడుకు ఆశయం నెరవేరినందుకు సంతోషించి అతన్ని “బంగారమంటి బిడ్డనిచ్చావు తండ్రీ! రెండు తులాలు కుదవపెడితే బిడ్డ నిలువెత్తు బంగారమై వచ్చాడు” అని మెచ్చు కుంటుంది.
దాదాపుగా సంప్రదాయ శిల్పంలో ఉన్న కథ ఎనిమిది చిన్న భాగాలుగా రాయబడింది. నాలుగు భాగాలు 1977 సమయం, నాలుగు భాగాలు ప్రస్తుత కాలం. ఈ ఎనిమిది భాగాలూ ఒక ఫ్లాష్ బ్యాక్, ఒక వర్తమానంగా ఏకాంతరంగా వస్తాయి. వర్తమానం నాలుగుభాగాల్లోనూ కేవలం అనితకు జరిగే ఆపరేషన్ మాత్రమే సినిమాలో క్లైమాక్స్ లాగ వర్ణించబడింది. ఫ్లాష్ బ్యాక్ కథ కూడా ఒక నేరేటివ్ లా కాకుండా వరస సంఘటనలతో ఉంటుంది. గతానికి వర్తమానానికి లంకె సమగ్రంగా ఉండదు, కొంచెం సినిమాటిక్ గా ఉంటుంది. ఐతే పాఠకుల్లో పఠనాసక్తిని, ఉత్కంఠను పెంచడం కోసం రచయిత ఈ టెక్నిక్ వాడినట్టుగా అనిపిస్తుంది.
కథాంశం పాతగా అనిపించకుండా రచయిత ఈ టెక్నిక్ వాడినట్టు అనిపిస్తుంది. ఐతే రచయిత ఇక్కడ ప్రధానంగా చెప్పదల్చుకున్నది కథ కాదు, ఒక తాత్విక అంశాన్ని అనుకుంటే ఈ టెక్నిక్ బాగా సరిపోతుంది. ఈ టెక్నిక్ కథనానికి అడ్డుపడలేదు, కథా క్రమం, కథనం బావున్నాయి.
పాత పద్దతిలో అక్కడక్కడా రచయిత చొరబడి తన స్వంత గొంతుతో కొన్ని విషయాలు చెప్పారు. కథలోని తాత్విక సందేశాన్ని పాఠకులు మిస్ కాకుండా ఉండడం కోసం రచయిత ఈ పద్ధతి పాటించి ఉండచ్చు.
కథ చిన్నదైనా భార్యాభర్తల పాత్రలను వాటి స్వభావాలతో సహా చూపించడంలో రచయిత కృతకృత్యులయ్యారు. మిగతా పాత్రలు కథాంశానికి అనుగుణంగా మాత్రమే ప్రవర్తిస్తాయి. సంభాషణలు పాత్రోచిత, ప్రాంతీయ యాసలో మాట్లాడతాయి. చిన్న చిన్న తేడాలు మినహాయిస్తే యాస బాగానే ఇలా ఉంటుంది.
“కాదుమా గురుమూర్తీ, రంగారెడ్డి, ప్రదీప్ గాడు అందురూ పోతాండారు, నేనూ పోతా పంపీమని చెప్పుమా, కోచింగ్ కు” (మురళి).
“బిడ్డేమన్న మిద్దెలు మాడీలు అడిగినాడా, సదువుకుంటాననే గదా అడిగింది. ఒక చొక్కా సంకురాత్తిరికి కొంటే సమత్సరమంతా ఒంటిమీద ఇంకో కొత్త బట్ట పడేదే లేదు. ఇంగ సదువుకు కూడా దుడ్డు ఈయకపోతే బిడ్డల్ని కనడం ఎందుకూ, పాడు నాశనం” (గంగులమ్మ).
ఫ్లాష్ బ్యాక్ కాలాన్ని నేరుగా చెప్పకుండా ‘అడవిరాముడు విడుదలైన సంవత్సరం గా (1977 ఏప్రిల్) కథలో ఆ సినిమా పొస్టర్ ని ఉటంకిస్తూ సూచించడం ఒక సరదా పద్ధతి. అక్కడి సంభాషణలు కథకు అవసరం లేదు.
మంచివాడై కుటుంబాన్ని ప్రేమించే తండ్రి చిన్న కారణానికి కొడుకుని తీవ్రంగా కొట్టడం కథలోని ఒక చిన్న అసందర్భం. పదిహేనేళ్ల మురళి బస్సులు బాగా తిరిగే కడప ఒంటిమిట్ట మెయిన్ రోడ్డులో, బస్సులో వెళ్లకుండా, ఒంటరిగా బంగారాన్ని తీసుకుని కడప నుంచి ఇరవై కిలోమీటర్లకు పైగా వేసవి గాలుల్లో అద్దె సైకిల్ తొక్కుకుంటూ వెళ్లడం పెద్ద అసందర్భం, అవాస్తవికం (నలభైయేళ్ల కిందట ఆ మెయిన్ రోడ్డు చుట్టూ కొండలు, చిక్కటి అడవి, దీర్ఘమైన ఎత్తుపల్లాలు ఉండేవి). మెలొడ్రామాకోసం రాసే ఇలాంటి అవాస్తవికమైన అంశాలు కథ అథెంటిసిటిని దెబ్బతీస్తాయి.
ఐతే ఈ కథలో మురళి ఎలా వెళ్లాడన్న అంశానికి ప్రాధాన్యత లేదు కాబట్టి ఫరవా లేదు. రచయిత బహుశా కథలో ఉత్కంఠ, సెంటిమెంటు, మెలొడ్రామా పెంచడంకోసం ఇలా రాసివుండచ్చు.
కథలో వచ్చే పాత్రలన్నీ మంచిగా ఉండి మురళికి సహాయపడడంలాంటి సంఘటన ప్రత్యేక సందర్భాల్లో జరిగే అవకాశం ఉంది కాబట్టి ‘వాస్తవికంగా లేదు’ అనలేం. ఐతే ఇది ఇంకాస్త ముందుకు వెళ్తే యుటోపియన్ ఊహాలోకపు అంచులను తాకే ప్రమాదం ఉంది.
కథలో కొన్ని భావాల్ని రచయిత చాలా బలంగా, కొంత కవితాత్మకంగా వ్యక్త పరిచారు. ఉదాహరణకు కొన్ని;
‘తండ్రి కొట్టినదెబ్బకంటే చదువుకోవద్దన్న దుఖమే ఎక్కువైంది కృష్ణుడికి.’
‘తలుపు వెనక కష్టాల సంకెల పడిన సంసార ఖైదీలా కదలకుండా ఉన్నాడు నాగులయ్య. పెళ్లాం బిడ్డల వెక్కిళ్లు గుండెలో ఫిరంగి గుళ్లలా పేలుతున్నాయి.
జీతం బత్తెం తప్ప ఇంకేమీ సంపాదించలేని చేతులు. దారితోచని తనం కోపమై బిడ్డ మీద దెబ్బగా పడింది… ‘బిడ్డ చదువుకుంటాను నాయనా అంటే డబ్బు ఇవ్వలేని చేతులు కొట్టడానికి ఎందుకు మొలుచుకు వచ్చాయని లోలోపల కుళ్లి కుళ్లి ఏడుస్తున్నాడు.’
‘ఆమెకూడా ఆ ఙ్ఞాపకాల్లోనే తచ్చాడుతున్నదని తడితేలిన ఆమె కళ్లు చెబుతున్నాయి… ‘పాలతో పాటు ఒకరికొకరంటూ తోడుండే బంధాలు కూడా చేరుతున్నాయి. సాయం అందుతుందన్న భరోసాతో తేటపడ్డ గంగులమ్మ కళ్లు పాల వెలుగుతో పోటీ పడుతున్నాయి.’
‘కొలిమి తిత్తులలా ఆశయ జ్వాల ఎగస్తోంది.’ ‘పోతన్న చెరువంతా నీ సెమటతోనే నిండిపోయేట్టుంది గదబ్బీ, నీళ్లు తాగిపో.’ ఈ వాక్యాల్లో వ్యక్తీకరణలు, భాష, ఉపమానాలు సంప్రదాయ పద్ధతిలోనూ, కొన్నిచోట్ల ఇదివరకు విన్న వాక్యాలుగాను అనిపిస్తాయి. రచయిత పదునును పెంచడం కోసం కావాలనే అలా రాసివుండచ్చు.
రచయిత ఒక డాక్టరు కాబట్టి వర్తమానకాలపు కథలో అనిత పాత్ర ఆరోగ్య సమస్యని, చికిత్సా విధానాన్నీ ఇలాంటి సాంకేతిక పదాలతో వివరించడం కనిపిస్తుంది.
‘అత్యంత అరుదుగా రుతుచక్రంలో అండం విడుదలయ్యాక అండాశయ రక్తనాళం పగిలిపోవచ్చు. దాంతో తీవ్ర రక్తస్రావం జరిగి ప్రాణం ప్రమాదంలో పడుతుంది. జారిపోతున్న ఆ ప్రాణాన్ని పైకి లాగి ఊతమిచ్చి నిలబెట్టాడతను.’
ఈ కథలోని మరో కోణం దైవకృప. రచయిత నేరుగా చెప్పకపోయినా పరోక్షంగా సమిష్టి కృషికి దైవ కృపకూడా అవసరమన్న భావన బ్యాక్ డ్రాప్ లో ఈ వాక్యాల్లో కనిపిస్తుంది.
‘పోస్టర్లో రాముని గెటప్ లో ఎన్టీఆర్ నవ్వుతూ చూస్తున్నాడు.’
‘ఒంటిమిట్ట రామాలయం నాలుగు గాలి గోపురాలతో కన్నుల పండువగా కనపడింది. కృష్ణుడి ముఖంపై చిరునవ్వు మొలిచింది.’
‘దేవకీ అమ్మకు మంచిరోజులు వస్తున్నాయంటూ రాములవారి గుడిగంటలు మోగాయి.’
అంతే కాకుండా అసలు మురళిని కృష్ణుడుగా, గంగులమ్మను దేవకిగా రచయిత అక్కడక్కడా చూపిస్తారు. చివర నేరుగా ఈ వాక్యంతో తన తాత్వికాంశానికి దైవకృపను కూడా అనుసంధానించి స్థిరీకరిస్తారు.
‘చెరసాలలో పుట్టిన కన్నయ్య కష్టాల నదిని దాటేస్తే చాలదు. గోకులంలో రాక్షస బాలారిష్టాలను జయించాలి. కృష్ణయ్యగా మారి గోవర్ధనాన్ని గోట ఎత్తి ఆబాలగోపాలాన్ని కాపాడాలి. అప్పుడే దేవకీ పరమానందమయ్యేది.’ కథ పేరు ‘దేవకీ పరమానందం’ అన్నది ఇక్కడ గమనించదగ్గ విషయం. ఇదొక సమాంతర కోణం.
ఇక కథా సందేశానికొస్తే రచయిత ఒకట్రెండు తాత్విక అంశాలను కథద్వారా చెప్పినట్టు కనిపిస్తుంది.
ఈ కథలో ప్రధానంగా కనిపించే ఒక తాత్విక అంశం ‘ఏదైనా గొప్ప పని సమిష్టి కృషి ద్వారానే జరుగుతుంది’ అన్నది. దీన్ని రచయితే తన గొంతుతోనే కథా ప్రారంభంలో నాందీ వాక్యంలా ఇలా చెప్పి; కథా, కథలోని సందేశం ఇవేనని చెప్పకనే చెప్పారు.
‘ఇనుపముక్క పదునైన పనిముట్టుగా మారాలంటే? కొలిమిలో కాలాల, కొలిమితిత్తులు గాలిని ఊదాల, బొగ్గు రగిలి రవ్వరవ్వగా మండాల, ఇనుము నిప్పు కణికగా రూపాంతరం చెందాల, అప్పుడు పడే వరుస సమ్మెట దెబ్బలు తట్టుకోవాల.’
అలా చెప్పడంతో సంతృప్తి చెందక పై వాక్యాన్ని విభజించి మెట్లుగా ఫ్లాష్ బ్యాక్ లోని ప్రతిభాగం చివర మళ్లీ ఇలా చెప్పుకుంటూ పోయారు.
‘పనిముట్టు తయారీకి కమ్మరి పనితనానికి మాదిగన్న కుట్టిన తోలుతిత్తి కూడా జత కలిసింది. మాదిగన్న తోలుతిత్తికి తోడుగా యానాది చిన్నాయన అడవికష్టం ‘బొగ్గు ‘ కొలిమికి చేరింది. జ్వలనం మొదలైంది. వడ్రంగన్న చెక్కపిడి బిగించాడు. సమ్మెట పైకి లేచింది. ఇనుపముక్కను ఆయుధంగా మార్చే చివరి కొలిమి పని మొదలైంది. సమిష్టి శ్రమ సాయంతో కొలిమిలో పురుడు పోసుకున్న ఆ పనిముట్టు అందరికోసం ఇష్టంగా పనిచేస్తూనే ఉంటుంది.’
ఒక సామాజిక ఆశయ సాధన కోసం సమిష్టి కృషితో ఒక మనిషినిరూపొందించడాన్ని ఒక పనిముట్టు తయారీతో పోల్చి, ‘సమిష్టి కృషి అవసరాన్ని’ ఈ కథలో సందేశంగా చూపారు రచయిత.
గుర్తించదగిన మరొక సందేశం ‘పేదవాళ్లు, దిగువ మధ్య తరగతివాళ్లు పై తరగతుల సహాయం లేకుండానే తమలో తాము ఒకరికొకరు సహాయపడడం ద్వారా కూడా పైకి రావచ్చు. దానికి తగిన శక్తి, అనుబంధం వాళ్ల మధ్య ఉంటాయి. ఐతే పైకి వచ్చాక అలా వచ్చిన వాళ్లు ఒక బాధ్యతగా కింది తరగతులవాళ్లకు తోడ్పాటు ఇవ్వాలి’. రచయిత ఈ విషయాన్ని కథలో నేరుగా చెప్పకపోయినా, కథలోని పాత్రలను, వాటి మాటలను బట్టి ఈ కథలో ఈ అంశం ఉనికి బలంగా తెసుస్తుంది.
శిల్పలోపాల మాట ఎలావున్నా, వివిధ పద్ధతులు ఉపయోగించినా ఒక చిన్న కథలో రెండు మంచి సందేశాలను బలంగా చెప్పి కథను ఆసక్తిగా చదివేట్టు మలచిన రచయిత అభినందనీయులు.
*****
డా.కే.వి.రమణరావు పుట్టింది, పెరిగింది ఆంధ్రప్రదేశ్, కడప జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో. చదివింది కడప, తిరుపతిలలో. వృక్షశాస్త్రంలో డాక్టరేట్. వివిధ ప్రభుత్వకళాశాలల్లో అధ్యాపకుడుగానూ, ప్రభుత్వ కళాశాల విద్యావిభాగంలో, రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయంలో అకడెమిక్ విభాగంలోనూ పనిచేసి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా 2017 లో ఉద్యోగ విరమణ. వీరి అర్ధాంగి శ్రీమతి సుభద్ర. ఆమెకూ సంగీత, సాహిత్యాల్లో ఆసక్తి, ప్రవేశం.
వివిధ మాస, వారపత్రికల్లో నలభై పైగా కథలు ప్రచురింపబడ్డాయి. కొన్ని బహుమతులు పొందాయి. సాహిత్యవిమర్శ, ఉన్నతవిద్యకు సంబంధించి కొన్ని వ్యాసాలు కూడా ప్రచురణపొందాయి. ‘విశాలాంధ్ర’ వారు 2013లో అప్పటివరకూ ప్రచురింపబడిన ఇరవై ఆరు కథలతో ‘పుట్టిల్లు – కె వి రమణరావు కథలు’ అనే పేరుతో కథాసంపుటం ప్రచురించారు. 2016లో ‘చాసో స్ఫూర్తి’ అవార్డు ప్రధానం చేయబడింది.