యాత్రాగీతం

బహామాస్ 

-డా||కె.గీత

భాగం-6

బహామాస్ క్రూజ్ (రోజు -1)

          మర్నాడు ఉదయం 11 గం.లకి మేం బహమాస్ క్రూజ్ టూరు కోసం మయామీ షిప్పుయార్డులో షిప్పు ఎక్కాల్సి ఉంది.  మయామీలో మేం బస చేసిన హోటల్ లో బ్రేక్ ఫాస్టు చేసి  రెంటల్ కారు తిరిగి ఇవ్వడానికి ఎయిర్పోర్టుకి వెళ్లాలి. కారు తిరిగిచ్చేసేక మళ్లీ వెనక్కొచ్చి మిగతా అందరినీ పికప్ చేసుకోవడానికి మళ్ళీ ఏ టాక్సీ నో  తీసుకోవాలి. కాబట్టి రెంటల్ కారు తిరిగిచ్చి అట్నుంచటే షిప్పుయార్డుకి టాక్సీలో వెళ్ళడానికి అందరం లగేజీలతో సహా బయలుదేరాం. 

          పిల్లలతో ముఖ్యంగా సిరి ఎటూ నడవనని పేచీ పెట్టడంతో కొంచెం ఆలస్యం అయినా మొత్తానికి సజావుగా అందరం నిర్ణీత సమయానికి  షిప్పుయార్డు చేరుకున్నాం.  క్రూజ్ ఎక్కడానికి ఎప్పటిలానే వేరే  క్రూజ్ టెర్మినళ్లలో  ఉన్నట్లే  పెద్ద లైనులో నిలబడి, డాక్యుమెంట్స్ చెకింగ్ పూర్తిచేసుకుని, లగేజీని వాళ్లకిచ్చేసి  క్రూజ్లోకి ఎక్కేసరికి ఒంటి గంట దాటిపోయింది. 

          క్రూజ్ లో ఈ సారి మామూలు గది  కాకుండా సూట్ తీసుకోవడంతో అచ్చం హోటలు గదిలాగా పెద్ద బెడ్డు, సోఫాలతో చూడముచ్చటగా ఉంది.  పైగా బాల్కనీ కూడా ఉంది. 

          క్రూజ్ పేరు రాయల్ కరీబియన్ ఎంచంట్మెంట్ ఆఫ్ ది సీస్ ( Royal Caribbean Enchantment of the seas). మూడు రోజుల క్రూజ్ టూరుకి పెద్దవాళ్ళకి దాదాపు $850 డాలర్లు, పిల్లలకి  $650 డాలర్లు టిక్కెట్టు. ఇందులోనే అకామడేషన్, ఫుడ్ ఛార్జీ కలిపి ఉంటుంది. మాములు కూల్ డ్రింక్స్, జ్యూస్ ల వంటివి కూడా కలిపే ఉంటాయి. ఆల్కహాల్ కావాలంటే మాత్రం వేరేగా డబ్బులు కట్టాలి. అమెరికా వీసా ఉన్నవారెవరైనా ఈ టూరుకి వెళ్లిరావొచ్చు.  

          అయితే  ఫుడ్ వెరైటీలలో, టెస్టులో, షిప్పులో చూడాల్సిన వింతలు, విశేషాల్లో ఇంతకు ముందు మేం వెస్ట్ కోస్ట్ (కాలిఫోర్నియా) లో ఎక్కిన మెక్సికో క్రూజ్ దీని కంటే బావుందనిపించింది. 

          అంతేకాదు, అది జూన్ నెల, వేసవి కావడం వల్ల మేం ప్రయాణించిన మూడు రోజులు సముద్రమ్మీద కూడా బాగా వేడిగా ఉంది. వాతావరణం ఆహ్లాదంగా లేదు. అందుకో ఏమో క్రూజ్ ప్రయాణం అంత గొప్పగా అనిపించలేదు. కానీ, బహమాస్ దీవులకి  మొదటిసారి వెళ్తున్నామేమో చూడ్డానికి మనసు ఒకటే ఉవ్విళ్లూరుతూ ఉంది. 

          దాదాపు సాయంత్రం వరకు షిప్పులోని స్విమ్మింగ్ పూల్, పిల్లలు ఆడుకునే ప్రదేశాలు తిరుగుతూ గడిపేసేం. సిరి కిడ్స్ క్లబ్ కి వెళ్లనని పేచీ పెట్టి మాతోనే ఉండిపోయింది. వరు డిన్నర్ టైములో మాతో మధ్యలో కాస్సేపు గడిపి  చాలా రాత్రి వరకు యూత్ క్లబ్ లో మిగతా పిల్లలతో గడిపింది. రాత్రంతా కేసినో, బార్స్  వంటి చోట్ల జనాలు పెద్ద మ్యూజిక్ వింటూ, డాన్సులు చేస్తూ సందడిగా గడుపుతూ ఉన్నారు. 

          మేం భోజనాలు కానిచ్చి సిరిని నిద్రపుచ్చి బాల్కనీలో నుంచి  అనంతమైన జలధిని చీల్చుకుంటూ ముందుకెళ్తున్న మా ఓడని, దూరంగా కనిపించే ఇతర ఓడల్ని, నల్లని అందమైన ఆకాశంలో నక్షత్రాల్ని చూస్తూ ఎంతో సేపు గడిపేం. మర్నాడు మా ఓడ బహమాస్ టూరులోని మొదటి దీవిలో ఆగనుంది.

*****

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.