యుద్ధం ఒక గుండెకోత-18
(దీర్ఘ కవిత)
-శీలా సుభద్రా దేవి
హింసా ప్రతిహింసా
ద్వేష ప్రతీకారాల వైరస్సులతో
వణికిపోతున్న వాళ్ళకి
అమ్మ అనురాగం ఏం రుచిస్తుంది?
నోరంతా యుద్ధవాసనతో
పుళ్ళుపడిపోయిన వారికి
కన్నపిల్లల అమాయకపు ముద్దు మాటలు
ఎక్కడ గొంతు దిగుతాయి?
తలనిండా ఎత్తులు పైఎత్తులూ
జులపాల్లా పెంచుకొంటున్న వాళ్ళకి
శిరోభారం తగ్గించేందుకు
భార్య అనురాగంతో రాయబోయే ప్రేమమందు
ఎక్కడ పనిచేస్తుంది?
యుద్ధజ్వర కలవరింతల్ని
ప్రపంచమంతా వినిపించేవరకూ
నిద్ర ఎక్కడ పడుతుంది?
యుద్ధ క్షుద్ర దేవతకి ప్రజాస్వామ్యాన్ని బలిపశువుని చేసి
ప్రపంచ నియంత కావటానికి
శక్తి యుక్తులను ఆవాహన చేసుకొనేవరకూ
భయంకర పడగనీడై
వాతావరణమంతా ఆక్రమించుకొనేవరకూ
ఎక్కడైనా ఏ మూలైనా
కునికిపాట్లు పడ్తున్న శాంతిపావురాన్ని పట్టి
దాని రక్తంతో దాహం తీర్చుకొనేవరకూ
తాత్విక, బౌద్ధిక బలాల్ని
తుత్తునియలు చేసేవరకూ
స్ధిమితం ఎక్కడ?
క్షుద్రదేవతోపాసకులుగా మారి
యుద్ధపూనకంతో శివాలేస్తున్న వాళ్ళని
జాగృతి కలిగించేది ఎలాగో
తల్లుల్లారా! మీరైనా ఆలోచించండి!
సామరస్యంతో
మారాం చేయనీకుండా అక్కున చేర్చుకొని
లాలించి
సామ్యవాద ఆలోచన్ల గోరుముద్దలు తినిపించి
యుద్ధక్రీడను మైమరపించగలమేమో!
అమ్మల్లారా! మనం కన్న పసివాళ్ళు
రక్తపిపాసులు కాకుండా చేద్దాం
బంగారు భవిష్యత్తును చేజార్చుకొని
మానవ మనుగడకు గొడ్డలిపెట్టై
భారీ విధ్వంసాలకు భారీ మూల్యాలు చెల్లించుకొనే పరిస్ధితులు
సంభవించకుండా
మనమేమైనా ప్రయత్నించగలమేమో!
*****
(ఇంకా ఉంది)