రాగో
భాగం-23
– సాధన
ఆకాశంలో చుక్కలు వెలిగాయి. మబ్బులు తేలిపోయి గాలి కూడా పొడిగా వస్తుంది. ఇక వర్షం తేలిపోయినట్టే.
నక్షత్రాల మసక వెలుతురు చెట్ల ఆకులను దాటి కిందికి దిగడం లేదు. అలవాటయిన వారికి తప్ప అడవిలో ఆ చీకట్లో దారి కనిపించడమే కష్టం. మిణుగురు పురుగుల మెరుపులు ఉండి ఉండి జిగేలుమని కళ్ళు చెదరగొడుతున్నాయి. ఆ చీకటికి జీమ్, జీమ్ అని నిశ్శబ్దానికి భయాన్ని జోడిస్తున్నట్లు చిమ్మెట్లు రొద చేస్తున్నాయ్. సగం కాలిన మోడులు చీకట్లో ఎవరో నిలబడినట్లు గతుక్కుమనిపిస్తాయి.
తాండవాయి చేరాలంటే కనీసం ఇంకో రెండు గంటలు నడవాలి. బయల్దేరిన మొదటి రోజునే ఇలాంటి ప్రయాణం చేయించాల్సి వచ్చినందుకు గిరిజ మనసు పీకుతుంది. పైలట్ గా నడుస్తున్న జైనికి ఈ దారి క్షుణ్ణంగానే తెలుసుననీ, తొణుకు బెణుకు లేకుండా, ఆమె నిబ్బరంగానే తీసుకుపోగలదనీ తనకు నమ్మకం ఉన్నప్పటికీ ఈ అర్థరాత్రి నడకతో ఈ కొత్తక్కలు ఏమి ఇబ్బంది పడతారో, ఇది క్యాంపెయిన్కు ఏమి ఇబ్బంది కలిగిస్తుందో అని గిరిజ మనసు కొట్టుకోసాగింది.
‘పిల్లల్ని చంకల వేసుకొని నడుస్తున్న పిల్లీబాయి ఏమనుకుంటుందో. బ్యాక్ పైలట్ మిన్కో నిబ్బరంగా వస్తా ఉందా! ఇంతకీ జైనికి ఇవేమీ పట్టడం లేదా?’ అంటూ తనలో తాను తర్కించుకుంటూ గిరిజ ఒర్రెలో నుంచి గట్టెక్కింది.
అదే సమయానికి జైని “అక్కా! రాత్రికి ఇక్కడ పడుకొని ఉదయాన్నే పోతే ఏడు గంటలకల్లా చేరగలుగుతాం. ఈ పక్కనే జాగా బాగుంటుంది. ఏం చేద్దాం!” అంటూ అడిగింది.
“ఇంగో” (అవును) అంటూ గిరిజ ఒప్పుకోవడంతో అక్కల దళం పక్కకు నడిచింది.
బట్టకడిమి చెట్టు క్రింద దళం అక్కలు కిట్లు దించుకోగా సంగం అక్కలు జబ్బ సంచులతో అట్లే నిల్చుండిపోయారు. జైని, సీదో, మిన్కోలు వరకులు తీసి పరుస్తూనే “పడుకుందాం రండి అక్కలు” అనడంతో గిరిజ సెంట్రీ డ్యూటీలు చెప్పింది.
చంటి పిల్లాడితో తెల్లార్లు తిప్పలే ఉంటాయి గనుక పిల్లీబాయికి సెంట్రీ మాఫీ చేశారు.
వరకులో నడుం వాల్చిన గిరిజ ఆలోచనలు తన కొత్త బాధ్యతల వైపు పోయాయి. స్త్రీలని బాధ్యతల్లోకి ప్రోత్సహించటం లేదనీ, ఏ రంగంలోనైనా స్త్రీలని వెనక్కి నెట్టేస్తుంటారనీ అవకాశం దొరికితే చాలు చురకలు వేసే తనకే తీరా తొమ్మిది మంది బాధ్యత నెత్తిన పడేసరికి కాస్త జంకు అనిపించింది. ఎందుకు? అనుకుంటూ పక్కనున్న వెపన్ సరిగా సర్ది ఒత్తిగిల్లి పడుకుంది.
పక్కలో పిల్లాడు కదలి రాగం పట్టడంతో పిల్లీబాయి పిల్లాడి నోటిలో రొమ్ము పెట్టి జోకొట్టడం ప్రారంభించింది. దీనితో గిరిజ ఆలోచనలు ఇంకోవైపు మళ్ళాయి. గతమంతా బుర్రలో సినిమా రీళ్ళలా తిరగడం ప్రారంభించింది.
ఇంట్లో అల్లారు ముద్దుగా పెరగడం, కాలేజీలో రాడికల్ రాజకీయాలు, పార్టీ క్యాంపెయిన్లలో తలమునకలుగా ఈదులాడడం, కామ్రేడ్ తో పెళ్ళి, పిల్లల్ని కనే సమస్య, అది పార్టీ జీవితానికే ప్రతిబంధకం అవుతుంది గనుక మానుకొమ్మని సలహాలు, అన్నీ వరుసగా రంగుల రాట్నంలా బుర్రలో గిర్రున తిరిగాయి.
మాతృత్వం దగ్గర ఆగిపోయిన ఆలోచనలు మనసులో మధన రేపుతుంటే ఇక లాభం లేదనుకొని ఆ ఆలోచనలు విదిలించుకుంటూ లేచి డబ్బాలో నీళ్ళు తాగి సెంట్రీ వరకు పోయి వచ్చింది.
సెంట్రీని చెక్ చేసి వచ్చి పడుకున్న గిరిజకు ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదు. అన్నిటికీ సిద్ధపడి అన్నీ వదులుకొని అడవికి వచ్చిన ఈ రెండేళ్ళలో తన కళ్ళముందే జరుగుతున్న ఎన్నో సంఘటనలు, ఎన్నో అనుభవాలు ఎంత వద్దన్నా ఉసిళ్ళ పుట్టలా తలలో జుమ్మున రేగుతున్నాయి.
ఈ సాంస్కృతికంగా వెనుకబడ్డ వాళ్ళనుకుంటున్న ఆదివాసీ అమ్మాయిలు దళంలోకి వచ్చి, పార్టీలోకి ఎదిగి, పెళ్ళి, పిల్లలు వంటి వ్యక్తిగత విషయాలను పోరాట అవసరాల కోసం, మంది ప్రయోజనాల కోసం ఎంత తేలిగ్గా వదులుకోగలుగుతున్నారో చూస్తూ ఉంటే తన కళ్ళను తానే నమ్మలేకపోతుంది. నిజంగా ఎవరు సాంస్కృతికంగా వెనుకబడ్డది? వాళ్ళ భాషలో లోకుల (ప్రజల) గురించి ఆలోచించి సొంత లాభాన్ని వదులుకోగలిగే ఆ పెద్ద బుద్ది ఎప్పుడందుకోగలుగుతాం!!
అలా ఆలోచిస్తున్న గిరిజకి జైని చెప్పిన విషయం గుర్తుకొచ్చి నవ్వొచ్చింది. ఇష్టం లేని పెళ్లి తప్పించుకోడానికి ఇల్లును, తల్లిని వదిలి ప్రమాదాలు లెక్క చేయకుండా తిరిగిన పిల్ల దళంలోకి వచ్చాక ఎంత మారిపోయింది! వలచిన వాడి కోసం అంతకు తెగించిన రాగో నాన్సును మరిచిపోగలగటమే తనకిప్పటికీ వింత అనిపిస్తుంది. ‘వయసొచ్చిన కొత్తలో అందరిలాగే వెర్రిగా జోడికోసం పాకులాడాను గానీ దళంలో బుద్ధులు నేర్చుకున్నాక ఇప్పుడు ఆ ధ్యాసే రావడం లేద’న్న జైని మాట నిజంగా మనసులో మాటేనా అనిపిస్తుంది.
సెంట్రీ డ్యూటీ అయిపోయి తిరిగొచ్చిన జైని “నువు నిద్ర పోయినట్టు లేదు కద అక్కా-నువ్వే చేసి వస్తావా! మిన్కోను లేపనా?” అని కదిలించేసరికి “లేదు, లేదు మిన్కోనే లేపు” అంటూ బలవంతంగా నిద్రపోవడానికి ముసుగు కప్పుకుంది.
చివరి సెంట్రీలో ఉన్న సీదో అక్కల్ని లేపుతుంటే లేచి కూచుని టైం చూసుకుంది గిరిజ. “5.30 అయిపోయింది. తొందరగా తయారవుదాం!” అని అందరిని హెచ్చరించింది. పది నిముషాల్లో అందరూ టక టక తయారయ్యారు. కిట్లు వేసుకుందామనేసరికి మెంతక్క, మిన్కోలు ఇంకా రాలేదని ఎక్కడివారు అక్కడే చతికిలబడ్డారు.
గిరిజ పక్కనే కూచున్న జైని చుట్టూ చూసి “కమాండర్ ఏమన్నాడక్కా” అని చెవులో మాట్లాడుతున్నట్లు నెమ్మదిగా కదిపింది.
అకస్మాత్తుగా వచ్చిన ఈ ప్రశ్నకి సందర్భం ఏమిటో తెలియక గిరిజ అయోమయంగా చూస్తుంటే “అది కాదక్కా! రాత్రి మీరు ముగ్గురు మాట్లాడుకున్నారు గదా! పోలీసు ఫైరింగ్ గురించి ఏమన్నాడు దాద” అని తన ప్రశ్న వివరించింది జైని.
“పోలీసులను గట్టిగా తిప్పికొట్టామని అందరి ముందే చెప్పాడు కదా అంతే. మళ్ళీ ఆ విషయం రాలేదు” అంటూ అంతలోనే గిరిజకు సెల్ మీటింగ్ చప్పున గుర్తు రావడంతో జైని దాని గురించే అడుగుతున్నదనుకుంది.
“ఓహో! నిన్న మీరు గోటుల్ దగ్గరికి ఎగరడానికి పోయినపుడు మేం ముగ్గురం మాట్లాడుకున్నాం అని కదా! అది సెల్ మీటింగ్ జైని. ఇదివరకే నీకు ఒకసారి చెప్పాను కదా. పార్టీ సభ్యత్వం ఉన్నవాళ్ళే సెల్ మీటింగ్ లో కూచుంటారు.”
గాలి పోయిన సైకిలు టైర్ లా జైని ఒక్కసారి చప్పబడిపోయింది. “నిజంగానే రుషికి తన సంగతేం పట్టలేదా. లేక తనని అక్కే ఆట పట్టిస్తుందా. పోనీ అలాగే ఉండనీ నేను అడగను” అనుకుంటూ తన ఆలోచన్లు మొగం మీద కనపడనివ్వకుండా, “డుంగ, కర్ప, మిన్కో అందరూ నాకంటే ముందు చేరినవాళ్లేకదక్కా, వాళ్ళకు కూడ పార్టీ సభ్యత్వం ఇవ్వలేదా” అంటూ గుట్టుగా మాట నింకో వేపు తిప్పేసింది.
“సీనియారిటీ ఒక్కటే కాదు జైని, పోరాటంలో పట్టుదల, పనుల్లో చొరవ, రాజకీయాల్లో చురుకుతనం, మొత్తంగా మన అభివృద్ధి అన్ని పరిశీలించి పార్టీ సభ్యత్వం ఇస్తారు. పార్టీ సభ్యత్వం కావాలని ఆరాటం పెరగడం కూడ ఆ చైతన్యం పెరుగుతున్న దనటానికి సూచనే” అంటూ ఇంకా ఏమో చెప్పబోయేసరికి “కిట్లు వేసుకోండోహోయ్” అని అరుస్తూ మిన్కో రావడంతో అందరూ లేచారు.
పొద్దు కర కర పొడుస్తుంటే, దళం బాటన నడుస్తుంది.
నడుస్తూ నడుస్తూ జైని హఠాత్తుగా ఆగి “రోడొచ్చింది దగ్గరిగా రండి” అంది. గిరిజ లైన్లో నుండి ముందుకొచ్చి “జైనీ అందరూ దాటేవరకు కవర్లో సెంట్రీ ఉండు. సీదో, మిస్కో మీరు అలర్ట్ లో రండి” అంటూ “రండక్కా – ఎవరూ వెనుకపడకుండా అందరు తొందరగా రోడ్డు దాటాలి” అంటూ మొత్తం దళాన్ని రోడ్డు దాటించి 40-50 గజాల వరకు అడవి లోపలికి చకచక లాక్కుపోయింది.
“రోడ్డు దాటడానికి ఇంత హడావుడి ఎందుకో” – అని నవురి ఆశ్చర్యపోతుంటే, దళాన్ని రోడ్డు దాటించేపుడు రుషి, గాండోలు ఎలా చేసేవారో తాను కూడా సరిగ్గా అలాగే నిర్వహించానన్న సంతృప్తితో కమాండర్ గిరిజ ముందుకెళ్ళుతుంది.
కొంచెం దూరం వెళ్లేసరికి బాట పక్కనే ఓ పెద్ద నల్ల బోర్డు మైలురాయి కనపడేసరికి మెంతక్క “రండి, రండి అందరూ దగ్గరిగా రండి”, అంటూ రోడ్డు దాటే సన్నాహం ప్రారంభించింది.
వెనక్కి తిరిగిన జైనితో పాటు గిరిజ, సీదోలు కూడా ఆ హడావుడి చూసి పకాల్న నవ్వారు.
“ఇది రోడ్డు కాదక్కా. జీకం కండి” (కండి అంటే డాం)
* * * * *
(ఇంకా ఉంది)
సాధన కమ్యూనిస్టు పార్టీ నాయకులు. తెలంగాణ రాష్ట్రలోని కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో జన్మించారు. అడవి కడుపులో ఆయుధంతో అనునిత్యం కత్తి అంచుమీద నడుస్తూనే మిగుల్చుకోవడానికి కాలం వ్యాకోచించదు కనుక క్రమశిక్షణకు లోబడి ఓవర్ టైం పనిచేసి సృజనశీలియైన సాధన రాసిన రెండో నవల రాగో. అడవిలో మనుషులుంటారని, ఆ మనుషులకు అభిమానాలు, అభిజాత్యాలు ఉంటాయని – ఆ మనుషులు, వాళ్ళ మధ్యన మరో ప్రపంచపు మనుషులు కలిసి అనురాగాల, అభిమానాల, ఆదర్శాల ఒక స్వాప్నిక ప్రపంచం కొరకు ఒక కఠోర సాయుధ పోరాటం చేస్తున్నారని సాధన నవలలు ‘సరిహద్దు’, ‘రాగో’ సాధికారికంగా ప్రతిఫలిస్తాయి.