సాగర సంగమం

– సిరికి స్వామినాయుడు

నువ్వేమో చల్లని జాబిలివి .. 
నేనేమో మండే సూరీడ్ని ..
ఇన్నేళ్లూ ..  ఒక విరహాన్ని భారంగా మోస్తూ
ఒక ఎడబాటు ఎడారిమీద చెరో దిక్కున – మనం
ఉరకలెత్తే నది  సముద్రాన్ని కలసినట్టు
వెన్నెల వేడిమి ఒకరికొకరు ఓదార్చుకున్నట్టు 
ఇన్నాళ్లకీవేళ .. మనం !
 
ఆ క్షణం .. 
కాసేపు మన మాటలు మూగవోతాయి
గుండెలు ఆర్తిగా కొట్టుకుంటాయి
మన దేహాలు సన్నగా కంపిస్తాయి చిగురుటాకుల్లా..
ముద్ద మందారాన్ని తీసుకున్నట్టు
నీ మోమును నా చేతుల్లోకి తీసుకొని 
ప్రేమగా నీ కళ్లలోకి చూస్తాను 
పచ్చని వనాలు విరబూస్తాయి 
పారే నదులు కనిపిస్తాయి 
ఎగిరే పక్షుల కువకువలు వినిపిస్తాయి
తొలిరేయి జ్ఞాపకాలు తేనెటీగల్లా కుడతాయి !
 
నీ నుదుటాకాశం‌ మీదా .. 
శంఖువులాంటి నీ కంఠం మీదా .. 
నీ వణికే పెదాల మీదా .. 
చినుకులాంటి ఓ చిన్నముద్దు పెడతాను
కోరికతోనే  గాదు .. అవ్యక్తమైన ప్రేమను 
ఆయా రూపాల్లో నీలో ఒంపుకునేందుకు ..
రెండు తీరాల్ని కలుపుతూ పారే 
నిర్మలమైన నది ఆవేళ మనలో ప్రవహిస్తుంది !
 
నిన్ను గుండెలకి హత్తుకుంటాను తనివితీరా ..
గాలి  .. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతుంది
చందమామ సిగ్గుతో 
మబ్బుల పొదల్లోకి జారిపోతుంది
పగలు చీకటైపోతుంది 
ప్రపంచం మనకు‌ పరాయిదై పోతుంది
ఉఛ్వాస నిశ్వాసలు తీవ్ర వాయుగుండాలవుతాయి !
 
యిద్దరం .. రెండు మంచుబొమ్మలమై కరిగిపోతాం
అపుడు మన కనుకొలకుల్లోంచి 
కొన్ని కన్నీటిబొట్లు జారతాయి
నీ పయ్యాడకొంగున 
వాటిని మంచిముత్యాలుగా మూటగట్టి
రేపటి జ్ఞాపకాలుగా దాచుకుంటావు 
తలుపుచాటు కన్నాల్లోంచి 
తుఫానుని చూసిన వాళ్లు ‘ ఛీ .. పాడు ‘ అంటారు !
 
వాళ్లకేమి తెలుసు
రెండు దేహాలు ఏకకాలంలో 
ఒక్కటిగా రూపాంతరం జెందటమనీ ..
రెండు ఆత్మలు 
ఒకే ప్రాణంగా కలగలసి పోవటమనీ ..
వాళ్లకేం తెలుసు 
రేపు నట్టింట పారాడే తొలి పంటకోసం 
దంపతులమై ఓ పవిత్రయాగం  జేస్తున్నామనీ ..
మన పరిపూర్ణ జీవన సంపుటానికి యిద్దరం కలసి 
ఒకే ముందుమాట రాస్తున్నామనీ ..!!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.