స్నేహమయీ!
-డా. నల్లపనేని విజయలక్ష్మి
తెన్ను తెలియని ప్రయాణంలో
తెరచాపై ఒడ్డు చేర్చింది నువ్వే
ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రాణానికి
ఊరట నిచ్చింది నువ్వే
వడగాలికి ఉడికిపోతున్నప్పుడు
కమ్మతెమ్మెరై సేదతీర్చింది నువ్వే
చలిగాలికి వణికిపోతున్నప్పుడు
వెచ్చని ఓదార్పయింది నువ్వే
నీ వాన జల్లులో తడిశాకే కదా!
ఈ యంత్రం చిగురించింది
వికసించే పువ్వును చూసి పసిపాపలా నవ్వటం
పచ్చని చెట్టును చూసి పరవశించటం
రాలిన ఆకుల గలగలల్లో రాగాలు వినడం
నిన్ను చూసే కదా నేర్చుకున్నాను
ఉద్విగ్నంగా ఊగిపోయినా
ఆగ్రహంతో రగిలిపోయినా
కన్నీరుగా కరిగిపోయినా
అన్నీ నీ సన్నిధిలోనే!
వ్యక్తావ్యక్త లోకంలో
వాస్తవానికి, అవాస్తవానికీ మధ్య
సందేహానికి, సంశయానికీ నడుమ
కొట్టుమిట్టాడే వేళ
సమాధానమై నిలిచావు
ఎంతకూ తెల్లవారని రాత్రి
తోడుగా నిలిచే స్నేహం నీది
ఎడతెరిపి లేని వర్షంలోనూ
ఎడబాయని మమత మనది
ఏకాకినై అలమటించే వేళ
నీకు నేను లేనా? అని కవ్విస్తావు
అనంత కాంతి లోకాలను కానుకిస్తావు
కాంతిమయీ! కవితా!
నిన్ను నాలో నింపుకోని నాడు
నేను నీవై ప్రవహించని నాడు
ఉండి లేని దానినౌతాను
మౌన సమాధిలో నిద్రిస్తాను
*****
కవి కాల్పనిక జగత్తులో జీవిస్తాడు అనేది అక్షరాలా నిజం.. అందుకేనేమో ఈ లోకం లో ఎక్కడా లేని స్నేహాన్ని , ఎక్కడా కనిపించని ప్రేమను గురించి ఇంతలా ఆర్ద్రత తో రచించడం బావుంది .. శైలి అద్భుతం
హృదయపూర్వక ధన్యవాదాలు మేడమ్
“ఏకాకినై అలమటించే వేళ
నీకు నేను లేనా? అని కవ్విస్తావు” చాలా చక్కని భావన. ఎంతో భావయుక్తంగా ఉంది కవిత.
హృదయపూర్వక ధన్యవాదాలు సర్
నిజమే,కవిత్వమొక తీరని దాహం
కవిత్వం దాహం తీర్చే సెలయేరు కూడా!
స్నేహసుగంధాన్ని వెదజల్లిన కవిత . బావుందమ్మా ..
అది కవిత్వంతో అల్లుకున్న స్నేహబంధం. ధన్యవాదాలండీ!
అది కవిత్వంతో అల్లుకున్న స్నేహబంధం. ధన్యవాదాలండీ.
కవిత్వంతో స్నేహం చాలా బాగు౦ది.kavitha chala adbhutam gaa undi
హృదయపూర్వక ధన్యవాదాలు మేడమ్!
కవిత్వంతో స్నేహం చాలా బాగు౦ది.kavitha chala adbhutam gaa undi.
స్నేహం గురించిన మీ కవిత అర్థవంతంగా ఉంది మేడం.
హృదయపూర్వక ధన్యవాదాలు మేడమ్!