కంపానియన్

(తృతీయ ప్రత్యేక సంచిక కథ)

మణి వడ్లమాని

సుందరంగారు నడుచుకుంటూ వెళుతున్నారు. ఆ అడుగుల్లో తొందర, ఆత్రుత కనిపిస్తున్నాయి. చమటతో తడిసిపోతున్నారు. బస్సులో ఎలా కూర్చున్నారో తెలియదు. మొహమంతా  ఆందోళన… ఆ మాట  అతని నోట విన్నప్పటి నుంచి  మనసంతా  విషాదం… అది సహజమే  కదా!

లేదు… లేదు  అది  అనాథ  అవడానికి వీలులేదు. ఏదో చెయ్యాలి. ఎలా… అదే  తెలియటం లేదు.

గంట ప్రయాణంలో24గంటల  ఆలోచనలు చేసారు.

బస్సు దిగి  ఇంటికి  వచ్చేసరికి చాలా రాత్రయింది. డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దేసి ఉన్నాయి. కాళ్ళు, చేతులు కడుక్కుని వచ్చి కూర్చున్నారు. గిన్నెలోవి ప్లేట్లో పెట్టుకుంటూ  మళ్ళీ  ఆలోచనలలో పడ్డారు.

***

          రోజులాగే  సుందరం గారింటికి వెళ్ళింది నాగరత్నం.  ఇల్లు తాళం పెట్టి  ఉంది. ఎక్కడకి వెళ్లి ఉంటారబ్బా అనుకుంటూ  కాసేపు అక్కడే తచ్చాడింది. పక్కనున్న వాళ్ళని అడిగింది. ఏమో మాకు తెలియదన్నారు. చేసేదేమీలేక  కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి బయలుదేరింది.

పొడవైన, లోతైన ఇంటి వాకిలిపై ఉన్న నీడ  అక్కడ గోడకున్న నల్లటి  పాత బోర్డులపై తెల్లటి ఫోటోలపైపడి సాయంత్రపు సూర్యకాంతి కొట్టుకుంటోంది. బయట ఉన్న కొన్ని అటు ఇటూ తిరుగుతున్నాయి. వాటిని చూస్తూ  గాలిలో వచ్చే పేరు తెలియని పూల వాసన  ముక్కుతో పీల్చింది.అంతలోనే పొలం పనులు చేసుకుని అటుగా పోతున్నవాళ్ళ నవ్వుల  శబ్దం గట్టిగా వినిపిస్తోంది.

ఆ నవ్వులు వింటుంటే  నాగరత్నానికి  వాళ్ళ ఊరు  చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి.

ఆలోచనలలో ఉన్న నాగరత్నం రింగు అవుతున్న ఫోన్ శబ్దానికి ఉలిక్కిపడి  లేచి వెళ్లి తీసుకుని నొక్కి “హలో” అంది.

“నేనే  ఒకసారి ఇంటికి  రా” అన్నారు సుందరంగారు.

గబగబా తల సరిచేసుకుని, చీర కుచ్చెళ్లు దులుపుకుంటూ తలుపుకి తాళం పెట్టి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ సుందరంగారింటికి వెళ్ళింది.

***

          సుందరం  చనిపోయాడుట…

సుందరం మాస్టారు  చనిపోయారుట!

సుందరం మాస్టారు  చనిపోయారుట, నీకు తెలుసా…

పాపం చాలా  మంచివాడు, బాగుచేయలేని రోగం వచ్చింది. మరే, అదే బాధగా  ఉంది అని ఊరంతా  గగ్గోలు పెట్టింది.

సుందరంగారి దహన కార్యక్రమాలు  అయ్యాయి. ఆయన బంధువులం  అని చెప్పుకున్న  ఆ వచ్చిన వాళ్ళే చేసారు. సాయంకాలానికి అన్నీ సర్దుమణిగాయి. వీధి గదిలో బంధువర్గం మరో ఇద్దరు ఊరి పెద్దమనుషులు కూర్చున్నారు.

***

          నాగరత్నం  లాంటివాళ్ళు చాలా మందే ఉండి ఉంటారు. అయితే  ఎత్తు మీద  నాగరత్నం  అంటే ఒక్కతే! అలా అడిగితే ఎవరైనా సరే ఇంటికి తోవ చూపించేస్తారు.

ఎందుకంటే  నాగరత్నం ఇల్లు ఎత్తుమీద ఉంటుంది. అలా ఆ పేరు స్థిరపడి పోయింది.

రోజూ చీకటితోనే లేచిన వెంటనే  తూర్పు వైపు  చూస్తూ ఆ సూరీడుకి దండం పెట్టుకోవాలని వాళ్ళ తాత చెప్పాడు. ఇక అది అలవాటుగా మారింది. ఆ తరువాత  వాకిలి చిమ్మేసి, మిగతా పని పూర్తిచేసుకుని,  సుందరంగారింటికి  వెళ్ళేది.

పొద్దున్న  నుంచి రాత్రి  వరకు  పని చేసి  ఆయనకి భోజనం పెట్టి వంటిల్లు శుభ్రం  చేసేసి  ఇంటికి వెళ్ళేది.

నాగరత్నం  మంచి బలమైన వ్యక్తి, ఎత్తరి  కూడా. మొహమంతా నవ్వుతో చాలా ఆకర్షణీయంగా  ఉంటుంది. వంకీల జుట్టు, చురుకుగా చూసే కళ్ళు.

అదేంటో ఎప్పుడూ పెళ్లి గురించి ఆలోచించలేదు. ఆమె ఎప్పుడూ ప్రేమలో పడలేదు. ఇరవై సంవత్సరాల వయస్సులో ఆమెని  ఒకతను  పెళ్లి చేసుకుంటాను అడిగాడు, అయితే దాన్ని ఆమె ఇష్టపడకపోగా   వద్దని  గట్టిగా చెప్పేసింది.  ఇప్పుడు  నలభై   ఏళ్ళు వచ్చాయి. ఇన్ని  సంవత్సరాలలో  ఆమెకి పెళ్లి మీద  ధ్యాసే లేదు అనుకుంటారు ఊళ్ళో వాళ్ళు పైగా ఈ ఊరు, తన పని మాత్రమే ఆమె జీవితం అని గొప్పగా అంటారు.

***

          సుందరం  మాస్టారు  పోవడం  మాట  అటుంచు, ఆ నాగరత్నాన్ని పెళ్లి చేసుకున్నాడుట!  అదీ అసలు  విడ్డూరం! అయ్యయ్యో! ఇదేమి కలికాలం బుద్ధులు ఆయన కంటే వయసులో బాగా చిన్నది.

మరే, ఆయనకి డెబ్భైఏళ్ళు ఉంటాయి.  అయినా  మాస్టారుకి ఇదేమి బుద్ధి అని ఓ గొంతు కావుమంది. దానికి సిగ్గులేదే, తండ్రి వయసు వాడిని  చేసుకుంటుందా! అని మరో మనిషి కాకి కావుకావు కావుమంది. మగవాడికి  లేకపోతే  ఆడదానికైనా  సిగ్గుండక్కర లేదా అని సన్నాయి నొక్కుతో మరో కాకి అరిచింది.

అవును మరే  ఆయన దగ్గరున్న డబ్బు, దస్కం లాగేయడానికి ప్లాన్  వేసి ఉంటుంది అని ఓ బొంత కాకి కావుమంది.

ఆ గొంతుల్లో నాగరత్నాన్ని పొందలేదనే దుగ్ధ ప్రస్ఫుటంగా ధ్వనించింది. కొంతమందికి  చాలా ఆశ్చర్య మేసింది. నిజంగా డబ్బు కోసం  చేసుకుందా? నమ్మబుద్ధి కావటం లేదు.

ఇలా రకరకాలుగా మాటలు వినిపించాయి… ఊరంతా  ఒకటే  గుసగుసలాడేసుకుంటోంది.

***

          సుజాతకు  ఆ ఊళ్ళో ఉన్న ఒకే ఒక నేస్తం నాగరత్నం. అలాగే నాగరత్నానికి కూడా  సుజాత  అంటే అభిమానం, గర్వం కూడా!  తన వాళ్ళందరికీ  దూరంగా వచ్చి స్వతంత్రంగా ఉండి ఉద్యోగం చేసుకుంటోంది, ఆ మాత్రం సాయ పడకపోతే ఎలా? మనం మనుషులం  కదా  అనుకుంటుంది.

నాగరత్నానికి సుజాత గురించిన వివరాలు తెలియదు. ఆమెకి  మాటల్లో అర్ధమయినది, భర్త  ఆమెని వదిలేసాడని. ఆమె గురించి ఎప్పుడూ, ఎవరూ  రాలేదు కూడా!

సుజాత  తల్లి మటుకు ఏదో ఆశ్రమంలో ఉంటోంది అని చెప్పింది. ఎవరైనా ఊళ్ళో వాళ్ళు ఏదైనా  ఆరా తీయబోతే  గయ్యిమని  అంతెత్తున  ఎగిరిపడి తిట్టేది“ఇప్పుడు  నీకు అది అవసరమా!” అని. అందుకే ఊళ్ళో వాళ్ళు  అమ్మో ఆ  ఎత్తుమీద నాగరత్నంతో పడలేము బాబోయి” అని దండం పెట్టేసేవాళ్ళు.

సుజాత  స్కూల్ నుంచే వచ్చేసరికి  వెళ్ళేది. ఆమెకి టీ పెట్టి  ఇచ్చి తను తాగుతూ ఆ రోజు విశేషాలు  చెప్పుకునేది.

***

          పది రోజులుగా ఊర్లో లేని సుజాతకి అడుగుపెట్టగానే సుందరంగారు పోయారన్న వార్త, అంతకు మించినది  సుందరంగారికి, నాగరత్నానికి పెళ్లి అయిందని  తెలిసి మరీ  విస్తుపోయింది. ఇంట్లో పెట్టె పడేసి ఎలా వచ్చింది అలానే పరిగెత్తింది సుందరంగారింటికి.

అక్కడ సుజాతను చూసిన నాగరత్నం తెరలు తెరలుగా… లుంగలు చుట్టుకుపోతూ కడుపు పట్టుకుని మరీ పడి పడి నవ్వుతోంది.

ఒక్క క్షణం  నవ్వు  ఆపి  సుజాత వైపు సీరియస్ గా  తేరిపార చూసి  మళ్ళీ నవ్వటం మొదలు పెట్టింది. నవ్వినవ్వి నాగరత్నం కళ్ళ నిండా నీళ్ళు బుగ్గల గుండా జారుతూ  గుండెల  మీద పడి మాయమవుతున్నాయి.

దగ్గరగా వెళ్లి  నాగరత్నం వీపు మీద చేయి వేసి దగ్గరకు తీసుకుంది. ఆ దగ్గరతనంలో వాళ్ళ గుండెలు  రెండూ లబ్ డబ్  లబ్ డబ్ అంటూ ఆ లోతులలో  నిక్షిప్తం అయిన  విషయాలు  మాట్లాడుకుంటున్నాయి.

అవి…

కొన్ని రోజుల క్రితం  ఓ  రోజు  ఎప్పటిలాగే   సాయంత్రం  వెళ్ళినప్పుడు సుజాత మొహం  వాడిపోయి ఉంది.

“ఎందుకమ్మా  అలా ఉన్నావు?”

వెళ్ళిపోతున్న  ఓ మనిషిని చూపిస్తూ  “వాడు…నన్ను  వదిలేసిన మొగుడు”.

“మరి…” అని ప్రశ్నార్ధకంగా  చూసింది.

“ఓహ్…  అసలు నా గురించి మీకెవరికీ తెలియదు. నేను…పదహారేళ్ళ  వరకు పెద్ద మనిషి  అవలేదు. అప్పుడు భయమేసి  అమ్మావాళ్ళు నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళారు. అప్పుడు తెలిసింది నేను ఎప్పటికీ అవలేనని. పరువు కోసం పెళ్లి చేసేసారు.  పెళ్ళయిన మూడు నెలలుకి   నెల తప్పానేమో  అని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళారు. అక్కడ డాక్టర్ పరీక్ష చేసి నిజం చెప్పేసింది. నా ఈ లోపం కప్పిపుచ్చి మోసం  చేసి పెళ్లి చేసారని  పెద్ద గొడవ చేసారు. కేసు పెట్టారు చివరికి విడాకులిచ్చేసారు. ఆ దెబ్బతో నాన్న, అమ్మ కుంగిపోయారు,చుట్టాలెవ్వరూ  కలవడం లేదు.

అప్పుడే అనుకున్నా బాగా చదివి నా కాళ్ళమీద నేను నిలబడాలని. అలాగే పట్టుదలగా చదువుకున్నాను. ఉద్యోగం తెచ్చుకున్నాను.  ఇలా ఉండటం  నా తప్పు కాదు అని తెలుసుకుని  ధైర్యంగా తలెత్తి తిరగాలని నిశ్చయించుకున్నాను. కొన్ని రోజులకి నాన్న పోయారు. అమ్మ మంచం పట్టింది. నా ఉద్యోగం వల్ల నేను  ఊర్లు  మారుతూ ఉండాలి. అందుకే  అమ్మని  ఆశ్రమం లో పెట్టేసాను.’’

ప్రశాంతంగా బతుకుతున్న నన్ను చూస్తే  ఆ దేవుడికి కూడా నచ్చలేదేమో! ఆ దరిద్రుడు  రెండో పెళ్లి చేసుకున్నాడు. పిల్లలని కన్నాడు. అయితే వాడి పెళ్ళాంకి ఏదో  మాయదారి రోగం  వచ్చిందిట.  అందువల్ల  వాడికి పడక  సుఖం  లేదట  పైగా  నేను కూడా ఒంటరిగా  ఉన్నాను.  నాకూ  కోరికలు ఉంటాయి కదా. అవి  తీర్చుకోవచ్చు, వాడిని కూడా  సుఖ పెట్టచ్చు అని వాడే అనేసుకుని  నన్ను అడుక్కోడానికి  వచ్చాడు.

నేను ఆమెని వదిలేసి నన్ను మళ్ళీ పెళ్లి చేసుకో అన్నా.  అది కుదరదుట. అయితే నేను  ఉంచుకున్న దానిలా ఉండను ఫో …  అని వెళ్ళగొట్టాను.”

“పోనీలే సుజాతమ్మా! అన్నీ మర్చిపో.”

“ఇక్కడకి వచ్చాక  నువ్వు కనిపించావు. నిజానికి  ఊళ్ళో నీ లాంటి వాళ్ళు  కోకొల్లలు ఉండచ్చు. అయితే   నిన్ను చూస్తే ఏదో తెలియని ఆత్మీయత  కలిగేది. నీ  నవ్వు చూస్తే ఎంత బాధనైనా మర్చిపోవచ్చు  నిజం…  నాగరత్నం!   ఆ నవ్వు చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది” అంది  సుజాత.

ఆ మాటలకి సిగ్గుపడింది నాగరత్నం.

ఆ రాత్రి నిద్రపట్టలేదు ‘అయ్యో! సుజాతమ్మ ఎంత బావుంటుంది. పాపం  నాలాగే బోలెడు కష్టాలు!’

కొన్ని రోజులు గడిచాయి.  ఓ రోజున  నాగరత్నం ఇచ్చిన టీ  తాగుతూ సుజాత “అవునూ   నాగరత్నం,  నువ్వు పెళ్ళెందుకు చేసుకోలేదు” అని అడిగింది.

బదులుగా  నిర్వికారంగా  “నేను  మాచకమ్మని…నాకు పెళ్ళేంటి!” అంది.

“అంటే… నువ్వుకూడా నాలాగే…”

“అవునమ్మా ! నేను సమర్తే  అవలేదు అసలు, నాకేమో చిన్నప్పుడే  పెళ్లి చేసేసారు. వయసొచ్చినా  నేను సమర్తాడలేదని మా అత్తారోళ్ళు నన్ను వదిలేసారు. వాడు వేరే పెళ్లి చేసేసుకున్నాడు. అవన్నీ  తెలిస్తే  ఊర్లో   పరువు పోతుందని. అమ్మా నాన్న  నన్ను  చంపేసినారు, అదేలే  ప్రపంచకం దృష్టిలో. కాలు జారి ఏటిలో పడిపోయిందని అందరినీ నమ్మించారు.

అప్పటి నుంచీ మా తాతే నన్ను చూసుకున్నాడు.  కొంతకాలం  తాతతో పాటు  బీడీల ఫ్యాక్టరీలో పనికి వెళ్ళేదాన్ని. తాత పెద్దవాడయ్యాడని  పనిలోంచి తీసేసారు.  ఏమి చెయ్యాలో అర్థం  కాలేదు. అప్పుడు ఈ సుందరం  మాస్టారు  వచ్చారు. స్కూల్లో పని ఇప్పించారు. స్కూల్  శుభ్రం  చేయటం, ముఖ్యంగా బాత్రూములు కూడా  కడిగేదాన్ని.  అది సుందరం  మాస్టారే చెప్పారు.

ఆ తరువాత  నువ్వు వచ్చావు ఇక్కడికి.  అంతే కాదు  ఇక్కడ  ఈ దరిద్రపు  ఆచారం గురించి నీకు తెలుసు కదా. గూడెంలో  ఆడాళ్ళకి నెలసరి వస్తే అందరూ  ఊరికి చివరన  ఉన్న ఆ గదిలో ఉండాలి. అది వాళ్ళ కట్టుబాటు  అని తెలిసినప్పుడు  భయమేసింది  నా గురించి  ఊర్లో తెలిసిపోతుందని. అప్పుడు తాతయ్యే సలహా  చెప్పాడు.  నెలకి  మూడు రోజులు  గుర్తుంచుకొని  అక్కడ పోయి ఉండమని. చాలా కాలం  నుంచి అదే చేస్తున్నాను. అనుకోకుండా  నువ్వు, ఇంకా  ఆ డాక్టరమ్మా కలిసి గూడెంలో  గట్టిగా  చెప్పాకా  చాలామంది  మారారు. అప్పటి  నుంచి  నాకా బాధ తప్పింది. నేను కూడా చాలా మందికి  చెబుతూనే వచ్చాను. అయినా  అక్కడక్కడ  ఇంకా కొంత మంది  ఉన్నారనుకో  మారాల్సిన వాళ్ళు. నువ్వు పట్నం  నుంచి వచ్చావు. పెద్ద చదువులు చదివావని,  ఉద్యోగం చేస్తున్నావని  ఈ ఊర్లో అందరికీ  భయం.”

అలా గుండె లోతులలో ఒకటే ఆలోచనలతో నిలుచుండిపోయిన ఇద్దరూ, సుందరం మాస్టారి  స్నేహితుడి  పిలుపుతో  బయటకు వచ్చారు.

“నాగరత్నం,  ఇక నుంచి  సుందరం భార్యగా వచ్చే పెన్షన్ నీ బ్యాంకు ఎకౌంటులో పడుతుంది.  ఆయన నిన్ను నమ్మి అప్పగించిన   బాధ్యతని జాగ్రత్తగా  మోస్తావు కదా!”  అని  బ్యాంకు పాస్ బుక్, కొన్ని పేపర్లు చేతిలో పెట్టాడు. “ఎప్పుడూ ఎలాంటి సహాయం కావాలన్నా మొహమాట పడకుండా అడుగు. వాడి మంచితనమే  ఆ పిల్లని  కాపాడుతుంది” అనుకుంటూ  వెళ్ళిపోయాడు.

వెళ్ళిపోయిన అతన్ని చూస్తూ  “సుజాతమ్మా, సుందరం  మాస్టారు నన్ను పెళ్లి చేసుకోవటానికి కారణం  ఆయనకు ముదిరిపోయిన కాన్సర్ ఇక కొన్ని రోజులలో ఉన్న ఆయన జీవితం. భార్య పోయాక  ఆ మెదడు తక్కువ  పిల్లను మెంటల్ హాస్పిటల్లో చేర్చారు. ఆయన  చూసుకోలేక నన్ను ఒకటే అడిగారు. నువ్వూ  నా కూతురిలాంటి దానివే. ఆ అమ్మాయిని  సంరక్షించే బాధ్యత  తీసుకోమని. ఎంత హాస్పిటల్ లో ఉన్నా తన కంటూ ఓ మనిషి  ఉండాలి కదా!  పైగా  ఆయనికి ఆస్తి పాస్తులు లేవు. ఒక్క పెన్షన్  మటుకే ఆధారం. అది భార్యకు  మాత్రమే వస్తుందిట. అలాంటప్పుడు దారి ఏది? మాస్టారి స్నేహితుడు  ఇందాక వచ్చారే ఆయన ఈ సలహా ఇచ్చారుట. ఈ వయసు లో పెళ్ళేంటి? అదయినా నా కూతురి వయసున్నఅమ్మాయితో  అని తెగ బాధ పడిపోయారు.

ఆ పరిస్థితి లో నేను ఆయనకి ధైర్యం చెప్పి ఒప్పించాను.  ఎందుకంటే తాత  పోయాక  ఈ లోకం లో ఉన్న ఒకే ఒక  ఆత్మీయుడు ఆయన.  పైగా  నా గురించి వివరంగా తెలిసిన వ్యక్తి. అలాంటి  మంచి మనిషికి ఏదో ఒక రకంగా  ఉపయోగ పడాలి. నేను చేసేదేమీ  తప్పుడు  పని కాదు.  జీవితంలో తల్లి కాలేకపోయినా, కాగితం మీద తల్లి  హోదాను పొందాను.  ఈ విధంగా  మాస్టారి ఋణం  తీర్చుకుంటాను. ఆయన కూతురిని జాగ్రత్తగా  చూసుకుంటాను” అంది.

“అవును  నాగరత్నం పళ్ళు, పూలే ఇచ్చే చెట్టే కాదు ముఖ్యం,  ఇంత  నీడ నిచ్చి సేదదీర్చే  చెట్లు  లాంటి వాళ్ళం.  మనం ఆత్మన్యూనతతో  బాధపడకూడదు. తలెత్తి  నించున్న శిఖరాలవుదాము” అంది.

***

          “అబ్బో భలే భలే!   ఈ ఇద్దరు ఆడవాళ్ళు అమ్మోరుల్లా పడి ఆ దిక్కుమాలిన పద్ధతిని  మానిపించారు.  అదేకాదు,  జనాలకి  వాళ్ళిద్దరి  గురించిన నిజం  తెలిస్తే  ‘ఔరా!  ఈ ఇద్దరూ జీవితం లో సమర్త  ఆడి ఎరగరు  కాని  బహిస్టు  గది గురించి ఎంత  విప్లవం చేసారు’  అనుకోవడం  మటుకు ఖాయం” అని సంబరపడింది ఆ ఊరి మట్టి.

*****

 

Please follow and like us:

2 thoughts on “కంపానియన్ (తృతీయ ప్రత్యేక సంచిక కథ)”

  1. Katha bavundi. gramallo jarugughunna
    anacharalani vishkeshinchi raasaru.
    content ni sootiga chepparu.

Leave a Reply

Your email address will not be published.