కనక నారాయణీయం -34

పుట్టపర్తి నాగపద్మిని

          ఆ వీధిలోనే తరతరాలుగా స్థిరపడిన  పేరుమోసిన లాయర్ నరసరామయ్య గారి పేరుతోనే ఆ వీధి పిలువబడేది. దాదాపు వెయ్యి గజాల స్థలంలో…వీధి కంటే ఆరడుగుల ఎత్తులో చాలా హుందాగా…పేద్ద వరండా. అందులో ఓ ప్రక్క పేద్ద చెక్క ఉయ్యాల. ఆ ఉయ్యాలపై, ఎప్పుడూ కిల కిలా నవ్వుతూ ఆడుకునే నా వయసు పిల్లలూ!! తెల్లవారింది మొదలు  ఆడా, మగా అందరూ సందడిగా ఏవో పనుల్లో ఇంట్లోకీ బైటికీ తిరుగుతూనే ఉండేవాళ్ళు. లంకంత కొంప అనేవాళ్ళు కదా, కొంప అంటే ఇల్లు అనికదా అర్థం!! అచ్చం అదేవిధంగా..  అదేవిధంగా వుండేదా ఎత్తు అరుగుల ఇల్లు!!

          ఉప్పలధడియం నరసరామయ్యగారు, కడపలో  మంచి పేరున్న వకీలు. సంపద తాండవిస్తూ ఉండేది. అటు కేసుల గురించో, లేదా బంధువర్గం వారో – మొత్తానికి ఇంట్లో ఎప్పుడూ వచ్చీ పోయేవాళ్ళతో బహు సందడిగా ఉండే ఆ ఇంటి ఎదురుగా పుట్టపర్తి బాడుగకుండే మట్టిమిద్దె. లక్ష్మీ సరస్వతులిద్దరూ, ఎదురుబొదురుగా ఉండేవాళ్ళన్న మాట!!

          ఆ రోజు జనవరి 30 వతేది. పుట్టపర్తి ఇంట్లోనే తనగదిలో కూర్చుని ఎదో చదువుకుంటూ ఉన్నారు. ఇంతలో, ‘మహాత్మాగాంధీ అమర్ రహే’ అని నినాదాలతో కొంత మంది పిల్లలు గాంధీతాత ఫోటో పట్టుకుని వీధిలో అరుచుకుంటూ వెళ్ళే శబ్దం వినిపించింది.

          పుట్టపర్తి బైటికి వచ్చారు, చూడటానికి!!

          అప్పటికే కనకమ్మా, పిల్లలూ నిలబడి చూస్తున్నారు. కనకమ్మ వాళ్ళను చూస్తూ కొంగుతో కళ్ళు తుడుచుకుంటున్న సంగతి గమనించారు వారు.  గాంధీజీ అన్నా, కస్తూర్బా అన్నా ఆమెకు వల్లమాలిన గౌరవం. గాంధిజీ అంటే పుట్టపర్తికీ అంతులేని గౌరవం. ఈరోజు గాంధీజీ వర్ధంతి కదా!! అందుకే పిల్లలు ఇలా వారికి నివాళులు సమర్పించుకుంటున్నారు. మనసంతా ఆర్ద్రమైపోయింది వారికి!! వెంటనే ఇంట్లోకి వచ్చి 1948 జనవరి 30 తేదీ గాంధీజీ హఠాన్మరణ వార్త విన్న వెంటనే, తమ ఇరువురి శోకం కావ్యరూపం దాల్చిన జ్ఞాపకాలు ముప్పిరిగొన్నాయి.వెంటనే గాంధీజీ మహాప్రస్థానం పేరుతో, ఆ అశ్రునివాళి ముద్రితమైంది కూడా!!

          ఆ ప్రతిని తీసి అందులో మొదటి మజిలీ గా ప్రచురితమైన కనకమ్మ పద్యాలవైపు దృష్టి సారించారు పుట్టపర్తి. అప్పుడెప్పుడో చదివిన పద్యాలే ఐనా, ఇప్పుడు యీ సందర్భంలో, గాంధీజీని స్మరించుకుంటూ చదువుతుంటే, వాటిలో తన భార్య శబ్దాడంబరం లేని సున్నిత భావ వ్యక్తీకరణ, సూటిగా గుండెల్లోకి దూసుకుని వెళ్ళే శైలీ..కట్టిపడేశాయి వారిని!!                    

          ఆ. ఒక సుమమ్ము నందనోద్యానమందుండి

               ఇలకు దిగియె డెబ్బదేండ్ల క్రింద

               అనుదినంబు క్రొత్తలగు తావులను నించి

              వచ్చినట్టి త్రోవబట్టి పోయె!! 

          అట్టి సుమము తావులతో జగము సుగంధభరితమైపోయింది. కానీ, ఉన్నట్టుండి మతదురావేశమన హోరుగాలి  వీచింది. సుమము నేల వ్రాలింది, ఆ దేవదేవుని దివ్య పదపంకజముల వద్ద!

           తే. ఎన్ని వెలుగులు భువి ప్రకాశింపనేమి?

                అర్యముండొక్కడే నిక్కమైన వెలుగు,

                యెందరు మనుష్యులిల ప్రభవింపనేమి?

                ఆ మహాత్ముడొక్కడె సత్యమైన నరుడు..’

          ఎన్నిసుమములో యీ భువిని జనిస్తాయికానీ,  యీ పువ్వు సురభిళమును బోలిన సురభిళము మరి దేనికీ రాదు, రాబోదు. అయ్యో!! ఎన్ని మధురాత్మల తపస్సులో ఫలించి యీ హైందవ జాతి అవతరించినదో కదా!! అట్టి ఋషి తుల్యులైన వారినే మట్టుపెట్టెందుకు సన్నద్ధమైన యీ జాతికిక కీర్తి ఖండితమే..’అని వ్యంగ్య బాణాలు సంధిస్తున్నది కనకమ్మ లేఖిని.

          జీసస్సును నాడు పాశ్చాత్య జాతి చంపింది. నేటి నవయుగ బుద్ధుణ్ణి ప్రాచ్య జాతి చంపింది. అక్కడా, ఇక్కడా, ఎక్కడైనా, సత్యవాదులకు రక్షణ లేదు..’ అని నిట్టూర్చింది కనకమ్మ మనసు!!గాంధీజీ,  దివ్య విజ్ఞానంలో బుద్ధుడూ, చావుతో పోల్చుకుంటే జీసస్సు  గా అభివర్ణిస్తూ, గృహమేధితనములో అతనికెవరూ సాటిలేరని కూడ కితాబునిస్తారామె!! గాంధీ ‘నడచెడు సముద్రము ‘ అమె దృష్టిలో!! ఎంత చక్కటి రూపకము  !! అమృతమెట్లుంటుందో చెప్పవలెనన్న, తాత నోటి పలుకు..’అన్నది నాటి మాట!! గరళమెట్లుంటుండును?? అని ఎవరైనా ప్రశ్నిస్తే, రాజఘాటు మంట వలె..’అన్నది కొత్తనానుడౌతుందట!! ఆహా!! విషాదములో జీవిత సత్యములు ఎంత ప్రస్ఫుటంగా పలుకుతాయో, యీ మాటలకన్న వేరే ఉదాహరణలు అనవసరమేమో!!

          ‘తాత లోకాలకెల్ల చిత్రంబు నాడు – తాత జీవములేని చిత్రంబు నేడు..’ అన్న పద్యవాక్యాలు, గుండెలు పిండేస్తాయి. శివరాత్రినాడు కస్తూర్బా గాంధీ పరమపదించారు – అది నిటాలాక్షునికి ఆ మహాదేవి పుష్పార్చనమట!! రమ్య భీకర  శుక్రవారమునాడు బాపూజీ మరణం -లలితాదేవికి, కాశ్మీర లలిత పూజ” !! ఎంత హృద్యమైన విలక్షణమైన పోలిక?? 

          ‘అంతమెరుగని నిత్యాత్ముడు” బాపూ!!ఆయన జీవనము  ‘నియమ బద్ధంబైన వాక్య నియతి వోలె, ప్రవిమలానంద మయము జీవనము”!! అచ్చమైన ప్రేమంపు మూర్తి!! తనకొక్కనికె తానర్థమైనవాడు!! అట్టి ఆ మహాత్ముడు మరణించలేదు సుమా!! వృధామలిన మతులమైన మనమే మరణించాము..’ , నిర్వేదంలో సైతం కనకమ్మ వాణి ఖంగుమని వినిపిస్తున్నది.  

          క్రౌంచ మరణము జూచి ద్రవించిన వాల్మీకి గానీ, పావురాయికి ఆశ్రయమిచ్చి దాని రక్షణకోసం తన అంగాన్నే త్యాగం చేసిన శిబి చక్రవర్తిగానీ, రంతిదేవుని ఉదార చరితము – వీటిలో ఏ ఒక్కటీ గుర్తుకు రాలేదా ఆ హంతకునికి?? ఏమి చిత్రము??? అని కట్టలు తెంచుకున్న ఆక్రోశం !!   

                   తే. ఎన్ని వెలుగులు భువి ప్రకాశింపనేమి?

                         అర్యముండొక్కడే నిక్కమైన వెలుగు,

                         యెందరు మనుష్యులిల ప్రభవింపనేమి?

                          ఆ మహాత్ముడొకడె సత్యమైన నరుడు..’

          ఆ నిజమైన నరుని కూడా నిర్దయగా, కబళించిన మృత్యు దేవతను నిలదీసే ధైర్యం కనకమ్మ వాణిలో ధ్వనించి, మరోసారి ఆశ్చర్యపోయారు పుట్టపర్తి.

                       తే. మృత్యు! ఒక్క పల్కు నాదాలకింపవమ్మ,

                           యతని విడుమమ్మ నీవొక్క ఆడుదాని

                           వా? హృదంతరమింత రాయైనదేమి?

                          నీకు దయ యెక్కడున్నదే, నియతి బిడ్డ?

          సర్వమతసామరస్యాన్ని కవితాత్మకంగా చిత్రించిన తీరు అపూర్వం.

                          తే. తులసి రామాయణంబు పిచ్చిల రసంబు,

                              బైబిలు ఖురాను, దైవ సంభావ్య వాక్కు,

                             సదమలంబు గీతా జ్యోతి జ్ఞాన పరిధి,

                              యనుదినము, దేశమున పూజలందుగాక!

          ఊరికంతా అలంకారమైన చెట్టు పడిపోతే, ఎంత బోసిపోతుందా వూరు?? అలా ఆ ప్రేమైక మూర్తి లేనట్టి భారత దేశo కూడా కళావిహీనమై పోయిందంటారామె!!  ఎంతో చక్కటి పోలిక!!

            ‘రామా రామా..అంటూ ప్రాణములు విడిచినాడు మహాత్ముడు!! కానీ రాముడు వేరే ఉన్నాడా?? ఆయనే రాముడు కదా??” అని అమాయకంగా ప్రశ్న్నిచే లేఖిని బలం సుస్పష్టం.

          ‘హిమవత్పర్వతాలలో తపమొనరుస్తున్న మునివరులరా!! అదుగో, మా దేవుడు వెళ్ళిపోతున్నాడు. ఒకసారి వెళ్ళిపోతే, మరలి రాబోడు. మీ తపము చాలించి వచ్చి, ఆయనను బ్రతికించరాదా?? అలా రాకుంటే, మీ తపము వలన లోకానికేమి లాభం?? చెప్పండి..’ అంటూ నిలదీస్తున్న కవయిత్రి తీరుకూ తనముందు పల్లెత్తు మాట మాట్లాడని పవిత్ర స్త్రీమూర్తికీ పోలికే లేదే??               

            గీ. ధర్మమేనాడు వాడి యధర్మమెపుడు,

                బలియునో  యప్పుడే పరాత్పరుడు దన్ను

                దాన సృష్టించుకొనెడి యదార్థ్యమూది

               చెప్పిన మునీంద్రులకు జోతలప్పగింతు..’

          ‘యదా యదా హి ధర్మానాం గ్లానిర్భవతి భారత” అని చెప్పిన మునీంద్రులకు ఆ ఆత్మ రూపులకు వందనం” అంటారామె!! భారత దేశంలోని పరిస్థితిని గమనించి, భగవంతుడే గాంధీ జీ రూపంలో అవతరించాడని కవయిత్రి  విశ్వాసం.

          మహాత్ములైన వారు, శరత్కాల చంద్రికవలయ మధురితంబైన రాత్రుల వలె, దివ్య జూవుల చరితాగానంలో సొమ్మసిల్లిపోతారట!! కష్టములు కలిగినప్పుడు ఆత్మ శక్తిని వీడక, అడుగు వెనుకకు వేయనివారు మహాత్ములు!! బ్రదుకును కేవలం ఒక ఉఛ్వాస నిశ్వాసముల పరుగువలె కాక, లయబద్ధమైన కోమలగానంగా మలచుకునేవాళ్ళే మహాత్ములు!! సృష్టిలోని ప్రాణులన్నిటి మీదా దయాదృష్టిని బరపే వారే మహాత్ములు!! చీమ నుండి మహాశిఖరి వరకూ – అన్నిటా పరమాత్మ స్వరూపమే ఉన్నదని సదా మరువక, సేవాభావంతో మెలగేవారే మహాత్ములు!! ఈ లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్నాడు కనుకనే,  గాంధీజీ, మహాత్ముడయ్యాడు!!

       గీ. ఎన్ని కార్యముల్ చేసినా ,ఎన్ని సుఖము

           లనుభవించినా, యొక్కటి యనుగమింప,

          దా మరణ కాలమున యందు – నాత్మ 

***** 

  (సశేషం) 

Please follow and like us:

2 thoughts on “కనక నారాయణీయం-34”

  1. కంట తడి పెట్టించాయి శ్రీమతి కనకమ్మ గారు రాసిన పద్యాలు. ఎంతైనా మాహత్ముని నిష్క్రమణ కలవరపెట్టే విషయమే. ఇవన్నీ ఇలా అందిస్తూ మీరూ మాత్రు ఋణం తీర్చుకుంటున్నారు పద్మిని గారూ.

Leave a Reply

Your email address will not be published.