కాళరాత్రి-11
ఆంగ్లమూలం : ఎలీ వీజల్ -“నైట్”
అనువాదం : వెనిగళ్ళ కోమల
అది ఒక ఆదివారపు ఉదయం. మా కమాండోకి ఆ రోజు పనిలేదు. కాని ఇడెక్ మమ్మల్ని పనిచేయమని డిపోకి పంపాడు. ఫ్రెనెక్‌తో వీళ్ళతో ఏమి చేయిస్తావో నీ యిష్టం, పని చేయించకపోతే, నా సంగతి నీకు తెలుసుగా అంటూ వెళ్ళిపోయాడు.
మాకేమి చేయాలో తోచక వేర్‌హవుస్‌లో అటూ ఇటూ తిరుగుతున్నాం ఎక్కడైనా ఎవరైనా మరచి పోయిన రొట్టెముక్క అయినా దొరుకుతుందేమొ అనే భ్రమలో.
నేను బిల్డింగు వెనకకు వెళితే పక్క గదిలో నుండి శబ్దాలు వినిపించాయి. దగ్గరగా వెళ్ళి తొంగిచూస్తే ఇడెక్ ఒక పోలండ్ అమ్మాయితో గడ్డిమోపు మీద కనిపించాడు. ఇడెక్ మమ్మల్ని క్యాంపులో ఎందుకు ఉండవద్దన్నాడో అర్థమయింది.
ఒక అమ్మాయితో సెక్స్‌లో పాల్గొనటానికి వంద మంది ఖైదీలను కదిలించాడు అని తెలిసి గట్టిగా నవ్వాను. ఇడెక్ అదిరి పడ్డాడు. నన్ను చూశాడు. ఆ అమ్మాయి తన వక్షస్థలం కప్పు కున్నది. నేను పారిపోవాలనుకున్నాను. కానీ ఇడెక్ నా గొంతు పట్టుకున్నాడు. కోపంతో బుసలు కొడుతూ ‘‘చూడు నిన్నేమి చేస్తానో, పని వదిలి వచ్చినందుకు నీ పని నేను తరువాత పడతాను ఇక పనిలోకిపో’’ అన్నాడు.
మా పని ఇంకా అరగంట ఉన్నదనగానే ఆపి కపో హాజరు తీసుకున్నాడు. అతనలా ఎందుకు చేస్తున్నాడో నాకు తెలుసు.
‘‘మామూలు వ్యక్తికి ఇతరుల వ్యవహారాలలో తల దూర్చే హక్కులేదు. మీలో ఒకరికి ఆ విషయం బోధ పడినట్లు లేదు. అతనికి తెలియ చెపుతాను’’ అన్నాడు.
నాకు చెమటలు పట్టాయి. ఎ 7713 అని పిలిచాడు. ముందుకు వచ్చాను. ‘ఒక బల్ల’ అన్నాడు, ఒక బల్ల తెచ్చారు. బోర్లగా పడుకో అన్నాడు.
విప్‌తో కొడుతూ పోయాడు. మొదటి దెబ్బ బాధించింది. కొడుతూ లెక్కబెడు తున్నాడు. 25 లెక్కబెట్టే లోపల నేను స్పృహ కోల్పోయాను.
నా మీద చల్లటి నీళ్ళు చల్లితే కళ్ళు తెరిచాను. ‘నిలబడు’ అని కపో అరిచాడు. నేను కదలలేనని చెప్పాలన్నా నాకు చేత కాలేదు. ఇడెక్ కమాండోలు యిద్దరు నన్ను లేపి అతని వద్దకు తీసుకెళ్ళారు.
‘నా కళ్ళల్లోకి చూడు’ అన్నాడు. చూశాను అతని వైపు ` నాన్న గుర్తు వచ్చాడు, నాకంటే ఆయన ఎక్కువ బాధ పడుతుండ వచ్చును.
అరే పందీ, నీ కుతూహలానికి యిదే తగిన శిక్ష, నీవు చూసిన సంగతి ఎవరికైనా చెప్పావంటే ఇంతకు 5 రెట్లు దెబ్బలు పడతాయి. అని బెదిరించాడు. నేను తెలిసింది అని తల వూపుతూనే ఉన్నాను. ఆపలేక పోయాను.
ఒక ఆదివారం. మాలో సగం మంది పనిలోకి వెళ్ళారు. నాన్న వారితో వెళ్ళాడు. నేను మిగతా వాళ్ళతో విశ్రాంతి తీసుకుంటూ ఉండి పోయాను.
10 గం॥ల ప్రాంతంలో సైరన్లు మోగాయి. మా యిన్‌ఛార్జి మమ్మల్ని బ్లాక్స్‌లోకి రప్పించాడు. ఎస్.ఎస్.లు లోనంతా ఉన్నారు. అలా సైరన్లు మోగి ఎలర్ట్ చేసినప్పుడు పారిపోవడం సులభం. గార్డులు వాచ్ టవర్ వదిలి వెళ్ళారు. ముళ్ళ కంచె కరెంటు కట్ చేశారు. బ్లాక్ బయట ఎవరన్నా కనిపిస్తే కాల్చి వేయమని ఎస్.ఎస్.కి ఆర్డరు వేశారు.
కాసేపట్లో క్యాంపు ఖాళీ చేయబడిన ఓడలాగా మారింది. వరండాల్లో మనుషులెవరూ లేరు. వంటశాల పక్కన రెండు బాండీల నిండా కాగిన సూపు అలానే వదిలేశారు. అంత ఆహారం వృధా అవబోతున్నది. తినాలనే బలీయమైన కోరిక, వందల కళ్ళు అటే చూస్తున్నాయి ఆశగా. మేక మాంసపు సూపు, ఎవరూ కాపలా లేరు. కానీ తినటానికి ఎవరికి ధైర్యం ఉన్నది?
ఆకలిని మించిన భయం. ఇంతలో బ్లాక్ 37 వాకిలి కొంచెం తెరుచుకున్నది. ఒకతను సూపు వైపుకు నెమ్మదిగా పాకుతున్నాడు.
వందల కళ్ళు అతని కదలిక గమనిస్తున్నాయి. వెనక వందల మంది రాళ్ళమీద తమ శరీరాలను ఈడుస్తున్నారు. అందరం ఈర్ష్య పడ్డాం వాళ్ళ చొరవకి. అతను ధైర్యం చేశాడు.
అతను మొదటి సూపు బాండీకి చేరాడు. అతను గెలిచాడని అనుకున్నాం. ఈర్ష్యపడ్డాం, అతన్ని మెచ్చుకోవాలనే ఆలోచన రాలేదు. ఇంకొంచెం రేషన్ కోసం ప్రాణత్యాగం చేసుకుంటున్నాడు పాపం.
బాండీ మీద నుండి మూత ఎత్తాలని ప్రయత్నిస్తున్నాడు. బలంచాలకో, భయం వల్లనో అలాగే ఉండిపోయాడు. శక్తి కూడగట్టాలనే ఆలోచనతో పైదాకా లేవగలిగాడు. సూపులో తన ఆకారం చూసుకున్నాడేమో, తన ముఖం భయంకరంగా కనిపించిందేమో, గట్టిగా అరిచాడు చస్తున్నట్లు. అలాంటి అరుపు నేను యిదివరకు విని ఉండలేదు. తెరిచిన నోటితో తలను మరుగుతున్న సూపు వైపు చాచాడు. కాల్పు శబ్దానికి అదిరిపడ్డాం. అతని ముఖాన సూపు అంటి ఉన్నది. కిందపడి పోయాడు. కొద్ది క్షణాలు గిలగిల కొట్టుకున్నాడు. ఇక కదలిక ఆగిపోయింది.
అప్పుడే విమానాల శబ్దం వినిపించింది. బ్యారక్కులు కంపించుతున్నాయి. వాళ్ళు బ్యూనా ఫ్యాక్టరీని కూల్చి వేస్తున్నా రన్నారెవరో.
నాన్న అక్కడ పనిలో ఉన్నాడని గుర్తుకు వచ్చింది. అయినా ఫ్యాక్టరీని తగలేస్తున్నారంటే సంతోషించాను. కక్ష తీర్చు కుంటున్నారనిపించింది. జర్మన్ సేనలు కొన్ని చోట్ల ఓడిపోయారని వింటున్నాము. నిజమో, కాదో అనుకున్నాం. ఇప్పుడు నిజమనిపిస్తున్నది.
మేము భయపడలేదు. బ్యారక్కుల మీద బాంబు పడితే అందులో ఉన్న వందల మంది చనిపోతారు. చావంటే భయం పోయింది మాకు. ప్రతి బాంబు మాలోని ధైర్యాన్ని పెంచింది. సంతోషమనిపించింది.
ఒక గంట బాంబుల శబ్దం తరువాత నిశ్శబ్దం ఆవరించింది. అమెరికన్ యుద్ధ విమానాలు కనుమరుగయ్యాయి. ఆకాశంలో నల్లని పొగలు కనిపించాయి. సైరన్లు తిరిగి మోగాయి. అలర్ట్ ముగిసిందన్న మాట.
అందరూ బ్యారక్కుల బయటికి వచ్చారు. పొగల వాసన పీల్చాము. ఆశతో మా కళ్ళు మెరిసాయి. ఒక బాంబు క్యాంపు మధ్యలో ఎపెల్ ప్లాట్స్ దగ్గర పడింది. అందరం వరుసలు కట్టేది అక్కడే. బాంబు పేలలేదు. దాన్ని మేము నిర్వీర్యం చేశాం.
క్యాంపు ఉన్నతాధికారి లెగరాల్ టెస్ట్ తన సహాయకుడు కపోతో కలిసి క్యాంపును పరీక్షిస్తున్నాడు. ఆనాటి సంఘటనల తాలూకు భయం అతని ముఖంలో కనిపించింది.
క్యాంపు మధ్యలో సూపు అంటిన ముఖంతో చచ్చిన శవం పడి ఉంది. సూపు బాండీలు వంటశాలకు చేర్చారు.
ఎస్. ఎస్.లు వాచ్‌టవర్స్ దగ్గర డ్యూటీలో ఉన్నారు. మెషీన్ గన్స్ పట్టుకొని. ఒక గంట తరువాత పనివాళ్ళు తిరిగి వచ్చారు. నాన్నను చూశాను.
‘‘చాలా బిల్డింగులు నేలమట్టమయ్యాయి. డిపోకు ఏమీ నష్టం జరగలేదు’’ అన్నాడు నాన్న.
కూలిపోయిన డెబ్రీనంతా ఎత్తివేయటానికి వెళ్ళాము.
*****
వెనిగళ్ళ కోమల మూల్పూరు గ్రామంలో జన్మించారు. ప్రముఖ హేతువాది ఇన్నయ్య గారి సతీమణి. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా 1995 లో పదవీ విరమణ చేశారు. ప్రస్తుత నివాసం అమెరికాలోని వాషింగ్టన్ డి.సి.