గ్యారంటీ
(నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో మొదటి బహుమతి రూ.2500/- పొందిన కథ)
-రామలక్ష్మి జొన్నలగడ్డ
అమ్మ అనుకున్నంతా అయింది. నేను ప్రేమలో పడ్డాను. అతడి పేరు ఉదయ్. ఆఫీసులో నా కొలీగ్. ఎక్కువగా ఎవరితో కలవడు- నాతో తప్ప.
నాకంటే ముందు ఆఫీసుకి వస్తాడు. నేను రాగానే నాకోసమే ఎదురుచూస్తున్న వాడిలా పలకరిస్తాడు. మధ్యమధ్య హెల్ప్ కావాలా అంటూ వస్తాడు. అడక్కుండా టిప్సు ఇస్తాడు. లంచి టైముకి మళ్లీ నావద్దకొస్తాడు.
సుమారు రెండొందలు మా స్టాఫ్. ఎక్కువ మంది వయసు పాతిక్కీ ముప్పైకీ మధ్య. చదువయ్యేక కొన్నాళ్లు లైఫ్ ఎంజాయ్ చేసి అప్పుడు పెళ్లి గురించి ఆలోచిద్దామంటారు వాళ్లు. బాయ్‌ఫ్రెండ్-గర్ల్‌ఫ్రెండ్ సంస్కృతి ఆ ఎంజాయ్‌మెంటులో భాగం.
ఒకోసారి అమ్మాయి చొరవ. ఒకోసారి అబ్బాయి చొరవ. అలాంటి జంటలు పన్నెండున్నాయి. ఇంకా జంట కట్టాల్సినవాళ్లు ముప్పైమంది ఉండొచ్చు. వాళ్లలో నేను, ఉదయ్ కూడా ఉన్నాం.
నాకు అందముంది. డ్రెస్ సెన్సుంది. హెవీ మేకప్ లేకపోయినా ఉన్న అందానికి మెరుగులు దిద్దేలా టచప్ లివ్వడంలో చాతుర్యముంది. నన్నొకసారి చూసిన అబ్బాయిలు మరోసారి చూసే ప్రయత్నం చేయడం స్వానుభవమే నాకు. ఆఫీసులో కనీసం నలుగురబ్బాయిలు నా వెంటబడ్డారు. వాళ్ల చూపులే ఫ్లర్టింగులా అనిపించి దూరం పెట్టాను.
ఉదయ్ అలా కాదు. కళ్లలో స్నేహభావం తప్ప మరోటి కనబడదు. అతణ్ణి దూరం పెట్టాలనిపించ లేదు. ఐతే మా జంట మిగతా వాటిలా కాదు. అది ఆఫీసుకే పరిమితం. కానీ ఒక సాయంత్రం నన్నతడు కాఫీకి పిలిచాడు. “నేను కాఫీ తాగను” అన్నాను. అది నిజం కూడా. వెంటనే, “పోనీ, ఐస్‌క్రీమ్” అన్నాడు ఉదయ్.
ఆ సాయంత్రం ఐస్‌క్రీమ్ పార్లర్లో అన్నాడు ఉదయ్- మనం పెళ్లి చేసుకుందామా అని. నాకు తెలిసి పెళ్లి ప్రపోజల్ పెద్దల నుండి వస్తుంది. వరుడి నుంచి రాదు. ఉదయ్ పెళ్లి ప్రపోజల్ తేవడం వింతగా, కొత్తగా అనిపించింది. అంత సూటిగా అడుగుతాడని అనుకోలేదేమో- తడబడ్డాను. ఏమనాలో తోచక, “ఆలోచించి చెబుతాను” అన్నాను.
“టేక్ యువర్ టైమ్” అన్నాడు ఉదయ్. తర్వాత టాపిక్ మార్చాడు.
రూంకెళ్లాక ఉదయ్ గురించి ఆలోచించడం మొదలెట్టాను. అతడు నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. అంటే ప్రేమిస్తున్నాడా? ఆఫీసులో మాది ఆర్నెల్ల స్నేహం. ఈ రోజు పెళ్లి ప్రసక్తి తెచ్చేదాకా- అతడి కళ్లలో నాకు ప్రేమ స్ఫురించలేదు.
అసలు నాకు ప్రేమంటే తెలుసా- అనుకోగానే నైన్త్ క్లాసులో సుహాస్ ప్రేమ గుర్తుకొచ్చింది…
***
అప్పటికి నా శరీరంలో వస్తున్న మార్పులు, వాటికి అబ్బాయిల నుంచి వస్తున్న స్పందనలు- నా ఆలోచనల్లో అంత వరకూ లేని స్త్రీ పురుష బంధానికి చోటునిచ్చాయి. అబ్బాయిలంటే కొత్త ఆకర్షణ మొదలైంది.
స్కూల్లోనూ బయటా కూడా కొందరబ్బాయిలు అమ్మాయిల్ని ఆకర్షించడానికి ఏవో జోక్సు వేసేవారు. మేము నవ్వితే రెచ్చిపోయి జోక్సు డోసు పెంచేవారు. వాళ్లలా సంతోషపడ్డం మాకూ బాగుండేది. అందుకని ఆ జోక్సుకి నవ్వు రాకపోయినా నవ్వేవాళ్లం. తర్వాత మాలో మేము- జోక్సు వేసే అబ్బాయిల మీద జోక్సు వేసుకునేవాళ్లం. ఐనా- అబ్బాయిల జోక్సు వినడం ఇష్టంగానే ఉండేది. ఎందుకంటే- అవి మమ్మల్ని ఆకర్షించడానికి కదా!
అలా జోక్సు వేసేవాళ్లలో టెన్త్ చదువుతున్న సుహాస్- మా ఎదురింట్లోనే ఉండే వాడు. ఇంటర్ ఫైనల్లో ఉన్న నా అన్నయ్య వద్దకు అప్పుడప్పుడు లెక్కల్లో డౌట్సు తీర్చుకుందుకు వచ్చేవాడు. సుహాస్ జోక్సుని వేళాకోళంగా అన్నయ్యకు చెప్పాను. అన్నయ్యకు ఎవర్నయినా ఆటపట్టించడం మహా సరదా. ఒకసారి సుహాస్ తనవద్ద కొచ్చినప్పుడు- “నీవద్ద మంచి జోక్సు స్టాక్ చాలా ఉందని విన్నాను. నాకూ కొన్ని చెప్పవూ?” అనడిగాడు. సుహాస్ మొహమాటంగా ఒకటి రెండు జోక్సు చెప్పాడు. అన్నయ్య వాటికి పడిపడి నవ్వేసరికి ఉత్సాహపడ్డాడు. “ఉండు, మా చెల్లిని పిలుస్తాను. అసలు నీ జోక్సు గురించి చెప్పిందే అది” అంటూ అన్నయ్య నన్ను పిలిచాడు. అతడి జోక్సుకి నేనూ పడిపడి నవ్వాను. “నువ్వు చాలా సరదా మనిషివోయ్. మా అమ్మని కూడా పిలుస్తానుండు” అన్నాడు అన్నయ్య. తనని వేళాకోళం చేస్తున్నారని సుహాస్‌కి తెలియదు. అలా అతణ్ణి రెచ్చగొట్టి కాసేపు వినోదించి పంపేశాడు అన్నయ్య. అతడు వెళ్లగానే- “ఆ నవ్వులేంటే- ఆడపిల్లకి అంత విరగబాటు కూడదు” అని అమ్మ నన్ను తిట్టింది. నాకులాగే నవ్విన అన్నయ్యని ఏమనకుండా, నన్ను మాత్రమే అలాగని చిన్నబుచ్చిందని అమ్మమీద కోపమొచ్చింది.
కానీ మర్నాడు స్కూల్లో ఒక్కత్తినీ ఉన్న సమయం కనిపెట్టి, సుహాస్ నావద్దకొచ్చి, “శ్యామలా! ఐ లవ్ యూ” అన్నాడు. ఉలిక్కిపడి, “అంటే?” అన్నాను. “పోనీ తెలుగులో చెబుతాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అన్నాడు.
నాకు నిజంగా ప్రేమంటే ఏమిటో తెలియదు. సినిమాల్లో చూసిందాన్నిబట్టి అస్పష్టమైన అవగాహన కొంత ఏర్పడినా- ప్రేమ పట్ల నాకు ఆకర్షణ ఏర్పడలేదు. పైగా భయం కూడా! సినిమాల్లో హీరో హీరోయిన్లు ప్రేమకోసం చేసినవి- వా వల్లకాదన్న
వాస్తవం గ్రహించేటంత వివేకం కూడా నాకుంది. అమాయకత్వం నటిస్తూ, “నాకు ప్రేమంటే తెలియదు” అన్నాను.
“నన్ను తలచుకోగానే నీకు నామీద ఏమనిపిస్తుందో, అదే ప్రేమ” అన్నాడు సుహాస్.
“ఏమీ అనిపించకపోతే?” అన్నాను.
“రేపు సాయంత్రం మా ఇంట్లో నేనొక్కణ్ణే ఉంటాను. మా ఇంటికి రా, నీకు నా మీదున్న ప్రేమను తెలుసుకునేలా చేస్తాను”
నా వయసు అమ్మాయి, అబ్బాయిల్ని ఏకాంతంలో కలుసుకోవడం ప్రమాదమని తెలియనంత అమాయకురాల్ని కాను. కానీ ఇప్పుడు సుహాస్‌కేమని జవాబు చెప్పాలి?
నేను సుహాస్‌కి జవాబు చెప్పలేదు. కానీ అప్పట్నించీ అతణ్ణి తప్పించుకుని తిరగడం మొదలెట్టాను. అది కాస్త కష్టమైంది. ఎప్పుడైనా సుహాస్‌కి దొరికిపోతే- అతడి జోక్సుకి సీరియస్‌గా మొహం పెట్టేదాన్ని. అది నాకు ఏమాత్రం కష్టం కాలేదు.
***
సుహాస్‌ది తెలిసీ తెలియని వయసులో ఎరిగీ ఎరుగని ప్రేమ. అబ్బాయి కాబట్టి అతడికి దానివల్ల అంతగా ప్రమాదం లేదు. కానీ అమ్మాయిని కాబట్టి అతడి ముందు నవ్వడమే నాకు పెద్ద తప్పని అమ్మ హెచ్చరించింది.
సుహాస్ నన్ను ప్రేమించానన్నాడు. నేను దూరం పెట్టేక క్రమంగా నన్ను మర్చిపోయుంటాడు. ఇప్పుడెక్కడున్నాడో కూడా తెలియదు. ప్రస్తుతం నావద్దకు పెళ్లి ప్రపోజలుతో వచ్చాడు ఉదయ్. పెళ్లంటే తెలియనంత చిన్నపిల్లను కాను. మా బామ్మకి పదిహేనో ఏట పెళ్లయిందిట. అమ్మకి పంతొమ్మిదో ఏట. మరిప్పుడు నేనేమో పాతిక్కి దగ్గర్లో ఉన్నాను. ఐనా పెళ్లి ప్రపోజల్ కూడా నాకు కొత్తేం కాదు.
నేను బీటెక్‌లో చేరేముందు ఓ పెళ్లి సంబంధం వచ్చింది. వరుడు నాకంటే ఆరేళ్లు పెద్ద. నాకు ఈడూ జోడుగానే కనిపిస్తాడు. అయ్యేయస్. భార్య ఉద్యోగం చెయ్యడం ఇష్టంలేదు.
“చాలా మంచి సంబంధం. పిల్ల కాలిమీద కాలేసుకుని ఊళ్లేలుతుంది” అని బామ్మ సంబరపడింది. అలా అనకపోయినా, అది మంచి సంబంధమని అమ్మా నాన్నా కూడా అన్నారు.
స్త్రీవాద రచయిత్రిగా పేరుపడ్డ కమలినికి అభిమానిని. ఆమెకి ఫోన్లో విషయం చెప్పాను. “కట్నం అడిగినవాళ్లది మంచి సంబంధమెలాగౌతుందీ?” అందామె. ఆ మాటే అమ్మానాన్నలతో అన్నాను.
వాళ్లది తమనడిగిన ప్రశ్న అనుకోలేదు. నేనడిగినది అనుకున్నారు. అందుకని నాకు తెలీకుండా కట్నమివ్వాలనుకున్నారు. కట్నం తీసుకుంటున్న విషయం నాకు తెలియనివ్వమని వరుడి తరఫువారూ మాటిచ్చారు.
వాళ్లు కట్నం వద్దంటే నాలో విజయగర్వం కలిగింది. గొప్పగా కమలినికి చెప్పాను.
“ఇంజనీరు కావాలన్నది నీ కల కదా? మరి ఆ మాటేమిటి” అందామె.
“ముందు నన్ను డిగ్రీ పూర్తి చెయ్యనివ్వండి. అప్పుడాలోచిస్తాను” అన్నాను అమ్మానాన్నలతో.
“అంతకాలం ఆగాలంటే, ఈలోగా ఇంకెవరో అతన్నెగరేసుకుపోతారు” ఘోషించింది బామ్మ.
“ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ- కానీ అతగాడికి ఇంకో పెళ్లి సంబంధం రావద్దూ” అన్నాను కమలిని స్ఫూర్తితో. ఇంట్లో పెద్ద గొడవ. అప్పటికీ వరుడి తరఫువారు కొంత దిగొచ్చి, “ముందు పెళ్లైపోతే- తర్వాత చదువు వాళ్లిష్టం” అన్నారు.
ఇలా అన్నింటికీ ఒప్పేసుకుంటుంటే ఏంచెయ్యాలో పాలుపోలేదు. కమలినికి చెబితే, “పెళ్లిమాటలప్పుడే ఉద్యోగం చెయ్యొద్దని అన్నవాడు- ఓసారి పెళ్లయ్యేక, నిన్ను చదువుకోనిస్తాడా? చేతులు కాలేక ఆకులు పట్టుకోవడమౌతుందేమో” అంది.
“డిగ్రీ అవ్వాలి. తర్వాతే పెళ్లి” మావాళ్లకి చెప్పేశాను. అమ్మ మండి పడింది. “కాలేజిలో చదువంటే- పూర్వంలా ఉందా? అబ్బాయిలు ప్రేమంటూ వెంటబడతారు. అటు చదువూ, ఇటు జీవితమూ చెడుతుంది. అతగాడు అయ్యేయస్సాఫీసరు. పెళ్లి చేసుకుంటే మహారాణిలా బ్రతుకుతావ్!” అంది అమ్మ.
కమలిని ప్రభావం నామీద చాలా ఉంది, “రాజు అంటే దేశానికో, మరేదైనాకో రాజు. రాణి అంటే మాత్రం రాజుకి భార్య-
అంతే! నాకు మహారాణిలా కాదు, రాజులా బ్రతకాలనుంది” అన్నాను. ఇంట్లో రాద్ధాంతమే అయింది. మావాళ్లు కాళ్లూ చేతులూ కట్టి పెళ్లి చేసే టైపు కాదు కాబట్టి- అప్పటికా పెళ్లి ఆగింది. నావి పిదప కాలం బుద్ధులని తిడుతూనే, అప్పుడప్పుడు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తోంది బామ్మ. నాన్న నాతో మాట్లాడ్డం మానేశాడు. అమ్మ ముభావంగా ఉంటోంది. “ఎవర్నుద్ధరించడానికే ఈ చదువు” అన్నది ఇంట్లో వాళ్లు ముగ్గురి ఏకాభిప్రాయం.
“నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి….” అన్నది కమలిని బదులు. నాన్న అమ్మకి డబ్బిచ్చాడు. అమ్మ నాకిచ్చింది. ఫీజు కట్టి కాలేజిలో చేరాను…..
***
బీటెక్ పూర్తి చేశాను. ఉత్తరాది నగరంలో ఉద్యోగం చేస్తున్నాను. ఉదయ్ నన్ను పెళ్లి చేసుకోమని అడిగాడు, అంటే అతడికి నా చదువు, ఉద్యోగం- రెండూ ఇష్టమే!
ఓకే చెప్పడానికి అభ్యంతరం ఉండకూడదు. కానీ అసలు పెళ్లంటేనే ఇష్టం లేకపోతే!? వయసు తోడుని కోరుతోంది. సమాజం పెళ్లిని ప్రతిపాదిస్తోంది. ఆడదానికి మగతోడూ, మగాడికి ఆడతోడూ అవసరమే. కానీ అందుకు పెళ్లి అవసరమా? ఈ ప్రశ్న ఈరోజుది కాదు. బీటెక్ సెకండియర్లో ఉండగా థర్డియర్ చదివే కిషన్‌తో పరిచయ మప్పుడు ఉద్భవించినది…..
***
కిషన్ సన్నగా, పొడుగ్గా, తెల్లగా, చురుగ్గా ఉంటాడు. ఓ రోజు ఒంటరిగా ఉన్నప్పుడు పలకరించి, “ఐ లవ్ యూ” అన్నాడు.
“డిగ్రీ పూర్తి కాకుండా, అప్పుడే పెళ్లేమిటి?” అన్నాను వెంటనే.
“నాది మారేజ్ ప్రపోజల్ కాదు. లవ్ ప్రపోజల్” అన్నాడు కిషన్.
“పోనీ- డిగ్రీ పూర్తి కాకుండా అప్పుడే ప్రేమేమిటి?” అన్నాను.
“ఓహ్, శ్యామ్- ఇంకా ఏ కాలంలో ఉన్నావ్- ప్రేమకి డిగ్రీ కావాలా- నైన్తూ, టెన్తు క్లాసులే చాలు” అన్నాడు కిషన్.
శ్యామ్ అనడం కొత్త చనువేం కాదు. కాలేజిలో ఇంచు మించు స్టూడెంట్సంతా అలా కుదించిన పేర్లతోనే పిల్చుకుంటాం. “సరే- నీ ప్రపోజల్ గురించి ఆలోచిస్తాను. ముందు నీ కులమేమిటో చెప్పు…..” అన్నాను.
కిరణ్ తెల్లబోయి, “కులమా? ప్రేమకు కులమా? నువ్వు…..” అని ఏదో అనబోతుండగా-
“ఏ కాలంలో ఉన్నావని అడక్కు. ఇది కులమే సమాజాన్ని నడిపిస్తున్న కాలం. పత్రికలు, టివిలు, నాయకుల ఉపన్యాసాలు- ఇలా ఎక్కడైనా సరే- కులం ప్రసక్తి లేని కబురు ఒక్కటంటే ఒక్కటి ఉండదు” అన్నాను.
కిషన్ సద్దుకున్నాడు, “ఓకే- కులం కదా చెప్పాలి. మనది ప్రేమ కులం. మనం ప్రేమి’కులం’. సరేనా?” అన్నాడు.
“తెలివి బాగానే చూపించావ్ కానీ- నేనడిగిన కులం అది కాదని నీకూ తెలుసు. ఇంకో పేరు చెప్పు”
“ఇంకో కులం నాకు తెలియదు”
“పోనీ నీ కులమేమిటో నేను చెప్పనా?” అన్నాను.
“ఆడపిల్లవి. నీకు కులాలు తెలుసా?” అన్నాడు కిషన్ వెంటనే.
‘మన సమాజంలో ఆడదానికి ఏముండవు. ఇంటి పేరే కాదు, కులమతాలతో సహా అన్నీ మగాడితోనే’ అన్న కమలిని మాటలు గుర్తొచ్చాయి. “ఎందుకు తెలియదు? ఇక్కడ చదివేవాళ్లలో సగం మంది కులాలు నాకు తెలుసు. ఎందుకంటే ఇది ట్వంటీఫస్ట్
సెంచరీ” అన్నాను.
“అంటే మన కులాలు కలవ్వు కాబట్టి- నా లవ్ ప్రపోజల్‌కి ఒప్పుకోవన్నమాట!”
“చూసేవా, చెప్పకపోయినా నా కులం నీకూ తెలుసు” అన్నాను చప్పున.
“హెల్ విత్ ది కేస్ట్- నువ్వు నా లవ్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తున్నావా లేదా? అది చెప్పు”
“చదువుకునేవాళ్లకి లవ్వేమిటి?” అన్నాను.
కిషన్ వద్ద సంజాయిషీ ఉంది. ప్రేమించే వయసొచ్చినా, చదువయ్యేదాకా పెళ్లాడే హోదా లేక- నీరసించి పోతారుట కాలేజి పిల్లలు. ఆకలేసిన వాడికి అన్నంలా, లవ్ వాళ్లకి ఆలంబన ఐతేనే- చదువులో అనుకున్న ఫలితాల్ని సాధిస్తారుట. “చదివేటప్పుడే లవ్. ఇప్పుడది సొసైటీలో ట్రెండ్ కూడా. ఏ కాలేజీ కెళ్లు. రియాల్టీ షో చూడు. బాయ్‌ఫ్రెండూ, గర్ల్‌ఫ్రెండూ మాట కామన్ ఐపోలేదా?” అన్నాడు కిషన్.
నిజమే. నా క్లాస్‌మేట్సులో నలుగురమ్మాయిలకి వెరీ క్లోజ్ బాయ్‌ఫ్రెండ్సున్నారు.
“ఓకే- ఐ యాక్సెప్ట్ యువర్ లవ్ ప్రపోజల్- సొసైటీలో ట్రెండ్ అన్నావు కాబట్టి- “ముందు నువ్వు నన్ను మీ అమ్మా నాన్నలకు గర్ల్ ఫ్రెండుగా పరిచయం చెయ్యి. తర్వాత నేను మావాళ్లకి నిన్ను నా బాయ్‌ఫ్రెండుగా పరిచయం చేస్తాను. సరేనా?”
నా మాటలకు కిషన్ చిరాకు పడి, “మనమిద్దరం ప్రేమించుకుంటే- మధ్య ఈ అమ్మానాన్నలెందుకు?” అన్నాడు.
“వాళ్లూ సొసైటీలో పార్టే కదా! మనకైతే వెరీ ఇంపార్టెంట్ పీపుల్ కూడా” అన్నాను.
కిషన్ టైం కావాలన్నాడు. సరేనన్నాను. మరీ ఎక్కువ టైం తీసుకోకుండా మర్నాడే నన్ను కలిసి, “జస్ట్ లవ్ ఐనప్పుడు- అమ్మా నాన్నా పిక్చర్లో ఉండకూడదు. పెళ్లప్పుడే వాళ్లకి చెప్పొచ్చు” అన్నాడతడు.
“ఓకే- నీ క్లాసులో కూర్చుని నువ్వు నన్ను లవ్ చెయ్యి. నా క్లాసులో కూర్చుని నేను నిన్ను లవ్ చేస్తాను” అన్నాను.
“ఇద్దరూ చెరోచోటా ఉంటే అది లవ్ కాదు. ఫిజికల్ రిలేషన్‌షిప్ ఉండాలి” అంటూ కిషన్ తన ఉద్దేశ్యం బయటపెట్టాడు.
ఒక అబ్బాయి నిస్సంకోచంగా నాతో రిలేషన్‌షిప్ ప్రపోజ్ చేశాడు. అది ఎంతో సహజ మన్నట్లు నేను వింటున్నాను. సమాజం ఫాస్ట్ అవడమంటే ఇదేనేమో!
‘ప్రస్తుతం ‘లివ్ ఇన్’ మగాడికి అనుకూలంగా, అవకాశంగా ఉంటోంది. దాన్ని అలాగే మలచుకో గల సత్తా ఉన్నదన్న నమ్మకం ఉన్న ఆడవాళ్లు మాత్రమే ‘లివ్ ఇన్’ ని ఆశ్రయించాలి. ప్రతి ఆడదీ ‘లివ్ ఇన్’ ని అలా స్వీకరించ గలిగితే- మనది మహిళాధిక్య
సమాజంగా మారడం తథ్యం. అప్పుడు పురుషుడు ‘లివ్ ఇన్’ కి ఒకటికి పదిమార్లు ఆలోచిస్తాడు. ఎందుకంటే సమాజంలో మగాడి ఉనికికి ఆలంబనగా ఉంటున్నదే పెళ్లి’ అన్న కమలిని మాటలు గుర్తుకొచ్చాయి.
“అంటే మనం ‘ఇన్ లవ్’ కాదు. ‘లివ్ ఇన్’ కావాలంటావు” అన్నాను.
కిషన్ తలూపి, “యా- పోనీ అలాగే అనుకో” అన్నాను.
“సారీ కిషన్! చదువుకి పేరెంట్సు డబ్బిస్తున్నంత కాలం, వాళ్ల ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా ఆలోచనలు చదువు దాటి వెళ్లరాదు. నా కాళ్లమీద నేను నిలబడ్డప్పుడే- ‘లివ్ ఇన్’ గురించి ఆలోచిస్తాను’ అన్నాను…..
***
ఇప్పుడు నేను నా కాళ్లమీద నిలబడ్డాను. ఐనా ‘లివ్ ఇన్’ గురించి కాక పెళ్లి గురించే ఆలోచిస్తున్నాను. ఐతే నా పెళ్లి గురించి నాకంటే ఎక్కువగా అమ్మా నాన్నా ఆలోచిస్తున్నారు. పెళ్లి అనగానే వాళ్లకి ఈడూజోడూ సరిపోతే చాలదు. కులం కలవాలి. సంప్రదాయం సరిపోవాలి. అందుకు తగ్గట్లు నాకోసం వరుల్ని వెదుకుతున్నారు. మా వాళ్లకు సంబంధించి ‘కట్నం అడక్కూడదు. ఉద్యోగం చెయ్యొద్దన కూడదు. పెళ్లి ఖర్చులు ఇరుపక్షాల వారూ చెరిసగం భరించాలి’ అన్న మూడు షరతులు మాత్రమే నావి.
కాలం మారుతోందనడానికి సూచనగా- పెళ్లిచూపుల్లో ఇప్పుడు వరుడు వధువు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఐనా ఎక్కడో తేడా కొడుతోంది నాకు. పెళ్లిచూపులు జరిగినప్పుడల్లా- మగపెళ్లి వారి అహంకారం పాములోడి బుట్ట లోపలి పాము బుసలా నాకు వినిపిస్తోంది. అందుకు సద్దుకు పోవాలన్న భావన అమ్మానాన్నల్లో కనిపిస్తోంది.
ఇప్పటికి నేను ముగ్గురు పెళ్లికొడుకుల్ని కాదన్నాను. ‘ఇంతకంటే మంచి సంబంధాలు ఎక్కణ్ణించి తేవాలే’ అని అమ్మానాన్నా ఆక్రోశించారు. ఆ సమయంలో ఉదయ్ నాకు ప్రపోజ్ చేశాడు.
ప్రేమకు కాదు, పెళ్లికి! కట్నం అడగడు. ఉద్యోగం మానమనడు. పెళ్లిఖర్చులు తనవేనన్నా కాదనడు. ఇవన్నీ అమ్మానాన్నలకి కూడా నచ్చే అంశాలే! వచ్చిన సమస్య అల్లా- భాష!
ఉదయ్‌కి తెలుగొచ్చు కానీ, తెలుగు మాతృభాష కాదు. ఉత్తరాది వాడు. కులమేదైనా అది మా కులం కానట్లే అమ్మానాన్నలకి.
ఉదయ్‌కి చెప్పాను అమ్మానాన్నలకి ఉన్న సంప్రదాయం పట్టింపుల గురించి.
“సారీ శ్యామలా! నిన్ను మీవాళ్ల నుంచి విడదీసే మాటైతే- మన పెళ్లి నాకే ఇష్టం లేదు” అన్నాడతడు.
అమ్మానాన్నలు పెట్టిన పేరు కుదిస్తే- వాళ్ల ప్రేమను కుదించినట్లే అంటాడతడు. అతడు నన్ను పూర్తి పేరుతో పిలిస్తే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఐతే మనసులో అనుకుంటాను- అమ్మా నాన్నా నా పేరుకి ముందు- వీర వెంకట సత్యసూర్య సుబ్బ- లాంటివి తగిలించి ఉంటే ఏం చేసేవాడోనని.
ఉదయ్ మావాళ్లని ఒప్పించడానికి నాకు తోడుగా వస్తాడనుకున్నాను. కానీ వెంటనే పక్కకు తప్పుకోవడంతో నిరుత్సాహం కలిగింది. ఇంత తొందరగా నన్ను వదిలెయ్యడానికి సిద్ధపడ్ద వాడితో- నేనేం సుఖపడతానని కూడా అనిపించింది. నాలుగు రోజులు నేనతణ్ణి తప్పించుకుని తిరిగాను. అతడు నన్ను కలుసుకుందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు.
నాలుగు రోజులూ నాలుగు యుగాలయ్యాయి నాకు. నేనతణ్ణి బాగా మిస్సయ్యాను. అందుకే ఐదో రోజున నన్నతడు పలకరించగానే, “పెళ్లి ఇష్టం లేదన్నావుగా! ఇంకా ఎందుకు నా వెంటపడతావు?” అన్నాను కోపంగా.
“ఇష్టం లేదని ఎప్పుడన్నాను?” అన్నాడు. నేనేదో అనబోతే- అతడు వివరించాడు.
సంప్రదాయాల విషయంలో అతడి వాళ్లు మా వాళ్లకంటే నాలుగాకులెక్కువే చదివారు. ఉదయ్ వాళ్లని ఎంతో కష్టపడి ఒప్పించి, ఆ తర్వాతనే నావద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చాడు.
“నువ్వూ మీ వాళ్లని ఒప్పించగలవని నా ఆశ!” అన్నాడతడు.
తెల్లబోయాను. మావాళ్లని ఒప్పించాలని అంత వరకూ నాకు తట్టనందుకు సిగ్గేసింది కూడా!
“ఒకవేళ మావాళ్లు ఒప్పుకోకపోతే?” అన్నాను.
“నాకు నీ మీదున్న ప్రేమ ఓ ప్లస్. మావాళ్లకి నామీదున్న ప్రేమ ఇంకో ప్లస్. రెండు ప్లస్సుల్ని కలిపినా, గుణించినా కూడా ప్లస్సే ఔతుంది. కాబట్టి మీవాళ్లు ఒప్పుకుంటారు” అన్నాడతడు నమ్మకంగా.
“ఒప్పుకోకపోతే?” అన్నాను.
“వాళ్లొప్పుకుంటేనే మన పెళ్లి. నీకు ప్రేమ మీద నమ్మకముంటే వాళ్లొప్పు కుంటారు” అన్నాడతడు.
అప్పుడొచ్చింది నాకో అనుమానం- ఇంతకీ నేను ఉదయ్‌ని ప్రేమిస్తున్నానా అని!
అమ్మానాన్నలకి నా ప్రేమ గురించి ఫోన్ చేసి చెప్పే ముందు- నేను ఉదయ్‌ని ఎంతలా ప్రేమిస్తున్నానో తెలుసుకోవాలి. అప్పట్నించీ ఉదయ్‌ని ప్రత్యేక దృష్టితో గమనించ సాగాను.
ఇద్దరూ పార్కులకెళ్లాం. సినిమాలకెళ్లాం. మ్యూజిక్ షోలకెళ్లాం. ఎక్కడికెళ్లినా అతడు పక్కనుంటే అదో కొత్తదనం. అదో ఉత్సాహం. అదో ప్రత్యేకానుభవం. చిత్రమేమిటంటే- అతడెప్పుడూ నన్ను ప్రత్యేకంగా తాకడానికి ప్రయత్నించ లేదు. చొరవ తీసుకోలేదు.
చిన్నప్పుడు అమ్మానాన్నలతో, తర్వాత అన్నయ్యతో, ఆ తర్వాత స్నేహితులతో- మసిలినప్పుడు కలిగిన ఆత్మీయతాభావమే అతడిలోనూ కనిపించింది. ప్రేమంటే తెలియని నాకు- అతణ్ణి నేను ప్రేమిస్తున్నానని అనిపించడం ఆశ్చర్యం. అమ్మ అనుకున్నంతా అయింది. నేను ప్రేమలో పడ్డాను.
‘చాలామందికి పెళ్లయ్యేక కూడా ప్రేమంటే ఏమిటో తెలియదు. కానీ వాళ్లు ఒకరినొకరు ప్రేమిస్తూనే ఉంటారు’ అంటుంది కమలిని. నేను ఉదయ్‌ని ప్రేమిస్తున్నానని గ్రహించేక- ఇక జాప్యం చెయ్యలేదు. అమ్మకి ఫోన్ చేసి చెప్పేశాను.
అమ్మ చెప్పిన ప్రకారం బామ్మ ఏడుస్తూ శాపనార్థాలు పెట్టింది. నాన్నయితే వెంటనే, “ఈ పెళ్లి చేసుకుంటే- ఇకమీదట నువ్వెవరో, మేమెవరో” అని తేల్చి చెప్పేశాడు. ధ్వనిని బట్టి అమ్మకీ ఈ పెళ్లంటే ఇష్టం లేదు.
ఏం చెయ్యాలో తోచలేదు. ఉదయ్‌కి మాత్రం విషయం చెప్పలేదు. అతడితో ఎప్పటిలా స్నేహం కొనసాగిస్తున్నాను. పిల్లల ప్రేమను పెద్దలు ఎందుకు ఆమోదించరు?
ఉదయ్ తలిదండ్రులకున్న సంస్కారం మావాళ్లలో లేదా? మావాళ్ల ప్రేమ ప్లస్ కాదా, మైనస్సా?
‘తలిదండ్రులూ మనుషులే. తాము ప్రేమించిన వారు సుఖపడాలన్న వారి ఆశయం స్వచ్ఛమైనది. మనసు విప్పి మాట్లాడితే వారి ప్రేమ అవగాహనకు వస్తుంది’ అంటుంది కమలిని.
నాన్న నాతో మాట్లాడడు. మళ్లీ అమ్మకే ఫోన్ చేసి- నేను ఉదయ్‌ని పెళ్లి చేసుకుందుకు వాళ్లకున్న అభ్యంతరాలేమిటని అడిగి- “సంప్రదాయం గురించి చెప్పొద్దు. అది కాలానుగుణంగా మారుతూంటుంది. ఈ పెళ్లి నేనెందుకు చేసుకోకూడదో
చెప్పండి. లాజికల్‌గా అనిపిస్తే మీ మాటే వింటాను” అన్నాను.
అమ్మ వెంటనే- కొన్ని ఉదాహరణలు చెప్పింది. అవన్నీ సంప్రదాయాన్ని కాదని పెటాకులైన పెళ్లిళ్ల కథలు. అమ్మ చెప్పిన ప్రకారం అన్నింటా నష్టపోయింది ఆడపిల్లలే!
దొరికిందనుకున్నాను. సంప్రదాయానికి తలొగ్గిన పెళ్లిళ్లు కొన్ని మా బంధువుల్లోనే పెటాకులైన వివరాలు గుర్తు చేశాను.
అమ్మ ఊరుకోలేదు- “మేం చేసిన పెళ్లిళ్ల విషయంలో సమస్యలొస్తే- పరిష్కరించే బాధ్యత మాది. మమ్మల్ని కాదని జరిగిన పెళ్లిళ్లు పెటాకులవడం గ్యారంటీ అని తెలిసీ, చూస్తూ చూస్తూ ఎలా ఒప్పుకోగలం?” అంది.
అప్రయత్నంగా అన్నానప్పుడు, “అమ్మా! ఉదయ్ నాకు అన్నివిధాలా తగినవాడు. అతణ్ణి చేసుకుంటే మేమిద్దరం ఎంతో సుఖంగా, సంతోషంగా ఉంటాం. అందుకు నాదీ గ్యారంటీ. అదే గ్యారంటీ మీరు చూసే సంబంధాలకు మీరివ్వగలరా?”
వెంటనే జవాబు లేదు, “గ్యారంటీకేం, నువ్వూ ఇవ్వచ్చు. మేమూ ఇవ్వచ్చు…” అంది అమ్మ ఓ క్షణమాగి.
“నీ మాటలోనే తెలిసిపోతోంది- నీకు గ్యారంటీల మీద నమ్మకం లేదని. అలాంటప్పుడు మీ గ్యారంటీని నమ్ముకుని నేను వేరే ఎవర్నో ఎందుకు పెళ్లి చేసుకోవాలి? చేసుకుంటే నేను ప్రేమించిన ఉదయ్‌నే పెళ్లి చేసుకుంటాను. కానీ అందుకు మీ
అనుమతి కావాలి. అందుకెన్నాళ్లు పడుతుందో అన్నాళ్లూ ఆగుతాను. మీ అనుమతి లేందే మా పెళ్లి జరుగదని కూడా గ్యారంటీ ఇస్తున్నాను. ఎందుకంటే నాకు ఉదయ్ మాత్రమే కాదు, మీరూ కావాలి. ఈ పెళ్లివల్ల మీకు దూరం కావడాన్ని నేను భరించలేను”
ఫోన్ పెట్టేశాను.
తర్వాత రెండు నెలలకే ఓ శుభముహూర్తాన- ఇరుపక్షాల సంప్రదాయాలకీ న్యాయం చేకూరుస్తూ- ఇరుపక్షాల పెద్దల దీవెనలతో నాకూ, ఉదయ్‌కీ పెళ్లి జరిగింది.
మా దాంపత్యం విషయంలో నేనిచ్చిన గ్యారంటీ పై నాకు అపారమైన నమ్మక ముంది. ఐనా ఆ గ్యారంటీని నిలబెట్టుకోవడం మా దంపతుల బాధ్యత కూడా!ఎందు కంటే- ప్రేమ వివాహాల సాఫల్యానికి ఆ గ్యారంటీ ఎంత ముఖ్యమో- దాన్ని నిలబెట్టు కోవడమూ అంతే ముఖ్యం. ఈ విషయం- ప్రేమికులు, వారిలో ముఖ్యంగా యువతులు, గ్రహిస్తారన్న ఆశ(యం)తో స్వానుభవాన్నిక్కడ పంచుకుంటున్నాను..
*****
మావారు డాక్టర్ జొన్నలగడ్డ రాజగోపాలరావు ప్రభావంతో కథారచనకు పూనుకున్నాను. మేమిద్దరం కలిసి వ్రాసినప్పుడు ‘వసుంధర’ మా కలం పేరు. ఎక్కువగా కలిసే వ్రాస్తుంటాం. మావారి జోక్యమున్న ప్రతి కథలోనూ ఎక్కడో అక్కడ కొన్ని సాంఘిక, రాజకీయ సంఘటనల పరమైన చురకలుంటాయి. అలా వద్దని నేననుకున్నప్పుడు వచ్చినవే కేవలం నా పేరుతో వచ్చిన కథలు. సంఖ్యలో తక్కువైనా- వాటిలోనూ చాలావరకూ పోటీల్లో బహుమతులు గెల్చుకోవడం నాకు లభిస్తున్న ప్రోత్సాహం.
బాగుంది కధ,ముఖ్యంగా యువతరానికి మార్గదర్శి
మంచి కథ…అభినందనలు మేడమ్
కథ బాగుంది. మంచి కథను అందించినందుకు రచయిత్రికి ధన్యవాదములు.
విషయ ప్రధానంగా సాగి, సీదా సాదాగా ఏ మాత్రం ముస్తాబులేక ‘ సామాన్య ‘ కథలా తోచింది.
సుమారు ముఫై సంవత్సరాలక్రితం అనుకుంటాను. నేను మా బావగారితో కలసి కోణార్క్ లో వెళుతుంటే వీరిని నాకు పరిచయం చేసారు. అప్పటినుంచి ‘వసుంధర’ వ్రాసిన కధలు చదవడం ప్రారంభించాను.
కధ బాగానే ఉన్నా, సందేశాల పాలు ఎక్కువై పాత్రల మధ్య సంభాషణలు తగ్గి ఒక వ్యాసంలా అనిపించింది.
కథ బాగుందండి.
మంచి కథ. ఆసక్తి కలిగించింది.
మంచి కథ..
మంచి కథ. ప్రతి యువతి, యువకులు చదవ వలసిన కథ. సందేశము కూడా ఉంది.
వసుంధర, రామలక్ష్మి గారు నా అభిమాన రచయితలు. ఒకరు మేధస్సుతో రాస్తే మరొకరు మనసుతో రాస్తారనిపిస్తుంది. వారి కథలన్నీ రొటీన్ కి భిన్నంగా ఉంటాయి. ఏ కథ చదివినా ‘సంతృప్తి’ మినిమం గ్యారంటీగా లభిస్తుంది. ఇక పేరులోనే గ్యారంటీ ఉన్న ఈ కథ పూర్తి సంతృప్తి నిచ్చింది. సమాజంలో వివాహ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి స్త్రీలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య ఇది. పట్టింపులన్నీ స్త్రీలకే ఉంటున్నాయి. వివాహ వ్యవస్థ వ్యాపారంగా మారిపోతోంది. కులమతాలు, జాతకాలు, ఆర్థిక హోదాలు కలవకపోయినా మనసులు కలిస్తే చాలు ఆ జంటలు కలకాలం చిలకాగోరింకల్లా కలసిమెలసి ఉంటాయని ఎన్నో కథలు, సినిమాలు వచ్చినా ప్రజల్లో పెద్దగా మార్పు రాలేదు. ఈ కథ చదివాక కొందరిలో మార్పు వచ్చినా రచయిత్రి ఆశ(యం) నెరవేరినట్టే.
వసుంధర లేదా రామలక్ష్మి పేరుతో వచ్చిన కథలన్నీ వినూత్నంగా ఉంటాయి. కథ చదవటం మొదలెట్టగానే ముగింపు వరకు వదలకుండా చదివిస్తాయి. కథ చదివాక పాఠకులకు సంతృప్తి నివ్వటం ఈ కథల మినిమం గారంటీ. ఇక పేరులోనే గారంటీ ఉన్న ఈ కథ చదివాక పూర్తి సంతృప్తి నిచ్చింది. సమాజంలో పెళ్ళి వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి స్త్రీ జాతి ఎదుర్కొంటున్న సమస్య ఇది. కులమతాలు, జాతకాలు, ఆర్థిక హోదాలు కలవకపోయినా మనసులు కలిస్తే చాలు దంపతులు జీవితాంతం చిలకాగోరింకల్లా ఆనందంగా జీవిస్తారని బోధిస్తూ ఎన్ని కథలు, సినిమాలు వచ్చినా సమాజంలో పెద్దగా మార్పు రావటం లేదు. ఈ కథ చదివాక ఏ కొందరిలోనైనా మార్పు వస్తే రచయిత్రి ఆశ(యం) నెరవేరినట్టే.
వసుంధర గా మీ కథలూ, శైలీ పరిచయమే. చక్కని సందేశం తో రాసిన కథకు ప్రథమ బహుమతి లభించడం సమంజసమే. అభినందనలండీ.
మంచి సందేశం. అభినందనలు 👏👏