చాతకపక్షులు  (భాగం-16)

(తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల)

– నిడదవోలు మాలతి

          గీత అవాక్కయి వింటూ కూర్చుంది. చెక్కు చెదరని ప్రసన్నవదనంతో సదా కనిపించే ఈ తపతి ఇంతటి విషాదాన్ని కడుపులో దాచుకుందంటే నమ్మ శక్యం కావడం లేదు. గీతకి తపతిమీద గౌరవం మరింత పెరిగింది ఈకథ విన్న తరవాత.

          తపతి అదేమీ గమనించనట్టు అంది, “చెప్పేను కదా ఇమాన్యూల్ నన్ను ఇక్కడికి రమ్మన్నప్పుడు చెప్పిన మాట ‘ఇక్కడ ఎవరి బతుకులు వారివే. ఇండియాలోలాగ వేరేవాళ్లు నీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోరని. అతను ఏ సామాజిక సమస్యలు వుండవని చెప్పేడో అవి లేని ప్రదేశమే లేదు నిజానికి. నాకు ఇక్కడికి వచ్చేకే తెలిసిందది. అతనికి తెలీని మరో లోకం ఇక్కడ వుందని అతనికి తెలీలేదు.”

          “తెలుగువాళ్లు తెలుగువాళ్లే అంటావు దిగంతాలకేగినా,” అంది గీత నోరు పెగుల్చుకుని.

          “తెలుగువాళ్లు అందరూ అనడంలేదు. అలాగే తెలుగువాళ్లే కాదు అమెరికనులలోనూ వున్నారు అలా పొడిచి పొడిచి అడిగేవాళ్లు. స్మాల్ టాక్ అంటారు. పరిచయాలు పెంచుకోడానికి మార్గం అంటారు. ‘ఎందుకొచ్చేవు, ఎలా వచ్చేవూ, అరేంజిడు మారేజేనా’ అంటూ నసపెట్టి చంపుకుతినే వాళ్లు చాలా మందే తటస్థపడ్డారు నాకు. మానవ నైజం అనుకుని వూరుకోవాలి.”

          గీత ఆలోచిస్తోంది. నాలుగో పదో ప్రశ్నలు వేసి ఒక మనిషి తత్త్వం అర్థం చేసుకోడం సాధ్యమా?

          “కానీ అమెరికన్లు అడిగినప్పుడు వాళ్లు పై వాళ్లు, వాళ్లకి అర్థం కాదు, పొమ్మని వూరుకోగలను. కానీ మనవాళ్లలో ఈ తత్త్వం తట్టుకోడం కష్టం. ఇక్కడికొచ్చేక మనవాళ్లకి  ఒచిత్రమయిన మనస్తత్త్వం ఏర్పడుతుంది. అది అర్థం చేసుకోడానికి టైమొక్కటే చాలదు. కొన్నిరకాల అనుభవాలు కూడా కావాలి.”

          “నాకూ అవుతూనే వున్నాయి అనుభవాలు” అంది గీత.

          “లేదులే. వేరే రకం అనుభవాలు కావాలి. అలాటి అనుభవాలు కలక్కుండా చూసుకోడమే గొప్ప తెలివి. వచ్చిన కొత్తలో నేను కూడా అందరిలాగే ప్రతివారితోనూ ఎంతో స్నేహంగా వుంటూ ఎవరికేం కావలసినా, కనీసం నాకు చేతనయిన సాయం చేస్తూ వుండేదాన్ని. కారణం కొంత వరకూ ఇమాన్యూల్ నాకు చేసిన సాయం కావచ్చు. అవసరంలో వున్నవారిని ఆదుకుని ఆయన ఋణం తీర్చుకుంటున్నానన్న సంతృప్తి అనుకుంటాను. క్రమేణా అర్థమయింది ఇక్కడా వున్నాయి తరతమ తేడాలు. మన వూళ్లలోలాగ కొట్టొచ్చినట్టు కనిపించవు. ఇక్కడ అతి నాజూగ్గా, కనీ కనిపించకుండా వుంటాయి. మనమంతా తెలుగులం, మన జాతినీ, సంస్కృతినీ పోషించవలసిన వారం అంటూ ఊకదంపులు ఎదుట వున్నంతసేపే. తీరా అవసరం వచ్చినప్పుడు చూస్తే తెలుస్తాయి అసలు రంగులు. ఇక్కడా వున్నాయి గణాలు – ఊరుని బట్టీ, ఉద్యోగాల్నిబట్టీ, తాహతులని బట్టీ, పలుకుబడిని బట్టీ. అందులో ఇమిడిపోవడం, నిలదొక్కుకు నిలబడ గలగడం ఒక కళనుకో,” అంది తపతి.

          గీత నిట్టూర్చి, “పొద్దు పోతోంది. వెళ్తాను. హరిగారు పిలుస్తారేమో. నేను ఫోను తియ్యక పోతే గాబరా పడిపోతారు” అంది.

          తపతి కూడా “సరే, పద”, అంటూ లేచింది.

***

          ఇమాన్యూల్ ఇల్లు తనకి వదిలేసి వెళ్లిపోయిం తరవాత తపతి ఉద్యోగం చేసుకుంటూ, చిత్రకళ నేర్చుకోడం మొదలు పెట్టింది. వాళ్ల ఆఫీసులోనే మరో సెక్షనులో పని చేస్తున్న జేమ్స్ పార్ట్ టైం ఆర్టు టీచరు. అతను నేర్పుతానన్నాడు.

          తపతి పార్టీలు అట్టే ఇవ్వదు కానీ ఏడాదికోసారి బాగా తెలిసిన వాళ్లనీ, తననీ తన బతుకునీ ఆక్షేపించని వారినీ పిలుస్తూంటూంది కాఫీకో భోజనానికో. ఓసారి భాగ్యంగారి ఇంట్లో గాయత్రిగారిని కలిసింది. ఆవిడ కూడా పార్టీలంటే అట్టే వుత్సాహం చూపరని తెలిసిం తరవాత మరి కొన్ని సంగతులు తెలిశాయి.

          గాయత్రీ, సోమలింగం దంపతులకి ఇద్దరు మగపిల్లలూ, ఒక ఆడపిల్లా. ఆయన పదేళ్ల క్రితం అమెరికా వచ్చేడు కెమిస్ట్రీలో పి.హెచ్.డీ చెయ్యడానికి, అతనికీ గైడుకీ పడక రిసెర్చి సాగలేదు. మరో రెండేళ్లపాటు ఇక్కడా అక్కడా రిసెర్చి స్కాలరుగా గడిపేడు. రాను రాను ఫండ్సు తగ్గిపోయి అతనికి జరగడం కష్టం అయిపోయింది. దాంతో టాక్సీ నడపడం మొదలు పెట్టేడు. గాయత్రిగారు ఓ బాంకులో టెల్లరుగా చేరి, నాలుగురాళ్లు తెస్తోంది. గుట్టుగా సంసారం సాగించుకుంటున్నారు. 

          మగపిల్లలు బాగానే చదువుకుంటున్నారు కానీ అమ్మాయి చిత్ర పరిస్థితి వేరు. స్థానిక భాషలో రిటార్డెడ్ చైల్డ్. గాయత్రికి మొదట తెలీలేదు. అందరి పిల్లల్లాగే స్కూలికి పంపించేరు. నాలుగు రోజులయేక, తల్లికి స్కూలినించి పిలుపు వచ్చింది.

          “చిత్ర అందరు పిల్లల్తో కలవడం లేదు, అసలు మనలోకంలో వున్నట్టే లేదు. ఆ అమ్మాయిని ఇవాల్యుయేట్ చేయించాలి” అని చెప్పారు స్కూలు ప్రిన్సిపాలుగారు. “స్పెషల్ ఎడ్యుకేషను స్కూల్లో పెట్టండి” అని కూడా సలహా ఇచ్చారు.

          స్పెషల్ ఎడ్ స్కూలికి పంపే తాహతు లేదు సోమలింగం దంపతులకి. అంచేత చిత్రని ఇంట్లోనే వుంచుకుని, ఇద్దరిలో ఒకరు ఇంట్లో వుండడానికి అనువుగా వాళ్ల దినచర్యలు మార్చుకుని కాలక్షేపం చేస్తున్నారు. అలాటి పరిస్థితుల్లో జనాలకి జవాబులు చెప్పుకోలేక గాయత్రిగారు ఎవరింటికీ రారు. వచ్చినా పిల్లని తీసుకురారు.

          ఒకసారి తపతి గాయత్రిగారిని పిలిచి, చిత్రని కూడా తీసుకురమ్మని చెప్పింది. తపతికి చిత్ర పరిస్థితి అర్థం అవుతుంది.  సామాజికంగా తనూ, mental disorder మూలంగా ఆ అమ్మాయీ ఒకే నావలో పయనిస్తున్నారని అవిడ అభిప్రాయం. ఆ రోజు పార్టీకి గాయత్రినీ, చిత్రనీ చిత్రహింసలు పెట్టరని అనుకున్నవాళ్లని మాత్రమే పిలిచింది. ఆమాట గాయత్రిగారికి సూచన ప్రాయంగా తెలియజేసింది కూడాను.

          గాయత్రిగారికి కూడా తపతి అంటే మంచి అభిమానమే. అనవసరంగా ఒకరి జోక్యం కలగజేసుకోదు, తన బతుకేదో తను బతుకుతోంది అని. అంచేత ఆరోజు చిత్రని తీసుకువచ్చారు తపతి ఇంటికి.

          వచ్చినవాళ్లు మధ్యగదిలో కూర్చుని వుండగా, చిత్ర లేచి అటూ ఇటూ తిరుగుతూ పక్కగదిలోకి వెళ్లింది. అక్కడ రంగులూ, కుంచెలూ, కాన్వాసుమీద సగం వేసిన బొమ్మా వున్నాయి. చిత్ర అవి చూసి ఓ కుంచె తీసుకుని ఆ బొమ్మ పూర్తిచెయ్యడం మొదలెట్టింది.

          కొంచెం సేపయిన తరవాత గాయత్రి చిత్రకోసం అటూ ఇటూ చూసి, కనిపించకపోతే పక్కగదిలోకి వచ్చి చిత్ర చేస్తున్న పని చూసింది. ఆవిడ గాభరా పడిపోతూ. చిత్రచేతిలోంచి కుంచె లాక్కుని, విసుక్కుంటూ పిల్లని ఓ దెబ్బ వేసింది. చిత్ర ఏడవడం మొదలెట్టింది. ఏమిటి గలాభా అని తపతి వచ్చింది. తపతిని చూసి గాయత్రి, “మీరేం అనుకోకండి. ఇందుకే నేనెక్కడికీ తీసుకురాను పిల్లని.” అంది వేదనతో.

          తపతి “నో, నో. ఫరవాలేదండీ. మీరు గాభరా పడకండి” అంది బొమ్మవేపు పరిశీలనగా చూస్తూ. తన చిత్రం నాశనం అయిపోయిందని బాధ పడుతోందేమోనని గాయత్రి మరింత బాధ పడిపోతూ క్షమాపణలు చెప్పుకోసాగింది.

          “ఫరవాలేదండీ, మీరేం బాధ పడకండి” అని తపతి మరోసారి ఆవిడకి చెప్పి, పక్కగదిలో వున్న జేమ్స్‌ని పిలుచుకొచ్చింది.

          చిత్ర నెమ్మదిగా వెక్కుతోంది ఓమూల చేరి.

          గాయత్రి అయోమయంగా చూస్తోంది. జేమ్స్‌ని చూసి ఆయనచేత కాన్వాసు ధర కట్టిస్తోంది కాబోలు అనుకుని, “ధర నేను ఇచ్చుకుంటానమ్మా, ఎంతవుతుందో చెప్పండి” అంది.

          “అయ్యో, లేదండీ. మీరలా అనుకోకండి” అని ఆవిడకి ధైర్యం చెప్పి, “మీ చిత్రకి చిత్ర కళలో మంచి నైపుణ్యం వున్నట్టుందండీ ఈ బొమ్మ చూస్తుంటే” అంది.

          జేమ్స్ కాన్వాసువేపు పరీక్షగా చూస్తూ, “అవును. విలక్షణమయిన నైపుణ్యం కనిపిస్తోంది” అన్నాడు.

          “మీ అమ్మాయికి మంచి చిత్రకారిణి అయ్యే లక్షణాలు వున్నాయి. నేర్పించండి” అని కూడా చెప్పేడు.

          అలా చిత్ర చిత్రకళా నైపుణ్యం గుర్తించడం జరిగింది ఆ పూట.

          ఆమాట గాయత్రికి ఆనందమూ, బాధా కూడా కలిగించేయి, “ఆర్ట్ కాలేజీకి పంపే స్తోమతు మాకెక్కడ నాయనా” అంది ఉసూరుమంటూ.

          ఆ తరవాత వారం రోజులనాడు తపతీ, జేమ్సూ చిత్రవిషయం మళ్లీ మాట్లాడు కున్నారు. జేమ్సు చిత్రకి ఉచితంగా పాఠాలు చెప్తానన్నాడు.

          “ఇల్లు దూరం కదా. దాన్ని ఒక్కదాన్నీ పంపలేం. మాకు తీసుకురావడానికి వీలవదు” అంది గాయత్రి.

          “నేను మంగళ వారాలు మీయింటి వేపు వేరే పనిమీద వస్తూ వుంటాను. అప్పుడే మీ అమ్మాయికి కూడా పాఠాలు చెప్తాను” అన్నాడు జేమ్స్.

          గాయత్రీ, సోమలింగం పరమానంద పడిపోయారు. నిజానికి తపతి కూడా ఆశ్చర్యపోయింది. ఏదో మాటవరసకి కదిపి చూద్దాం అనుకుంది కానీ ఆయన అంత ఉత్సాహం చూపుతాడనుకోలేదు.

          “మీ ఇద్దరి ఋణం సప్తజన్మలెత్తినా తీర్చుకోలేను” అంది గాయత్రి రుమాలుతో కళ్లు ఒత్తుకుంటూ.

కొంత కాలం బాగానే గడిచింది. మొదట్లో ఎందుకయినా మంచిదని జేమ్స్ వచ్చే సమయానికి ఆవిడ ఇంట్లోనే వుంటూ వచ్చింది. దరిమిలా నమ్మకం కుదిరేక తనమానాన తను పనికి వెళ్లడం మొదలెట్టింది.

          ఆరు నెలలకి చిత్రలో మార్పు కనిపించింది లీలగా. కాస్త మనుషుల్లో పడుతున్నట్టే అనిపించింది. గాయత్రీ, సోమలింగం, తపతీ, జేమ్స్ కూడా బ్రహ్మానందపడి పోయేరు.

* * * * *

(ఇంకా ఉంది)

చిత్రకారుడు: ఆర్లె రాంబాబు

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.