జ్ఞాపకాల సందడి-36
-డి.కామేశ్వరి
కావమ్మ కబుర్లు -5
వారాలబ్బాయి (మొదటి భాగం)
వారం అంటే పల్లెల నించి చదువుకోడానికి వచ్చే బీద అబ్బాయిలు కలిగిన వారింట ‘వారంలో ఒక రోజు మీ ఇంట భోజనం పెట్టండి’ అని అడిగి, ‘ఫలానా రోజు మీ ఇంటికి వస్తాను’ అని చెప్పడం అన్న మాట. అలా బ్రాహ్మణ ఇళ్లల్లో ఏడు రోజులు వారం కుదుర్చుకుని ఆ ఇంటి అరుగు మీద పడుకుని, నూతి దగ్గర స్నానం చేసి, భోజనాలు చేసి, కష్టపడి చదువుకునేవారు. ‘పాపం బీద పిల్లాడు, ఒక పూట అన్నం పెడితే మన భాగ్యం ఏమీ తరిగిపోదు. పుణ్యమే గాని పాపం రాదు. మన పిల్లలు కంచం దగ్గర పారేసినంత ఉండద’ని ఆలోచించి దయగల తల్లులు వారం ఒప్పుకునేవారు.
మా అమ్మ అలా ఒకరిద్దరు అబ్బాయిలకి వారం పెట్టేది. ఆవిడకి ముందు నుంచీ పూజలు, పునస్కారాలు, దానధర్మాలు ఎక్కువే. ఎవరొచ్చినా ఉత్త చేతులతో పంపేది కాదు.
***
కావమ్మ కబుర్లు – 6
వారాలబ్బాయి (రెండవ భాగం)
యాయవారం బ్రాహ్మణుడు రాగానే బియ్యము చేటలో పోసి, ఓ కూర కాస్త పప్పో, ఇంత చింతపండో, ఇన్ని మిరపకాయలో ఏదో వేసి ఇచ్చేది. అసలు యాయవారం బ్రాహ్మణుడు అంటే ఎంతమందికి తెలుసు? అంటే బీద బ్రాహ్మడు గౌరవప్రదంగా అడుక్కోవడం అనచ్చు. ఆ రోజుల్లో చదువులు అందరికీ ఉండేవి కావు కనక ఆ రోజు తిథి, వార, నక్షత్రాలు, వర్జ్యం, మంచి టైం అన్నీ గడగడా చెప్పేసేవాడు. అంటే పంచాంగం చూడడం, చదవడం అందరికీ రాదు కనక చెప్పేసి, వాళ్ళిచ్చిన బియ్యం, పప్పు అవీ పుచ్చుకు పోయేవాడు. ఇతర కులాల వారికీ, చదువురాని వాళ్ళకి పంచాంగంలాటి వాడన్నమాట. అలాటి వాళ్ళనందరినీ ఉత్త చేతుల్తో ఏనాడూ పంపేది కాదు.
సరే, మా ఇంటికి తొమ్మిదో క్లాస్ చదివే అబ్బాయి ఒకరోజు, పదోక్లాస్ చదివే అబ్బాయి ఒకరోజు వచ్చేవారు. ఉదయం పెరట్లో స్నానాదులు పూర్తి చేసుకుని, అమ్మ పెట్టిన
చద్దన్నం తిని, బడికి వెళ్లి, మళ్లీ మధ్యాన్నం వచ్చి మాతో పాటు భోంచేసేవారు. వారం అబ్బాయిలు పాపం వంచిన తలెత్తకుండా తినేవారు. ఆడపిల్లలున్న ఇల్లేమో మరింత సిగ్గుపడుతూ, ఇంతంత ముద్దలు చేసుకు గుటుకు గుటుకు మింగేవారు. మారు అడిగేవారు కాదు. ‘ఏం కావాలో అడగక పోతే ఎల్లా? తిండి దగ్గర మొహమాటం అయితే ఎలా?’ అని అమ్మ కేకలు వేసేది. వాళ్ళు ఒక్కొక్క వాయా ఇంతంత కలిపి తినడం చూసి మేము సైగలు చేసి నవ్వుకోడం చూసి వాళ్ళు ముడుచుకు పోయి మరింత తలవంచుకునేవారు. ‘మీ దిష్టే తగులుతుంది వాళ్ళకి. వయసులో ఉన్న మగపిల్లలు తినరా కడుపు నిండా? ఇటొచ్చి అటొచ్చి చిరుతిళ్ళు తినడానికి వాళ్లకేం ఉంది, పూటపూట అన్నం తప్ప ఏముంది?’ అంటూ కేకలేసి వాళ్ళకి వేరే వరండాలోనో, మా తరువాతో ముందో పెట్టేది.
ఇప్పుడనిపిస్తుంది. నిజంగా ఆనాటి తల్లుల మానవతా దృక్పథం ఎంత గొప్పది? తమ పిల్లలతో పాటుగా, ఇంకో పిల్లాడికి అన్నం పెట్టి ఆడుకుని, చదువుకుని పైకి వచ్చేందుకు సాయపడ్డారు. మహా అయితే పదో పరకో ఇచ్చి వదుల్చుకుంటాం తప్ప, వండి వార్చి పెట్టే ఓపిక ఉందా? తమకున్న అరడజను పిల్లలతో పాటు ఇంకో పిల్లాడు ఎక్కువ కాదనుకునే మనస్తత్వం ఈనాటి ఇల్లాలికుందా? అలా చదువుకు పైకి వచ్చిన వాళ్ళెందరో లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారని వింటుంటాం. అలా ఆదుకున్న వారి అమ్మాయినో, మనవరాలినో పెళ్లిచేసుకున్న కథలు విన్నాం. ఈనాడు మనిషికి మనిషికి మానవ సంబంధాలు అంతరించిపోతున్నాయి. స్వార్థం తప్ప పరచింతన కరువైపోతుంది. నేను, నా భార్య, పిల్లలు. సంసారం అంటే అంతే. బంధుత్వాలు అనుబంధాలు. రాకపోకలు తగ్గిపోయాయి. ఆ రోజుల్లో ఇల్లాలుగా ఎంత సహనం, ఓర్పుతో గంపెడు పిల్లలు అత్త, మామ, ఆడపడుచులు, పురుళ్ళు, పుణ్యాలతో వంచిన తలెత్తకుండా చేసే చాకిరీలు చూసిన వాళ్ళం. వారిని ఇప్పుడు తల్చుకుంటే చెయ్యి ఎత్తి నమస్కరించాలని ఉంటుంది. వారాల అబ్బాయి కథ నుంచి ఎటో వెళ్లిపోయాను. అలా ఒక అబ్బాయి ఏభయి ఏళ్ళకి నాకు ఎలా కనిపించాడో చెప్తాను రేపు.
***
కావమ్మ కబుర్లు – 7
మా అమ్మమ్మ (మొదటి భాగం)
ఇల్లాలు, మాతృమూర్తి అంటే ఓర్పు, దయ, క్షమ, శాంతం కలబోసిన రూపు, ‘క్షమయాధరిత్రి’ అన్న పదం గుర్తువచ్చేట్లు ఉండేవారు, ఆనాటి ఇల్లాళ్లు. ఏటేటా కాన్పులతో, కడుపులో పిల్ల, చంకలోపిల్ల, ఎడపిల్ల… నిద్రాహారాలు లేకుండా ఇంటి చాకిరీతో సతమతమయ్యేవారు. ఆనాటి ఇల్లాళ్ళ ముందు అసలు నిలబడగలమా? వాళ్ళు చేసిన చాకిరీలో పదోవంతు చేయగలమా? ఇప్పటిలా గ్యాస్ పొయ్యిలు, గ్రైండర్లూ ఏమీలేని కాలంలో, డజను మందికి తక్కువ కాకుండా ఉండే ఆ ఇళ్లలో చాకిరీ తల్చుకుంటే ఈనాటికీ అయ్యబాబోయి అనిపిస్తుంది. మా అమ్మమ్మయితే వంచిన నడుం ఎత్తకుండా చాకిరీ అంటే అర్థం అవుతుంది.
మా అమ్మమ్మకి పది మంది సంతానం. పోయినవాళ్ళు పోగా, ఎనిమిది మంది మిగిలారు. ఐదుగురు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు. మా అక్క, పిన్ని ఒకేసారి, నేను, మా ఆఖరి మామయ్య ఒకేసారి పుట్టాం. అంటే తల్లీ పిల్లలు ఒకేసారి కనేవారన్నమాట. కాకినాడలో తాతగారి ఇల్లు ఒక సత్రంలా ఉండేది. ఆ రోజుల్లో కాలేజీలు కాకినాడలో అటు రాజమండ్రిలో ఉండేవి. చదువుల కోసం అమ్మమ్మ అక్కయ్య పిల్లలు, అన్నయ్య పిల్లలు చుట్టు పక్కల చోడవరం, మాడుగుల, రామచంద్రపురం లాంటి తాలూకా పల్లెల నుంచి వచ్చి కాకినాడలో చదువుకునేవారు తాతగారింట్లో ఉండి. ఆవిడ సంతానం కాక కనీసం ముగ్గురు, నలుగురు పిల్లలు. ఎప్పుడూ ఒకరు వెడితే ఇంకోరు వచ్చేవారు.
*****
డి.కామేశ్వరి కథారచయిత్రిగా తెలుగుసాహిత్య లోకానికి సుపరిచితులు. 11 కథా సంపుటాలు, 21 నవలలు, సుమారు 300 కథలు, 30 కవితలు, ఒక కవితా సంపుటి ప్రచురితాలు. కొత్తమలుపు నవల ‘న్యాయం కావాలి’ సినిమాగా, కోరికలే గుర్రాలైతే నవల అదే పేరుతో సినిమాగా వచ్చాయి. కొన్ని నవలలు టెలీఫిల్ములుగా, టీవీ సీరియళ్లుగా వచ్చాయి.