జ్ఞాపిక

(తృతీయ ప్రత్యేక సంచిక కథ)

-దామరాజు విశాలాక్షి

          “ఇది కఛ్చితంగా నీ పనే. ముందు నుండీ ఆ బొంత చూసి ఛీదరించు కుంటున్నావు.. ఏ చెత్తల బండిలోనో పడేసినావా ? నన్నుకూడా పడేయే ,నీకళ్ళు చల్ల బడతాయి నా నేస్తురాలు సచ్చిపోయిందంటే సూడ్డానికెళ్ళాను .. పొద్దున్నెల్లి సాయింత్రానికి వచ్చాను గదే! ఏడుస్తోంది ముసల్దిసత్తెమ్మ ” …
 
          “నాకు తెలియదంటే నమ్మవేం? అయినా, దొంగతనంగా నేనెందు కు పడేస్తాను,
చెప్పి చెప్పి చిరాకేసి వదిలేసాను. అనవసరంగానన్ను అనుమానించకు. నింద లేసావంటే నీబొంద తీసేస్తాను అరిచింది ఎల్లమ్మ ..
 
          నమ్మని ముసల్ది , గొణుగుతునే ఉంది …
 
          నెలరోజుల క్రితం జరిగిన సంఘటనను తలుచుకుని మరీ!ఏడుస్తోంది… 
“ఇదుగో !మీ కిదే  ఆఖరు సారి  చెప్పడం …ఆబొంత  పారేయకపోతే! ఎవరేమన్నా  ,
ఆవిడను ఆబొంత తోనే ఆ పల్లెటూరికి  తిరిగి పంపవలసి వస్తుంది  తీవ్రస్వరంతో అంటోంది కోడలు ఎల్లమ్మ ” .
 
          సర్లేవే ! ముసల్ది  దాని చాదస్తం దానిది, ఎంత చెప్పినా వినదు ఆమె పుట్టింటి నుండి తెచ్చినదట ..అదంటే ప్రాణం దానికి….అయినా !మా అమ్మ పుట్టింట్టి నుండి తెచ్చుకున్న  అన్నిటినీ వాడుతున్నాం..
 
          ఆ బొంత మనలను వాడ మనడం లేదు కదా ! ఆబొంత నిన్నుఏమి చేసిందే? రోజూ గొడవ పడతావు . దాని  కర్మకి,  అది  పరుపుగా వేసుకుని  ఆమూల గదిలో పండు కుంటున్నది గదా? మహా చిరాగ్గా అన్నాడు కొడుకు  మల్లేశ.
 
          అదిగాదయ్యా ! ఎవరు వచ్చినా ఆముసల్ది ఎలాగున్నాదని?పలకరించడానికి వెల్తారు..పలకరించి నా దగ్గరకొచ్చి ,  అదేమే! ఎల్లమ్మా  … మీకయితే మస్తు పైసలున్నవి గదా? ఆ  అవ్వని ఏమలా,  ఆ పాత బొంత మీద పండుకో బెడతన్నారు. .ఒక కొత్త బొంత కొనియ్య రాదా ?అని అడగతన్నారు చాలా అవమానంగా ఉంది ..కొందరు మన వెనకాతల చెవులు కొరుక్కుంటున్నారయ్యా !దాని ఆస్తంతా నేను తినేసి దాన్ని సరిగా చూడలేదని…
 
          ఆ చెడ్డపేరు నాకెందుకు? ఆ నిందలకు  పరువు పోతున్నాదయ్యా!చిరాగ్గా అంది కోడలు ఎల్లమ్మ..
 
          నిజమేనే !అన్న వాళ్ళకు చెప్పు అది మనమాట వినదని విసుగ్గాఅన్నాడు కొడుకు మల్లేశం ..
 
          నీ ఎదురుగా బతిమాలి ,అడిగానా! నీకింకొక పరుపు కొంటాను…అది పడేయమని ..
“నేను చచ్చిపోయాక నామీదేసి కాల్చేయ మంటాదిగాని బొంత ఇవ్వనంటాది” ..
దానికి తెలియకుండా బొంత పడేద్దామంటే మనం ఆబొంత ముట్టుకుంటే ,
మనపిల్లడిని చంపుకు తిన్నట్లని ఒట్టు పెట్టింది ముసల్ది  .అందుకే నిన్నడగమన్నాను .
ఆ ముసల్ది ఒప్పుకోదన్నానా! నువ్వే నా మాట  నమ్మడంలేదు  కోపంగా అన్నది ఎల్లమ్మ.
 
          సరే !ఆమె వినదు .నువ్వు వినవు. మధ్యలో నేను సత్తన్నా.. విసుక్కున్నాడు కొడుకు మల్లేశం .
 
          “ఈ బొంత నేనుకాపురానికి వచ్చిన కొత్తలో కొన్న బట్టలతో కుట్టిందిరా !నీ కొడుకు పుట్టినప్పుడు ,నా పసుపు బొత్తుచీర ,మీ అయ్యపంచె ,  నీ కొడుకు పొత్తిళ్ళకోసం. మా అత్త మామలు అయ్య అమ్మలు ఇచ్చిన బట్టలతో కుట్టిన  బొంత అది .వాళ్ళంత ఆయుష్షు పోసుకు బతుకుతాడని ,మా అమ్మ అయ్య బట్టలు. !మా పెళ్లి పట్టు బట్టలు,పెళ్ళి. పసుపు. బట్టలు , కూడా వేసి, మగ్గాల నుండి తెచ్చిన మంచి మంచి  రంగు రంగుల దారపు ఉండలు తెచ్చి ,పోగులు తీసి , పద్మాలు చిలకలు, హంసలతో.  మా పుట్టింటిలోన మూడు నెలలు కష్టపడి ముచ్చటపడి కుట్టాను ..నెమళ్ళు , జింకలు ,బొమ్మలు గీసి ,రంగు దారాలేసి మరీ కుట్టాను . చూసినోల్లంతా చిత్రమైపోయేవోరు .. రాజుల కాలమయితే నీ బొంత కుట్టిన నైపుణ్యం చూస్తే నీకు తప్పక ఏరాజ్యమో ఇచ్చి ఉండేవారు అనేవారు .
ఇది నా కళ.  ఇది నా కష్టం …అదీగాక  దీనిమీద పడుకుంటే ,నన్నొదిలి వెళ్ళిన మా అమ్మ ,  అయ్య,  మీ నాయిన,  నాతోటే ఉన్నట్టు ఉంటాది ..ఇది నాజ్ఞాపకంరా !సచ్చాక నాతో  తగలేట్టేయండి . అంతేగాని దీన్ని పారేస్తాననకండి అన్నది . వరండాలో పడుకొని వాదనలన్నీ మనుమడు సోమేశం విన్నాడు…నాయినమ్మ నెందుకు బాధ పెడతారని అమ్మ అయ్యపై అరిచాడు …
 
          ఏడాది క్రితం జరిగిన సంఘటనలోనికి వెళ్లింది సత్తెమ్మ   ..నేను ఇప్పుడా డబ్బు కట్టక పోతే, చేతికందిన అవకాశం చెయ్యి జారి పోతుంది .. “ఆ ఉద్యోగం ఇంకొకలు ఎగరేసుకుపోతారు.. ఈ ఉద్యోగం కూడా రాకపోతే నేను భరించలేను .
నా స్నేహితులందరూ ఉద్యోగాలు డబ్బులు కట్టే తెచ్చుకున్నారు ..గోల పెడుతున్నాడు మనుమడు సోమేశం ..
 
          “పంటలా పండలేదు.. పండినకాడికి గిట్టుబాటు ధర లేక పెట్టిన మదుపు కూడా రాలేదు .. నీ చదువుకే ,మీ అమ్మ బంగారమంతా హరించి పోయింది ..ఇప్పుడు అప్పు కూడా పుట్టడంలేదు . ఎక్కడి నుండి తేవాలిరా ?ఎగిరిపడ్డాడు తన కొడుకు మల్లేశం .
నా పుట్టింటివారు పసుపు కుంకం కోసం ఇచ్చిన.  భూమి అమ్మేసి డబ్బు తెమ్మందామంటే, ఇప్పడి కిప్పుడు సరియైన ధరరాదు ..ఎలాగురా!అంది కోడలు ..
ఆ రోజు మద్యాహ్నం తల్లి తండ్రి పొలానికి వెళ్ళాక ,అలిగి పడుకున్న ,వాడి  దగ్గరికి వచ్చి పక్కనకూర్చుని…
 
          మనవడా! నాతో,రారా! అని వీధి తలుపు గడియపెట్టి తను పడుకున్న ఆ పంచలోకి తీసుకెళ్ళింది తను .. ఆ బొంత మూల నుండి ఒకా జిప్పు లాటి దారం విప్పి, ఇసుక్కు మంటున్న మనుమడిని ,ఓపిక పట్టమని చెప్పి , దారంలాగి ,ఒక పెద్ద గొలుసు తీసి ఇచ్చింది మనుమడికి తను .. దీన్ని నేను చచ్చిపోయే ముందు నీకిద్దామనుకున్నాను…
కుస్తీ పోటీలలో గెలిచిన మీతాతకి ,వచ్చిన బహుమతి ఇది ..దీని తనఖా పెట్టుకుని 
ఉద్యోగం తెచ్చుకో .నేను ఇచ్చానని చెప్పకు. .నీస్నేహితుడిచ్చాడని చెప్పి ,మీ నాన్న ఇచ్చాక విడిపించి .. మీతాత జ్ఞాపకంగా దాచుకో ..ఇన్నాళ్ళూ! ఈబొంతలో పెట్టి దాచాను ..ఇదుగో !నాకు వాళ్ళు వీళ్ళు ఇచ్చిన  పైసలు .పదివేల వరకూ ఉంటాయి ..బొంత ఉతుక్కు న్నాప్పుడు వీటిని దాచలేక చస్తన్నాననుకో ,… “నీకు ఉద్యోగ మొస్తాదంటే నాకింకేమి కావాలి నాయినా”.మీ అమ్మ ఎప్పుడీ బొంత పారేస్తాదోనని  భయం  ..
“ఇది నా ప్రాణం రా నాయినా ! దీనితోనే నువ్వే ,నన్ను తగలబెడతానని మాటియ్యరా, బాబూ! ..ఇది నాప్రాణం అంటూ ..ఆరోజు ఆ మాట కోరింది తను ..
 
          ఈరోజు తను పెద్ద ఉద్యోగస్తుడు మనుమడు ..చాలా జీతమట .సెలవుపెట్టుకొని పండగకు వచ్చాడు. బొంత కోసం  ఏడుస్తూ నేలపైన గుడ్డ వేసుకు పడుకున్న ముసలమ్మ సత్తెమ్మ .. ప్రమాణం చేస్తానత్తా ..నాకా బొంత గురించి తెలియదే ..కాస్తా ఎంగిలి పడే !నీ కొడుకొస్తే నన్నే తిడతాడు. పండుగంటి పూటా గొడవలు అవసరమా ?పిల్లడు సరదాగా ఉండాలని వచ్చాడు . బతిమాలి బతిమాలి విసుక్కుని వెళ్ళింది కోడలు ఎల్లమ్మ ..
 
          అయినా తను లేవలేదు .మనసంతా బొంత మీదే ఉంది .నాయినమ్మా !లే.. లేచి దీనిమీద పడుకో అంటున్నాడు ..మనుమడు చేతిలో పెద్దపరుపులాటిదానితో కనబడ్డాడు..
 
          మనుమడిని పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది .సత్తెమ్మ ..నా బతుకయిపోయిందిరా మనుమడా ! ఆ బొంత తో అంతా అయిపోయింది అంది .
 
          అమ్మా !ఇదుగునే.  నీకు గిఫ్టు ..ఎప్పటి నుండో  బొంత కోసం నాయనమ్మ తో గొడవ పడుతున్నావు  కదా…
 
          నా ఫ్రెండు షరీఫ్  మంచి టైలరు .మీ ఇద్దరికీ రెండు కంఫర్టర్లు కుట్టించాను. దాన్ని అమ్మా! నువ్వు  రోజాయి అనుకో. అవ్వా ! నువ్వు నీ బొంత అనుకో ,అని  డార్క్ కలర్ ది తల్లి చేతిలో పెట్టాడు .
 
          నాయినమ్మ నీ బొంత ఇదుగో .ఏడవకు నేనే తీసుకెళ్ళాను .అని ఇచ్చాడు మనుమడు. 
 
          “సూర్యోదయపు ఆకాశం  రంగులో, ఉన్నబొంత  ముసలమ్మ చేతిలో పెట్టాడు సోమేశం “..
 
          “తల్లి మురిసిపోతూ,లోపలికి వెళ్ళిపోయింది . సత్తెమ్మ మాత్రం ఇవేవీ నాకు వద్దురా. నన్ను బాధపెట్టకు” ..  నాబొంత నాతోపాటు తగలడనీ అన్నాను .. నీవు నాకు మాటకూడా ఇచ్చావు ..మాట తప్పావు . నువ్వు కూడా నామాట వినలేదు “. అదినా జ్ఞాపకం రా .దానికీ  నాకు ఈరోజుతో ఋణం తీరి పోయింది.”.  అంది ఏడుస్తూ ..
 
          అదేమన్నా బాబాగారి “ఇటుకా “నాయనమ్మా !ఏడవకని ఆమె  చేతిలో ,  జిప్ తీసి, లోపల చూపెట్టి ,…. ఇదుగో నీజ్ఞాపకం . నీ బొంత…దాన్నే తీసుకెళ్ళి ఇలా కుట్టించాను .
నువ్వు అమ్మని అనుమానించావు .నువ్వొచ్చేసరికి తెద్దామనుకున్నాను .మధ్యలో పనిపడి ఆలస్యమైంది .. అని  లోపల బొంత చూపెట్టాడు. ..అంతేకాదు నాయినమ్మా .ఇదుగో తాత ఇచ్చిన జ్ఞాపిక. అమ్మకి నువ్విస్తానన్న గొలుసు … నువ్వే అమ్మకియ్యు .సంతోషిస్తుంది .. మళ్ళీ నాకే అంటే మా ఆవిడకే ఇస్తాను అన్నాడు నవ్వుతూ మనుమడు ..
 
          నిజం  నాయినా! పాపిష్టిదాన్ని .అనవసరంగా మీ అమ్మను అనుమానించి అనరాని మాటలు అన్నాను. మీ అమ్మ అరుస్తుంది గాని .కన్నకూతురికంటే ఎక్కవగా చూసుకుంటుంది . ఈ గొలుసు అవీ మీ నాన్న కంటపడితే ,దానికి ఈ నగకూడా ఉంచ కుండా ,పొలాల మీద మదుపు పెట్టేస్తాడని ఈ బొంతలోనే దాచి నీకు ఇచ్హాను . ఇక నేనెప్పుడు పోతానో మీ అమ్మనే దాచుకోమంటాను అంది ముసలమ్మ .
 
          కొడుకుతో ముసలమ్మకు భోజనం పెట్టమని కొడుక్కు చెప్దామని వచ్చి ఈ మాటలన్నీ విన్నది  ఎల్లమ్మ .” ఇందుకే పెద్దదిక్కు అంటారు” నా కొడుకు ఉద్యోగం నీవే ఇప్పించావా? మమ్మల్ని కాపాడావా ?
 
          నేనే తప్పుగా నిన్ను అవమానించాను క్షమించు. అని సత్తెమ్మ కాళ్ళకు నమస్కరించింది కోడలు ఎల్లమ్మ .
 
          “నీళ్ళు నిండిన కళ్ళతో  ఆకొత్త బొంతను గుండెలకు హత్తుకొని,  దానితోపాటు మనుమడిని గుండెలకు హత్తుకుంటున్న   అత్త  సత్తెమ్మను చూసి,అత్తా !నీవంత కష్టపడకపోతే మేమీరోజు ఇంత సంతోషం పొందగలమా?అని నమస్కరించింది ఎల్లమ్మ .
నాయినమ్మ , తల్లిముఖంలో ఆనందంచూస్తున్న ఆ యువకుని ముఖం వలే , క్రొంగొత్త వెలుగులతో కాoతులీనుతోంది వినీలాకాశం .   

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.