నిర్ణయం
(తృతీయ ప్రత్యేక సంచిక కథ)
-బండి అనూరాధ
నిద్రపట్టట్లేదు. అశాంతి. ఏవేవో ఆలోచనలు. కొంత ఏడుపవుతుంది. కొంత భయమవుతుంది. లైటేస్తే, హ్మ్ ,.. చీకటి పళ్ళునూరుతుంది. వెలుతురు వెక్కిరిస్తోంది. హ హ్హ హ్హా. నాకెందుకో నవ్వొస్తూంది. మరింత నవ్వు. ఏడుపునెక్కువ చేసే నవ్వా ఇది, తక్కువ చేసేదా. ఇంత నవ్వాక, నవ్వడమయ్యాక భయం పోతుందా. పిచ్చాలోచనలు అటకెక్కుతాయా. శాంతి పవనాలు వీచి నిద్రొస్తుందా. ఏంటి? నేను నిజంగా పిరికిదాన్నా. అంత పిరికిదాన్నే అయితే ఈపాటికి చచ్చిపోయి ఉందును. మరి బలవన్మరణం పాపమంటారు కదా. అయినా సరే పిరికివాళ్ళు కాదు చనిపోయేది. ధైర్యవంతులే అలా తమని తాము విముక్తం చేసుకుంటారు. మరప్పుడు వాళ్ళది పాపమవుతుందా. వాళ్ళు స్వర్గాన్ని చేరలేరా. ఉండడం నరకమనే కదా వెళ్ళారు. వెళ్ళాక కూడా నరకమయితే ఎలా. అమ్మో ..ప్చ్..పాపం వాళ్ళు.
***
ఎలాగో ఇలాంటి రోజులు గడిస్తే బావుండు. ఈ, అస్సలు నచ్చని, బావుండని రోజులు.. ఉఫ్మని ఎవరైనా కొంత సమయాన్ని ఊదేస్తే బావుండు. కొత్త కాలంలోకి కొత్త ఋతువులోకి పోతే బావుండు. ఓపిక లేదు కానీ ఆపని నేనే చేసుందును. నీరసం. ఒకటే నీరసం. ఉఫ్మని ఊదబోతే టప్మని పోతాను. ఎందుకింత బద్ధకం నాకు. కిచెన్లోకి పోయి ఏదోకటి తిన్లేనా. తింటే కొంచం బరువవుతాను. ఈ బరువొచ్చి నిద్రని తెచ్చి, అనవసరాలోచన్ల బరువుని తగ్గించొచ్చు కూడా. హ్హ హ్హ హ్హా. ఎవరన్నా నా నవ్వుని వింటే నవ్వుకుంటారా. తిట్టుకుంటారా. లేక నాకు పిచ్చనుకుంటారా.
***
ఎంతయినా నేను మంచిదాన్ని. నన్ను నేను వినుకుంటాను. నాకు నేను నచ్చచెప్పుకుంటాను. అందుకే కదా బుద్ధిగా రాత్రి ఒంటిగంటకి చద్దన్నానికి ఒక రూపు తెచ్చాను. నిలువుగా నిల్చుని, రెండుగుడ్లు అడ్డంగా పగలకొట్టి, పాత్రని వాలుగా పెట్టి సెగపెంచి అన్నాన్నేసి ఇష్టారాజ్యచప్పుళ్ళతో తిప్పి తిప్పి చేతికందిన సాసేసి ఉప్పూకారంతో ముగించి… ప్లేట్లోకి తెచ్చి ఉల్లిముక్కలతో అలంకరించి తిన్నాను. ఒక గ్లాసు మజ్జిగ కూడా తాగాను. అప్పుడు కదా నిద్రొచ్చింది.
***
అరుపులు. పిలుపులు. అలికిడి. పక్షులు, మనుషులు. కలగాపులగపు ధ్వని. పొద్దెక్కింది. దిగేవరకింతే. హ్హ హ్హ హ్హా.. ఒకటి చెప్పాలా. అవి బయట కరుస్తాయి. నేను లోపలరుచు కుంటాను. వాళ్ళూ అంతే, మాట్లాడుకోకుండా ఉండలేరు. అరుచుకోకుండా ఉండలేరు. నేనుండగలనా.. ఒకప్పుడేమోగానీ, ఇప్పుడుండగలను. ఉండగలనేంటి ఉంటున్నాగా. పైగా నన్ను నేను గబ్బిలంలా తిప్పుకుంటాను. గుడ్లగూబలా ఇల్లంతటినీ , పోనీ నన్నూను కాచుకుంటాను. ఒక సాలీడుని నేను.. అల్లుకుంటూ.. నన్నల్లుకుంటూ ఇల్లల్లుకుంటూ పోతాను. మరేం చెయ్యనూ, ఇక అంతకు మించి. ఎవరైనా అంతే, పోనీ కొంచమెక్కువమంది అయినా.. దుఃఖానికి లొంగిపోతారు. విషాదాలకు రోజుల తరబడి కట్టుబడతారు. నిర్లిప్తతలో సోలిపోతారు. కొంత నైరాశ్యాన్ని వెదజల్లుతారు. ఆనకెప్పటికో ఎప్పటికో.. ఒక తత్వాన్ని ఒంటబట్టించుకుంటారు. ఇకప్పుడు స్థితప్రజ్ఞులవుతారు. నేనెప్పుడవుతానో. ఈ అసంతృప్తి మొత్తం పోయినప్పుడు.. అవును.. అప్పుడే..
***
నేను పిచ్చిదాన్నా. కొందరలానే అన్నారు. కానీ డాక్టర్ అలా అనలేదు. కౌన్సిలర్లు అలా అనలేదు. చాలా మంది కూడా అలా అనలేదు. కానీ కొందరన్నారు. ఆ కొందరు ఎవరని అడుగుతారా… నేను చెప్పను వాళ్ళని. మళ్ళీ చెప్పానంటే… మీరు ఏమయినా డాక్టర్లా చెప్పడానికి?. మీకు సైకియాట్రీ తెలుసా. మీరు కౌన్సిలర్లా. సైకాలజీ తెలుసా మీకు. మనషులేగా మీరు. సాటి మనుషుల అంతరంగాలు తెలుసా. మరి.
అయినా మనిషిని మనిషి అర్ధం చేసుకోవడం అంత తేలికేం కాదు. చాలా సున్నితత్వం ఉండాలి లోపల. మెతక హృదయం ఉండాలి. మాట మెత్తన ఉండాలి. మనసిరపని మాటలాడాలి. తుంచి విసరకుండా, పువ్వుని పట్టుకుని కోయకుండా వదిలేసినంత మంచిగా , ముట్టుకోకుండానే ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ఆవేదననంతా తీసిపారేసేంత మంచిగా… సరే ఎవరికిమాత్రం అంత తీరిక. ఎందుకంత తాపీగా మరొకరి గురించి దీర్ఘంగా ఆలోచిస్తారు. మరి అతను? ఎవరతనా? అతను భర్తే కదా. భరించువాడు అన్నారు కదా. కాస్తయినా భరించగలిగాడా. కొంచం కొంచమయినా ప్రేమని కొసరాడా.. ఇతనంత ఎందుకు చదివాడో.. ఎలా ప్రొఫెసర్ అయ్యాడో పైవాడికెరుక. మగహంకారాన్ని కనిపెట్టిందెవరో.. ఇంటి స్త్రీకంత చనువివ్వకూడదని తేల్చిందెవరో? కాపురం కృత్రిమమని నూరిపోసిందెవరో…
***
ఏవో సమీకరణాలు. బహుశా పెళ్ళిళ్ళన్నీ ఇంతే. పందిరి పచ్చదనంలా బ్రతుకూ పచ్చగా ఉంటే బానే ఉంటుంది. గడపకు పసుపు పూసి, తులసికోట చుట్టూ ప్రదక్షిణాలు చేసి, సూర్యనమస్కారాలు చేసి, బాబోయ్ ఎంత జీవించాను. అక్కడికీ అది నటనని అప్పటికి నాకు తెలియదు కదా. ముచ్చట ముగ్గులు పెట్టుకుంటూ అచ్చిబుచ్చి కబుర్లు చెప్పుకుంటూ బానే కాలక్షేపం చేసా కదా. వండీ వార్చీ కనీ పెంచీ ఎన్ని చేసానూ. అక్కడికీ ఒకరోజు అడిగాను అతన్ని, మీరెందుకు నన్ను ప్రేమించరని.
‘ఏమిటీ’ మధ్య వయసు బాగోతమన్నాడు. ఇరవయ్యెనిమిదేళ్ళ నేను ఆ ప్రొఫెసర్కి మధ్యవయస్కురాలినా!?
మళ్ళీ అతనే అన్నాడు, ‘ప్రేమంటే’ అని సాగదీస్తూ.. మరీ, నాకెందుకో ఒంటరిగా అనిపిస్తుంది. మీతో మరింత ఉంటే బావుంటుందనీ, పోనీ కాసేపు కబుర్లు,.. అని అన్నానా.. ఇక అంతే. జీవితం ఇది. సినిమా కాదు. నవల కాదు. ఇలానే ఉంటుంది. పిల్లలున్నారు కాలక్షేపానికి. ఇల్లూ, పిల్లలు, పనులు.. మరేం కావాలి..?
బయటేదయినా ఉండుంటుందా. అతని వ్యామోహమక్కడ ఉండుంటుందా. ఇలా అడగడం ఎంత నేరమో తెలీకనేగా అడిగింది. పోనీ అనాగరికంగానే ప్రశ్నించుంటాను.
ఏది నిజమో ఎవరు నిజమో.
ఇక కొన్నిరోజులు, కాదు కాదు కొంతకాలం,.. నా నేరానికి ఎంత శిక్షపడిందో.
చాలా మందికి చాలా అపోహలున్నాయ్, శిక్షంటే కొట్టి హింసించడం, గట్టిగట్టిగా తిట్టి హింసించడం అనుకుంటారు… కానీ చిన్ని చిన్ని తుంపుడు మాటలతో పెద్దపెద్ద శిక్షాదండలుంటాయని చెబితే నమ్ముతారా.. ఊహూ.. నన్నయితే ఎవరూ నమ్మలా. ఎందుకలా అంటున్నానోనని ఆశ్చర్యార్ధక మొకాలేసుకుని…
గృహ హింస గురించి చెబితే, సొంత గ్రుహస్తులే నమ్మరు. జీర్ణించుకోరు. సంపాదించే భర్త, చక్కటి ఇల్లు, పిల్లలు .. మరేం కావాలాడదాని కంతకన్నా అని అంటారు… అనే కదూ అన్నారు..
చాలా చాలా సంసారాల్లో, ఆడది కేవలం వంశాభివృద్ధికి మాత్రమే… అంతే ఇద్దరు పిల్లలు పుడితే చాలు. మరి మగపిల్లవాడు ముఖ్యంగా ఉండాలి… అప్ప్పుడుగానీ , ఒక వంశాంకురాన్ని కంటేగానీ జన్మ సార్ధకమవ్వదు. వంశోద్దారకుడు… ఎలాగో ఒకడు ముందు సంతానంగా పుట్టాడు గానీ… లేకపోతే ఇద్దరూ ఆడపిల్లలే అయితే ఏంజేసేవారు వీళ్ళు నన్ను. మళ్ళీ కనమనేవారా. నాకు ఎన్నోసార్లు ఏడుపుతోబాటు నవ్వొస్తుంది. మా తోడికోడలిని దెప్పిపొడిస్తేనేగా వెళ్ళిపోయింది.. మళ్ళీ కనమంటేనేగా, వీళ్ళ ముఖాన కాస్త గడ్డి పడేసి పోయింది. ఆనకెప్పుడో పెద్దమనుషులు పెద్దరికం చేసి సర్దిపోయారు కానీ… అయినా ఎందుకిలా… చదువుకుని కూడా.. తెలియదా పిల్లలెలా పుడతారో.. చదువుకున్న క్రోమోజోముల కథ, X, Y ల గోల
చీ… చీ చీ ఛ్చీ చ్చీ జీవితమాని..
నెపం అంతే..
అహాన్ని చల్లార్చుకోవడానికి స్త్రీలే కావాలి వీళ్ళకి.. కానీ అహమెందుకో అర్ధమయ్యి చావదు…
మందమెదడు అయినా ప్రశ్నల్ని పుట్టిస్తోంది.
అయినా ఒక సందేహం.
ప్రేమ లేకుండా అట్టా ఎట్టా ఉంటారో.
ప్రేమించకుండా కలిసుండడం, పిల్లల్ని కనడం యాంత్రికోన్నత జీవన సరళి…
నా ఎమ్మే తెలుగులో నాకు తోచిన తిట్లు అతడిని నేను తిట్టుకుంటే తప్పా?. నేను ఉద్యోగం చెయ్యడానికి సరిపోను. ఊడిగం చెయ్యడానికి సరిపోతాను. ఏ రాత్రో అతని అవసరానికి… అప్పుడు అయినా అడిగితే సమాధానం చెబుతాడనుకున్నా, చెప్పాడు.. సౌత్ ఇండియాలో భర్తలు భార్యలపై బాహాటంగా ప్రేమని ప్రదర్శించరంట.
***
సర్దుకు పోవాలని చెప్పిన అమ్మ, సంసారమంటే మొగుడ్ని గౌరవించడమని చెప్పిన అత్తగారు. ఇంకొన్ని సంవత్సరాలు అలానే గడిచాయ్. నాలో ప్రశ్నలు తెల్ల నోట్సులకెక్కాయ్. నెమ్మదిగా నన్ను నేను మర్చిపోతున్నాను. అప్పుడే, తగలబెట్టారు, ఏంటా పిచ్చేడుపు రాతలని. నీకు పిచ్చన్నారు. మరేమేమి మాట్లాడానో గానీ..
డాక్టరెంత మంచోడో. డిప్రెషన్.. అంతే.. కొన్ని మందులు చాలు. కొంత కాలం వాడితే చాలు. కొన్నిరోజులు మీ పుట్టింటికి వెళ్ళండి. కౌన్సిలింగ్కి రండి అన్నాడు.
నాకు పిచ్చా అని అడిగాను. అలా అన్నవాళ్ళకి పిచ్చి అన్నాడు. అతడిని కూడా రమ్మని చెప్పారు. నేను రాను. ప్రొఫెసర్ని నేను. నాకెటువంటి కౌన్సిలింగూ అవసరం లేదూ అని అన్నాడట!
***
కౌన్సిలింగ్లో రబ్బర్బాండ్ టెక్నిక్ చెప్పారు. ముంజేతికి ఒక బాండ్ పెడ్తారు. లాగి వదలాలి. చురుక్కుమంటుంది. స్పృహలోకి, లోకంలోకి వస్తారంట. మందమతి తనం పోతుందట. ఇంకొకటి మాట్ వాక్ కలర్ తెరపీ. త్రిబుజాకారపు చెక్క రంగు ముక్కలుంటాయ్ దాన్నిండా. అటూ ఇటూ ఐదుసార్లు నడవాలి. మిమ్మల్ని మీరు బలహీనం చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరు హింసించుకుంటున్నారు. మీ తెలివిని మీరు చంపుకుంటున్నారు. మిమ్మల్ని మీరు అస్థిర పరచుకుంటున్నారు.
మీరు తెలివి గలవారు. చక్కగా ఉంటారు. భలే నవ్వుతారు. ఎంతో చమత్కారంగా మాట్లాడతారు. ఇలా ఎన్నో.. ఎన్నెన్నో చెప్పారు.
పొద్దున్న, సాయంత్రం ఆకాశంలోకి ఐదు నిమిషాలు చూడమన్నారు. మారే రంగుల్నీ, వచ్చే సూర్యుడ్నీ, పెరిగే వెలుతుర్నీ, పాడే పక్షుల్నీ,..పోయే సూర్యుడ్నీ, తగ్గే వెలుతురునీ, గూళ్ళకి తిరిగి పోయే పక్షుల్నీ… గమనించాలట. నన్ను నేను పునర్నిర్మించుకోగలనట..
చివరి సెషన్-
రెండు మొక్కలు గిఫ్ట్ చేసారు. చదువుకున్నారు. ఎలా ప్రశాంతంగా ఉండొచ్చో నిర్ణయించుకోండన్నారు.
***
ఇప్పుడు నేను రెస్ట్లో ఉన్నాను. మరికొన్నిరోజులు కూడా ఉంటాను. తెలుసు నాకు, శాంతిగా ఎలా బ్రతకాలో. నాకు మొక్కలు నచ్చుతాయ్. నేను పచ్చగా నవ్వుతాను. నాకు పక్షులూ నచ్చుతాయ్. నాకు నేనూ నచ్చుతాను. కొత్త ఉదయాలొస్తాయ్. కొత్త పుస్తకాలు తెచ్చుకుంటాను. పక్షులు గూళ్ళనల్లినట్లుగా, నన్ను నేను అల్లుకుంటాను. నాతో ఎవరుంటారో ఎవరుండరో? అది వాళ్ళ ఇష్టం. నాకెందుకవన్నీ. ఎమోషనల్ డిపెండెన్సీ వద్దు నాకిప్పుడు. నేనూ, నా కలలు,.. అంతే. మరో జన్ముందో లేదో.
*****
పేరు అనూరాధ బండి. స్వస్థలం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామం. ప్రస్తుత నివాసం కృష్ణా జిల్లా తాడిగడప గ్రామం. చదువు ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్. కవిత్వమంటే ఇష్టం. కథలంటే ఆసక్తి. రాస్తుంటాను.
ఏ మనిషికైనా మానసిక స్థితి, స్థిమితంగా ఎప్పుడు ఉంటుంది.?
క్షణాల ముందు వెనుకల తోపులాటలు లేని నిశ్చింతలాంటి ఒక నిశ్చలత అబ్బాలంటే కావలసినవన్నీ దొరికాల్సిందేనా.? లేకుంటే ఏమవుతుంది.? ఇంటాబయటా సమస్యలు, లోపలావెలుపలా అశాంతి పోగవుతూ పోయే పరిణామాల పట్ల మనకెంత నియంత్రణ ఉంటుంది.? ఒకవేళ ఆలోచించి తన ఆలోచనలు తెలిపే శక్తి ఉంటే, బురద కమలం ఏం చెబుతుంది.?
ఇది చదివాక , State of mind is everything అనిపిస్తోంది నాకైతే.!
నిర్ణయమంటే ఎప్పటికీ మారనిదనేం కాదన్న సత్యాన్ని ఒంటబట్టించుకుని సెల్ఫ్ టాక్ లో మనకు మనం ఏం చెప్పుకుంటూ వెళ్తామో అదే ముఖ్యం చివరకు. పాఠకులకు ప్రత్యక్షంగా ఎలాంటి ఉద్బోధ చెయ్యకుండా కేవలం ఆలోచన రేకెత్తించే ఇలాంటి కథలు/కథానికలు ఎంతో బావుంటాయి. అనురాధ గారికి అభినందనలు 💐
Thank you Raj garu.
Thanks for for understanding the story
andari badha krishna Sastri badhe kaadu…maa anu radhakka kathalu kuda… chal baga rasavu akka congratulations
Thank you Veeru
Touchy
Thank you
ఆహా ఎంతటి సహజంగా వ్రాశారు
Thank you andi
అద్భుతంగా ఉందమ్మా.👍
Thank you Babai garu
నిజంగా నాతో నేనే మాట్లాడుకొంటున్నట్టుగా ఉంది
చిన్నగా అనిపించే విషయాలను మంచిపదాల అల్లికలతో అల్లారు
చాలా బాగా వ్రాశారు
థాంక్యూ
Thank you Lakshmi Narayana garu ☺️
కొత్తగా ఉంది… Well narrated akka …
Thank you
Very apt story of many shattered.. yet unspoken women. Kudos Anu for raising the voice on behalf of all 💐
Thank you Radhika garu ☺️
Thank you Radhika garu ☺️
ఏడుపొచ్చింది మాచదివాక😭😭
Thank you Madhavi ☺️
అనూ కథ చాలా బాగుంది
లవ్లీ 👌
Thank you ☺️
Thank you Vaishnavi garu ☺️
చిన్నచిగా కనిపించే కారణాలు ఎంత పెద్దవయినవీ నిజానికి. నలిగిపోయిన మనసుల వ్యధకి దర్పణమీ కథ. మానసిక విశ్లేషణలా ఎంత చిక్కగా ఉందీ వ్యక్తీకరణ. నూతనప్రక్రియ. అభినందనలు.
Thank you
కథ చాలా బావుంది
కవితలా ఉంది. లోతుగా ఉంది.
ఇది కథేనా, లేక ఎందరి జీవితమో మాట్లాడుతోందా.. గొంతు పెగల్చుకుని.
అలా ఉంది. సరిగ్గా నిజంలా. అనూరాధ గారికి అభనందనలు. 🙏🙏
Thank you sir ☺️